
పండ్లలో రారాజు ఎవరంటే... పిన్నల నుంచీ పెద్దల వరకూ చెప్పేది మధురఫలమైన మామిడి పండు పేరే. వేసవిలో మాత్రమే దర్శనమిచ్చే ఈ మామిడి కొన్ని స్టార్టప్‌లకు ఆదాయవనరుగా మారి లాభాలు తెచ్చి పెడుతోంది. ఎలాగంటే...
ఇది మగ్గబెట్టే పొడి
వేసవిలో మామిడి పండ్లదే హవా. మార్కెట్లోకి రాగానే గబగబా కొనేసుకుని సీజనంతా లాగించేస్తుంటారు మామిడి పండ్ల ప్రియులు. అయితే ఆ పండ్లను సహజసిద్ధంగా కాకుండా ఎథనాల్, క్యాల్షియం కార్బైడ్, చైనా పౌడర్లు వేసి కృత్రిమంగా మగ్గబెట్టడంతో చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారు. అవన్నీ విషపూరితమని హైకోర్టు నిషేధించినా వాడకం మాత్రం తగ్గట్లేదు. అది గమనించిన హైటెన్ సొల్యూషన్స్ అనే ఓ హైదరాబాదీ స్టార్టప్ అటు రైతులకూ ఇటు వినియోగదారులకూ మేలు చేసేలా పండ్లను మగ్గబెట్టేందుకు ఎన్-రైప్ పేరుతో ఓ పొడిని తయారు చేసింది. దీంతో 72 గంటల్లో మామిడి పండ్లను మగ్గబెట్టుకోవచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ తదితర సంస్థలు ఈ పొడితో ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవనీ, పండ్లు సహజ రుచినీ, తాజాదనాన్నీ కోల్పోవని నిర్ధారించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదించి రాష్ట్రంలోని రైతులకు ఆ పొడిని అందుబాటులో ఉంచడంతోపాటు ఇతర రాష్ట్రాలకూ ఎన్-రైప్‌ను సిఫారసు చేస్తోంది. ఇక, ఈ పొడితో మామిడి పండ్లతోపాటు సపోటా, జామ, అరటి, నిమ్మ వంటి ఇతర పండ్లను కూడా మగ్గబెట్టుకోవచ్చు. చిన్న చిన్న సాచెట్ల రూపంలో అందుబాటులో ఉన్న ఎన్-రైప్ పొడిని 20 కిలోల మామిడి పండ్లకు 10 గ్రాములు వేస్తే సరిపోతుంది.
ఇంటికే వస్తుంది మధురఫలం....
గల్ఫ్‌లో కొంత కాలం పనిచేసి హైదరాబాద్‌కి తిరిగొచ్చింది ఆరిఫారఫీ కుటుంబం. ఆమె చదివింది నెట్వర్క్ ఇంజినీరింగ్. నేపథ్యం లేకపోయినా ఆరిఫాకి మొదట్నుంచి వ్యవసాయం చాలా ఇష్టం. అయితే పంటలకి ఎక్కువగా రసాయనాలు చల్లడం దగ్గరగా చూసిన ఆమె సేంద్రియ వ్యవసాయం చేద్దామనుకుంది. అందుకే పదమూడేళ్ల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, మల్లాపూర్‌లో 21 ఎకరాల పొలం కొనుగోలు చేసింది. అందులో మామిడితోపాటు అంతరపంటలుగా కాయగూరలు సాగు చేయడం మొదలుపెట్టింది. శాస్త్రవేత్తలూ, వ్యవసాయ విశ్వవిద్యాలయాల నిపుణుల సలహాలూ సూచనలతో సహజ ఎరువులు తయారు చేస్తూ... సకాలంలో వాటిని పిచికారీ చేస్తూ పంట పండిస్తోంది. అలా ఐదేళ్లకే మామిడి ఫలసాయం అందుకున్న ఆరిఫా ఏఆర్4 మ్యాంగోస్ పేరుతో తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవిదేశాలకు ఆన్లైన్ ద్వారా డోర్‌డెలివరీ ఇవ్వడం మొదలుపెట్టింది. బంగినపల్లి, రసాలు, హిమాయత్, ఆల్ఫాన్సో, దశేరి, మల్లికా వంటి పలు రకాలను అందిస్తున్న ఆరిఫా నిజాముల తోటల్లో అరుదుగా పండే ‘అజాముస్ సమర్’ అనే రకాన్నీ పండిస్తోంది. అది హిమాయత్ కంటే ఎంతో మధురంగా ఉంటుంది. ఇక, ఫోన్‌కాల్, వాట్సాప్ ద్వారా ఆర్డరు తీసుకుని ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో మాత్రమే డెలివరీ ఇస్తున్న ఆరిఫా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బిజినెస్ లీడర్ అవార్డును అందుకుంది. సీజన్లో దాదాపు అరవై లక్షల టర్నోవరును సొంతం చేసుకుంటోంది.
ఏడాదంతామామిడి పండ్లు
సీజన్ అయిపోతే మామిడి పండ్లు దొరకవని కొందరు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ కూడా మానేసి వేసవిలో వాటినే తిని బతికేస్తుంటారు. అయితే దిల్లీకి చెందిన ఓ స్టార్టప్ మాత్రం ఆ పండ్లను అన్ని సీజన్లలోనూ అందిస్తోంది. అదీ ఆఫీసులూ, హోటళ్లూ, హాస్టళ్లూ, స్కూళ్లలో మాత్రమే డెలివరీ ఇస్తోంది. బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన రుషీ సఖుజా మూడేళ్ల క్రితం ఫ్రూట్ బాక్స్ అండ్ కో పేరుతో ఏర్పాటు చేసిన ఈ స్టార్టప్ దేశవ్యాప్తంగా 500 ప్రధాన ప్రాంతాల్లో సాగయ్యే మామిడి, జామ, అరటి, నారింజ, బత్తాయి, ద్రాక్ష రైతుల దగ్గర నుంచి నేరుగా పండ్లు తీసుకుని... వాటిని కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసి వినియోగదారులకు అందిస్తుంది. మనకు ఆకలి తీర్చడానికి రకరకాల ఫుడ్ ఆప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆకలితోపాటు ఆరోగ్యాన్ని పంచడం కూడా ముఖ్యమనే ఉద్దేశంతో రుషి ఉద్యోగులకు, విద్యార్థులకు పండ్లు అందించడానికి ఈ స్టార్టప్ సేవలకు శ్రీకారం చుట్టాడు. అందులో భాగంగా విదేశాల నుంచి యాపిల్, జమ, అవకాడో, పియర్స్ వంటి పండ్లు తెప్పించి వినియోగదారులకు అందిస్తున్నాడు. దాంతోపాటు వెయ్యి మందికిపైనే రైతులకు లాభాలు చేకూరుస్తున్నాడు.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్