close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సెల్ఫీల కోసం మ్యూజియం!

రోజంతా లెక్కలేనన్ని సెల్ఫీలు దిగడం కొందరికి భలే సరదా... అదిగో అలాంటి వారి కోసమే ఇప్పుడు దుబాయ్‌లో ‘సెల్ఫీ కింగ్‌డమ్‌’ పేరుతో ఓ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇందులో రకరకాలైన బ్యాక్‌గ్రౌండ్లు కలిగిన 15 గదులు ఉంటాయట. అంటే ఒక గది మొత్తం సీడీలతో అలంకరణ... మరో గదంతా మబ్బుల్లో తేలిపోయినట్టు కనిపించేలా ఏర్పాటూ... ఇంకోచోట అందమైన ప్రకృతి దృశ్యాలూ... ఇలా ప్రతిదీ భిన్నంగా ఉంటుందట. వచ్చిన సందర్శకులు తమకు నచ్చిన పోజులు పెట్టి అందులో ఫొటోలు తీసుకోవచ్చు. సెల్ఫీలు తీసుకోవడం సరిగ్గా రాని వారి కోసం మ్యూజియం నిర్వాహకులే ట్రైపాడ్‌ లాంటివి కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకేముంది... నచ్చినన్ని సెల్ఫీలు క్లిక్‌మనిపించి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసేయడమే!


ఇది మాస్కుల చెట్టు!

చెట్లకు డబ్బులు కాస్తాయో లేదో తెలీదు కానీ మాస్కులు మాత్రం కాస్తాయంటోంది అమెరికాకు చెందిన డెబ్‌ సిగ్గిన్స్‌. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆ దేశంలో వైద్యులకు సైతం రక్షణ పరికరాలు లేని పరిస్థితి. దీంతో అందరికీ ఏదైనా సాయం చేయాలి అనుకుంది డెబ్‌. తనే సొంతంగా మాస్కులు కుట్టడం మొదలుపెట్టింది. అయితే వాటిని నేరుగా వెళ్లి పంచడం అంటే నిబంధనలు అతిక్రమించినట్టు అవుతుంది కదా! అందుకని తమ వీధిలోని ఓ చెట్టును ‘గివింగ్‌ ట్రీ’గా మార్చేసింది. తను తయారుచేసిన మాస్కులను ఆ చెట్టుకు రోజూ వేలాడదీస్తోందన్న మాట. అవసరం ఉన్నవారు ఎవరైనా వాటిని ఉచితంగా తీసుకోవచ్చు. ఎవరు ఎన్ని తీసుకున్నా ఏం కాదు. ప్రస్తుతం రోజంతా మాస్కులు కుట్టడం, సాయంత్రం వాటిని చెట్టుకు పెట్టడం... ఇదే ఆమె దినచర్య అయిపోయింది. ఐడియా బాగుంది కదూ!


కదలకుండా రోజుకు 6 గంటలు!

కుదురుగా గంటసేపు కూర్చోమంటేనే కష్టంగా అనిపిస్తుంది మనకి. అలాంటిది రోజూ 6 గంటలపాటు ఒకేచోట కూర్చోవడమంటే మాటలా! కానీ అది సాధ్యమే అని నిరూపిస్తున్నాడు ఆస్ట్రేలియాలో ఉండే టిమ్‌. ఇతడు తన వీపు మీద టాటూ వేసేందుకు ఒక కళాకారుడికి అనుమతి ఇచ్చాడు. అలా వేయించుకున్న టాటూను ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వివిధ దేశాల్లోని మ్యూజియాల్లో ప్రదర్శిస్తున్నాడు. అంటే అక్కడ ఉండే కళారూపాల్లాగానే టిమ్‌ కూడా ఒక గ్యాలరీలో రోజంతా కదలకుండా కూర్చుంటాడన్న మాట! ప్రస్తుతం ఇలా ఆస్ట్రేలియాలోని ఓ మ్యూజియంలో ఉన్నాడు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా దాన్ని మూసివేయడంతో సందర్శకులు ఎవరూ రాకపోయినా... టిమ్‌ మాత్రం ఒక్కడే కూర్చుంటున్నాడట! ఎటూ ఉంటున్నాడు కదా అని మ్యూజియం నిర్వాహకులు అతడి గ్యాలరీని ప్రేక్షకులకు లైవ్‌లో చూపిస్తున్నారట!


ఎంత మంచి మాస్టారో!

విద్యార్థుల ముందు మాస్టారు ఎంత గంభీరంగా కనిపించినా... దాని వెనుక వెన్నలాంటి మనసు ఉంటుంది, పిల్లలంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. దానికి ఈ మాస్టారే ఉదాహరణ. లండన్‌కు చెందిన జేన్‌ పాలెస్‌ మాజీ సైనికుడు. ప్రస్తుతం వెస్ట్రన్‌ ప్రైమరీ స్కూల్‌ అనే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆ బడిలో పిల్లలకు మధ్యాహ్న భోజనం పాఠశాల నిర్వాహకులే అందిస్తారట. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా స్కూల్‌ మూసివేశారు. పిల్లలు తరగతులకు హాజరు కాలేకపోవడంతో వారికి భోజనం అందడం లేదు. ఇళ్లలో ఉంటున్నా తల్లిదండ్రుల ఆదాయాలు అంతంతమాత్రం. దీంతో పిల్లలు ఇబ్బంది పడకూడదని ఆలోచించిన జేన్‌... తనే స్వయంగా వారికి ఆహారం అందించాలని నిర్ణయించుకున్నాడు. రోజూ 18 కేజీల బరువున్న ఆహార పొట్లాలను మోస్తూ 8 కిలోమీటర్ల మేర ఇంటింటికీ నడుచుకుంటూ వెళ్లి విద్యార్థులకు అందిస్తున్నాడు. దాంతోపాటే వారు చదువుకు దూరం కాకుండా చిన్న చిన్న హోంవర్కులు ఇస్తూ మానసికంగా దృఢంగా ఉండేలా ప్రోత్సహిస్తున్నాడట. ఎంత మంచి మాస్టారో కదా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు