close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాఫీ ఆకులతో గ్రీన్‌ టీ..!

కాఫీ ఎలా చేస్తారు? కాఫీ మొక్కకి కాసే గింజలతోనే కదా... గ్రీన్‌ టీ ఎలా చేస్తారు? తేయాకు ఆకులతోనే కదా... కానీ అరకులో మాత్రం కాఫీ ఆకులతోనూ గ్రీన్‌ టీ తయారు చేస్తున్నారు. పైగా ఇది తేయాకుతో చేసే గ్రీన్‌ టీ కన్నా ఆరోగ్యానికి మంచిదనీ మధుమేహులకి మరీ మంచిదనీ అంటున్నారు.

కాఫీ ఆకులతో గ్రీన్‌ టీనా...ఇదేం తికమక అనుకోవద్దు. మీరు చదివేది నిజమే. విదేశాల్లో కొన్నిచోట్ల ఈ టీని ఇప్పటికే తాగుతున్నారు. మన దగ్గర మాత్రం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. నేచురల్‌ ఫార్మసీ ఇండియా సంస్థ ద్వారా దేశంలోనే మొట్టమొదటగా అరకు కాఫీ ఆకులతో గ్రీన్‌ టీని రూపొందించారు అమెరికా నివాసి మాదల రామన్‌.

పచ్చకోక చుట్టుకున్న తూర్పుకనుమలూ వాటి మధ్యలోని లోతైన లోయలూ ఆ లోయల్లో విరిసిన అవిసె పూలూ... అరకు అనగానే ఠక్కున స్ఫురించే అందాలు. వీటితోబాటు ఎత్తైన చెట్లూ వాటి మధ్యలో గుబురుగా పెరిగిన కాఫీ తోటలూ వాటికి పక్కనే వెలసిన కాఫీ అవుట్‌లెట్లూ తప్పక గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఇప్పటికే అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయింది. భారీ మాల్స్‌తోబాటు తనదైన బ్రాండ్‌తో వందలకొద్దీ కియోస్క్‌లు తెరిచే స్థాయికీ చేరుకుంది. అంత రుచికరమైన కాఫీని అందిస్తోన్న ఆ మొక్కల ఆకులతో టీ రుచుల్నీ అందించవచ్చని తెలుసుకుని దానికి తానే స్వయంగా శ్రీకారం చుట్టాడు మాదల రామన్‌. ఓసారి సిలికాన్‌ వ్యాలీలోని ఇథియోపియన్‌ రెస్టరెంట్‌కి వెళ్లినప్పుడు అక్కడ కాఫీ ఆకులతో చేసిన గ్రీన్‌ టీ రుచి నచ్చడంతో దాని గురించి ఆరా తీశారట. కాఫీ మొక్క పుట్టిన ఇథియోపియాలో కాఫీ గింజలకన్నా ఆకుల్నే టీ రూపంలో వేల సంవత్సరాల నుంచీ వాడుతున్నారనీ, దీన్ని వాళ్లు ‘కుటి’ అంటారనీ, అందువల్లే అక్కడ డయాబెటిస్‌ బాధితులు తక్కువనీ తెలుసుకున్న రామన్‌, అరకులో పండే కాఫీ ఆకులతోనూ అలా చేయవచ్చన్న ఆలోచనతో ఇథియోపియాకి వెళ్లి మరీ దానిమీద రెండున్నరేళ్లపాటు పరిశోధన చేశారు. ఆపై స్థానిక రైతులతో మాట్లాడి తయారీని ప్రారంభించారు. అదే ఇప్పుడు స్థానికులకు ఉపాధితో బాటు రైతులకి లాభాలనీ తెచ్చిపెడుతోంది. సాధారణంగా కాఫీ గింజలు గట్టిపడేందుకు ఏడాదికి రెండుసార్లు కొత్తగా కొమ్మల్ని కత్తిరిస్తుంటారు. అయితే ఒకప్పుడు ఈ పనిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కత్తిరించిన ఆకులకూ ఆదాయం రావడంతో గిరిజన రైతులు విధిగా వాటిని తుంచుతున్నారు. ఆపై వాటిని ఎండబెట్టి విక్రయిస్తున్నారు.

ఎలా మంచిది?
మార్కెట్లోని గ్రీన్‌ టీలతో పోలిస్తే ఈ కాఫీ ఆకులతో చేసే కుటి, అరకు టీల్లో కెఫీన్‌ 45 శాతం తక్కువగానూ, యాంటీ ఆక్సిడెంట్లు 18 శాతం ఎక్కువగానూ ఉంటా యంటున్నారు రామన్‌. ఈ టీల్లో 70 శాతం ఎండిన కాఫీ ఆకులూ 12 శాతం అనాసపువ్వూ 10 శాతం నిమ్మగడ్డీ ఎనిమిది శాతం సోంపు వంటి సుగంధద్రవ్యాలూ ఔషధాలూ కలిపి తయారుచేయడంతో ఇవి ఎంతో రుచిగానూ ఉంటాయట. కేవలం ఇవే కాకుండా ఉసిరి, దాల్చినచెక్క, మెంతులు, వాము, ఛమేలీ, లావెండర్‌, నల్లజీలకర్ర, మునగాకు... వంటి పలు ఔషధ దినుసుల్ని కలిపి ఎర్లీ మార్నింగ్‌, రోజెల్లా, స్ట్రెస్‌ బస్టర్‌, గుడ్‌నైట్‌... ఇలా మరో నాలుగు రకాల ఔషద టీలను ఎలాంటి కృత్రిమ ఫ్లేవర్లూ లేకుండా చేస్తున్నారు. గ్రీన్‌ టీలానే పాలూ పంచదార లేకుండా తాగే ఈ టీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. కాఫీ ఆకుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లతోబాటు మ్యాంగిఫెరన్‌ అనే పదార్థం ఉంటుందనీ ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందనీ చెబుతున్నారు. కొలెస్ట్రాల్‌, డయాబెటిస్‌ తగ్గడానికీ మెదడు పనితీరుకీ ఈ మ్యాంగిఫెరన్‌ దోహదపడుతుందట. గిరిజన సహకార సంస్థలతోబాటు చాయ్‌గురూ ఇతర ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా విక్రయిస్తోన్న ఈ కాఫీ తేనీరు- చాయ్‌ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.


ప్రచారం ‘కవర్‌’ ఎక్కింది!

‘ఈ టీ తాగండి- ఆరోగ్యంగా ఉండండి’, ‘కప్‌నూడుల్స్‌ - వేణ్నీళ్లు పోస్తే తినేయొచ్చు’, ‘భయం వద్దు- మీ పాపాయి మా చేతుల్లో భద్రం’... ఇలా రకరకాల ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలూ వాటి క్యాప్షన్లూ రోజూ టీవీల్లో, పత్రికల్లో చూస్తూనే ఉంటాం కదా.. కానీ అంత శ్రమ లేకుండానే ఓ ఉత్పత్తిని చూడగానే అదేంటో అర్థమైపోయేలా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి కొన్ని సంస్థలు. తమ ఉత్పత్తి గురించి క్యారీబ్యాగులపైన ఆకట్టుకునే బొమ్మల రూపంలో ప్రచారం చేస్తూ మార్కెటింగ్‌లో నయా మంత్రను అనుసరిస్తున్నాయి.

ఓపెద్ద దుకాణానికి బట్టలు కొనడానికి వెళ్తే... బిల్లంతా అయ్యాక అన్నింటినీ ఓ బ్యాగులో సర్ది చేతికిస్తారు. అలాగే మందులూ, సెల్‌ఫోన్లూ, కళ్లజోడు... ఇలా ఏవి కొన్నా ఆఖరున పేపరు బ్యాగు లేదా కవరులో పెట్టి ఇవ్వడం మామూలే. ఒకసారి ఆ బ్యాగుల్ని చూస్తే... కొన్న షాపు లేదా బ్రాండ్‌పేరు వాటిపైన అక్షరాల రూపంలో రాసి ఉంటుంది. కానీ కేవలం పేర్లు మాత్రమే ప్రింట్‌చేస్తే ఎలాంటి లాభం ఉండదనుకున్న కొన్ని సంస్థలు మరో అడుగు ముందుకేసి ఆ బ్యాగుల్ని వీలైనంత వైవిధ్యంగా, సృజనాత్మకంగా డిజైను చేయించి, సులువుగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాగును చూస్తే అదే కంపెనీయో తెలిసిపోయేలా వాటి డిజైనింగ్‌పైనా శ్రద్ధ పెడుతున్నాయి. ఉదాహరణకు ఓ కళ్లజోడు సంస్థ... ఆ బ్యాగు హ్యాండిల్స్‌ను కళ్లజోడు ఫ్రేములా మార్చేసి, దాని అడుగున సంస్థ పేరు రాసింది. దాన్ని చూడగానే కళ్లజోళ్ల సంస్థకు చెందిన బ్యాగు అనేది ఎవరికైనా తెలిసిపోతుంది. అదేవిధంగా మరో క్యారీబ్యాగు హ్యాండిల్‌ దగ్గర కెటిల్‌ని వంచుతున్నట్లుగా ఓ బొమ్మ ఉండి అందులోని నీరు కప్పులోకి పడుతుంటుంది. ఆ కప్పు పైన కప్‌నూడుల్స్‌ అని ఉంటుంది. అంటే వేణ్నీళ్లు పోస్తే నూడుల్స్‌ తయారైపోతాయని సులువుగా చెప్పేసిందా సంస్థ. అలాగే టీ బ్యాగును నీళ్లల్లో నానబెట్టినప్పుడు కాసేపటికి ఆ సారం అంతా దిగుతుంది కదా.. దాన్ని సూచిస్తున్నట్లుగా టీ బ్యాగు తరహాలోనే బ్యాగును మార్కెట్‌లో విడుదల చేసింది మరో సంస్థ. ఇయర్‌ఫోన్లనే హ్యాండిల్‌గా మార్చేసి తమ సెల్‌ఫోన్‌ గురించి సులువుగా ప్రచారం చేసుకున్న సంస్థ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇక, హ్యాండ్‌బ్యాగులూ, చెప్పులూ, దుస్తులూ, ఆహారపదార్థాలూ, కెమెరాలకు సంబంధించిన సంస్థలయితే తమ ఉత్పత్తులు అందరికీ తెలిసిపోయేలా వీలైనంత భిన్నంగా బ్యాగుల డిజైనింగ్‌పైన దృష్టి పెడుతున్నాయి. అయితే... ఫిట్‌నెస్‌ ఉత్పత్తులూ, కార్ల యాక్సెసరీలూ, రక్తదానాన్ని ప్రోత్సహించే ఎన్జీవోలూ తదితర సంస్థలు తమ ఉత్పత్తుల్ని పెట్టేందుకు ఆ క్యారీబ్యాగులు సరిపోవు కాబట్టి ఈ తరహా డిజైనింగ్‌ని కేవలం ప్రచారం కోసం మాత్రమే వాడుకుంటున్నాయి. ఇలా వినూత్నంగా బ్యాగుల్ని డిజైన్‌ చేసి వినియోగదారుడికి అందిస్తే వాటిని ఓ మూలన పడేయరనీ, వీలైనంత ఎక్కువగా వాడుకుంటారనీ దానివల్ల తమ ఉత్పత్తి గురించి అందరికీ సులువుగా తెలిసిపోతుందనేది సంస్థల ఆలోచన. పైగా కొంతలోకొంత ప్రచారం ఖర్చు కూడా ఆ సంస్థలకు ఆదా అయినట్లే. ఏదేమైనా ఈ మార్కెటింగ్‌ కిటుకులకు హ్యాట్సాఫ్‌ అనాల్సిందే!


సినిమా శిక్షణ @ లాక్‌డౌన్‌

‘నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. సినిమాల గురించి కేవలం ఆన్‌లైన్‌లో నేర్చుకుని ఇటొచ్చేశాను అంతే..!’ అంటుంటారు నేటితరం దర్శకుల్లో చాలామంది. ‘అదెలా సాధ్యం?’ అనుకునేవారు కాస్త ఈ వెబ్‌సైట్‌లూ, వీడియోలూ చూడొచ్చు. వీటి ద్వారా సినిమాకి సంబంధించిన ఎన్నో నైపుణ్యాలని నేర్చుకోవచ్చు. ‘మరి ఫీజులో!’ అంటున్నారా... కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీటన్నింటినీ ఉచితంగానే ఆన్‌లైన్‌లో పెట్టారు మరి!

ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక విద్యాసంస్థ మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) దాదాపు 22 గంటలపాటు సాగే సినిమా పాఠాలని తమ సైట్‌లో పెట్టింది. ఎంఐటీలోని ఫిల్మ్‌ అండ్‌ మీడియా స్టడీస్‌కి చెందిన ప్రొఫెసర్‌ డేవిడ్‌ థర్‌బోర్న్‌ ఈ పాఠాల్ని చెబుతారు. ‘సినిమాకీ రసాయనశాస్త్రానికీ దగ్గర సంబంధం ఉందా?’ అనే ప్రశ్నతో మొదలు పెట్టి వివిధ సాంకేతిక అంశాలని వివరిస్తూ సాగుతుంది ఆయన లెక్చర్‌. చార్లీ చాప్లిన్‌, అకిరో కురొసావా, ఆల్బర్ట్‌ హిచ్‌కాక్‌ నుంచీ నేటితరం దర్శకుల వరకూ వాడిన వివిధ శైలుల గురించిన వీడియోలూ ఉన్నాయి. వీటిని ఎంఐటీ సైట్(ocw.mit. edu/courses/literature)లో చూడొచ్చు.

భారతీయ సినిమాలు...
మనదేశానికి చెందిన ‘ఫిల్మ్‌ కంపానియన్‌’ వెబ్‌సైట్ (swww.filmcompanion.in) ‘లెర్నింగ్‌ ఇన్‌ లాక్‌డౌన్‌’ పేరుతో సినిమాకి సంబంధించిన రకరకాల అంశాలపైన శిక్షణా వీడియోలని పెడుతోంది. ‘పాత్రల రూపకల్పన’కి సంబంధించి ఈ మధ్యే జాతీయ అవార్డు అందుకున్న నటుడు రాజ్‌కుమార్‌ రావుతో 50 నిమిషాలపాటు ‘లైవ్‌ సెషన్‌’ని నిర్వహించింది. ఇందులో రాజ్‌కుమార్‌ తాను పోషించిన షాహిద్‌, న్యూటన్‌ కుమార్‌ వంటి ఐదు పాత్రల తీరు గురించి వివరించాడు. అంతేకాదు, ఔత్సాహిక సినిమా విమర్శకులూ, సమీక్షకుల కోసం ప్రత్యేక వీడియో పాఠాలనూ ఈ వెబ్‌సైట్‌ రూపొందించింది. మనదేశంలోని ప్రముఖ విమర్శకులు భరద్వాజ్‌ రంగన్‌, అనుపమా చోప్రా, సుచరితా త్యాగి వీటిని నిర్వహిస్తున్నారు.

ఇంత ఈజీయా..!
మార్క్‌ కజిన్స్‌... లండన్‌కి చెందిన సినిమా దర్శకుడూ, సినిమా చరిత్రకారుడూ. ఆయన ‘40 డేస్‌ టు లెర్న్‌ ఫిల్మ్‌’(నలభై రోజుల్లో సినిమాని నేర్చుకుందాం) పేరుతో వెబ్‌సిరీస్‌ మొదలుపెట్టారు. చిట్టిపొట్టి కథలనూ, తన స్వీయానుభవాలనూ జోడించి సినిమాలో వాడే కలర్స్‌, ఐ లైనింగ్‌, ఫోకస్‌, డ్రాయింగ్స్‌... ఇలా విభిన్నమైన అంశాల గురించి చాలా ఆసక్తికరంగా ‘ఓస్‌ ఇంతేనా’ అనుకునేలా వివరిస్తున్నారు. పలు భారతీయ సినిమాల నుంచీ అనేక ఉదాహరణలని చూపిస్తున్నారాయన. కజిన్స్‌ పాఠాలని ప్రముఖ ఓటీటీ సైట్‌ ‘వీమియో’లో ఉచితంగా చూడొచ్చు!

యూట్యూబ్‌ ‘క్రాష్‌ కోర్స్‌’..!
యూట్యూబ్‌ తన ‘క్రాష్‌ కోర్స్‌’ ఛానెల్‌ ద్వారా సినిమా పాఠాలని అందిస్తుంది. ఇందులో ‘సినిమా హిస్టరీ’, ‘సినిమా ప్రొడక్షన్‌’ అనే విభాగాల కింద 32 వీడియోలున్నాయి. ప్రతి వీడియో నిడివి పన్నెండు నిమిషాలకు మించదు. సినిమాలోని 24 విభాగాలూ ఎలా పనిచేస్తాయో వివరంగా చెబుతున్నారు ఇందులో. హాలీవుడ్‌ నటి లిలీ గ్లాడ్‌స్టోన్‌, ప్రముఖ ‘వ్లాగర్‌’ క్రెయిగ్‌ బెంజైన్‌ వీటిని వివరిస్తున్నారు.

యానిమేషన్‌ నేర్చుకుంటారా..!
‘టాయ్‌ స్టోరీ’, ‘కార్‌’, ‘ఇన్‌సైడ్‌ ఔట్‌’... వంటి ప్రసిద్ధ యానిమేషన్‌ చిత్రాలకి పుట్టినిల్లైన ‘పిక్సార్‌’ సంస్థ అందిస్తున్న శిక్షణ ఇది. సినిమా తీయడంపైన మనకి ఆసక్తి ఉన్నా లేకున్నా... ఈ సంస్థకి చెందిన సాంకేతిక నిపుణులూ కళాకారులూ ‘ఇన్‌సైడ్‌ ఔట్‌’లాంటి చిత్రాలని ఎలా రూపొందించారో చూడటం ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఈ వీడియో పాఠాలని- చిన్నారుల కోసం ఉచితంగా పాఠాలు నేర్పుతున్న ఖాన్‌ అకాడమీ ద్వారా అందిస్తోంది. వీటిని khanacademy.org/partnercontent/pixarలో చూడొచ్చు.

స్క్రిప్టు రాయడం ఎలా?
‘సినిమాటిక్‌ కథ అంటే ఏమిటీ?’, ‘స్ట్రక్చర్‌ని ఎలా రూపొందిస్తారు? ‘సీన్‌ రాయడం ఎలా?’ - ఇలా సినిమా స్క్రిప్టుకి సంబంధించిన సమస్త అంశాలనీ నేర్పుతోంది లండన్‌కి చెందిన ఈస్టర్న్‌ ఆంగ్లియా యూనివర్సిటీ. వాల్ట్‌ డిస్నీ సంస్థలో రచయితగా పనిచేసే మైఖెల్‌ లెంగ్స్‌ఫీల్డ్‌ ఇందులో పాఠాల్ని చెబుతున్నారు. ఇది మూడువారాల కోర్సు. మన పేరూ వివరాలనూ రిజిస్టర్‌ చేసుకుంటేనే వీడియో పాఠాలని చూడటానికి అనుమతిస్తారు. ‘హ్యారీ పోటర్‌’ వంటి పాపులర్‌ సినిమాలెన్నింటినో తీసుకుని ‘సీన్‌-బై-సీన్‌’ సినిమా కథాకథనాలని వివరించి చెప్పడం ఈ కోర్సు ప్రత్యేకత! ఈ కోర్సు కోసం మీ వివరాలని futurelearn.com/courses/screewritingలో నమోదు చేసుకోవచ్చు.


సాంబ్రాణి సంగతులెన్నో..!

తెల్లవారు జామున గుళ్లోకి వెళ్లగానే గుప్పున ముక్కుపుటాలను తాకే సుగంధ పరిమళం, స్నానం చేయించిన పసిబిడ్డను ఎత్తుకోగానే హాయిగొలిపేలా వచ్చే కమ్మటి సువాసన, పండగలప్పుడు ఇంటిని చుట్టేసే అత్తరు గుబాళింపుల ధూపం... సాంబ్రాణి. విరిగిపోయిన గాజు ముక్కల్లా కనిపించే ఆ పరిమళ ద్రవ్యం ఓ చెట్టు జిగురని మీకు తెలుసా... దానిలో ఆరోగ్యానికి మేలు చేసే  సుగుణాలూ ఉన్నాయని విన్నారా... ఇవిగోండి ఆ విశేషాలు!

ప్రకృతి మనకు చాలానే ఇచ్చింది. దాన్నుంచే మనం మన ఆహారాన్నీ ఆనందాన్నీ వెతుక్కుంటాం. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సాంబ్రాణి ధూపమూ అలా అడవితల్లి ఒడిలో పుట్టిందే. తుమ్మ చెట్టు కాండానికి గాటు పెడితే జిగురు రావడం మనకు తెలిసిందే. అచ్చం అలాగే, చెట్టుకు గాట్లు పెట్టడం వల్ల సాంబ్రాణి కూడా తయారవుతుంది. ఆ వృక్ష జాతులే బోస్వెల్లియా శాక్రా (ఫ్రాంకిన్సెస్‌), కొమ్మి ఫొరా మిరా (మిర్‌).

ఎక్కడ పెరుగుతుందంటే...
సాంబ్రాణిని ఉత్పత్తి చేసే ఈ చెట్లు ఎక్కువగా సోమాలియా, అరేబియా, ఒమన్‌ దేశాలతో పాటు భారత్‌, ఇథియోపియా, జోర్డాన్‌, ఆఫ్రికా తదితర దేశాల్లోనూ పెరుగుతాయి. ఇవి ఎక్కువగా పొడి వాతావరణం, ఎండా ఉండే ఉష్ణమండల ప్రాంత నేలల్లో పెరుగుతాయి. ఈ చెట్లలో ఫ్రాంకిన్సెస్‌ జిగురు గట్టిగా ఉంటే, మిర్‌ రకం బంక గాఢమైన వాసన కలిగి ఉంటుంది. చెట్టు పెరిగే వాతా వరణం, నేల, చెట్టు వయసు తదితరాలను బట్టి దాని నుంచి వచ్చే జిగురు నాణ్యత ఆధార పడుతుంది. అయితే, ఒమన్‌లో దొరికే ఫ్రాంకిన్సెస్‌ రకం జిగురునూ సోమాలియాలో దొరికే  మిర్‌ రకం జిగురునూ నాణ్య మైనవిగానూ ఖరీదైనవిగానూ చెబుతారు. సోమాలియాలో పెరిగే ‘కింగ్‌ ఆఫ్‌ ఫ్రాంకిన్సెస్‌’ను  సాంబ్రాణుల్లో అత్యంత ఖరీదైనదిగా చెబుతారు. దీని ధర కిలో రూ.30వేల పైగా పలుకుతుంది.

వేల ఏళ్ల నుంచీ...
క్రీస్తు పుట్టినప్పుడు ఆయన కోసం వచ్చిన ముగ్గురు మేధావుల్లో ఒకరు బంగారం తీసుకురాగా ఒకరు ఫ్రాంకిన్సెస్‌ సాంబ్రాణినీ, మరొకరు మిర్‌ సాంబ్రాణినీ తీసుకువచ్చారని బైబిల్‌ చెబుతుంది. మధ్య ప్రాచ్యదేశాల్లోనూ, ఉత్తర ఆఫ్రికాలోనూ దాదాపు అయిదు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే సాంబ్రాణి వ్యాపారం నడిచేదట. బాబిలోనియాలో అంత్యక్రియల్లోనూ, ఈజిప్టులో మమ్మీలను భద్రపరిచేందుకూ ఈ సాంబ్రాణిని వాడేవారట. సాంబ్రాణి పొగ ఉండే చోట సూక్ష్మక్రిములూ, కీటకాలూ ఉండవు. అందుకే ఇప్పటికీ పసిపిల్లలకు స్నానం చేయించగానే సాంబ్రాణి పొగ వేస్తారు. దీని నుంచి తీసే నూనెను సబ్బులూ, పర్‌ఫ్యూమ్‌లూ, బాడీ లోషన్లూ తది తరాల్లో వాడతారు. ఈ నూనె చర్మాన్ని యవ్వనంగా ఉంచుతూ, జుట్టుకి బలాన్నిస్తుంది.

ఆరోగ్యానికీ ఎంతో మేలు!
సాంబ్రాణిని ఆయుర్వేదంలో కీళ్లనొప్పుల నివారణకూ, జీర్ణక్రియ, చర్మ రోగాలను తగ్గించేందుకూ తయారు చేసే లేహ్యాలూ, ఇతర మందుల్లో వాడతారు. అలాగే, యాంక్జైటీ, ఆస్తమా, అల్సర్లూ, క్యాన్సర్ల చికిత్సల కోసం వినియోగించే మందుల తయారీలోనూ సాంబ్రాణిని ఉపయోగిస్తున్నారు. దీనిలో యాంటీ సెప్టిక్‌ గుణాలూ ఉన్నాయి గనుక, దీన్నుంచి తీసిన నూనెను టూత్‌పేస్టులూ, ఆయింట్‌మెంట్లూ, మందుల తయారీలోనూ వాడతారు. సాంబ్రాణి ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడుల్ని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుందట. అందుకే మానసిక రుగ్మతల్ని దూరం చేసే అరోమా థెరపీలోనూ దీన్ని వాడతారు. ఈ సువాసన మనసును ఉత్సాహంగా ఉంచుతూ డిప్రెషన్‌ను దరిచేరనీయదట. ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే, ఈనాటికీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల టన్నుల సాంబ్రాణి వ్యాపారం జరుగుతోంది మరి!


ఆ గుహలో నిధి నిజంగానే ఉందా?

సోన్‌ భండార్‌ లేదా స్వర్ణ భండార్‌ గుహలు... కొండరాళ్లను తొలిచిన ఈ గుహలు బీహార్‌ రాష్ట్రం రాజ్‌గిర్‌లోని వైభార్‌ కొండల్లో ఉన్నాయి. క్రీ.పూ. నాటి ఈ గుహల్లో ఎందరో హిందూ, జైన సాధువులు ధ్యానం చేసినట్లు చెబుతారు. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే-క్రీ.పూ. ఆరో శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యానికి చెందిన బింబిసార చక్రవర్తి రాజ్‌గిర్‌ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న సమయంలో- సింహాసనాన్ని హస్తగతం చేసుకోవడం కోసం తన కొడుకే తనను చంపించేందుకు ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలుసుకుని, అపార సంపదను-ప్రధానంగా బంగారాన్ని ఇక్కడున్న కొండగుహల్లోని గోడలో దాచినట్లు చెబుతారు. గుహలోపల ఓ దారి ఉందనీ, అది నేరుగా ఆ నిధి దగ్గరకే వెళుతుందనీ అంటారు. ఈ కథనం నిజమే అన్నదానికి గుర్తుగా గుహలోని ఓ గోడకి తలుపు ఆకారమూ దానికి పక్కనే అర్థంకాని భాషలో ఓ లిపీ కనిపిస్తాయి. అయితే ఆ లిపిని ఎంత ప్రయత్నించినా ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఓ బ్రిటిష్‌ అధికారి అయితే ఆ గుహ గోడని శక్తిమంతమైన ఫిరంగి గుళ్లతో పేల్చినా అది చెక్కుచెదరలేదు. ఈ ప్రయత్నాలన్నీ ఆ గుహ పట్ల మరింత ఆసక్తిని పెంచాయే తప్ప ఆ నిధి రహస్యం మాత్రం వీడలేదు. నాకైనా నిధి కనిపించక పోతుందా అన్న ఆశో లేదూ కనీసం అద్భుతంగా చెక్కిన ఆ గుహల్ని ఓసారి చూడాలనో తెలియదు కానీ ఏటా ఈ ప్రాంతాన్ని సందర్శించేవాళ్ల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉందట.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు