close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా వేళ... సొంతవారిలా సేవ!

కరోనా మహమ్మారి నుంచి బయటపడటానికి చిన్నా పెద్దా, ఆడా మగా అన్న తేడాలేకుండా అందరూ సహాయ కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. రైతులు- పండించిన పంటలూ, చిన్నపిల్లలు- దాచుకున్న డబ్బుతో భోజనమూ సరకులూ... ఇలా ఎవరికి వీలైనవి వారు పేదలకు అందజేస్తూ సేవాభావానికి ఎల్లలు ఉండవని చాటుతున్నారు.


పంట దిగుబడుల పంపిణీ

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన పబురాం మంద, మున్నీదేవి దంపతులది సాధారణ రైతు కుటుంబం. తమకున్న అయిదెకరాల వ్యవసాయ భూమిలో పంటలను సాగు చేస్తూనే ఇద్దరు కొడుకుల్నీ చదివించారు. పెద్దకొడుకు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటుండగా.. చిన్న కొడుకు దిల్లీలో ఆదాయ పన్ను శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా ఉద్యోగం సాధించాడు. కొడుకు ఉన్నత ఉద్యోగంలో స్థిరపడినా... పబురాం దంపతులు మాత్రం వ్యవసాయాన్ని మరవలేదు. ప్రతి సంవత్సరం దిగుబడి వచ్చిన తరవాత... కుటుంబానికి సరిపడా ధాన్యాన్ని నిల్వ చేసుకుని, మిగిలిన మొత్తాన్ని విక్రయించే వారు. ఈ సారి కరోనా కారణంగా వారు పంట దిగుబడులను అమ్మలేదు. లాక్‌డౌన్‌ తరవాత విక్రయించి లాభాలు పొందాలనీ ఆలోచించ లేదు. ఆ ధాన్యంతోపాటు మరికొన్ని నిత్యావసర సరకులను కొనుగోలు చేసి... కరోనా కారణంగా ఉపాధి లేని పేదలకు పంపిణీ చేయాలని అనుకున్నారు. మొదట... జోధ్‌పూర్‌ జిల్లా ఔసియాన్‌, తిన్వారీ తహసీల్‌ పరిధిలోని 80 గ్రామాల్లో ఆరు వేల పేద కుటుంబాలను గుర్తించారు. తరవాత అందులోని ఒక్కో కుటుంబానికి 10 కిలోల గోధుమ పిండీ, కిలో పప్పూ, పసుపూ, ఉప్పూకారంతోపాటు లీటరు వంట నూనె, బిస్కట్‌ ప్యాకెట్లూ, సబ్బులూ, పేస్టులూ పంపిణీ చేస్తున్నారు. అలా... ఇప్పటి వరకూ ఆ రైతు దంపతులు 40 గ్రామాల్లో మూడు వేలకుపైగా కుటుంబాలకు వీటిని అందజేశారు. ఇంకా అందజేస్తూనే ఉన్నారు.


పేదలకు కూరగాయలు...

‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న మదర్‌థెరిస్సా మాటలు ఆ మహిళా రైతులో స్ఫూర్తి నింపాయి. ఆ స్ఫూర్తితోనే పలు గ్రామాల్లోని పేదలకు కూరగాయలూ, పాలూ పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారామె. ఒడిశాలోని భద్రక్‌ జిల్లా కురుడకు చెందిన ఛాయారాణి సాహుకు మొదటి నుంచీ వ్యవసాయం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే భర్త సర్వేశ్వర్‌ సాహుతో కలిసి తమ ఏడెకరాల భూమిలో గత ఇరవై ఏళ్లుగా కూరగాయలను సాగు చేస్తూ ఇరవై ఆవులతో పాడి పరిశ్రమనూ నిర్వహిస్తోంది. ప్రతి రోజూ తనే స్వయంగా కూరగాయలూ, పాలూ విక్రయిస్తుంటుంది. అయితే, ప్రస్తుతం కరోనా కారణంగా ఉపాధి లేక పేదలు నిత్యావసర సరకులను కొనడానికి ఇబ్బంది పడుతుండటంతో అలాంటి వారికి అండగా ఉండాలనుకుంది ఛాయారాణి. దాంతో గత కొన్ని రోజులుగా సొంత గ్రామమైన కురుడతోపాటు చుట్టుపక్కల భైరబ్‌పూర్‌, అలబగ, లుంగ, బ్రాహ్మణిగావ్‌, వినాయక్‌పూర్‌ తదితర 15 గ్రామాల్లోని పేద కుటుంబాలకు పాలు, టొమాటోలు, వంకాయలు, బెండకాయలు, క్యారెట్లు, పచ్చిమిర్చి ఉచితంగా అందిస్తూ ఔదార్యం చూపుతోంది. వీటిని పంపిణీ చేయడానికి ఆమె ప్రత్యేకంగా ఓ వాహనాన్ని అద్దెకు తీసుకుంది కూడా.


ఆకలి బాధ తీర్చుతున్న ‘కిచిడీ ప్రాజెక్ట్‌’

కరోనా కారణంగా విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. పిల్లలందరూ స్నేహితులతో మాట్లాడుతూనో, టీవీలు చూస్తూనో, ఫోన్లూ కంప్యూటర్లలో గేమ్స్‌ ఆడుతూనో ఆనందంగా గడుపుతున్నారు. కానీ ఆ విద్యార్థులు మాత్రం దీనికి విరుద్ధంగా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన దీప్‌దేశాయ్‌, నందన్‌ కొనేటి అక్కడి ‘విద్యాశిల్పి అకాడమీ’లో పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు. కరోనా వల్ల పనులు కరవై, ఆహారం లేక పేదలు పడుతున్న అవస్థలను టీవీలూ పత్రికల్లో చూసి చలించారు. తాము పొదుపు చేసుకున్న డబ్బుతో పేదల ఆకలిని తీర్చాలనుకున్న ఆ విద్యార్థులు... తమ ఆలోచనను తల్లిదండ్రులతో చెప్పారు. వారు అంగీకరించడంతో ప్రత్యేకంగా ‘కిచిడీ ప్రాజెక్ట్‌’ పేరిట పేదలకు కిచిడీ, చట్నీ పంపిణీని ప్రారంభించారు. తాము చేస్తున్న ఈ కార్యక్రమం గురించి ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రాం ద్వారా స్నేహితులకూ పరిచయస్తులకూ వివరించారు. వారూ తలాకొంత డబ్బును అందజేయడంతో సుమారు లక్షాయాభై వేల రూపాయలు పోగయ్యాయి. ఈ మొత్తం డబ్బుతో ఆ ఇద్దరు స్నేహితులు బెంగళూరులో రోజూ వంద మందికిపైగా పేదలకు కిచిడీ అందిస్తూ ఆకలి బాధ తీర్చుతున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు