
‘బొమ్మను చూస్తే నీలా ఉంది... దగ్గరికొస్తే కేకయ్యిందీ... సర్లే పోనీ కోద్దామంటే... మనసే రాకుందీ...’ ఇక్కడున్న ఈ బొమ్మల్ని చూస్తే ఎవరికైనా ఇలానే పాడాలనిపిస్తుందేమో... ఎందుకంటే కళ్లుచెదిరే డిజైనర్ డ్రెస్సులతో ముద్దొచ్చే ఈ బొమ్మలన్నీ కేకులే మరి. ఫ్యాషన్ డిజైనర్లని సైతం చకితుల్ని చేసేంత అందమైన డిజైన్లతో బొమ్మకేకుల్ని తయారుచేస్తున్నారు నేటి బేకింగ్ మాస్టర్స్.
అందమైన అమ్మాయిని చూడగానే బొమ్మలా ఉంది అంటుంటాం. ఇక, ఆ అమ్మాయి పుట్టినరోజుకి కుచ్చులతో ఉండే వెడల్పాటి గౌను వేసుకుంటే బుట్టబొమ్మలా ఎంత ముద్దుగా ఉందో అనకుండా ఉండలేం. అది తెలిసే కాబోలు, అమ్మాయిలకోసం బుట్టబొమ్మలాంటి కేకుల్ని రూపొందిస్తున్నారు కేకు కళాకారులు. పార్టీకి వచ్చిన అతిథుల కళ్లు అమ్మాయి కన్నా ముందున్న కేకుమీదే నిలిచిపోయేంత అద్భుతంగా వాటిని చేస్తున్నారు.
అబ్బురపరిచే రూపాల్లో కేకుల్ని తయారుచేయడం నిజానికి కొత్త విషయమేమీ కాదు. కానీ ఈ బొమ్మకేకులమీద ఉన్న డ్రెస్సు డిజైన్లకి ఫ్యాషన్ డిజైనర్లు సైతం ఫిదా అయ్యేంత అందంగా అవి ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. అచ్చం డ్రెస్సులమీద ఉన్నట్లే సిల్కు, లేసు పువ్వులూ రాళ్ల ఎంబ్రాయిడరీల్ని తలపించేలా ఫాండంట్తోనే చకచకా డిజైన్లు సృష్టించేస్తున్నారు. అదే గతంలో అయితే షుగర్ పేస్టు, బటర్‌క్రీమ్, మార్జిపాన్ లేదా రాయల్ ఐసింగ్లతోనే కేకుల్ని ఎక్కువగా అలంకరించేవారు. కానీ ఈమధ్య, ముఖ్యంగా కేకుల్ని బొమ్మల్లా చేయాలనుకున్నప్పుడు పంచదార, నీరు, జెలాటిన్, గ్లిజరిన్ కలిపి తయారుచేసిన ఫాండంట్నే వాడుతున్నారు. మిగిలినవాటితో పోలిస్తే ఫాండంట్తో డిజైన్ని ఎంతో సునిశితంగా చెక్కొచ్చు. పైగా డిజైన్లకోసం రకరకాల ఎడిబుల్ కలర్స్తోబాటు ఫ్లేవర్కోసం కొద్దిపాళ్లలో ఎసెన్స్నీ కలిపి చేసే ఈ బుట్టబొమ్మలు చూడ్డానికే కాదు, తినడానికీ బాగుంటాయి.
ఈ కేకుల మీద పెట్టే బొమ్మల్లో డిస్నీ ప్రిన్సెస్, ఫ్రోజెన్ క్వీన్ ఎల్సా, సిండ్రెల్లా, అందాల బొమ్మ బార్బీ... ఇలా రకరకాలు ఉంటున్నాయి.
ఆ బొమ్మ క్యారెక్టర్ ఎక్కువగా వేసుకునే డ్రెస్సుల్నే కేకుల్లోనూ డిజైన్ చేస్తున్నారు. బార్బీ బొమ్మకయితే ప్రాంతాన్నీ వేడుకనీ బట్టి రకరకాల కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేయడం తేలిక కావడంతో కేకుల్లోనూ ఆ బొమ్మదే హవా. దాంతో పుట్టినరోజు వస్తోందంటే చాలు, కుటుంబసభ్యులతోబాటు స్నేహితులూ అమ్మాయికిష్టమైన కలర్ డ్రెస్సుతో బొమ్మ కేకుని డిజైన్ చేయించి, సర్ప్రైజ్ చేస్తున్నారు. మీరూ ప్లాన్ చేయండి మరి..!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్