close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిలోన్‌ బచ్చలి... కంటికి నెచ్చెలి..!

ళ్ల పెరట్లోనూ బాల్కనీలోని కుండీల్లోనూ సులభంగా పెంచుకోగలిగే సిలోన్‌ బచ్చలి కాస్త జిగటగా ఉంటుందన్న కారణంతో కూరల్లో వాడటానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఇందులో నీటిశాతంతోబాటు ఎ, బి, సి విటమిన్లూ; ఐరన్‌, కాల్షియం... వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులోకన్నా అధిక ప్రొటీనూ ఆపిల్‌లోకన్నా ఎక్కువ పీచూ ఇందులో లభిస్తాయి. దీన్నే నేలబచ్చలి, దుంపబచ్చలి అనీ అంటారు. ఇందులో పుష్కలంగా ఉండే రెటినాల్‌ కంటిచూపుని పెంచేందుకు తోడ్పడుతుంది. కేటరాక్ట్‌నీ కంటి కండరాల బలహీనతనీ తగ్గిస్తుంది. విటమిన్‌-సి అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తూ కండరాల పెరుగుదలకి తోడ్పడుతుంది. పొడిబారిన చర్మం, పిగ్మెంటేషన్‌తో బాధపడేవాళ్లకీ ఎంతో మేలు చేస్తుంది. వారానికోసారి ఈ ఆకుని ఉడికించి జ్యూస్‌లా చేసుకుని తాగితే చర్మం మెరుపుని సంతరించుకుంటుంది.
* కాల్షియం సమృద్ధిగా ఉండే సిలోన్‌ బచ్చలిని క్రమం తప్పక తినేవాళ్లలో ఎముకలూ దంతాలూ ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే ఆస్టియోపొరోసిస్‌తో బాధపడేవాళ్లూ ఎముకలు విరిగినవాళ్లూ రోజూ ఈ ఆకుకూరని తింటే త్వరగా కోలుకుంటారు. ఈ బచ్చలి జీర్ణశక్తినీ పెంచుతుంది. ఇందులోని పీచువల్ల సలాడ్‌ రూపంలోనో లేదా ఉడికించో తింటే బరువు తగ్గుతారట.
* దీన్ని క్రమం తప్పకుండా తినేవాళ్లలో మెదడు భాగాలకు రక్త సరఫరా మెరుగై గ్రాహకశక్తి పెరుగుతుందట. ఐరన్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది మెదడు కండరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. నిద్రలేమినీ నివారిస్తుంది. ఈ ఆకుని సూప్‌ రూపంలో రోజూ తీసుకుంటే బీపీ, మధుమేహం నియంత్రణలో ఉంటాయి. ఇందులోని ప్రొటీన్‌ ఎర్ర, తెల్ల రక్తకణాల సంఖ్య పెరగడానికి తోడ్పడతుంది. దీన్ని క్రమం తప్పక తినేవాళ్లలో రక్తంతోబాటు ఆక్సిజన్‌ సరఫరా సరిగ్గా అందడంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుంది. అందుకే వేగంగా పెరిగే ఈ బచ్చలిని తాగండి, తినండి..!


వేడినీటి స్నానం గుండెకి మంచిదా?!

గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే హాయిగా నిద్ర పడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ వేడినీటి టబ్‌లో స్నానం చేయడం వల్ల హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువని చెబుతున్నారు జపాన్‌కు చెందిన పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు మధ్యవయస్కులైన 30 వేలమందిని అధ్యయనం చేశారట. అందులో వాళ్ల దినచర్య- అంటే, వ్యాయామం, తినే ఆహారం, బరువు, నిద్రపోయే సమయం, ఆరోగ్య సమస్యలు, ప్రస్తుతం వాడుతోన్న మందులూ ఇలా అన్ని వివరాలూ సేకరించారట. అలా వాళ్లను సుమారు 20 సంవత్సరాలపాటు పరిశీలించగా- వాళ్లలో చాలామందికి ప్రతిరోజూ వేడినీటి టబ్బు స్నానం చేసే అలవాటు ఉందని గుర్తించారు. ఇలా చేసేవాళ్లకు మిగిలిన వాళ్లతో పోలిస్తే గుండెజబ్బు, గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందట. అంతేకాదు, వేడినీటి టబ్‌ స్నానం హైపర్‌ టెన్షన్‌నీ తగ్గిస్తుందనీ చెబుతున్నారు. దాంతో సంప్రదాయ జపనీయుల్లో ఉన్న ఈ వేడినీటి టబ్‌ స్నానం అలవాటును అందరూ పాటించేలా చేయడం ద్వారా గుండె జబ్బుల్ని తగ్గించవచ్చు అంటున్నారు సదరు నిపుణులు.


తల్లీ టీచరూ ఇద్దరూ కీలకమే!

పిల్లల పెంపకంలో తల్లి పాత్ర అందరికీ తెలిసిందే. అయితే రకరకాల కారణాల వల్ల తల్లి ప్రేమ సరిగ్గా అందని పిల్లలు ప్రైమరీ స్కూలు దశలో ఆ ప్రేమనీ ఆప్యాయతనీ టీచర్లలో వెతుక్కుంటారనీ వాళ్లతో చనువుగా ఉండేందుకు ప్రయత్నిస్తారనీ ఇంకా చెప్పాలంటే పూర్తిగా వాళ్లమీదే ఆధారపడతారనీ చెబుతున్నారు న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇందుకోసం కొన్ని స్కూళ్ల నుంచి ఐదు నుంచి పదేళ్లలోపు పిల్లల్ని ఎంపికచేసి, వాళ్లను దాదాపు రెండుమూడు సంవత్సరాలపాటు పరిశీలించారట. అమ్మతోనూ టీచర్లతోనూ పిల్లలకున్న అనుబంధాన్ని నిశితంగా అధ్యయనం చేశారట. అందులో తల్లీపిల్లల మధ్య సరైన బంధం లేని పిల్లలు, కొంత ఆందోళనతో గడుపుతున్నారనీ దాన్ని తగ్గించుకునేందుకు వాళ్లు టీచరుతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు గమనించారు. అదే సమయంలో టీచరు కూడా పిల్లలతో చనువుగా ఇష్టంగా లేని సందర్భంలో- పిల్లల ప్రవర్తనలో భయాందోళనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు గుర్తించారు. అందుకే ప్రాథమిక స్థాయి దాటేవరకూ పిల్లలతో ఇంట్లో తల్లులూ స్కూల్లోని టీచర్లూ ఇద్దరూ చనువుగా ప్రేమగా ఉండాలని విశ్లేషిస్తున్నారు సదరు పరిశోధకులు.


టూకీగా...

25-35సంవత్సరాల మధ్యలో మొదటి బిడ్డను కన్న యువతులే మధ్యవయసులోనూ మంచి ఆరోగ్యంతో ఉంటున్నారని ఒహాయో స్టేట్‌ పరిశోధకులు పేర్కొంటున్నారు. అదే అంతకన్నా తక్కువ వయసులోనూ మరీ ఆలస్యంగానూ పిల్లలు పుట్టినవాళ్లలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయట.
* నీరెండలో నడవడం, కాసేపు గడపడం ద్వారా వృద్ధాప్యంలో డి-విటమిన్‌ లోపం తలెత్తకుండా ఉంటుంది. లేదంటే ఆస్టియోపొరొసిస్‌ బారిన పడాల్సి ఉంటుందని జ్యురిచ్‌ నిపుణులు చెబుతున్నారు.మీకు తెలుసా!

గాంధీగారి మూడు కోతులుగా ప్రసిద్ధిచెందిన వాటి మూలం జపాన్‌ దేశం. వాటిపేర్లు కిక్‌జరు (చెడు వినవద్దు), ఇవజరు (చెడు అనవద్దు), మిజరు (చెడు కనవద్దు).

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు