close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అంతేగా... అంతేగా...

- జి.యస్‌. లక్ష్మి

ఫీసునుండి రాగానే మెరుస్తున్న కళ్లతో ఎదురొచ్చిన నీరజని చూసి ఆశ్చర్యపోయాను.
‘‘మన సుందీకి ఎంగేజ్మెంటండీ... అన్నయ్య ఇందాకే ఫోన్‌ చేశాడు...’’
శుభవార్త విన్న నాకూ ఆనందమనిపించింది. సుందరి నా బావమరిది కూతురు. ఎమ్మెస్‌ చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. అత్తారింట్లో శుభకార్యమంటే ఆ ఇంటి అల్లుడికి ఆనందమే కదా! మా పెళ్లయి పాతికేళ్లయినా ఇప్పటికీ ఆ ఇంటికెళితే అల్లుడనే అంటారు కదా! అల్లుడనే హోదాలో ఎంత గొప్పతనముందో తల్చుకుంటున్నకొద్దీ నాలో ఉత్సాహం ఉరకలేసింది. ‘‘ఎప్పుడు! ఎక్కడ!’’ అంతే ఉత్సాహంగా అడిగాను.
‘‘వచ్చేనెల పదిన. ముందు టికెట్స్‌ బుక్‌ చెయ్యండి. ఆలస్యమైతే దొరకవు...’’
నిజమే కదా... ఆ రాత్రే ఆన్‌లైన్‌లో విజయవాడకి టికెట్స్‌ బుక్‌ చేసేశాను.
మర్నాడు పొద్దున్న లేస్తూనే చెప్పింది నీరజ. ‘‘టికెట్స్‌ కాన్సిల్‌ చేసెయ్యండి...’’ అంటూ
‘‘అదేంటీ!... ఎంగేజ్మెంట్‌ విజయవాడలో కాదా!’’ అన్నాను అర్థంకాక.
‘‘ఎక్కడైతేంలెండి...’’ అంది నీరసంగా సోఫాలో కూలబడుతూ.
‘‘ఏంటీ... ఏమైంది!’’
‘‘ఎంగేజ్మెంట్‌ ఆన్‌లైన్‌లోనట. అబ్బాయికి చైనాలో ఉద్యోగం కదా! ఈ కరోనా వైరస్‌ భయంతో ఎక్కడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెనక్కి పంపేస్తారోనని ఇండియా రావడానికి భయపడుతున్నాట్ట. అబ్బాయి రానిదే నేను మటుకు ఎందుకూ, ఏకంగా పెళ్లికే వస్తాను అందిట సుందీ. మరి ఎంగేజ్మెంట్‌ సంగతేమి టంటే ‘దాందేముంది... ఆన్‌లైన్‌లో చేసేసుకుందాం...’  అందిట.’’
నీరజ చెప్పింది వింటున్న నేను ‘‘ఆన్‌లైన్‌లోనా... అంటే...’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘మహా తెలీనట్టు. ఆ టైమ్‌కి అటువాళ్లూ ఇటువాళ్లూ అందరూ లాగిన్‌ అవుతారన్నమాట. ఇక్కడ పేరెంట్స్‌ తాంబూలాలు పుచ్చుకుంటూంటే అక్కడ్నుంచి వాళ్లు దండమెడతారన్నమాట...’’ అంది కొంచెం విసుగ్గా.
‘‘ఇదేమిటో కొత్తగా బాగుందే. హాయిగా ఎవరింట్లో వాళ్లు కూర్చుని ఫంక్షన్‌ చూసెయ్యొచ్చు. శ్రమపడి సెలవులు పెట్టుకుని ఊళ్లూ వెళ్లక్కర్లేదు, వాళ్లకీ ఇబ్బందుండదూ...’’ అన్నాను.
‘‘ఊ... ఏం బాగు నా మొహం. ఎవరింట్లో వాళ్లు కూర్చుని చూస్తే పట్టుచీరలన్నీ ఎప్పుడు కట్టుకోవాలి. ఈ వంకనైనా పుట్టింటి కెళదామనుకునే నాలాంటి ఆడపిల్లలకి ఎంత బాధగా ఉంటుంది...’’
‘‘ఛ... తప్పు అలా అనకు. శుభమా అంటూ వాళ్లు పెళ్లి కుదుర్చుకుంటుంటే నువ్విలా బాధపడకూడదు. పిల్లలకి మంచిదికాదు...’’ నచ్చచెప్పాను.
అవునుకదా అనుకుంటూ మొహమ్మీదకి నవ్వు తెచ్చుకుని, ‘‘పోన్లెండి... వాళ్లు బాగుంటే చాలు. పెళ్లికెలాగూ పదిరోజులముందు వెళతాంగా...’’ అంటూ పదిరోజుల కోసం ముందే టెండర్‌ పెట్టేసింది.
ఆ సమయానికి కరెంటు పోతే సిస్టమ్‌లో ఎంగేజ్మెంట్‌ మిస్సవుతామని అప్పటిదాకా మా ఇంట్లో లేని ఇన్‌వర్టరుని వేలు ఖర్చు పెట్టి కొనిపించింది నా చేత నీరజ. పోనీలే కారణమేదైతేనేం ఇంట్లోకి ఓ వస్తువు వస్తోంది కదా అనుకున్నాను.
అనుకున్న ఆ శుభదినం రానే వచ్చింది. తెల్లారకుండా నన్ను లేపేసింది నీరజ. అప్పటికే తను ఎంచక్కా తయారయిపోయి కొత్తగా కొన్న మామిడిపిందె అంచు ఆరెంజ్‌ కలర్‌ పట్టుచీర కట్టేసుకుని, డిజైనర్‌ బ్లౌజ్‌ వేసేసుకుని, మెడలో జిగినీగొలుసూ, కాసులపేరూ పెట్టేసుకుని, వెనక జుట్టుకి పెట్టిన క్లిప్పుకి ముందుకే కనిపించేలా కనకాంబరాలదండ వేళ్లాడేసుకుని దర్శనమిచ్చింది.
‘‘వంకీ, వడ్డాణం మర్చిపోయావా...’’ అనడిగాను.
నా వెటకారం అర్థం అయిందేమో మొహం చిట్లించుకుంటూ ‘‘అంత అదృష్టం కూడానూ. అయినా పెళ్లానికి వంకీ, వడ్డాణం చేయించాలనే మురిపెం మొగుడికుండాలి... ఏం చేస్తాం... దేనికైనా పెట్టిపుట్టాలి...’’ అంటూ కొంగందుకోబోయింది.
‘‘అబ్బెబ్బే, ఇంతలా తయారయావు కానీ నువ్వు వాళ్లకి కనిపించవు కదా... వాళ్లే నీకు కనిపిస్తారు. అందుకనడిగానంతే’’ అన్నాను.
‘‘నిజమే కానీ, ఏవిటో పట్టుచీర కట్టుకోందే ఆ నిశ్చితార్థం ఫీలింగ్‌ రాదని కట్టుకున్నానండీ... మీరు కూడా తొందరగా తెమలండి. టైమైపోతోంది’’ అంది.
‘‘తెమలడానికేవుందీ! కాఫీ తాగి సిస్టమ్‌ ముందు కూర్చోవడమేగా...’’
అసలు అప్పటికే అనవసరంగా ఒకరోజు సెలవు వేస్టయిందే అని బాధపడుతుంటే ఆ సెలవురోజు రిలాక్స్‌ అవకుండా తయారవమని చెప్తే విసుగు రాదూ మరి!
‘‘ఇంకా నయం... టిఫిన్‌ చల్లారిపోతోంది రండి...’’ డైనింగ్‌ టేబుల్‌ వైపు నడిచింది.
హమ్మయ్య, తీరుబడిగా టిఫిన్‌ తినొచ్చు అనుకుంటూ వెళ్లిన నాకు డైనింగ్‌ టేబుల్‌ మీద రాఘవేంద్ర టిఫిన్స్‌ నుంచి తెప్పించిన వడలూ, ఇడ్లీలూ, ఉప్మా, మసాలా దోశలూ కనిపించాయి.
‘‘ఇదేమిటి... ఇప్పుడివెందుకు తెప్పించావూ! అయినా ఇన్నెందుకూ!’’
‘‘అదేంటీ అలా అంటారూ! ఇప్పుడు మనం ఎంగేజ్మెంటు చూస్తున్నాం. వండుకుంటూ కూర్చుంటామా ఏవిటీ! అయినా ఎంగేజ్మెంట్‌కి ఉప్మా ఒకటే పెడితే ఏం బాగుంటుంది! ఆ ఫీల్‌ రావద్దూ! అందుకే నాలుగు రకాలూ తెప్పించాను’’ అంది. నాకేం చెప్పాలో తెలీలేదు.
మొబైల్‌లో ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌తో మేనకోడలిపేర వెయ్యినూటపదహార్లు కట్నం చదివించమంది.
‘‘ఎంగేజ్మెంట్‌కి ఎవరూ కట్నాలు చదివించరు. పెళ్లికే ఇస్తారు...’’ అన్నాను. నా లోకజ్ఞానం అంతా బయట పెట్టుకుంటూ.
‘‘ఇవేమీ మన పెళ్లప్పటి రోజులు కావు, అటూ ఇటూ పెద్దలు కూర్చుని తాంబూలమూ పండ్లూ మార్చుకుని శుభం అనుకోవడానికి. ఈ రోజుల్లో ఎంగేజ్మెంట్‌ పెళ్లిలా చేస్తున్నారు. అసలు మీవాళ్లకి సరదాలూ, సంబరాలూ అంటూ ఏవైనా తెలిస్తేగా!’’ అంది ఫ్లాష్‌బాక్‌కి వెళ్లిపోతూ...
ఓర్నాయనో... ఇప్పుడు మా పెళ్లిముచ్చట్లు ఎత్తిందంటే సీన్‌ రివర్స్‌ అయిపోతుందని నోరు మూసుకుని అక్షరాలా వెయ్యినూటపదహార్లూ సుందరి పేర ట్రాన్స్‌ఫర్‌ చేసేశాను.
‘‘ఇక తొందరగా తెమిలి రండి. పంచె, కండువా వేసుకుంటారా... లేకపోతే టై కట్టుకుని కోటు వేసుకుంటారా...’’ అంది.
రామచంద్రప్రభో... హాయిగా లుంగీ కట్టుకుని రిలాక్స్‌ అవుదామనుకున్న నాకు ఎంత పెద్ద శిక్ష వేశావయ్యా అనుకుంటూ ‘‘కోటే వేసుకుంటా...’’ అన్నాను.
స్నానం చేసి వచ్చి నీరజ వచ్చేలోపల గబగబా లుంగీ మీద చొక్కా వేసేసుకుని, టై కట్టేసుకుని, కోటు వేసేసుకుని, టీవీలో వార్తలు చదివేవాళ్లు సగందాకానే కనిపిస్తారుకదా... అలాగ నా లుంగీ, కాళ్లూ సిస్టమ్‌ ఉన్న టేబుల్‌ కిందకి తోసేసి సిస్టమ్‌ ముందు కుర్చీలో కూర్చుండిపోయాను.
నీరజ అచ్చంగా పెళ్లివారింట్లోలాగ బొట్టుకింద బొట్టు పెట్టుకుని, మంచి పెర్ఫ్యూమ్‌ కొట్టుకుని, చేతిలో అక్షింతలున్న చిన్న గిన్నె పట్టుకుని వచ్చింది.
‘‘అవెందుకూ!’’ అన్నాను. ఆ అక్షింతలు నా సిస్టమ్‌ మీదకి విసిరేస్తుందేమోనన్న భయంతో.
‘‘మీరు మరీనండీ... సుందీని దీవించిన ఫీల్‌ రావద్దూ!’’ అంది మేనకోడలి మీద ప్రేమతో తలమునకలవుతూ.
హమ్మయ్యా అనుకుంటూ సిస్టమ్‌ ఆన్‌ చేసి లాగిన్‌ అయ్యాను. స్క్రీన్‌ మీద అన్ననీ, వదిననీ చూసి నీరజ మొహం మందారంలా విచ్చుకుంది. కుర్చీ మరికాస్త ముందుకే జరుపుకుని, మొహం స్క్రీన్‌లోకి దూర్చేసింది. పక్కనుంచి సన్నగా సన్నాయి రికార్డ్‌ వినిపిస్తోంది.
‘‘వదిన కట్టుకున్న చీర కంచిదంటారా, ధర్మవరమా!’’ చాలా పెద్ద సందేహంలో పడిపోయింది నీరజ. అడిగిందే కానీ నాకు ఆ చీరల వివరాలేమీ తెలీవని తనకీ తెలుసు.
‘‘చూశారా... చూశారా... మా అన్నయ్య ఎంచక్కా పంచె, కండువా వేసుకున్నాడు. అసలు మీకెప్పుడు ఏం వేసుకోవాలో కూడా తెలీదు...’’ అంటున్న నీరజ దృష్టి నా కాళ్లవైపు పడకుండా జాగ్రత్త పడుతూ,
‘‘ముందు ఆ వియ్యాలవారెవరో చూడు’’ అన్నాను ధోరణి మార్చుతూ.
‘‘అబ్బ... పెళ్లికొడుకు తల్లనుకుంటాను... ఎంత బాగుందండీ... మహా దర్జాగా ఉంది. అబ్బాయికి తల్లి పోలికొస్తే మా సుందీ అదృష్టవంతురాలే... ఆవిడ కట్టుకున్న చీర బెనారస్‌దనుకుంటాను... అయ్యే ఉంటుందిలెండి. ఇప్పుడు బెనారస్‌లో ఎన్ని రకాలు వస్తున్నాయో... మెళ్లో ఏంవేసుకుందో... ఏదీ... కొంచెం పెద్దది చెయ్యండీ...’’
చేసేను.
‘‘అబ్బో... కొత్తరకం హారమండోయ్‌. ఇప్పుడిది చాలా ఫ్యాషనూ... అంటే వియ్యపురాలికి ఫ్యాషన్లు బాగానే తెలుసనుకుంటాను.’’
మేమిద్దరం ఇక్కడనుంచి చూస్తూ ఇలా కామెంట్లు వేసుకుంటూనే ఉన్నాం. అక్కడ మా బావమరదివాళ్లూ హాల్లో ఒక చక్కటి తివాచీ పరిచారు. ఆ తివాచీ మీద పైన దేవుడిబొమ్మలు పెట్టుకునేలాంటి అందమైన డిజైన్లున్న రెండు పీఠాల్లాంటివి వేశారు. వాటి చివరికి రెండు స్టీలు డబ్బాలు పెట్టారు.
‘‘ఆ డబ్బాలెందుకూ అక్కడా...’’ అన్నాను అర్థంకాక.
‘‘అది వాళ్ల ఆనవాయితీయేమో...’’ అంటూ దీర్ఘం తీసింది నీరజ.

ఇంతలో మా బావమరిదీ, వాళ్ల వియ్యంకుడూ చేతుల్లో రెండు మొబైల్స్‌ పట్టుకుని వచ్చారు. డబ్బాలు సపోర్ట్‌ పెడుతూ ఒక డబ్బాకి ఆన్చి ఒక మొబైలూ, ఇంకో డబ్బాకి ఆన్చి మరో మొబైలూ పెట్టేక కెమేరా వాటి మీదకి ఫోకస్‌ చేశారు. రెండింటిలోనూ ఒకదానిలో సుందరీ, ఇంకోదానిలో ఒకబ్బాయీ కనిపించారు... హారినీ... అప్పుడర్థమయ్యింది... ఆన్‌లైన్‌లో వాళ్లని ఫోనులోకి రప్పించి, వాళ్లిద్దర్నీ ఆ డబ్బాలకాన్చి ఆ పీఠాలమీద కూర్చోబెట్టారన్నమాట.
ఇంకక్కణ్ణించి ఆ వియ్యపురాలు ఒక్కో స్వీటు పళ్లెమూ తెచ్చి సుందరి కనిపిస్తున్న మొబైల్‌కి చూపించి, తివాచీ మీద పెట్టింది. స్వీట్లూ, పళ్లూ, పూలూ అన్నీ అలాగే చేసింది. చివరిగా ఒక ట్రేలో పట్టుచీర, దానిమీద ఒక బంగారు నగా పట్టుకొచ్చి, చీర సుందరి కనిపిస్తున్న మొబైల్‌ చుట్టూ పరిచి, నగ ఆ మొబైల్‌కి తగిలించింది. ఆవిడలా చెయ్యగానే సుందరి అక్కణ్ణించి రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టింది కాబోయే అత్తగారికి.
ఆ వెంటనే మా బావమరిది భార్య కూడా అలాగే స్వీట్లూ, పళ్లూ, పూలూ ఆ అబ్బాయి మొబైల్‌ కి చూపించి తివాచీ మీద పెట్టారు. చివరిగా మా బావమరిది ఒక సూటూ, దానిమీద ఒక బంగారు బ్రేస్‌లెట్టూ పెట్టగానే ఆ అబ్బాయి కూడా అందుకుంటున్నట్టు చేతులు చాపి బుద్ధిగా నమస్కారం పెట్టాడు.
నేను నోరెళ్లబెట్టాను. నీరజ మరింత ముందుకి జరిగింది. కాబోయే వియ్యంకులిద్దరూ, వియ్యపురాళ్లిద్దరూ ఒకరినొకరు కౌగిలించేసుకుని, ఒకరి నోట్లో ఇంకొకరు స్వీట్లు పెట్టేసుకున్నారు.
‘‘ఎన్ని రకాల స్వీట్లు తెచ్చారంటారూ!’’ అడిగింది నీరజ అవి లెక్కపెట్టడానికి సిద్ధపడిపోతూ.
ఇంతలో డోర్‌ బెల్‌ మోగింది. నీరజ లెక్కని డిస్టర్బ్‌ చెయ్యడం ఎందుకని ఎవరొచ్చారో అనుకుంటూ నేనే వెళ్లాను తలుపు వైపు. తలుపు తియ్యగానే స్విగ్గీ డెలివర్‌ బాయ్‌ కనిపించాడు చేతిలో పార్సిల్‌తో, అతన్ని చూసి నేను ఆశ్చర్యపోతే నా వేషం చూసి అతను ఆశ్చర్యపోయాడు.
‘‘ఏంటిదీ!’’ అన్నాను అతని దృష్టి మారుస్తూ...
అతను తేరుకుని, ‘‘బిర్యానీ సర్‌. ప్యారడైజ్‌ నుంచి ఆర్డర్‌ చేశారుగా. పేమెంట్‌ ఇవ్వండి జల్దీ.’’
‘‘నీరూ, నువ్వు బిర్యానీ ఏమైనా ఆర్డర్‌ చేశావా!’’ గట్టిగా అరిచాను.
రూం లోంచి నీరజ బైటకి వచ్చింది చేతిలో డబ్బుతో. ఆ డబ్బు ఆ డెలివరీ బాయ్‌ చేతిలో పెట్టేసి, పార్సిల్‌ పట్టుకొచ్చి డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టింది.
మళ్లీ డోర్‌ బెల్‌ మోగింది. ఈసారి ఆల్మండ్‌ హౌస్‌ నుంచి స్వీట్స్‌ పాకెట్లు వచ్చాయి. వాటికీ డబ్బులిచ్చి తీసేసుకుంది.
‘‘ఉన్నది ఇద్దరు మనుషులం. పొద్దున తెప్పించినవే మిగిలిపోయాయి. కడుపు ఇంకా నిండుగానే ఉంది. మళ్లీ ఇవన్నీ ఎందుకు తెప్పించావ్‌!’’
కాస్త కోపంగా అడిగాను.
‘‘అయ్యోరామా... ఎంగేజ్మెంట్‌ అయ్యాక పొద్దున మిగిలిపోయిన ఉప్మా తింటారా ఎవరైనా! స్పెషల్‌గా తినొద్దూ! అందుకే బిర్యానీ, స్వీట్సూ తెప్పించేను.’’
‘‘వీటికి బోల్డు డబ్బులవుతాయి తెలుసా!’’
‘‘అయితే అవుతాయి. ఎంగేజ్మెంట్‌ కెళ్లిన ఫీల్‌ ఉండొద్దూ!’’ అంటూ సాగదీసింది. నాకు కోపం నషాళానికంటింది.
ఈ మాయదారి ఫీల్‌ కాదుకాని నా పర్సుకి పెద్ద చిల్లే పడేలా ఉందనుకుంటూ,
‘‘అయితే సరే... ఈ బిల్లులన్నీ మీ అన్నయ్యకే పంపిస్తాను. కట్టుకుంటాడు’’ అంటూ రెండురోజుల క్రితం కొన్న ఇన్వర్టర్‌తో సహా మా బావమరదికి అమౌంట్‌ మొత్తం ఎంతయిందో చెపుతూ, వెంటనే నా బాంక్‌ అకౌంట్‌కి ఆ డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చెయ్యమని మొబైల్‌ నుంచి మెసేజ్‌ పెట్టేశాను.
‘‘అయ్యయ్యో... అలా ఎవరైనా చేస్తారా...’’ అంటూ నీరజ లబలబలాడింది.
‘‘ఎందుకు చెయ్యరూ... అలాగే చెయ్యాలి. చెయ్యకపోతే ఎంగేజ్మెంట్‌ ఫీల్‌ ఉండదు...’’ అన్నాను మాటకి మాటే జవాబుగా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు