close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజ్ఞానం పంచే... వారధులు వీరు!

పుస్తకాలు విజ్ఞాన సాధనాలు. నిరుద్యోగులకవి ఉద్యోగ సోపానాలు. ఒక పుస్తకం వెంట ఉంటే... మంచి మిత్రుడు తోడున్నట్లే అంటారు పెద్దలు. వాటి విలువ తెలిసిన కొందరు పాఠశాలల్లో, మరికొందరు తమ ఇళ్లల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. వాటిలో రకరకాల పుస్తకాల్నీ, పత్రికల్నీ అందుబాటులో ఉంచి, అందరికీ విజ్ఞానాన్ని పంచే వారధులుగా నిలుస్తున్నారు.


విద్యార్థులకు ఫుడ్‌4థాట్‌

పాఠ్యాంశాలతోపాటు విజ్ఞానాన్ని పంచే, మానసిక వికాసాన్ని పెంపొందించే పుస్తకాలనూ చదవాలని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆసక్తి ఉంటుంది. అయితే, ఆ బడుల్లో అందుకు సరిపడా సౌకర్యాలు ఉండవు. ఫలితంగా వారు విజ్ఞాన, వ్యక్తిత్వ వికాస సంబంధ పుస్తకాలను చదివే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుపైన ప్రభావం చూపుతుంది. ఇదే అంశంపైన ఆందోళన చెందారు హైదరాబాద్‌కు చెందిన మాధవీశర్మ, శ్రీనివాస్‌రావు, షెఫాలీరావు. విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే పుస్తకాలను విద్యార్థులతో చదివించడానికి పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడమే పరిష్కారమని భావించారు వారు. దీనికోసం 2015లో ఫుడ్‌4థాట్‌ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా మొదట హైదరాబాద్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటుచేసి పుస్తకాలను అందజేశారు. ఇప్పటి వరకూ వారు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్‌, హరియాణా, ఒడిశా రాష్ట్రాల్లోని మూడు వందలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి లక్షలాది పుస్తకాలూ, సామగ్రీ అందించారు.


కాఫీ డబ్బుతో కితాబ్‌శాల

లుగురు ఓ చోట కలిసి కాఫీ తాగితే యాభై రూపాయల దాకా ఖర్చవుతుంది. దాంతో ఆ నలుగురికీ కాసింత ఆనందం, ఒకింత ఉపశమనం కలుగుతాయి. అదే యాభై రూపాయల విలువైన ఓ పుస్తకాన్ని గ్రంథాలయానికి ఇస్తే వంద మందికి విజ్ఞానం అందుతుంది. అలాంటి ఉద్దేశంతో ప్రారంభమైందే భువనేశ్వర్‌ సమీపంలోని కితాబ్‌శాల. అక్కడి ఆర్యపల్లికి చెందిన సాంత్వన సాగ్నిక... భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ(కేఐఐటీ)లో లెక్చరర్‌. స్నేహితులూ, సహోద్యోగులతో ఓ రోజు కాఫీ తాగుతున్న సాంత్వనకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కలిగింది. ఆ తరవాత కొన్ని రోజులకు తన స్నేహితురాలు రీతి ఛటర్జీ సహకారంతో తన ఇంట్లోనే కొన్ని పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు సాంత్వన. ఒక్కో పుస్తకం వందలాది మందికి విజ్ఞానాన్ని పంచుతుందంటూ స్నేహితులకు చెప్పడంతో వారూ స్పందించారు. అలా... సొంతంగా కొనుగోలు చేసిన, స్నేహితుల నుంచి సేకరించిన సుమారు రెండు వేల పుస్తకాలతో తన ఇంట్లోనే గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కితాబ్‌శాలకు రోజూ యాభై మందికిపైగా వస్తుండగా... యువ కవులూ, రచయితలూ, కళాకారులను ప్రోత్సహించడానికి వివిధ సందర్భాల్లో వర్క్‌షాప్‌లనూ ఏర్పాటు చేస్తున్నారు.


ఆ ఇల్లే గ్రంథాలయం

మ్మం నగరానికి చెందిన పారుపల్లి అజయ్‌కుమార్‌ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. టీచర్‌గా పనిచేసిన సమయంలో వేలాది పుస్తకాలు చదివారు. అట్లాగే... పుస్తకాలను చదివితే విజ్ఞానం పెరుగుతుందనీ, మంచి వ్యక్తిత్వం అలవడుతుందనీ విద్యార్థులకు చెబుతూ వారిలో పఠనాసక్తిని పెంపొందిస్తుండేవారు. రెండేళ్ల క్రితం పదవీ విరమణ పొందినా... ఆయన ధ్యాస అంతా పుస్తకాలపైనే. తన జీవితంలో ఎంతో ఉపయోగపడిన పుస్తకాలను విద్యార్థులూ, యువకులూ, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు అందుబాటులో ఉంచాలని అనుకున్నారు అజయ్‌కుమార్‌. ఈ ఆలోచనను ఉపాధ్యాయిని అయిన భార్య దుర్గాభవానీతో పంచుకున్నారు. ఆమె అంగీకారంతో గతేడాది తన ఇంట్లోనే తండ్రి పారుపల్లి సత్యనారాయణ పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో అతడి కుటుంబం నివాసముంటే... కింది భాగాన్ని గ్రంథాలయం కోసం కేటాయించారు. ఉదయం ఏడు గంటల నుంచీ రాత్రి ఎనిమిది గంటల వరకూ తెరిచి ఉండే ఈ గ్రంథాలయానికి రోజూ సుమారు వంద మంది పాఠకులు వస్తుంటారు. కొందరు దాతల సహకారంతో ఇందులో అంతర్జాల సదుపాయాన్ని ఏర్పాటు చేసిన అజయ్‌కుమార్‌, దుర్గా భవానీ దంపతులు- పుస్తకాలూ, ఫర్నిచర్‌ కోసం సొంతంగా రూ.6 లక్షల దాకా వెచ్చించారు. ఒక్క గది ఉన్నా అద్దెకు ఇవ్వాలని యోచించే ఈ రోజుల్లో మూడు గదులు ఉన్న ఇంటిని గ్రంథాలయం కోసం కేటాయించి, పాఠకులకు అవసరమైన పుస్తకాలూ, పత్రికలూ సమకూర్చుతున్న ఈ దంపతులు అందరికీ ఆదర్శం కదూ...!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు