close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈయన మీసాల వెంకన్న!

విశాలమైన ప్రాంగణంలో ఆకట్టుకునే శిల్పకళా సౌందర్యంతో సాధారణ ఆలయాలతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తుంది జామ్‌సింగ్‌ బాలాజీ దేవాలయం. హైదరాబాద్‌లోని గుడి మల్కాపూర్‌లో ఉన్న ఈ ఆలయాన్ని ఓ సైనికుడు కట్టించడం విశేషం.

దాదాపు 250 ఏళ్లక్రితం జామ్‌సింగ్‌ అనే అశ్వదళాధిపతి ఈ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కట్టించాడు. అందుకే దీనికి జామ్‌సింగ్‌ బాలాజీ దేవాలయం అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. పన్నెండు స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో మూడు ధ్వజస్తంభాలూ, వాద్య పరికరాలకోసం ప్రత్యేక అంతస్తూ, మరో రెండు ఉపాలయాలూ, నవగ్రహాల మందిరం ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంతటి విశిష్టత ఉన్న ఈ గుడి నిర్మాణం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

స్థలపురాణం...
భద్రాచలం రామదాసులా జామ్‌సింగ్‌ కూడా ప్రభుత్వ ధనాన్ని ఆలయ నిర్మాణానికి ఖర్చుపెట్టాడనీ... అయితే ఇక్కడి నవాబు అతడిని శిక్షించకుండా మరో పని అప్పగించాడనీ అంటారు. జామ్‌సింగ్‌ ఓ రాజపుత్రుడు. అతడి స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌. అతడికి గుర్రాలంటే ఇష్టమట. మేలైన అశ్వాలను గుర్తించడంలో, వాటిని మచ్చిక చేసుకోవడంలో అతడిని మించినవాడు లేడని చెప్పుకునేవారట. ఇవన్నీ తెలిసిన అప్పటి హైదరాబాద్‌ మూడో నిజాం నవాబు సికిందర్‌ ఝా  అతడిని ఇక్కడకు పిలిపించి అశ్వదళాధిపతిగా నియమించుకున్నాడట. విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్లి నిజాం సైన్యానికి అవసరమైన గుర్రాలను కొనడం అతడి పని. అలా ప్రయాణిస్తున్నప్పుడే అతడికి ఓసారి కలలో స్వామి కనిపించి గుడి కట్టించమని చెప్పాడట. స్వతహాగా భక్తుడైన జామ్‌సింగ్‌ ఎలాగైనా ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడట. దాంతో గుర్రాల కొనుగోలు కోసం ఇచ్చిన డబ్బులో కొంత మిగుల్చుకుని ఆలయాన్ని కట్టాడట. ఈ విషయం తెలిసిన నిజాంకు కోపం వచ్చి... అతడిని శిక్షించాలనుకున్నాడట. అయితే రాజు దగ్గర ప్రధానమంత్రిగా పనిచేస్తున్న రాజా చందూలాల్‌ అతడిని మరోలా శిక్షించమని చెప్పడంతో నవాబు గుడికి ఎదురుగా ఓ మసీదు కట్టించమని ఆజ్ఞ జారీచేశాడట. రాజు చెప్పినట్లు జామ్‌సింగ్‌ మసీదు కట్టించడంతో అతడిని వదిలేశాడట. ఆ తరువాత నవాబు కూడా గుడిని అభివృద్ధి చేయడంతోపాటూ జామ్‌సింగ్‌కి కొంత స్థలాన్ని కూడా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. జామ్‌సింగ్‌ సైనికుడు కాబట్టి వేంకటేశ్వరస్వామికి కూడా మీసాలు పెట్టించాడట. అదే విధంగా స్వామి పక్కన కత్తి కూడా ఉంటుందట. అభిషేకం చేసేటప్పుడు మాత్రమే ఆ కత్తి భక్తులకు కనిపిస్తుందట. గుడి గోపురం పైన కూడా గుర్రాలు కనిపించేలా ప్రత్యేకంగా శిల్పాలు చెక్కించాడని అంటారు. రథోత్సవానికి వాడే గుర్రాలను కూడా ప్రత్యేక చెక్కతో చేయించాడని చెబుతారు. ఇక్కడి స్వామి విగ్రహాన్ని కూడా నలుపురంగు గ్రానైట్‌తో రూపొందించారు.

బ్రహ్మోత్సవాలు...
ఆలయ గోపురంపైన గుర్రాల చిత్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ ద్వారాన్ని అశ్వద్వారం అని అంటారు. ఇక్కడ స్వామి భూదేవి, ఆదిలక్ష్మి సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడి విగ్రహంతోపాటూ శివుడూ, కృష్ణుడి ఉపాలయాలనూ ఈ ప్రాంగణంలో చూడొచ్చు. జామ్‌సింగ్‌ది ఉత్తర్‌ప్రదేశ్‌ కావడంతో... అక్కడి శిల్పకళానైపుణ్యం ఈ ఆలయంలో కొంతవరకూ కనిపిస్తుంది. ఇక్కడ ఏడాది పొడవునా ప్రత్యేకంగా జరిగే పూజలతోపాటూ వైశాఖమాసంలో స్వామికి బ్రహ్మోత్సవాలూ రథోత్సవం కూడా నిర్వహిస్తారు.
ఎలా చేరుకోవచ్చంటే...
ఈ ఆలయం హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లోని కూరగాయల మార్కెట్‌ దగ్గర ఉంటుంది. ఇతర ప్రాంతాల వారు ఇక్కడకు రావాలంటే హైదరాబాద్‌కు రైలు, రోడ్డు లేదా విమాన మార్గం ద్వారా వచ్చి... తరువాత ఆటోలూ, క్యాబ్‌లలో ఆలయానికి చేరుకోవచ్చు.

- బాలరాజేశ్వరరావు, న్యూస్‌టుడే, మెహదీపట్నం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు