close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రకృతే... ప్రేరణ..!

ఎప్పుడో వెయ్యేళ్లకు ముందు... తామరాకుని చూసి గొడుగు తయారుచేయడంతో ‘బయోమిమిక్రీ’ అనే విభాగానికి పునాది పడింది. నాటి నుంచి నేటి వరకూ ఏ అవసరం వచ్చినా ప్రకృతివైపు పరిశీలనగా చూడడం పరిశోధకులకూ శాస్త్రవేత్తలకూ ఓ అలవాటుగా మారింది. వందేళ్లనాటి విమానమైనా, నిన్న మొన్నటి రోబోలైనా... వాటి వెనక ఉన్నది ప్రకృతిలోని పక్షులూ జంతువులే. వాటి ప్రత్యేకతలు మనిషిని అబ్బురపరుస్తూనే ఉన్నాయి. అతని సైన్సు ప్రయోగాలకు ప్రేరణనిస్తూ సరికొత్త ఆవిష్కరణలకు కారణమవుతూనే ఉన్నాయి.

డవిలోనో, గుబురుగా ఉండే పొదల మధ్యో కాసేపు తిరిగొస్తే ఏమవుతుంది... బట్టల నిండా పల్లేరు కాయలు పట్టేస్తాయి. స్విట్జర్లాండ్‌కి చెందిన ఇంజినీరు జార్జ్‌ డి మెస్ట్రాల్‌ కూడా ఓరోజు అలాగే తిరిగొచ్చి ప్యాంటుకు అతుక్కున్న ఆ పల్లేరుకాయల్ని ఒక్కోటీ పట్టి తీసేస్తున్నాడు. ఒక పక్క నుంచి లాగుతుంటే మరో పక్కన పట్టుకుంటున్నాయవి. అంత గట్టిగా ఎలా పట్టుకుంటున్నాయో అని ఆశ్చర్యపోయిన ఆ ఇంజినీరు ఓ కాయను తీసుకెళ్లి మైక్రోస్కోప్‌ కింద పెట్టి పరీక్షించాడు. కొక్కేల్లాగా ఉన్న పల్లేరుకాయ ముళ్లు అంటుకోవాలంటే రెండో ఉపరితలం ఉచ్చు(లూప్‌)లాగా ఉండాలని తెలుసుకున్నాడు. బట్టల మీద దారపుపోగులు అలా ఉంటాయి కాబట్టే పల్లేరు కాయలు అతుక్కుంటున్నాయని గుర్తించిన ఆయన అలా ఓ ఐదారేళ్లపాటు ప్రయోగాలు చేసి కనిపెట్టిందే... వెల్‌క్రో. బూట్లకీ బ్యాగులకే కాదు ఆఖరికి స్పేస్‌సూట్స్‌కి కూడా దాన్ని హాయిగా వాడేసుకుంటున్నాం.

ఒక్క ముళ్ల పల్లేరు కాయే ఇంత పనిచేస్తే, సృష్టిలో ఉన్న రకరకాల ప్రాణులు ఇంకెన్నో ఆలోచనలకు స్ఫూర్తినివ్వడంలో వింతేముంది... అలాగే ఇచ్చాయి. మొట్టమొదట రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరే ప్రయత్నం చేసిన రైట్‌ సోదరులకు ప్రేరణ ఓ పావురమే. దాని రెక్కల్నీ ఎగిరే విధానాన్నీ నిశితంగా పరిశీలించాకే ఆ అన్నదమ్ములు గాల్లో ఎగిరే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 1950వ దశకంలో అమెరికన్‌జీవభౌతిక శాస్త్రవేత్త ఓటో ష్మిట్‌ ‘బయోమిమెటిక్స్‌’(బయోమిమిక్రీ) అన్న ప్రత్యేక కాన్సెప్ట్‌ని రూపొందించాడు. రొయ్యల నాడీ వ్యవస్థను అధ్యయనం చేసిన ష్మిట్‌ దాని స్ఫూర్తితో ఆంప్లిఫయర్‌ తయారుచేయగలిగాడు. ఆ తర్వాత కూడా కొంతమంది పక్షుల్నీ జంతువుల్నీ ప్రేరణగా తీసుకుని ప్రయోగాలు చేస్తూ కొత్త ఆవిష్కరణలు చేశారు కానీ దాన్ని ఒక ప్రత్యేక అంశంగా తీర్చిదిద్ది ప్రజాదరణ పొందేలా చేసింది మాత్రం జనైన్‌ బెనియస్‌. రెండు దశాబ్దాల క్రితమే ఆమె ‘బయోమిమిక్రీ: ఇన్నొవేషన్‌ ఇన్‌స్పైర్డ్‌ బై నేచర్‌’ అనే పుస్తకం రాశారు. అప్పటినుంచీ బయోమిమిక్రీ అనేది పరిశోధకులకు ఆకర్షణీయమైన సబ్జెక్టు అయింది. భవనాల నుంచి బ్రిడ్జిల వరకూ విమానాల నుంచీ రోబోల దాకా ఎన్నింటినో సరికొత్తగా ఆవిష్కరించేందుకు ప్రకృతిలోని జీవకోటి మనిషికి ప్రేరణనిస్తూనే ఉంది. వేర్వేరు రంగాల్లో ప్రగతిని ఓ మెట్టు పైకి తీసుకెళుతూనే ఉంది.

నిర్మాణరంగంలో...
ఇంట్లో ఏ మూలనైనా కాస్త చెదలు కనిపిస్తే ఉలిక్కిపడతాం. దాని అంతుచూసేవరకూ నిద్రపోం. అది చేసే నష్టం అలాంటిది మరి. పెద్ద పెద్ద భవనాలు కట్టే ఆర్కిటెక్టులను మాత్రం ఆ చెదపురుగుల శక్తి అబ్బురపరిచింది. అడవుల్లో అవి పెట్టుకునే పుట్ట రెండంతస్తుల భవనం కన్నా ఎత్తుగా ఉంటుంది. పలుచటి మట్టిపొరలతో కట్టిన ఆ పుట్ట లోపల చిన్నగా ఉండే మరో పుట్టలో కింద ఎక్కడో అవి ఉంటాయి. ఆ పుట్ట ఆనుపానుల్ని పరీక్షించి చూసిన మిక్‌ పియర్స్‌ అనే ఆర్కిటెక్టు అచ్చం అదే పద్ధతి ఆధారంగా భవనం నిర్మిస్తే ఏసీ అవసరం ఉండదనుకున్నాడు. జింబాబ్వేలోని హరారేలో ఆయన నిర్మించిన ఈస్ట్‌గేట్‌ సెంటర్‌లో నిజంగానే ఏసీ ఉండదు. రెండు పెద్ద భవనాలను కలుపుతూ మధ్య పైకప్పుతో విశాలమైన ఆవరణ ఉంటుంది. ఆఫీసులూ దుకాణాలూ ఉన్న ఈ భవనం ప్రత్యేకతలు-సహజమైన వెలుతురూ చల్లదనమూ. భవనం కింది భాగంలో బయటిగాలి లోపలికి వెళ్లేలా కట్టిన భాగంలో కొన్ని ఫ్యాన్లు అమర్చారు. అవి ఎప్పుడూ తిరుగుతూ చల్లని గాలిని పైపుల ద్వారా లోపలి గదుల్లోకి పంపుతాయి. సెంట్రల్‌ ఏసీ ఉన్న భవనాల్లో పైనుంచి చల్లని గాలి వచ్చినట్లు ఇందులో కిందినుంచి వస్తుందన్నమాట. వేేడి గాలి బయటకు పోవటానికి ప్రతి గదికీ పైన వెంటిలేటరు ఉంటుంది. ఆ వెంటిలేటర్లన్నీ ఒక పొగగొట్టానికి కనెక్ట్‌ అవుతాయి. దాంతో భవనంలో ఏ కాలమూ ఏసీ అవసరం రాదు. సాధారణంగా ఆ సైజు భవనాల్లో అయ్యే కరెంటు ఖర్చులో పదిశాతం మాత్రమే చాలు దీనికి. చెద పురుగులు ఉండేది నేలమీదే అయినా పొడుగ్గా అంతెత్తు పుట్ట కట్టుకోడానికి కారణం వేడిని బయటకు పంపడానికే- అనే మిక్‌ భవనాల పైకప్పులు సమతలంగా లేకుండా నిటారుగా విభిన్నంగా ఉండేలా కట్టిస్తాడు.

మాంచెస్టర్‌కి చెందిన ఇంజినీర్లు అయితే భారీ వంతెన నిర్మాణానికి మనిషి శరీరనిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. మామూలుగా ఎంత దిట్టంగా కట్టిన బ్రిడ్జిలైనా ఒక్కచోట ఎప్పుడైనా ఎక్కువ బరువు పడితే కుప్పకూలుతున్నాయి. అదే మనం ఒక చేత్తో ఒకేసారి పదికిలోల బరువుని లేపితే, మొత్తం శరీరం ఆ బరువుకు అనుగుణంగా వంగి బ్యాలన్స్‌ చేసుకుంటోంది కానీ చేయి ఊడి కిందపడడం లేదు. అందుకు కారణం... ఎముక, దానిమీద మెత్తటి కణజాలం, రక్తనాళాలు, స్పర్శను తెలిపే నాడులు, కండరాలు... ఇలాంటివన్నీ కలిపితేనే చేయి అవుతుంది. ఆ భాగాలన్నీ అనుసంధానమై మొత్తం శరీరాన్ని ఒక యూనిట్‌గా నిలుపుతున్నాయి. ఆ నమూనానే బ్రిడ్జికీ ఉపయోగించారు ఆ ఇంజినీర్లు. ఫలితంగా వెలసిందే ‘టెన్సెగ్రిటీ బ్రిడ్జ్‌’. చూడడానికి చుట్టూ బోలెడు పైపులూ గొట్టాలతో సున్నితంగా ఉన్నట్లు కన్పిస్తుంది కానీ ఎక్కడైనా బరువు పడితే మొత్తంగా బ్రిడ్జి నిర్మాణమంతా ఆ బరువును సమంగా పంచుకుని అందుకు తగినట్లుగా వంగుతుంది తప్ప కూలిపోదు. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుంటుందనే టెన్షన్‌ ప్లస్‌ ఇంటెగ్రిటీ కలిపి ‘టెన్సెగ్రిటీ’ అని పేరుపెట్టారు ఈ విధానానికి. భవిష్యత్తు అంతా ఇలాంటి నిర్మాణాలదే అంటున్నారు పరిశోధకులు.

సాంకేతిక రంగంలో...
అసలు విమానం తయారీకి పక్షులే కదా స్ఫూర్తి. ఎగరడం విషయంలోనే కాదు, ఆకారంలో కూడా. అందుకే వేర్వేరు పక్షుల ఆకారాల్లో విమానాలు తయారయ్యాయి. చాలా దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు పక్షులు గుంపుగా ‘వి’ ఆకారంలో ఎగురుతుంటాయి. మధ్యలో ఒకదాని స్థానంలోకి మరొకటి చొప్పున మారుతూంటాయి. దీనివల్ల వాటికి అలసట తెలియదట. జెట్‌ విమానాలు కూడా ఇలా పక్షుల్ని అనుకరిస్తే ఎంతో ఇంధనాన్ని ఆదాచేయవచ్చని స్టాన్‌ఫర్డ్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఇక గాలిలో ఒకేచోట ఎగురుతూ ఉండగల, బరువుల్ని మోసుకెళ్లగల హెలికాప్టర్‌ తయారీకి ప్రేరణ అచ్చంగా తూనీగే. పలుచని రెక్కలతో ఎగరడంలో అది చేసే మ్యాజిక్కులు చూసిన శాస్త్రవేత్తలు ఆ కిటుకుల్ని ఇంకా ఎన్నో విషయాల్లో ఉపయోగిస్తున్నారట.

తల దేనికన్నా కొట్టుకుంటే లోపల మెదడుకి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది కదా మరి అటువంటపుడు వడ్రంగిపిట్ట రోజంతా చెట్టు మీద కూర్చుని ఇంత పొడుగు ముక్కుతో టపీటపీ కొడుతూనే ఉంటుంది, దాని మెదడుకి ఏమీ కాదా? ఈ సందేహం శాస్త్రవేత్తలని కొన్ని దశాబ్దాల పాటు వేధించింది. దాని మెడ కండరాల పనితీరును విశ్లేషించిన ఫలితమే మన వాహనాల్లోకి వచ్చి చేరిన షాక్‌ అబ్జార్బింగ్‌ మెకానిజం. దానివల్లే ప్రమాదాల్లో నష్టాన్ని తగ్గించుకో గలుగుతున్నాం. పైగా వడ్రంగి పిట్ట పుర్రె మిగిలిన పక్షులకన్నా భిన్నంగా ఉంటుంది. అదే మన హెల్మెట్‌కి స్ఫూర్తి.

సోలార్‌ప్యానెల్స్‌తో సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే క్రమంలో ఆ ప్యానెళ్ల ఏర్పాటుకు చాలా స్థలం వృథా అవుతోంది. అందుకు మళ్లీ సూర్యకాంతి పుష్పాన్నే అనుకరించారు ఇంజినీర్లు. సూర్యుడితో పాటే తిరిగే ఈ పువ్వులో రేకలు ఒకదానిమీదికి ఒకటి రాకుండా అన్నిటి మీదా ఎండ పడేలా అమరివుంటాయి. సోలార్‌ ప్యానెళ్లని కూడా అచ్చం అలాగే అమర్చితే వాటి మీద నుంచి సూర్యకిరణాలు మధ్యలోకి రీడైరెక్ట్‌ అయి విద్యుచ్ఛక్తిగా మారతాయి. అచ్చం ఆ పువ్వులాగే ఈ సోలార్‌ ఫ్లవర్‌ కూడా సూర్యుడితో పాటు దిశను మార్చుకుంటుంది. తక్కువ చోటు సరిపోతుంది.

దుమ్ము పడని పెయింట్ల గురించీ, దుస్తుల గురించీ వింటూనే ఉంటాం. వాటిని ప్రత్యేక సాంకేతికతతో తయారుచేశామనీ దుమ్మూధూళీ పడితే వాటంతటవే శుభ్రమైపోతాయనీ చెబుతుంటారు. వాటి తయారీకి స్ఫూర్తి తామరాకే. అది నున్నగా ఉంటుంది కాబట్టి నీరు దానిమీద నిలవకుండా జారిపోతుందనుకుంటాం. నిజానికి ఆ ఆకుమీద చాలా సూక్ష్మమైన బుడిపెల్లా వ్యాక్స్‌ క్రిస్టల్స్‌ ఉంటాయట. వాటి మధ్యలో గాలి ఉంటుంది కాబట్టి పైన పడ్డ నీటి చుక్క పైనే నిలిచి దొర్లిపోతోంది. ఆ టెక్నిక్‌ ఉపయోగించి తయారుచేసినవే ఈ సెల్ఫ్‌ క్లీనింగ్‌ పెయింట్స్‌, గాజు సామానూ, దుస్తులూ.

డిజైనింగ్‌లోనూ...
వేర్వేరు విభాగాల్లో ఇంజినీర్లకు కొత్త వస్తువుల తయారీలో ఎదురవుతున్న కొన్ని సమస్యల్ని పక్షులూ జంతువులే తీరుస్తున్నాయి. జపాన్‌లో అత్యంత వేగంగా వెళ్లే బుల్లెట్‌ ట్రెయిన్‌ని తయారుచేశారు. అంతా బాగానే ఉంది కానీ పలుచోట్ల అది సొరంగ మార్గంలోనుంచి బయటకు వెళ్లేటపుడు గాలిని చీల్చుతూ వచ్చే మోతకి చుట్టుపక్కల మైలు దూరం వరకూ జనాలకు గుండెలు అదిరిపోయేవట. ఆ మోత తగ్గించడానికి ఏం చేయాలా అని ఆలోచించిన ఇంజినీర్లకు కింగ్‌ఫిషర్‌ పక్షి మార్గం చూపింది. పొడుగాటి ముక్కున్న ఈ పక్షి గాల్లోంచి నీళ్లలోకి నిశ్శబ్దంగా దూసుకుపోయి చేపను పట్టేసుకుంటుంది. రైలు ముందు భాగాన్ని కూడా ఆ పక్షి ముక్కులా పొడుగ్గా తయారు చేయడంతో మోత తగ్గడమే కాదు, పదిహేను శాతం కరెంటు ఖర్చూ తగ్గింది. రైలువేగం పదిశాతం పెరిగింది.

పెద్ద పెద్ద భవనాలకు గాజు కిటికీలు పెడితే అవి కనిపించక పక్షులు నేరుగా వెళ్లి ఢీకొని చనిపోయేవి. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలా అని తలపట్టుకున్న ఇంజినీర్లకు సాలీడు మార్గం చూపింది. అడవుల్లో చెట్ల మధ్య పెద్ద పెద్ద సాలెగూళ్లు ఉంటాయి. మనకి దగ్గరగా చూస్తే తప్ప కనపడవు కానీ పక్షులకు అవి దూరం నుంచీ మెరుస్తూ కన్పిస్తాయట. అందుకే పక్షులు అటు వెళ్లడం లేదు కాబట్టి ఆ సాలెగూళ్లు ఎన్నాళ్లైనా అలాగే ఉండిపోతున్నాయి. ఇప్పుడు గాజు తలుపులకు అలాంటి కోటింగ్‌ వేస్తున్నారు. అది మనుషుల కంటికి కన్పించదు, పక్షులకు మాత్రమే సాలెగూడులా మెరుస్తూ కన్పిస్తుంది. దాంతో అవి ఢీకొనే ప్రమాదాలు జరగడం లేదు.

హంప్‌బ్యాక్‌ అనే ఒక రకం తిమింగలానికి రెక్కల అంచులు సమంగా ఉండకుండా చిన్న చిన్న పళ్లలా ఎగుడుదిగుడుగా ఉంటాయి. అలా ఉండడం వల్ల అది చాలా వేగంగా ఈదగలుగుతోందని గుర్తించిన పరిశోధకులు గాలిమరలూ, జలవిద్యుచ్ఛక్తి తయారీకి వాడే టర్బయిన్లూ వెంటిలేటర్‌ బ్లేడ్లను అలా తయారుచేశారు. దాంతో వాటి సామర్థ్యం ఇరవై శాతం పెరిగింది.

నమీబియా ఎడారి ప్రాంతంలో నల్లని ఓ బీటిల్‌ పురుగు ఉంటుంది. మామూలుగా అన్ని పురుగుల్లానే ఆరుకాళ్లపై నడిచే ఆ పురుగు ఉదయం వేళల్లో తల కిందికి పెట్టి వెనకభాగాన్ని పైకి లేపి నడుస్తుంటుంది. అలా నడిచేటప్పుడు వాతావరణంలోని తేమ దాని చర్మంమీద నీటి బిందువులుగా ఏర్పడి అవి జారి దాని నోట్లోకి వెళ్తాయి. ఈ పురుగు శరీర నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని వాతావరణంలోని తేమ నుంచి తాగు నీటిని సేకరించే విధానాలెన్నో తయారై ఇప్పుడు ఎడారిప్రాంత వాసుల నీటికష్టాలు తీరుస్తున్నాయి.

రోబోలకైతే లెక్కేలేదు...
కృత్రిమ మేధతో పనిచేసే ఈ రోబోల తరానికీ ప్రేరణ సహజమైన ప్రకృతే మళ్లీ. అవును... ఒక్కో పక్షికీ ఒక్కో జంతువుకీ ఉండే ప్రత్యేక లక్షణాల ఆధారంగా రోబోలను తయారుచేసి వాటిచేత వేర్వేరు పనులు చేయిస్తున్నారు. చిరుత, కంగారూ, ఏనుగు, గబ్బిలం, హమ్మింగ్‌బర్డ్‌, సీతాకోకచిలుక, కప్ప... లాంటివన్నీ ఇప్పటికే రోబో అవతారం దాల్చాయి. కరోనా సమయంలో ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూడ డానికి సింగపూర్‌ రోబో కుక్కలను వాడింది. డ్రోన్లు వెళ్లడానికి వీలు కాని ప్రాంతాల్లోకి వెళ్లగలిగేలా గబ్బిలమూ హమ్మింగ్‌ బర్డ్‌ లాంటి చిన్ని చిన్ని ఎగిరే రోబోలను తయారుచేస్తున్నారు. నల్లటి చుక్కలున్న ఎర్రటి బీటిల్‌ ఎగరడం ఎప్పుడైనా గమనించారా? ఆ చుక్కల పెంకుకింద మడతపెట్టిన పలుచని రెక్కలుంటాయి. ఎగిరేటప్పుడు మాత్రమే అవి బయటకువస్తాయి. ఆ బుల్లి బీటిల్‌ కూడా రోబోకి మోడల్‌ అయింది. భూకంపాల్లాంటివి సంభవించినపుడు శిథిలాల కింద మనుషుల్ని వెతకడానికీ, గనుల్లో పరిస్థితులను అంచనా వేయడానికీ ఇలాంటి రోబోలు ఎంతగానో ఉపయోగపడతాయి.

వైద్యరంగానికీ...
ఎప్పుడూ నీటిలో ఉండే ఓడలూ జలాంతర్గాములకు నాచు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై పరిశోధన చేయడానికి ఒకసారి శాస్త్రవేత్తలు పెరల్‌హార్బర్‌ నౌకాకేంద్రానికి వెళ్లారు. ఆ సమయంలో మాటల్లో అసలు నీచువాసన రాని జలచరం ఏదన్నా ఉందా అన్న సందేహం వచ్చింది ఒకరికి. సొరచేపకి అలాంటి వాసన ఉండదని చెప్పారు మరొకరు. వాసన ఉండదూ అంటే దాని చర్మం మీద నాచు పట్టడం లేదనే అర్థం, కాబట్టి సొరచేప చర్మం ఎలా ఉంటుందో చూడాలని పరిశోధన మొదలెట్టారు. నిజంగానే ఆశాస్త్రవేత్తలు భావించినట్లు నాచు పెరగడానికి వీల్లేని రీతిలో దాని చర్మం మీద చాలా సూక్ష్మమైన పళ్లలాంటివి ఉన్నాయి. దాని గురించి మరింత లోతుగా ఆలోచించిప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు ‘షార్క్‌లెట్‌ సర్ఫేస్‌ టెక్చర్‌’ని రూపొందించారు. అచ్చు సొరచేప చర్మాన్ని పోలినట్లు కృత్రిమంగా తయారుచేసిన ఇలాంటి ఉపరితలం మీద నాచే కాదు, వైరస్‌లూ బ్యాక్టీరియాలూ ఏవీ అతుక్కోవు, పెరగవు. కాబట్టి ఆస్పత్రుల్లో, సూక్ష్మక్రిములు ఎక్కువగా వ్యాపించే చోట్లలో ఇలాంటి ఉపరితలాలను ఏర్పాటుచేయడానికి ఆ పరిశోధన తోడ్పడింది. ఇక, గోడల మీద పడిపోకుండా పాకే బల్లుల్లాంటి వాటి కాలి వేళ్ల నిర్మాణం ఆధారంగా తయారైన గెకో టేప్‌ని పేగులకు కుట్లు వేయకుండా అతికించాల్సి వచ్చినపుడు ఉపయోగిస్తున్నారు.

అన్నిరంగాల్లోనూ...
వ్యవసాయంతో సహా ఈ రోజుల్లో బయోమిమిక్రీని వాడని రంగం అంటూ ఏదీ లేదు. కీటకాలను తినే పిచర్‌ ప్లాంట్‌ స్ఫూర్తితో పురుగుల్ని పట్టే వలను తయారుచేశారు. మిణుగురులను చూసి ఎల్‌ఈడీ లైట్ల సామర్థ్యాన్ని పెంచారు. గుంపులుగా ఎగిరే తేనెటీగల్ని చూసి విమానాలకు ప్రమాదరహిత దారులు వేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగం మరో పదేళ్ల కల్లా 32లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తి పెరుగుదలకీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకీ అవకాశం కల్పిస్తుందని ఓ అంచనా.

ప్రకృతిలో ఒక్కో ప్రాణిదీ ఒక్కో ప్రత్యేకత. దానికి తోడు పరిస్థితులకు తగినట్లుగా తనను తాను మార్చుకునే గుణమూ వాటి సొంతం. ఆ గుణాలే ఇప్పుడు మనిషికి స్ఫూర్తిపాఠాలవుతున్నాయి. కొత్త ఆవిష్కరణలకు ప్రేరణనిస్తున్నాయి.


లక్ష డాలర్ల ప్రైజు

యోమిమిక్రీ కాన్సెప్ట్‌కి ప్రచారం తెచ్చిన జనైన్‌ బెనియస్‌ ఈ రంగంలో పరిశోధన చేసేవారికి ఒక వేదికలా ఉపయోగపడేందుకు బయోమిమిక్రీ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టారు. ప్రకృతి స్ఫూర్తితో కొత్త డిజైన్లు రూపొందించాల్సిందిగా రకరకాల పోటీలు పెట్టి యువతను ప్రోత్సహిస్తుంది ఈ సంస్థ. బయోమిమిక్రీ గ్లోబల్‌ డిజైన్‌ ఛాలెంజ్‌, యూత్‌ డిజైన్‌ ఛాలెంజ్‌లతో పాటు ‘రే ఆఫ్‌ హోప్‌’ పేరుతో ఏటా ఒక ఆవిష్కారానికి లక్ష డాలర్ల బహుమతి ఇస్తారు. కొత్త ఆవిష్కరణలను స్టార్టప్‌లుగా మలచుకోవడమెలాగో నేర్పుతారు. సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటివరకూ వచ్చిన పలు ఆలోచనలనూ, ప్రస్తుతం ఏయే బృందాలు ఏయే అంశాలమీద పరిశోధన చేస్తున్నాయీ అన్న విషయాలనూ కూడా పంచుకుంటున్నారు. ఉదాహరణకు పాలనీ పండ్లనీ నిలవ చేసుకునే సౌకర్యాలు లేకపోవడం వల్ల ఏటా 15వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టమూ, 40వేల మెట్రిక్‌ టన్నుల కర్బనవాయువులతో వాతావరణానికి నష్టమూ జరుగుతున్నాయి. ఇది కేవలం ఇండియా, మెక్సికో... రెండు దేశాల్లో జరుగుతున్న నష్టాన్ని లెక్కవేస్తేనే. ఇటువంటి నష్టాల్ని నివారించడానికి ఐడియాలకోసం ‘మిల్క్‌ అండ్‌ జ్యూస్‌’ అనే ఓ పరిశోధక బృందం ఇప్పుడు కీచురాళ్ల రెక్కల్నీ, గొంగళిపురుగుల్నీ, రాణీ చీమల్నీ... అధ్యయనం చేస్తోంది. ఇలాంటి ఎన్నో బృందాల సమాచారం బయో మిమిక్రీ ఇన్‌స్టిట్యూట్‌ వెబ్‌సైట్‌లో ఉంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.