close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈ బాబుని ఎవరైనా కొనేయొచ్చు!

మన కళ్లు మనల్ని మోసం చేస్తాయి అంటుంటారు. ఒక్కోసారి అది ఎంత నమ్మశక్యం కానట్లుంటుందంటే... కాస్త దూరంలో ఎదురుగా ఉన్న మనిషి... వీపుకి బాబుని తగిలించుకుని ఉంటాడు. ‘బాబు భలే ముద్దొస్తున్నాడే’... అని మనం దగ్గరగా వెళ్లి చూస్తే... ‘మనం చూసింది అబద్ధం’ అని తెలుస్తుంది. అక్కడ కనిపిస్తున్న బాబు నిజానికి టీషర్టు మీద ప్రింటు మరి. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ. అందుకే, ఈ క్రేజీ షర్టులు కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేస్తున్నాయి.

టీషర్టుల మీద రకరకాల జంతువులూ పిల్లలూ ప్రముఖులూ హీరోల ఫొటోలూ ప్రింట్లూ రావడం ఎప్పట్నుంచో ఉంది. పూలూ పండ్లూ కార్టూన్లూ కొటేషన్లు కూడా సాధారణమైపోయాయి. అలా అని ఇది పాత ఫ్యాషన్‌ అయిపోయిందని పక్కన పడేసే టైపు కాదు టీషర్టు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరైనా హాయిగా సౌకర్యంగా వేసుకోగలిగేది ఏదైనా ఉందంటే అది ఈ షర్టే మరి. ఇక, కుర్రాళ్లైతే టీషర్టుని మించిన ఫ్యాషన్‌ ఇంకోదాన్లో లేనేలేదంటారు. కాకపోతే, ఆ ఫ్యాషన్‌ ఎప్పటికప్పుడు కొంచెం కొత్తగా, ఇంకొంచెం క్రేజీగా ముస్తాబవ్వాలన్నది వాళ్లు పెట్టుకునే స్ట్రిక్ట్‌ రూల్‌. ఆ అభిరుచికి తగ్గట్లు విభిన్నంగా విచిత్రంగా సృష్టించినవే ఇవి.  మెడ చుట్టూ పాములు జరజరా పాకుతూ ఎదురుగా వచ్చేవారిని హడలెత్తించే టీషర్టులు ఒకరకమైతే... పిల్లి పిల్ల జేబులో ఎలా ఇరుక్కుపోయిందబ్బా..? భుజం మీద ఉడుత భలే ఆడుతుందే... అని కళ్లప్పగించి చూసేలా ఉన్నవి మరోరకం. ఇక, వీపు మీద పిల్లాడున్నట్లున్న ఆ షర్టుని చూసి, ఎంతసేపైనా బాబు కదలకుండా మెదలకుండా అలా ఎలా ఉన్నాడో అర్థం కాక దగ్గరకు రావడం, ఆ ‘చిత్రం’ త్రీడీ చేసిన చిత్రమని తెలిసి ఆశ్చర్యపోవడం ఖాయం. త్రీడీ ప్రింటింగ్‌తో పాటు నిజంగా అక్కడ జంతువు ఉందేమో అనిపించేలా ఊలుతోనూ ఉడుతలాంటి బొమ్మల్ని టీ షర్టుల మీద అల్లుతున్నారు.

చేతులు కొత్తగా...
షర్టు ముందుభాగంలోనూ వెనుక భాగంలోనే కాదు, చేతులకూ సృజనాత్మకతను జోడించి కెవ్వు కేక అనిపిస్తున్నారు ఫ్యాషన్‌ గురూలు. ఎలిఫెంట్‌ స్లీవ్స్‌, హార్స్‌, క్యాట్‌ స్లీవ్స్‌... ఇలా రకరకాల జంతువుల మోడళ్లతో వచ్చే వీటిలో ఆయా జంతువుల శరీర భాగం మొత్తం షర్టు ముందు భాగంలో ఉంటే చేతి మీద తల ఉంటుంది. ఫొటోలో చూపినట్లూ ఏనుగు తలా తొండం మొత్తం చేతిమీదికొస్తుందన్నమాట. దాంతో చెయ్యి ఎత్తినపుడూ దించినపుడూ ఏనుగు తలాడించినట్లూ ఉంటుంది. మరికొన్నిటికేమో శరీరం స్లీవ్స్‌ మీద ఉంటే తల షర్టు ముందు భాగంలో ఉంటుంది. కాబట్టి, చేతులు ఊపినపుడు ఆ జంతువులు కదిలినట్లూ ఉంటాయి. వీటిలో పిల్లలక్కూడా ఎక్కువ రకాలు వస్తున్నాయి. నిజంగా అవాక్కయ్యేలా ఉన్నాయి కదూ...


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు