పేదింటి కుర్రాడు... 600 డ్రోన్లు చేశాడు! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేదింటి కుర్రాడు... 600 డ్రోన్లు చేశాడు!

పేద కుటుంబం. తల్లిదండ్రులు పనులు చేస్తేనే కడుపు నిండుతుంది. ఇలాంటి నేపథ్యమున్న కుటుంబాల విద్యార్థులు సాధారణంగా ఏమని ఆలోచిస్తారు... కష్టపడి చదివి ఓ చిన్న ఉద్యోగం తెచ్చుకుని కుటుంబాన్ని పోషించాలనుకుంటారు. కానీ, ఈ కుర్రాడు అందుకు భిన్నంగా ఆలోచించాడు.

ర్ణాటక రాష్ట్రంలోని మాండ్యాకు చెందిన ప్రతాప్‌ది పేద కుటుంబం. తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయ పనులు చేస్తేగానీ కడుపు నిండదు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన అతడు ఓ వైపు చదువుతూనే మరోవైపు వ్యవసాయ పనులకు వెళ్తుండేవాడు. చదువులు మనకు పనికిరావని తల్లిదండ్రులు ఎంత వారించినా... అతని దృష్టంతా పుస్తకాలపైనే. మాండ్యాలో ఇంటర్మీడియట్‌ వరకు చదివిన ప్రతాప్‌... మైసూర్‌లో బీఎస్సీ పూర్తి చేశాడు. అలా ఇంటర్‌ నుంచీ డిగ్రీ వరకూ కష్టపడి చదివిన అతడు ఈ-వ్యర్థాలతో 600 డ్రోన్లను తయారు చేసి పలువురు శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకున్నాడు.

స్వీపర్‌గా చేరి అవగాహన
బాగా చదివి జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపనతో ఉన్న ప్రతాప్‌ ఓ రోజు టీవీలో డ్రోన్‌ను చూశాడు. ఎప్పటికైనా అలాంటి డ్రోన్‌ను తయారు చేసి ఆకాశంలోకి ఎగరేయాలని అనుకున్నాడు. అప్పటికి అతడి వయసు పద్నాలుగేళ్లే. ఆలోచన సరే కానీ దాన్ని వేటితో తయారుచేస్తారో, గాలిలోకి ఎలా ఎగురుతుందో అతడికి అర్థం కాలేదు. తన సందేహాలు తీర్చేవారూ ఎవరూ కనిపించలేదు. ఆ సమాచారం తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌ ఒక్కటే మార్గమని భావించినా... ఇంటర్నెట్‌ సెంటర్‌లో ఫీజు చెల్లించే స్తోమత అతడికి లేదు. దీంతో తల్లిదండ్రులకు తెలియకుండా మాండ్యాలోని ఓ ఇంటర్నెట్‌ సెంటర్‌లో స్వీపర్‌గా చేరాడు. తనకు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ప్రతిరోజూ అరగంట ఇంటర్నెట్‌ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం కల్పిస్తే చాలనీ ఆ సెంటర్‌ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా ఓ మూడు నెలలు ఆ సెంటర్‌లో పనిచేసి డ్రోన్ల తయారీ, వాటి పనితీరుపైన అవగాహన పెంచుకున్నాడు. తరవాత ఈ-వ్యర్థాలను సేకరిస్తూ డ్రోన్లను తయారుచేయడం మొదలెట్టాడు. చివరికి తన పదహారో ఏట ఓ డ్రోన్‌ను తయారు చేసి ఆకాశంలోకి ఎగరేశాడు. దాని ద్వారా ఫొటోలూ తీసి సఫలమయ్యాడు. ఆ తరవాత ఆర్థిక ఇబ్బందుల మధ్య చదువును కొనసాగిస్తూనే ఈ-వ్యర్థాలతో డ్రోన్లను తయారు చేసే పనుల్లో నిమగ్నమయ్యాడు.

ట్యూషన్‌ డబ్బుతో పాత పరికరాలు
ఇంటర్‌ పూర్తయ్యాక ప్రతాప్‌... మైసూర్‌లోని జేఎస్‌ఎస్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామర్స్‌ కాలేజీలో బీఎస్సీలో చేరాడు. మైసూర్‌ వెళ్లే సమయంలో తండ్రి ఇచ్చిన ఎనిమిది వేల రూపాయలు కాలేజీ ఫీజుకే సరిపోయాయి. గది అద్దెకు తీసుకోవడానికీ, భోజనం చేయడానికీ చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. దీంతో ట్యూషన్లు చెబుతూ ఆ డబ్బుతో అవసరాలను తీర్చుకునేవాడు. ఓసారి అద్దె చెల్లించడానికి డబ్బులు లేక గదిని ఖాళీ చేసి కొన్ని నెలలపాటు బస్‌షెల్టర్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆకలితో అలమటిస్తూ మంచినీళ్లు తాగి బాధను దిగమింగుకున్నాడేగానీ తన ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోలేదు. పాడైపోయిన మిక్సీల మోటార్లూ, పనికిరాని టీవీలూ, కంప్యూటర్‌ చిప్‌లూ, రెసిస్టర్ల వంటి పరికరాలతోనే అతడు డ్రోన్లను తయారు చేస్తుంటాడు. ఉదాహరణకు... పనిచేయని మిక్సీలోని మోటారునే డ్రోన్‌కు ఇంజిన్‌గా అమర్చి ఆకాశంలో ఎగురవేస్తాడు. వీటిని ఎలక్ట్రానిక్‌ రిపేర్‌ దుకాణాలూ, పాత సామాన్లు సేకరించే వారి వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటాడు. కారణం... కొత్త పరికరాలను కొనడానికి సరిపడా డబ్బు తన వద్ద లేకపోవడమే. ట్యూషన్లు చెప్పగా వచ్చే డబ్బునే ఆ పాత పరికరాల కొనుగోలుకు వెచ్చిస్తుండేవాడు. ఇరవై రెండేళ్ల ప్రతాప్‌ ఇలా ఇప్పటి వరకూ ఆరువందల డ్రోన్లను తయారుచేశాడు. తాను ఈ-వ్యర్థాలతో తయారుచేసిన డ్రోన్లను... 2017లో జపాన్‌లో, 2018లో జర్మనీలో నిర్వహించిన అంతర్జాతీయ ప్రదర్శనల్లో చూపెట్టి శాస్త్రవేత్తల మెప్పు పొందాడు. జపాన్‌ ప్రదర్శనకు వెళ్లడానికి డబ్బు లేకపోతే తల్లి తనకున్న కొద్దిపాటి బంగారాన్ని అమ్మి ప్రతాప్‌ చేతిలో పెట్టింది. మరికొంత మొత్తాన్ని కాలేజీ యాజమాన్యం అందించింది. ప్రతిఫలంగా ప్రతాప్‌ ఆ ప్రదర్శనల్లో యంగ్‌సైంటిస్ట్‌ అవార్డునూ, గోల్డ్‌మెడల్‌నూ సొంతం చేసుకున్నాడు. ఈ రెండు ప్రదర్శనల్లో వచ్చిన డబ్బును మరిన్ని డ్రోన్ల తయారీకి వెచ్చించాడు. సంవత్సరం క్రితం కర్ణాటకలో వచ్చిన వరదల సమయంలో అధికారులు వేలాది బాధితులకు ఈ డ్రోన్లతో ఆహారాన్ని సరఫరా చేశారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల గిరిజనులకు వీటి ఆధారంగానే ఆహారం, మందులూ పంపిణీ చేస్తున్నారు. ఈ-వ్యర్థాలతో డ్రోన్ల తయారీ విధానాన్నీ, వాటి పనితీరునూ తెలుసుకోవడానికి ఇప్పటి వరకూ అతడిని 87 దేశాలు ఆహ్వానించాయి కూడా. సంకల్పం ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించిన ప్రతాప్‌ నేటి యువతరానికి ఆదర్శం కదూ!


క్యాన్సర్‌ బాధితుల కోసం... జుట్టు దానం!

నల్లని పొడవైన జుట్టు ఉన్న మహిళలూ, యువతులూ, పిల్లలూ సాధారణంగా ఏం కోరుకుంటారు... చక్కగా కొప్పు ముడుచుకుని మురిసిపోవాలనో, అందంగా జడ అల్లుకుని ఆనందించాలనో అనుకుంటారు కదా! కానీ ఆ జుట్టునూ దానం చేస్తూ క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలుస్తున్నారు కొందరు.


విద్యార్థుల మంచి మనసు

క్యాన్సర్‌ బారినపడిన పేషంట్ల చికిత్సకు చాలా ఖర్చవుతుందనీ, అలాంటి వారికి తమవంతుగా ఎంతోకొంత సాయం చేయాలనీ అనుకున్నారు కోయంబత్తూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థినులు. కీమోథెరపీ చికిత్స చేసే సమయంలో ఊడిపోతున్న తల వెంట్రుకలతో వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని పత్రికలూ, టీవీల ద్వారా తెలుసుకున్నారు. వారిని ఆర్థికంగా ఆదుకునే స్తోమత తమకు లేదని భావించిన ఆ కళాశాల విద్యార్థినులు కనీసం తమ జుట్టునైనా దానం చేసి భరోసాగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అలా... ఆ కళాశాలకు చెందిన 80 మంది విద్యార్థినులు ఒకే రోజు జుట్టు దానం చేసి ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. వీరి స్ఫూర్తితో ఆ కళాశాలకు చెందిన మరికొందరు విద్యార్థినులూ జుట్టు దానానికి ముందుకు వచ్చారు. క్యాన్సర్‌ బాధితులను ఆదుకోవడానికి అవసరమైనంత డబ్బు తమ వద్ద లేకున్నా... వారి కోసం ఇలాగైనా సేవ చేయడం చాలా ఆనందంగా ఉందంటారు ఆ విద్యార్థినులు. క్యాన్సర్‌ పేషంట్ల కోసం సాయం చేసిన ఈ విద్యార్థినులది ఎంతో మంచి మనసు అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


సోషల్‌ మీడియాలో పిలుపుతో...

ల్గొండ జిల్లాకు చెందిన హిమజారెడ్డి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పేదలకూ పిల్లలకూ సేవ చేయాలన్నది ఆమె ఆశయం. ఇదే ఆశయంతో 2016లో ‘హోప్‌ ఫర్‌ లైఫ్‌ ఫౌండేషన్‌’ సంస్థను స్థాపించారు. ఆ ఫౌండేషన్‌ ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలోనే... కీమోథెరపీ చేయించుకునే క్యాన్సర్‌ పేషంట్ల తల వెంట్రుకలు ఊడిపోతున్నాయనీ, ఈ కారణంగా వారు ఆత్మన్యూనతాభావంతో కుంగిపోతున్నారనీ తెలుసుకున్నారు. అలాంటి బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్న హిమజ... జుట్టు దానం చేసేవారు ముందుకురావాలని సోషల్‌ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు ఎంతోమంది మహిళలూ, యువతులూ, విద్యార్థినులూ, యువకులూ స్పందించారు. ఇప్పటి వరకూ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హిమజారెడ్డితోపాటు 82 మంది తమ జుట్టును దానం చేసి క్యాన్సర్‌ పేషంట్ల మీద ఔదార్యం చూపారు. హైదరాబాద్‌ నగరంతోపాటు ఇతర జిల్లాల వారూ ఉత్సాహంగా ముందుకురావడం గమనార్హం. ఇలా సేకరించిన జుట్టును ముంబయిలోని టాటా క్యాన్సర్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌కు పంపిస్తున్నారు. తాము పంపుతున్న జుట్టుతో హాస్పిటల్‌ నిర్వాహకులు విగ్గులను తయారుచేస్తూ వాటిని క్యాన్సర్‌ బాధితులకు ఉచితంగా అందజేస్తున్నారని అంటారు హోప్‌ ఫర్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు హిమజారెడ్డి.


వెయ్యి మందికి విగ్గులు

పేద విద్యార్థులను విద్యాపరంగా ఆదుకోవడంతోపాటు యువతీయువకులకూ, విద్యార్థులకూ సంస్కృతీ సంప్రదాయాలపైనా, కళల మీదా ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో కేరళలోని చేతిపుళ సమీపంలో ఏర్పాటైన సంస్థ... సర్గక్షేత్ర కల్చరల్‌ అండ్‌ ఛారిటబుల్‌ సెంటర్‌. ఈ సంస్థ వీటితోపాటే రోడ్డు ప్రమాదాల నివారణపైన ప్రజలకు అవగాహన పెంపొందించడం, వృద్ధులకు ఆశ్రయం కల్పించి వారి బాగోగులను చూసుకోవడం వంటివి చేస్తోంది. అంతేకాకుండా క్యాన్సర్‌ పేషంట్లను ఆదుకోవడంలోనూ తనవంతు సాయం అందిస్తోంది. ఆ ప్రాంతంలోని ప్రజలకు క్యాన్సర్‌ బాధితుల సమస్యను వివరిస్తూ వారి నుంచి జుట్టును సేకరిస్తోంది. ఆ జుట్టుతో విగ్గులను తయారు చేయిస్తోంది. ఇలా... ఏడాది వ్యవధిలోనే వెయ్యికిపైగా క్యాన్సర్‌ పేషంట్లకు విగ్గులను ఉచితంగా అందజేసింది సర్గక్షేత్ర కల్చరల్‌ అండ్‌ ఛారిటబుల్‌ సెంటర్‌. కీమోథెరపి వల్ల తల వెంట్రుకల్ని కోల్పోయి బాధపడుతున్న తమ ప్రాంతంలోని ప్రతీ క్యాన్సర్‌ పేషంట్‌కూ ఉచితంగా విగ్గును అందజేయడమే లక్ష్యం అంటున్నారు ఆ సెంటర్‌ నిర్వాహకులు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు