close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
700 ఏళ్లుగా ఆ దీపం ఆరలేదు..!

రాజస్థాన్‌నీ ఆ రాష్ట్రంలోని కోటల్నీ చూస్తుంటే చరిత్ర పాఠాలు కళ్లముందు కదులుతుంటాయి. ఆనాటి రాజపుత్రుల వైభవానికీ వాళ్ల మధ్య జరిగిన యుద్ధాలకీ మౌన సాక్ష్యాలు ఇవే కదా అనిపిస్తుంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి కుంభల్‌గఢ్‌ కోట... రాణా ప్రతాప్‌ జన్మస్థలం’ అంటూ అక్కడి విశేషాలను కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తున్నారు అనకాపల్లికి చెందిన కొయిలాడ రామ్మోహన్‌రావు.

రాజస్థాన్‌లో ఎన్నిసార్లు పర్యటించినా చూడాల్సినవి ఇంకా మిగిలే ఉంటాయి. అలా మేం గతంలో చూడలేకపోయిన కుంభల్‌గఢ్‌, చిత్తోఢ్‌, రణక్‌పుర్‌ జైన మందిరాలను చూడాలని బయలుదేరాం. ముందుగా ఉదయ్‌పూర్‌ చూసి, అక్కడికి 82 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభల్‌గఢ్‌కు బయలుదేరాం. యుద్ధాలకూ రాజపుత్రుల అసమాన శౌర్య ప్రతాపాలకూ ప్రతీకగా నిలిచిన కోటలు రాజస్థాన్‌లో ఎన్ని ఉన్నా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది కుంభల్‌గఢ్‌. ఆరావళి పర్వతాలపై నిర్మించిన ఈ కోట నిర్మాణాన్ని మొట్టమొదట ఆరో శతాబ్దంలో సంప్రతి మహారాజు కట్టించాడనీ అప్పట్లో దీన్ని మశ్చీంద్రపూర్‌ అనేవారనీ 13వ శతాబ్దంలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ దీనిమీద దాడి చేశాడనీ చెబుతారు. ప్రస్తుతం ఉన్న కోటను మాత్రం మేవాడ్‌ను పాలించిన శిశోడియా రాజపుత్ర వంశీకుడైన రాణా కుంభ 15వ శతాబ్దంలో కట్టించాడు. అందుకే ఈ కోటకు ఆ పేరు.

అతి పెద్ద గోడ!
కోట చుట్టూ 36 కిలోమీటర్ల మేరా పొడవాటి గోడ కట్టి ఉంటుంది. గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా తరవాత ప్రపంచంలోకెల్లా అతి పెద్ద గోడ ఇదే. 15 అడుగుల వెడల్పుతో ఒకేసారి 8 గుర్రాలు స్వేచ్ఛగా వెళ్లగలిగేంత విశాలమైన కోట గోడ ఇది. అందుకే దీన్ని గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా అనీ అంటారు. శత్రుదుర్భేద్యంగా కట్టిన ఈ కోట గోడ అనేక మలుపులు తిరిగి ఉంటుంది. శత్రుసేనల గుర్రాలూ ఏనుగులూ తేలికగా లోపలికి రాకుండా ఉండేందుకు దీన్ని అలా కట్టారట. శత్రువుల బాణాలు తగలకుండా వాళ్లపై బాణాలు సంధించేందుకు అనుగుణంగా గోడమీద ఆర్చ్‌లూ బురుజులూ నిర్మించారు. కోట పై భాగం నుంచి చూస్తే ఆరావళీ పర్వత ప్రాంతంతోబాటు సుదూరంలోని థార్‌ ఎడారి ఇసుకతిన్నెలూ కనిపిస్తాయి. మహరాణా కుంభ కాలంలో కోట గోడమీద
వెలిగించే దీపం కోసం రోజూ 50 కిలోల నెయ్యీ, వందల కిలోల పత్తీ అవసరమయ్యేవట. ఆ వెలుగులోనే రాత్రివేళలోనూ రైతులు పొలం పనులు చేసుకునేవారట.

అత్యంత పటిష్టంగా నిర్మించిన ఈ కోటమీద ఎందరో దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఒకే ఒక్కసారి మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ ప్రతినిధి రాజా మాన్‌సింగ్‌, ఇతర రాజుల సహకారంతో జరిపిన దాడి మాత్రమే విజయవంతమైంది. దీనికి కారణం కోటలోకి వెళ్లే తాగునీటి సరఫరాని నిలిపివేయడం అని కొందరూ, ఆ నీటిలో విషం కలపడం అని మరికొందరూ చెబుతుంటారు. చిత్తోఢ్‌గఢ్‌ వంటి ఇతర ప్రాంతాలకు చెందిన రాజవంశీకులు ఈ కోటలో తలదాచుకుని రక్షణ పొందారట. పసివాడైన రెండో ఉదయ్‌సింగ్‌ను దాయాది బన్వీర్‌ సింగ్‌ చంపించాలనుకునే ప్రయత్నం తెలుసుకుని, అక్కడ పనిచేసే దాది పన్నా తన కుమారుడికి యువరాజు దుస్తులు వేసి, యువరాజుకి తన కొడుకు దుస్తులు వేసి రహస్యంగా ఈ కోటకు చేర్చి కాపాడిందట.
కోట లోపల సుమారు 360 మందిరాలు ఉండటం దీనికున్న మరో ప్రత్యేకత. అందులో మూడొందలు జైన మందిరాలు కాగా, మిగిలినవి హిందూ దేవాలయాలు. అలాగే కోటకు రామ్‌ పోల్‌, హనుమాన్‌ పోల్‌ అనే ఏడు ద్వారాలు ఉన్నాయి. హనుమాన్‌ పోల్‌ మీద కోట నిర్మాణం గురించిన వివరాలు ఉన్నాయి. రామ్‌ పోల్‌ నుంచి చూస్తే కోటలోని ప్రధాన భవనాలన్నీ కనిపిస్తాయి. అందుకే దీన్ని వాస్తునిర్మాణ  అద్భుతంగా చెబుతారు.

నీలకంఠ మహదేవాలయం!
ఇక్కడి ఆలయాల్లో తప్పక సందర్శించాల్సినది నీలకంఠ మహదేవాలయం. 24 స్తంభాలపై నిలిచిన గోపురమూ ఆ గోపురంమీదా స్తంభాలమీదా చెక్కిన నగిషీలూ ఆలయానికి ఎనలేని శోభని చేకూర్చుతాయి. రాజా కుంభ ఈ ఆలయంలో ప్రతిరోజూ పూజ చేసేవాడట. ఇక్కడి శివలింగం ఎత్తు ఐదు అడుగులు. దీని తరవాత గణేశ, పార్శవనాథ, బావన్దేవి జైన మందిరాల్ని చూశాం. ఒకే ఆలయంలో 56(బావన్‌) దేవతా విగ్రహాలు ఉండటంతో బావన్దేవి అనే పేరు వచ్చింది.
కోటలోనే ఓ పక్కగా కుల దేవి ఆలయం ఉంది. అప్పట్లో రాజపుత్రులెవరూ ఇక్కడి అమ్మవారిని చూడకుండా కోట బయటకు వెళ్లేవారు కాదట. లోపల ఉన్న అఖండ దీపం దాదాపు 700 సంవత్సరాల నుంచీ వెలుగుతూనే ఉందట. అందులో నూనె అయిపోయేలోగానే మళ్లీ నింపుతారు. తరవాత కోటలోపల ఉన్న లఖోలా సరస్సు దగ్గరకు వెళ్లాం. ఐదు కిలోమీటర్ల పొడవున్న ఈ సరస్సు వెడల్పు 200 మీటర్లు. లోతు 60 అడుగులు. దీన్ని క్రీ.శ. 14వ శతాబ్దంలో రాణా లఖా తవ్వించాడు.

మేఘాల్లో తేలిపోతున్నట్లుగా...
ఆ తరవాత కోటలోని ఎత్తైన ప్రదేశంలో కట్టిన బాదల్‌ మహల్‌కి వెళ్లాం. 19వ శతాబ్దంలో రాణా ఫతే  నిర్మించిన ఈ రెండంతస్తుల భవనం కిటికీల్లో నుంచి చూసినా భవనం మధ్యలోని ఖాళీ స్థలంలో నిలుచున్నా మేఘాల మధ్యలో ఉన్నట్లే ఉంది. ఆ కారణంతోనే దీని బాదల్‌ మహల్‌ అంటారు. వర్షాకాలంలో అయితే మేఘాలు అటూఇటూ పరుగులు పెట్టే దృశ్యంతోబాటు సూర్యాస్తమయ, సూర్యోదయ దృశ్యాలూ అత్యంత మనోహరంగా కనిపిస్తాయి. లోపల విశాలమైన వరండాలో రెండు విభాగాలు ఉన్నాయి. మగవాళ్లకోసం మర్దానా అనీ, ఆడవాళ్లకోసం జనానా అనే రెండు విశ్రాంతి గృహాలు ఉన్నాయి. ఈ భవనం రాతిగోడలకే జాలీలను చెక్కారు. వీటి నుంచే నాటి స్త్రీలు కోటలో జరిగే కార్యక్రమాలనూ ప్రకృతినీ చూసేవారట. చల్లటిగాలికోసం రంధ్రపూరితమైన మట్టిపైపుల్ని గోడలో అమర్చిన ఏర్పాటునీ టాయిలెట్లనీ నాటి వెంటిలేషన్‌ నిర్మాణాల్నీ చూసి విస్తుబోయాం.


శిశోడియా వంశంలో ఎనిమిదో తరమైన రాణా ప్రతాప్‌ ఈ కోటలోనే జన్మించాడు. మహమ్మద్‌ ఖిల్జీ, కుతుబ్‌ షా వంటి వారు ఎన్నిసార్లు దాడులు చేసినా అన్నిసార్లూ ఓటమిపాలయ్యారు. ఒకసారి ఖిల్జీ దాడి జరిపినప్పుడు వర్షాలు రావడంతో కోటకు కొంత దూరంలో గుడారాలు వేసుకుని, అవి తగ్గడం కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాణానే అతనిపై మెరుపుదాడి చేసి తరిమికొట్టాడు. ఆపై అనేకసార్లు విఫలప్రయత్నం చేసిన ఖిల్జీ  పదేళ్లపాటు ఆ కోట జోలికే పోలేదు. ఇలాంటి అనేక విజయాల్ని పురస్కరించుకుని రాణా కుంభ, చిత్తోడ్‌గఢ్‌లో ఓ విజయస్తంభాన్ని నిర్మించాడు. తొమ్మిది అంతస్తుల్లో ముప్ఫై ఏడు మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ స్తూపం మీద రామాయణ, మహాభారత దృశ్యాలు అత్యద్భుతంగా చెక్కారు. దీన్నే విష్ణు స్తంభం అనీ అంటారు. భోజరాజులానే రాణా కుంభ కళలను ప్రోత్సహించేవాడు. ఆయన స్వయంగా సంగీత రాజా, సుధాప్రబంధ, కామరాజ-రతిసార గ్రంథాలను రచించాడు. మేవాఢ్‌ ప్రాంతాన్ని 35 ఏళ్లపాటు ఓటమి లేకుండా ఏకబిగిన పాలించిన కుంభ చివరకు తన కుమారుడైన మొదటి ఉదయసింగ్‌ చేసిన విషప్రయోగం వల్ల మరణించడం విషాదకరం.

రణక్‌పుర్‌ జైన మందిరం!
ఆ కోటంతా తిరిగి చూశాక అక్కడికి 33 కి.మీ. దూరంలో ఉన్న రణక్‌పుర్‌ జైన మందిరానికి బయల్దేరాం. దీన్నే చతుర్ముఖ ధారణ విహార్‌ అనీ పిలుస్తారు. ఈ మందిరాన్ని ప్రథమ తీర్థంకరుడైన ఆది నాథుడికి అంకితం చేశారట. ఈ మందిరం పూర్తి
వివరాలు ఆడియో గైడ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. డీవీడీతో ఉన్న ఆడియో పరికరాన్ని మనకి ఇస్తారు. హెడ్‌ ఫోన్ల ద్వారా అందులోని సమస్త వివరాలూ వినొచ్చు. టూర్‌ ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎక్కడితో ముగుస్తుంది... వంటి విషయాలతోబాటు మనం సందర్శించే ప్రతి కళా ఖండానికి సంబంధించిన వివరాలూ, ఈ ప్రాంత చరిత్రా అన్నీ గైడ్‌ మనతోబాటు తిరుగుతూ చెబుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది.జైన మతానికి సంబంధించి అతి పెద్దదీ ముఖ్యమైనదీ అయిన ఈ ఆలయాన్ని దర్నా షా అనే జైన వర్తకుడు ప్రారంభించాడట. కానీ దీనికి భారీగా ఆర్థిక సాయాన్ని అందించింది మాత్రం రాణా కుంభ అనే చెబుతారు. దీని ఆవరణలో చతుర్ముఖ, సూర్య, సుపార్శ్వనాథ, అంబ దేవాలయాలు ఉన్నాయి. మౌంట్‌ అబూలోని దిల్వారా మందిరంలో మాదిరిగానే ఇక్కడా పాలరాతి విగ్రహాలూ వాటి శిల్పకళా చాతుర్యం చకితుల్ని చేస్తాయి. మందిరం పైకప్పు మీద అకిచకా అనే శిల్పాన్నీ దాని చుట్టూ ఉన్న కళాఖండాలనూ చూసి తీరాల్సిందే. పంచ భూతాలను ప్రతిబింబించేలా ఐదు శరీరాలతో ఉన్న ఈ శిల్పం ఎంతో వింతగా అనిపించింది. తరవాత 108 సర్పాలు గొడుగుపడుతున్నట్లుగా చెక్కిన పార్శ్వనాథ విగ్రహాన్నీ గర్భగుడిలోని మూల విరాట్‌ విగ్రహాలతోబాటు జంబూ ద్వీపం, శత్రుంజయ పర్వతం మీద ఉన్న 863 జైన మందిరాల నమూనాల్నీ కూడా చూశాం.

రాజస్థానీ శిల్పకళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే ఈ మందిర నిర్మాణం వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. దర్నా షాకు నళినీ గుల్మా విమానం అని పిలిచే ఓ దేవతా వాహనం తరచూ కలలోకి వస్తూ మందిర నిర్మాణానికి ప్రేరణ కలిగించిందట. అందుకే ఆయన ఆ దేవతా వాహన రూపంలో ఈ మందిరాన్ని ప్రారంభించాడనీ, అయితే దీని నిర్మాణం యాభై ఏళ్ల పాటు సాగిందనీ సుమారు మూడు వేల మంది దీని రూపకల్పనలో పాలు పంచుకున్నారనీ చెబుతారు. సునిశితమైన పనితనంతో పాలరాతిమీద చెక్కిన పూలూ లతలూ విగ్రహాలూ అత్యద్భుతంగా ఉంటాయి. ఆ రోజుల్లో అక్కడి శిల్పులకు ఇచ్చే వేతనం గురించి కథలుగా చెబుతారు. సాయంత్రం పని అయిపోయాక ప్రతి శిల్పీ, తాను చెక్కగా వచ్చిన రద్దును మూటగట్టుకుని ఆలయ కోశాధికారికి ఇస్తే, ఆయన అంతే బరువుగల వెండినో బంగారాన్నో ఆ రోజు వేతనంగా ఇచ్చేవాడట. అంటే శిల్పి పనితనాన్ని బట్టి అతనికి వెండిబంగారాలు లభించేవన్నమాట. కళకు తగ్గ ఫలితం ఉండబట్టే నాటి శిల్పులు రాళ్లను సైతం పూలతీగల్ని తలపించేంత అందంగా చెక్కగలిగారు అనిపించింది. అవన్నీ చూసి మరోసారి రావాలనుకుంటూ వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు