close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ మామిడిపండ్లు చూశారా!

మామిడి అనగానే మనకు పసుపురంగులోనో ఆకుపచ్చ రంగులోనో ఉండే బంగినపల్లో రసాలో గుర్తుకొస్తాయి.  కానీ సపోటా రంగులోనూ బ్లూబెర్రీల్లా నీలిరంగులోనూ  అవకాడోలా అస్సలు పీచులేకుండానూ, నేరేడుపండ్ల సైజులో కూడా మామిడి పండ్లు పండుతున్నాయి. అరుదైన ఆ మామిడి రకాలే ఇవి...

భలే భలే... బుల్లి మామిడి..!
రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల వ్యాసంతో ఆరు సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ పండ్ల పేరు మ్యాప్‌రాంగ్‌. ఆగ్నేయాసియా దేశాల్లో పండించే ఈ పండ్లకు థాయ్‌ల్యాండ్‌ పెట్టింది పేరు. పండాక నారింజ పసుపు వర్ణంలో ఉండే వీటి టెంక ఊదా రంగులో ఉంటుంది. ఈ చెట్టు లేత ఆకుల్ని సలాడ్లలోనూ తింటారు. మామిడిలానే పచ్చికాయల్ని పచ్చడికి వాడతారు. తీపీ పులుపూ కలగలిసిన రుచితో ఉండే పండ్లను తొక్కతో సహా తింటారు. నీటిశాతం ఎక్కువగా ఉండే ఈ పండ్లు ఊపిరితిత్తులు, గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మామిడి... అవకాడోలా..!
ద్భుతమైన పరిమళం, అంతకుమించిన రుచితో ఉండే అవకాడో మ్యాంగో అంటే ఇండోనేషియన్లకి ఎంతో ఇష్టం. ఈ పండ్లలో పీచు శాతం తక్కువ. దాంతో అచ్చం అవకాడో మాదిరిగానే మధ్యలోకి కోస్తే టెంక ఒక సగంలోకి వచ్చేస్తుంది. స్పూనుతో అవకాడోలానే సులభంగా తినొచ్చు. తియ్యగా ఉండే ఈ పండులో విటమిన్‌-ఎ, సిలతోబాటు కాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా దొరికే ఈ పండ్లని వాళ్లు సీజన్‌లో రుచి చూడాల్సిందే.

అందంకోసం... చిట్లా..!
సలు ఇది మామిడి పండో కాదో అన్నట్లుగా తెలుపు, ఆకుపచ్చ రంగుల మేళవింపుతో ఉన్నట్లున్న ఈ కాయలు మీడియం సైజులో ఉంటాయి. ఉత్తర దిల్లీలోని రాతౌల్‌ పట్టణంలోనూ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌, లఖనవూల్లోనూ పండించే ఈ చిట్లా మామిడిని పండ్లరసాల్లో ఎక్కువగా వాడతారు. పండ్లే కాదు, చిన్నగా ఉండే ఈ చెట్లను అందంకోసం కూడా పెంచుతారట.

కస్తూరి... నీలిరంగులో!
సుమత్రా, బోర్నియో ప్రాంతాల్లో పండే కస్తూరి మామిడిలో విటమిన్‌-ఎ, సిలతోబాటు ఇ-విటమిన్‌ కూడా లభిస్తుంది. పీచు శాతం ఎక్కువ. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులోనే ఉండి, పండాక ముదురు ఊదా రంగులోకి మారే ఈ మామిడినే బ్లూ మ్యాంగో అని పిలుస్తారు అమెరికన్లు.
మిగిలిన మామిడితో పోలిస్తే, ఈ పండు బీపీ రోగులకి ఎంతో మంచిదట. ఇందులో సోడియం శాతంతో పోలిస్తే పొటాషియం ఎక్కువ. చెడు కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుందట.

అడవి మామిడి!
పోటారంగులో ఉండే బబాంగన్‌ మామిడి బోర్నియో, ఇండొనేషియా, మలేషియా దేశాల్లో పండుతుంది. వీటినే వైల్డ్‌ మ్యాంగో అంటారు. పండుగా తినడంతోబాటు పచ్చికాయల్ని పచ్చడి పట్టడం, పండాక నేరుగా తినడం చేస్తారు. కాస్త అరటిపండు రుచిలో ఉన్న ఈ పండుని దోరగా ఉన్నప్పుడు రకరకాల వంటల్లోనూ వాడుతుంటారు. అరటిపండులానే తొక్కని ఒలిచీ తినొచ్చు. ఈ పండులో అత్యధిక స్థాయిలో పోషకాలతోబాటు యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ రోగులకు మంచిదన్న కారణంతో దీన్ని న్యూట్రాసూటికల్స్‌ల్లోనూ వాడుతుంటారట.

అసం కుంబాంగ్‌!
డవి మామిడిలానే ఉండే మరో రకమే అసం కుంబాంగ్‌. ఇదీ బోర్నియో, సుమత్రా, మలేషియా ప్రాంతాల్లోనే పండుతుంది.  ముదురు వంకాయ వర్ణంలో ఉండే ఈ పండ్లలో పీచు శాతం ఎక్కువ. పచ్చికాయల్ని కూరల్లో ఎక్కువగా వాడతారు. సో, మామిడిపండ్ల వేడుకల్లోనో ఆయా దేశాలకు వెళ్లినప్పుడో ఇవి కనిపిస్తే రుచి చూడటం మర్చిపోకండి..!తాటాకా... మజాకా..!

తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయో లేదోగానీ, తాటాకులతో అల్లిన ఈ బుట్టల్నీ బాక్సుల్నీ చూస్తే మన కళ్లు చెదరడం మాత్రం ఖాయం. అందుకే ఈమధ్య పెళ్లీ పేరంటాల్లో సామగ్రిని పెట్టేందుకూ కానుకల్ని పెట్టి ఇచ్చేందుకూ  సరికొత్త డిజైన్ల తాటాకు బుట్టలే అందంగా కనువిందు చేస్తున్నాయి. అటు వేడుకలకి అందాన్నిస్తూ ఇటు పర్యావరణానికీ మేలు చేస్తున్నాయి..!

గలగలలాడే తాటాకులతో ఒకప్పుడు చింకి చాపలూ విసనకర్రలూ సాదా బుట్టలూ అల్లడం తెలిసిందే. కానీ అసలవి తాటాకులతో చేసినవేనా అనిపించేంత అందంగా అలంకరణ వస్తువులతోబాటు బ్యాగులూ పర్సులూ వంటి యాక్సెసరీల్నీ కళాకారులు అల్లేస్తుంటే, అంతే ఇష్టంగా వాటిని వాడుతోంది ఈతరం.

కరవుకాటకాల్నీ తుపాన్లనీ తట్టుకుని వంద సంవత్సరాలకు పైగా జీవించే తాటిచెట్టు పేదవాడి కల్పతరువు. దాని ఆకులూ కాయలూ పండ్లూ గింజలూ వేర్లూ కాండం సకలం వాడుకో దగ్గవే. ముఖ్యంగా తాటాకుల గురించయితే ప్రత్యేకంగా చెప్పుకుని తీరాల్సిందే. దక్షిణ భారతంలో వేసవి వచ్చిందంటే చాలు... ఇంటిముంగిట తాటాకులతో చలువ పందిళ్లు వేస్తారు. పాకలూ గొడ్లచావిళ్ల మీద పాత ఆకుల స్థానంలో కొత్తవి కప్పుతారు. వర్షాకాలం కోసం గొడుగులూ టోపీలూ చేస్తుంటారు. పండ్లను మగ్గబెట్టేందుకూ తాటాకు బుట్టల్నే వాడతారు. ఇక, ప్రాచీనకాలంనాటి గ్రంథాలన్నీ తాళపత్రాలే... అంటే తాటాకులమీద రాసినవే. అవి నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆ ఆకులోని వైశిష్ట్యం ఏమిటో తెలుస్తోంది. అందుకే తాటాకుతో అందమైన వస్తువుల్ని తయారుచేసే సంప్రదాయం దేశవ్యాప్తంగా వాడుకలో ఉంది. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తమిళనాట ఇది మరీ ఎక్కువ. దేశవ్యాప్తంగా ఏడెనిమిది కోట్ల తాటిచెట్లు ఉంటే, వాటిల్లో సగం తమిళనాటే ఉన్నాయి.

తాటాకు... పెళ్లి కానుక!
కారైకుడి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఈ తాటిచెట్ల సంఖ్య మరీ ఎక్కువట. అందుకే అక్కడి హస్తకళావస్తువుల తయారీలో తాటాకే అత్యంత కీలకం. గ్రామాల్లో ఆకులతో బుట్టల్నీ పాత్రల్నీ రకరకాలుగా అల్లి అమ్మేవారు. ఇలా తాటాకులతో అల్లడాన్నే వాళ్లు కొట్టాన్‌ కళగా పిలుస్తారు. అయితే క్రమంగా ప్లాస్టిక్‌ వినియోగం పెరగడంతో వీటి వాడకం, తయారీ దాదాపుగా నిలిచిపోయింది. కానీ ఎం.ఆర్‌.ఎం.ఆర్‌.ఎం. కల్చరల్‌ ఫౌండేషన్‌ ద్వారా తాటాకు కళను పునరుద్ధరించేందుకు నడుం బిగించారు విశాలాక్షి రామస్వామి. అందులోభాగంగా అనేక గ్రామాలకు చెందిన మహిళలకి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి మరీ అల్లించడంతో తాటాకు పచ్చగా కళకళలాడుతోంది. పెళ్లిళ్లలో కానుకల్ని ఇచ్చే బాక్సులూ సారెలో తెచ్చే చీరలూ మిఠాయిలూ అలంకరించే బాక్సులూ ట్రేలూ బుట్టలూ... ఇలా అన్నిరకాల వస్తువుల్నీ తాటాకులతోనే అల్లేస్తున్నారు ఆ ప్రాంత మహిళలు. గిలగిచ్చకాయలూ పండ్ల బుట్టలూ చాపలూ వేజ్‌లూ బ్యాగులూ పూలదండలూ.. ఇలా తాటాకు అల్లికలెన్నో. వీటి అల్లికకోసం ఆకుల్ని చీల్చేందుకు ప్రత్యేకమైన పనిముట్లని ఉపయోగిస్తారు. లేత ఆకుల్ని భిన్న పరిమాణాల్లో చీల్చి రంగునీళ్లలో ఉడికించి మరీ ఆరబెట్టి అల్లుతారు. అల్లేముందు వాటిమీద నీళ్లు చల్లడంవల్ల ఆకులు విరిగిపోకుండా ఉంటాయి. బుట్ట సైజుని బట్టి అల్లికని ఎంచుకుని, ఈనెల్ని మూతిభాగంలో గట్టిదనంకోసం వాడుతుంటారు. ఆ స్ఫూర్తితో మరెందరో కళాకారులు రెట్టించిన ఉత్సాహంతో తాటాకులతో మరింత అందంగా అల్లేస్తుంటే, వాటిని కొనడం ద్వారా ఆ కళకి జీవం పోస్తున్నారు పర్యావరణ ప్రేమికులు..!చెస్‌... లూడో... అన్నీ ఫోన్లోనే!

ఎండలో బయటకు వెళ్లి ఆడుకోలేని పిల్లలకు మరికొందరిని జతచేసి... ఇంట్లోనే క్యారంబోర్డో, బిజినెస్సో ఇచ్చి కూర్చోబెడతాం. మరి ఇప్పుడు ఇంటికే పరిమితమైన పెద్దవాళ్ల సంగతీ... వాళ్లకూ ఈ ఆటలే కంపెనీ ఇస్తున్నాయిప్పుడు. ఆడటానికి జత ఎవరూ లేకపోయినా... హాయిగా సోఫాలో కూర్చుని సరదాగా సెల్‌ఫోన్లో ఆడుకోవచ్చు. అవును... ఇలాంటి బోర్డు గేములన్నీ ఇప్పుడు ఆప్‌ల రూపంలో వచ్చేసి ఫోను స్క్రీనులపైన చేరిపోతున్నాయి. దూరంగా ఉన్నవారిని దగ్గర చేస్తున్నాయి.

కరోనా పుణ్యమా అని ఇప్పుడు అందరూ పెద్దగా బయటకి వెళ్ళకుండా ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఓ వైపు పెద్దవాళ్లు పనులతో సతమతమవుతుంటే... మరోవైపు పిల్లలేమో ఆటల్లో మునిగితేలుతున్నారు. కాస్త ఖాళీ దొరికినప్పుడు వాళ్లతో సరదాగా క్యారమ్స్‌ లేదా చెస్‌ ఆడినా... సమవయస్కులతోనో కుదిరితే బంధువులతోనో స్నేహితులతోనో ఆడితే ఆ మజానే వేరు. అలా కోరుకునే వారికి ఈ బోర్డు గేముల ఆప్‌లు చక్కని పరిష్కారం చూపిస్తూ సమయాన్ని తెలియనివ్వకుండా చేస్తున్నాయి. అలాంటి ఆటల్లో చెస్‌, క్యారమ్స్‌ లాంటివే కావు... లూడో కింగ్‌, మోనోపలీ, క్లూ, స్క్రాబుల్‌... వంటివాటినీ ఒక్క డౌన్‌లోడ్‌తో మన ఫోను స్క్రీను మీద పెట్టేసుకోవచ్చు. అయితే... ఇంట్లో బోర్డు పెట్టుకుని అందరూ కలిసి కూర్చుని ఆడటానికీ డిజిటల్‌ రూపంలో ఆడటానికీ తేడా ఉండదా అంటే దాదాపుగా ఉండదనే చెప్పొచ్చు. పైగా ఆ ఆటలు తెలియకపోయినా కూడా ధైర్యంగా ఆడేయొచ్చు. ఉదాహరణకు చెస్‌నే తీసుకుంటే... బిగినర్స్‌ నుంచీ ఇందులో రకరకాల లెవల్స్‌ ఉంటాయి. ఆ పావుల్ని ఎంత జాగ్రత్తగా జరపాలీ... దేన్ని ఎలా చంపొచ్చు అనే సంకేతాలు మనకు అందుతాయి. ఆ ప్రకారం జాగ్రత్తగా ఆడటం తెలిస్తే గెలిచి మరో రౌండుకు వెళ్లిపోవచ్చు. క్యారమ్స్‌ పూల్‌ కూడా అంతే.

నలుగురే కాదు, ఇద్దరూ ఆడుకోవచ్చు. ఇందులో పాయింట్లు ఉంటాయి. ఒక్కో కాయిన్‌ని కొట్టినప్పుడల్లా ఒక్కో పాయింట్‌ మన ఖాతాలోకి చేరుతుంది. గెలిచేకొద్దీ ఆ పాయింట్లు పెరుగుతాయి. ఎన్ని పాయింట్లతో ఆడాలనేది ముందే నిర్ణయించుకోవచ్చు. పైగా మనకు నచ్చిన బోర్డు డిజైను ఎంచుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంటుంది. కేవలం పాయింట్లతో ఆడటం ఇష్టంలేనివారు కాస్త ధైర్యం చేసి డబ్బులు పెట్టి ఆడే లెవల్స్‌ కూడా ఉన్నాయి. లూడో కూడా అంతే. మొదటి లెవల్‌ గెలిస్తే.. రెండోదానికి వెళ్లొచ్చు. పైగా ఈ ఆటలన్నీ ఎవరితోనైనా ఆడుకోవచ్చు. ఎలాగంటే... ఒక్కసారి ఈ ఆప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని సైన్‌ ఇన్‌ అయి.. యూజర్‌ నేమ్‌ పెట్టుకుని ఆటలోకి వెళ్తే... ఎంతమంది యాక్టివ్‌గా ఉన్నారనేది ఫోను స్క్రీన్‌మీద కనిపిస్తుంది.

వారిలో ఒకరితో ఆడేయొచ్చు. అలా తెలియని వారితో ఆడటం ఇష్టంలేనివారు స్నేహితులూ లేదా బంధువులకూ వాట్సాప్‌ ద్వారా రిక్వెస్ట్‌ పెట్టి... వాళ్లతోనే ఆడొచ్చు. ఒకవేళ ఎవరూ వద్దనుకుంటే కొన్ని ఆటలకు ప్రత్యర్థిగా  స్వయంగా ఆప్‌ ఆడుతుంది. అప్పుడు కూడా కాయిన్‌ని ఎలా కదపాలనే సలహాలు అందుతాయి కాబట్టి భయపడక్కర్లేదు.

ఈ ఆప్‌లన్నింటినీ దాదాపు ఉచితంగానే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకసారి చేస్తే ఆఫ్‌లైన్లోనూ ఆడొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటికి ఎక్కువ ఆదరణ పెరుగుతోందనీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారనీ చెబుతున్నాయి గేమింగ్‌ సంస్థలు. ఏదేమైనా... లాక్‌డౌన్‌ ఉన్నా లేకపోయినా ఇలాంటి ఆటల్ని మన ఫోనులో పెట్టుకుంటే ఏ మాత్రం బోర్‌గా అనిపించినా  హాయిగా ఆడుకోవచ్చు. ఏమంటారు!అది... అంతుచిక్కని నిర్మాణం..!

సిటీ ఆఫ్‌ నవాబ్స్‌గా పేరొందిన లఖ్‌నవూ నగరంలో చూడదగ్గ ప్రదేశాలెన్నో. కానీ 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన నాలుగో నవాబైన ఆసఫుద్ధౌలా అరబిక్‌-ఐరోపా శైలిలో కట్టించిన ‘బడా ఇమాంబాడా’ కట్టడం, అద్భుతమైన వాస్తునిర్మాణానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. చెక్క, లోహాలతో పనిలేకుండా రాతితో కట్టిన అతి పెద్ద కట్టడాల్లో ఇదొకటి. గురుత్వాకర్షణ శక్తినే సవాలు చేస్తూ ఈ ప్యాలెస్‌ ప్రధాన హాలుని నిర్మించిన తీరు అద్భుతం. 50 మీటర్ల పొడవూ 16 మీటర్ల వెడల్పూ 15 మీటర్ల ఎత్తులో ఉన్న హాలు సీలింగుని బీమ్‌లూ స్తంభాల సాయం లేకుండా కట్టడం ఇందులోని విశేషం. ఈ భవనం నిర్మాణంకోసం 20 వేల మందికి పైగా పనిచేశారనీ వాళ్లలో సాధారణ కార్మికులు పగటిపూట పనిచేయగా, వాస్తుశాస్త్రం తెలిసినవాళ్లు రాత్రిపూట పనిచేశారనీ అందుకే అదెలా కట్టారనేది ఎవరికీ తెలియని మిస్టరీగా ఉండిపోయిందనీ చెబుతారు. ఈ హాలు గోడలకోసం ఇటుకల్ని ఒకదాంతో ఒకటి అనుసంధానించిన తీరూ ప్రత్యేకంగానే ఉంటుంది. అలాగే భవంతిలో పైకి వెళ్లేందుకు సన్నని సందులూ మెట్ల మార్గాలూ వెయ్యికి పైగానే ఉన్నాయి. వీటిన్నింటిలోంచీ వెళ్లొచ్చు కానీ తిరిగివచ్చే దారులు మాత్రం రెండే ఉంటాయట. శత్రువులు ప్రవేశించకుండా ఉండేందుకే ఈ జిగ్‌జాగ్‌ పజిల్‌ ఏర్పాటు అని చెబుతారు. గైడ్‌ సాయం లేకుండా ఇందులోకి వెళితే రావడం చాలా కష్టమట. అంతేకాదు, ఈ ప్యాలెస్‌ నుంచి అలహాబాద్‌, దిల్లీ,  ఫైజాబాద్‌లకు దారితీసే సొరంగా మార్గాలున్నాయట. చాలామంది వాటిల్లోకి వెళ్లి తిరిగిరాకపోవడంతో వాటిని మూసేశారట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.