close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పచ్చని మల్లెలు చూశారా..!

గులాబీపువ్వు అనగానే ఆ రంగుతోబాటు ఎరుపూ తెలుపూ పసుపూ నారింజా... ఇలా రంగురంగుల్లో విరిసేవీ గుర్తుకొస్తాయి. కానీ స్వచ్ఛమైన తెలుపు రంగుకే పర్యాయపదమైన మల్లెలూ జాజులూ పసుపు వన్నెలోనూ పరిమళిస్తాయంటే నమ్మగలమా... కానీ నమ్మాలి... ఇవన్నీ అవే మరి..!

నాగమల్లి, తీగమల్లి, జాజిమల్లి, గుండుమల్లి... ఏ మల్లె అయితేనేం... అన్నీ ధవళ వర్ణంలోనే పరిమళిస్తుంటాయి. మల్లె జాతికే చెందిన ఛమేలీ సైతం తెలుపు రంగులోనే పల్లవిస్తుంది. కానీ పసుపు రంగులో విరిసే మల్లె రకాలూ ఉన్నాయి. ఆ మల్లెల సౌరభాల్నీ ఆస్వాదిద్దాం... మరుమల్లెల మాట వింటే చాలు... మనసంతా పరవశంతో గుబాళిస్తుంది. స్వచ్ఛమైన ఆ రూపం కళ్లల్లో నిండిపోతుంది. కానీ జపనీయులకి మాత్రం మల్లె అంటే పసుపు వర్ణమే. అక్కడ ఎక్కువగా పూసేది అవే మరి. అందుకే ఆ మల్లెని జపనీస్‌ జాస్మిన్‌ లేదా ప్రైమ్‌ రోజ్‌ అని పిలుస్తుంటారు. జపాన్‌తోబాటు ఆగ్నేయాసియా దేశాల్లోనూ పెరిగే ఈ మొక్కని ఇంటి ముందున్న ఆర్చ్‌కో లేదా గుమ్మానికి అటూ ఇటూనో పెంచితే ఆ మల్లెల సౌరభం ఇల్లంతా పరచుకుంటుందట. అందుకే దీనికి రాయల్‌ హార్టీకల్చరల్‌ సొసైటీ నుంచి గార్డెన్‌ మెరిట్‌ అవార్డూ లభించింది. కత్తిరించే కొద్దీ గుబురుగా పెరిగే ఈ మల్లెపొదని పచ్చదనం కోసమూ పెంచుతుంటారు.

వావ్‌... ఛమేలీ!
గులాబీ రంగు కాడ ఉండి తెలుపు రంగులో విరిసే ఛమేలీ పూల సోయగం మనకు సుపరిచితమే. అంతే పరిమళంతో పసుపు రంగులో పూసే మరో జాస్మిన్‌ రకమూ ఉంది. అదే ఎల్లో జాస్మిన్‌ లేదా ఇటాలియన్‌ జాస్మిన్‌. దీన్నే మనవాళ్లు పీలీ ఛమేలీ అంటారు. దీని కాడ ఛమేలీలా పొడవుగా ఉండదు కానీ వీటి పరిమళమూ అమోఘమే. ఈ ఛమేలీ పూలు ఔషధ సౌగంధాలు కూడా. ఈ పూల కషాయాన్నీ ముద్దనీ పొట్ట, గుండె సమస్యలకు వాడుతుంటారు. అందుకే హిమాలయాల్లో పుట్టిన ఈ పొద, ఆసియా, ఐరోపా దేశాలంతటా పాకిపోయింది.

సన్నజాజి పువ్వులా...
సన్నజాజులోయ్‌... కన్నెమోజులోయ్‌... అంటూ పాడుకోవడమే కాదు, సున్నితమైన ఆ పూల సోయగానికి ముగ్ధులవని వాళ్లుండరు. వాటిలానే సీజన్‌లో పొద మొత్తంగా విరబూసే రకమే జాస్మినమ్‌
న్యూడిఫ్లోరమ్‌. దీన్నే వింటర్‌ జాస్మిన్‌ అంటారు. చైనాలో ఎక్కువగా పెరిగే ఈ పొదను గుమ్మాలకీ గోడలకీ పాకిస్తారు. మత్తెక్కించే ఈ పూల వాసన అంటే ఐరోపా వాసులకి ఎంతో ఇష్టమట.

విరిసిన విరజాజి..!
ఆకుపచ్చని తివాచీమీద నిండుగా చుక్కల్ని పరిచినట్లుగా పొద మొత్తంగా విరిసే విరజాజుల సౌరభం మధురోహల్లో ముంచెత్తుతుంది. గుప్పుమంటూ వచ్చే వాటి వాసన ఓ పట్టాన అక్కడ నుంచి కదలనివ్వదంటే అతిశయోక్తి కాదు. మరీ అంత కాకున్నా తేలికపాటి వాసనతో చెట్టంతా విరబూస్తుంటుందీ జాస్మినమ్‌ పార్కెరి. హిమాలయన్‌ బోన్‌సాయ్‌గా పిలిచే ఈ పొదని కుండీల్లోనూ పెంచుకోవచ్చు. దీని ఆకులు చిన్నగా ఉండటంతో పూసినప్పుడు పొద మొత్తం పుసుపురంగు పులుముకున్నట్లే ఉంటుంది. టోపియరీ గార్డెన్‌లా నచ్చిన ఆకారంలోనూ కత్తిరించుకోవచ్చు.
చూశారుగా మరి... ఈసారెక్కడైనా పచ్చని మల్లెలు కనిపిస్తే ఏ వాసన లేని పూలో అనుకోకుండా మనసారా ఆఘ్రాణించండి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు