
ఒక పెద్ద కోట. అందులో అందమైన యువరాణి. బోలెడు కథల్లో ఇలాంటి వర్ణనలు మనం చదివే ఉంటాం. అయితే యువరాణుల్లాంటి ఆడపిల్లల మెడల్లో ఆ కోటలు ముచ్చటగా ఒదిగిపోతే రాజసమంతా ఓ చోట పోగైపోదూ అనుకున్నారేమో డిజైనర్లు... ‘క్యాజిల్ జ్యువెలరీని’ రూపొందిస్తున్నారు. ఈ తరహా పెండెంట్లను ముత్యాలూ, పగడాలతో పాటు పచ్చలూ, కెంపులూ సహా వివిధ రంగుల రాళ్లను ఉపయోగించి తయారు చేస్తున్నారు. రకరకాల కోటల ఆకృతిలో చూడగానే కళ్లను కట్టిపడేసేలా తయారవుతున్న ఇవి, అమ్మాయిల మనసు దోచేస్తాయనడంలో సందేహమా!
ఉంగరానికి టాజిల్ సోకు!
వాడే వస్తువు చిన్నదైనా పెద్దదైనా ఎప్పటి కప్పుడు అప్డేట్ అయితేనే దాన్ని వాడటంలో మజా ఉంటుందన్నది కుర్రకారు మాట. దానికి జ్యువెలరీ మాత్రం మినహాయింపేం కాదు. అందుకే నగలూ ఎప్పటి కప్పుడు కొత్త సొగసులద్దుకుని జనం ముందుకు వస్తున్నాయి. అలాంటి వాటిలో ఓ రకమే ‘టాజిల్ ఉంగరాలు’. ఉంగరానికి ముందుభాగంలో గొలుసులు వేలాడటం వీటి ప్రత్యేకత. అంటే దీన్ని పెట్టుకునేప్పుడు వేలి దగ్గర మామూలు ఉంగరం మాదిరి సౌకర్యంగానే ఉంటుంది. బయటివైపు టాజిల్స్ వేలాడటం వల్ల మనం మాట్లాడుతున్నప్పుడూ, పనిచేస్తున్నప్పుడూ చేత్తో పాటు కదులుతూ కొత్త అందాన్ని తీసుకువస్తాయి. బంగారంతో చేసిన వీటిలో వజ్రాలూ, క్రిస్టళ్లలాంటివి జోడిస్తున్నారు. ఇక మీదట దుస్తులే కాదు ఉంగరాలూ టాజిల్స్‌తో మురిపించనున్నాయన్నమాట!
మ్యాచింగ్ మ్యాచింగ్ నల్లపూసలు!
ఫ్యాషన్‌ను ఫాలో అయ్యే వాళ్లందరికీ మ్యాచింగ్ వేసుకోవడమంటే ఎంత పిచ్చో చెప్పనక్కర్లేదు. అయితే నల్లపూసల విషయంలో మాత్రం అది ఇప్పటి దాకా సాధ్యపడలేదు. దుద్దులూ, గాజులూ, ఉంగరాలూ ఇలా అన్నీ మార్చేసుకున్నా, వేసుకున్న డ్రెస్సుకు తగ్గట్టు నల్లపూసలు మార్చుకోవడమంటే కష్టమే. కానీ ఇప్పుడు నల్లపూసల్ని కూడా మన మ్యాచింగ్ ఫ్యాషన్‌లో భాగం చేసుకోవచ్చు. ఎలా అôటారా... ఇదిగో, ఈ ఇంటర్ ఛేంజబుల్ లాకెట్ల సాయంతో. ఈ రకం నల్లపూసల గొలుసులతో పాటు రంగురంగుల పూసలూ రాళ్లూ కలిగిన లాకెట్లూ, వాటికి తగ్గ జుంకాలూ వస్తాయి. మనం ఏ రంగు చీర లేదా డ్రెస్సు వేసుకున్నామో ఆ రంగులో ఉండే లాకెట్‌ను తీసుకుని, ఆ గొలుసుకు ఉండే కొక్కెం సాయంతో మార్చుకోవచ్చు. ఎంచక్కా నల్ల పూసల గొలుసునూ మ్యాచింగ్ మ్యాచింగ్‌లా పెట్టుకోవచ్చు!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్