close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘లాక్‌డౌన్‌’ లో... ఆన్‌లైన్‌ పాఠం!

కొవిడ్‌ ప్రతి ఒక్కరికీ కావాల్సినంత విరామాన్ని ఇచ్చింది. ఈ లాక్‌డౌన్‌ వేళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు కుటుంబసభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తుంటే... మరికొందరు ఫిట్‌నెస్‌ పెంచుకోవడం, వంటలు నేర్చుకోవడంపైన దృష్టి సారించారు. ఇంకొందరేమో విజ్ఞానం పెంపొందించుకోవడానికీ, కొత్త విషయాలు తెలుసుకోవడానికీ ఆన్‌లైన్‌ కోర్సుల్లో ప్రవేశం పొంది పాఠాలు వింటున్నారు.


నటనకి మెరుగులు

లాక్‌డౌన్‌లో విలువైన సమయాన్ని వృథా చేయడానికి ఇష్టపడని సమంత తన నటనను మరింత మెరుగుపరుచుకోవడం మీద దృష్టి పెట్టింది. నటనకు సంబంధించిన మెలకువలను తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌ కోర్సులో ప్రవేశం తీసుకుంది. ‘ద క్వీన్‌’ చిత్రానికిగాను ఉత్తమ నటిగా ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్న హెలెన్‌ మెరీన్‌ ‘మాస్టర్‌ క్లాస్‌’ పేరిట నటనపైన ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తోంది. నటనలో మరింత గుర్తింపు పొందడానికి సమంత కూడా ఈ అమెరికన్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో  పాఠాలు వింటోంది. ఇప్పటికే కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న సమంత ‘ఈ పాఠాలు విని, నటనలో తిరుగులేనిశక్తిగా మీ ముందుకు వస్తా’నని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.


‘చరిత్ర’ వింటూ...

బాలీవుడ్‌ నటుడూ, గాయకుడూ, టీవీ వ్యాఖ్యాతా అయిన ఆయుష్మాన్‌ ఖురానా కూడా ఆన్‌లైన్‌ కోర్సులో చేరిపోయాడు. కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపే ఆయుష్మాన్‌... లాక్‌డౌన్‌ వేళ ‘భారతదేశ చరిత్ర’ పాఠాలు వినడానికి ఆన్‌లైన్‌ను వేదిక చేసుకున్నాడు. నేర్చుకోవడం అనేది మనిషికి దేవుడిచ్చిన గొప్పవరమనీ, లాక్‌డౌన్‌ వేళ ఖాళీగా ఉండకుండా మన దేశ చరిత్ర గురించి సమగ్రంగా తెలుసుకునే అవకాశం కలిగిందనీ అంటున్నాడు.


తేజ... డబ్ల్యూహెచ్‌వో విద్యార్థి!

సినిమాలను విభిన్నంగా తీయడం మీద ఎక్కువ శ్రద్ధ వహించే దర్శకుడు తేజ ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) విద్యార్థిగా మారాడు. ఆ సంస్థ ‘శ్వాసకోశ సంబంధ వ్యాధులు- వాటి నివారణ’ అంశంపైన నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ కోర్సులో చేరాడు. శ్వాసవ్యవస్థ మీద కరోనా వైరస్‌ ప్రభావం, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు చెబుతున్న ఆన్‌లైన్‌ పాఠాలను వింటున్నాడట. సిలబస్‌ పూర్తయ్యాక ఆ సంస్థ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తుంది. అందులో ఉత్తీర్ణత సాధించిన తరవాత డబ్ల్యూహెచ్‌వో తనకు వాలంటీరుగా అవకాశం కల్పిస్తే వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తానని అంటున్నాడు తేజ.


డాన్స్‌ నేర్చుకుంటూ...

టి ఐశ్వర్య రాజేష్‌కు మొదటి నుంచీ క్లాసికల్‌ డాన్స్‌ అంటే ఇష్టం. విద్యార్థి దశ నుంచే క్లాసికల్‌ డాన్స్‌ నేర్చుకోవాలని ఎన్నో కలలు కనేది. చదువు, ఇతర పనుల కారణంగా సాధ్యం కాలేదు. మధ్యలో కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా... తప్పనిసరి పరిస్థితుల్లో నిలిపేయాల్సి వచ్చింది. దాంతో ఈ లాక్‌డౌన్‌ విరామంలో రోజూ ఆన్‌లైన్‌లో కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంది ఐశ్వర్య. మొత్తానికి కరోనా కారణంగా తన కల నెరవేరబోతోందని ఆనందంగా చెబుతోంది ఈ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ హీరోయిన్‌.


న్యూయార్క్‌ అకాడమీలో ‘నిధి’

‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో నభానటేష్‌తోపాటు మరో హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్‌ నటనలో నైపుణ్యాన్ని సాధించడానికి ఆన్‌లైన్‌ పాఠాలు వింటోంది. ఇప్పుడు గొప్పగా నటిస్తేనే భవిష్యత్తులో చెప్పుకోదగ్గ అవకాశాలు వస్తాయనీ, మంచి నటిగా గుర్తింపు పొందాలన్న భావనతోనే ఆన్‌లైన్‌ కోర్సులో చేరాననీ అంటోంది ఈ టాలీవుడ్‌ బ్యూటీ. ప్రతిష్ఠాత్మక ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ’లో ఆన్‌లైన్‌ ప్రవేశం పొందిన నిధి అగర్వాల్‌... నటనతోపాటు సినీ ఇండస్ట్రీలో రాణించడానికి డైరెక్షన్‌, ఫిల్మ్‌ మేకింగ్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌ విభాగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించేలా పాఠాలను శ్రద్ధగా వింటోందట. ‘లాక్‌డౌన్‌ పూర్తయ్యేసరికి ప్రేక్షకులు నిధి అగర్వాల్‌లో కొత్త నటిని చూస్తారు’ అంటోంది ఈ అమ్మడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.