close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆడుకునే ఇల్లు... రూ.64 కోట్లు..!

పిల్లలందరికీ తమ బొమ్మలంటే పంచప్రాణాలు. వారాల వయసున్నప్పుడే గిలిగిచ్చికాయ సవ్వడిని సంభ్రమంగా చూస్తుంటారు. కాస్త పెద్దవ్వగానే బంతులూ, జంతువులూ, వాహనాల బొమ్మలతో సందడి చేస్తుంటారు. వారికి అలా ఆటవస్తువులు కొనివ్వడం పెద్దలకూ ముచ్చటగా ఉంటుంది. ప్రస్తుతం కొత్తకొత్త వెరైటీల బొమ్మలు అందుబాటులో ఉండటంతో వాటి రేట్లు బాగా పెరిగిపోయాయి. మరి ఎప్పుడైనా ఆలోచించారా... ప్రపంచంలోనే ఖరీదైన బొమ్మల ధరలు ఎంతుంటాయో అని? అత్యంత ధనికుల పిల్లలు వేటితో ఆడుకుంటారబ్బా అనే ప్రశ్న వస్తే... వీటితోనే అని సమాధానమిచ్చేలా ఉన్నాయీ బొమ్మలు. ఎందుకంటే వాటి ఖరీదు కోట్ల రూపాయలు! ఆ సంగతులేంటో మీరూ చదివేయండి మరి.

అద్భుతమైన భవంతి!

ఇసుకలో గూళ్లు కట్టినప్పటి నుంచే మనకు ఇల్లంటే ఇష్టం. అందమైన భవంతులంటే ఇంకా ఇష్టం. అందుకే పిల్లల కోసం బోలెడన్ని రకాల మినియేచర్‌ డాల్‌ హౌసెస్‌ దొరుకుతున్నాయి. అలాంటిదే ఈ ‘ఆస్టోలాట్‌ డాల్‌హౌస్‌ క్యాజిల్‌’ కూడా. కాకపోతే ఈ ఇంటిని చూస్తే మాత్రం ‘అబ్బా... ఎంత బావుందో’ అనుకుంటూ పిల్లలూ, ‘అమ్మో ఇంత ధరా’ అని పెద్దలూ నోరు తెరవకమానరు. ఎందుకంటే దీన్ని కొనాలంటే 64.30 కోట్ల రూపాయలు కావాలి మరి! అందుకే అత్యంత ఖరీదైన డాల్‌హౌస్‌గా ఈ బొమ్మ ఇల్లు పేరుపొందింది. ఇంతకీ దీనికింత ధర ఎందుకూ అంటే... పేరుకు మినియేచరే కానీ దీన్ని నిజమైన భవంతి మాదిరిగానే
ఆర్కిటెక్చర్‌, ఇంజినీరింగ్‌ నిపుణులు సకల సౌకర్యాలతో ఏడు అంతస్తుల్లో తీర్చిదిద్దారు. ఇందులో అన్ని ఇళ్లల్లో ఉండే హాల్‌, బెడ్‌రూం, కిచెన్‌లతోపాటూ మ్యూజిక్‌ రూం, లైబ్రరీ, స్పోర్ట్స్‌ రూం, జిమ్‌, స్విమ్మింగ్‌పూల్‌ వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. ప్రతి గదిలోనూ మినియేచర్‌ ఫర్నిచర్‌ను పక్కాగా నిజమైన వాటిలాగానే కనిపించేలా ఎంతో కష్టపడి తయారుచేశారట. అందుకే దీన్ని పూర్తిచేయడానికి 13 సంవత్సరాలు పట్టింది! ఈ హౌస్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి... అందరూ ఈ ఇంటిని చూసే అవకాశం కల్పించేలా రకరకాలైన మ్యూజియాల్లో ప్రదర్శించడం మాత్రమే కాదు, తద్వారా వచ్చిన ఆదాయాన్ని చిన్నపిల్లల సంక్షేమం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల కోసం విరాళంగా ఇస్తున్నారట. 


పుత్తడి పూత..!

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ‘ద బర్డ్‌ ట్రైనర్‌’ అనే బొమ్మ గురించి. దీన్ని ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టియాన్‌ బెయిలీ అనే నిపుణుడ[ు 15,000 గంటలకుపైగా కష్టపడి తయారుచేశాడట. కీ ఇస్తే కదిలేలా 2,340 విడి స్టీలు భాగాలను కలిపి బొమ్మగా రూపొందించాడు. స్టీలుపైభాగాన బంగారం పూతపూసి ముత్యాలు పొదిగాడు. ఈ బొమ్మకు ఒక చేతిలో వేణువు ఉంటుంది. కీ ఇచ్చినప్పుడు మురళిని నోటి దగ్గరగా తీసుకుని బొమ్మ సంగీతం కూడా ఆలపిస్తుంది! మరో చేతిపైన చిన్నపక్షి బొమ్మ ఉంటుంది. ఆ పిట్ట కూడా తలా, తోకా కదిలించగలదు తెలుసా! ఇంతకీ దీని ధర ఎంతో చెప్పలేదు కదూ... 47.28 కోట్ల రూపాయలు. 


వజ్రాలు పొదిగారు!

ముద్దుగా కనిపించే అమ్మాయిల బొమ్మలు ఆడపిల్లలకు ఆల్‌టైం ఫేవరెట్‌. అందుకే ‘ఎలోయీస్‌’ డాల్‌ అంత ఫేమస్‌. దీని ధర సుమారు 37.82 కోట్లు. ఇందులో విలువైన వజ్రాలు పొదిగారు. అంతేకాదు, ఈ ఎలోయీస్‌ బాగా ఖరీదైన బ్రాండెడ్‌ యాక్సెసరీలూ, స్వరోస్కీ క్రిస్టల్స్‌తో చేసిన దుస్తులూ ధరిస్తుంది. దీని డిజైనర్‌ అలెక్సాండర్‌ ఇలాంటివి కేవలం 5 బొమ్మలు మాత్రమే తయారు చేశారు. దీంతోపాటూ ఒక బుజ్జి కుక్కపిల్ల కూడా ఉంటుందండోయ్‌. రెండూ కలిసి ఎంతో రిచ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. అందుకే అంత రేటు మరి. 


కళ్లల్లో నీలాలు!

బుజ్జిబుజ్జి టెడ్డీబేర్లంటే ఎవరికి నచ్చదు చెప్పండి! ఇందులో ఎన్ని రకాలున్నా జర్మనీకి చెందిన స్టెఫ్‌ అనే సంస్థ తయారుచేసిన ‘లూయీ వ్యూటన్‌ టెడ్డీ’ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే దీన్ని వేలం వేస్తే ఒక వ్యక్తి 15.88 కోట్ల రూపాయలకు చేజిక్కించుకున్నాడు. ఈ టెడ్డీని పూర్తిగా బంగారంతో చేయడంతోపాటూ జంతువుల వెంట్రుకలను దాని బొచ్చుగా వాడారట. దీని కళ్లలో నీలాలు, వజ్రాలు పొదిగారట. దీనికి ప్రయాణాలు చేసేటప్పుడు వేసుకునేలాంటి దుస్తులు తొడగడంతోపాటూ చేతికి ఒక బ్రీఫ్‌కేస్‌ కూడా ఇచ్చారండోయ్‌. ప్రస్తుతం ఇది సౌత్‌ కొరియాలో ఉన్న ఓ టెడ్డీబేర్‌ మ్యూజియంలో ఉంది. 


రూబిక్స్‌ క్యూబ్‌లో రాళ్లూ రత్నాలూ!

రంగులతో బుర్రకు పదునుపెట్టే రూబిక్స్‌ క్యూబ్‌ తెలియని వారుండరు. ఇందులో అత్యంత ఖరీదైనదే ఈ ‘మాస్టర్‌పీస్‌ రూబిక్స్‌ క్యూబ్‌’. మామూలు వాటిల్లో రంగుల బాక్సులే వాడతారు. కానీ దీంట్లో వాటికి బదులు రత్నాలు వాడేశారు! అంటే ఒకవైపు కెంపులు, మరోవైపు వజ్రాలు, ఇంకోవైపు నీలాలు... ఇలా విలువైన రాళ్లన్నీ కలిపి తయారుచేసిన క్యూబ్‌ అన్నమాట. ‘ఫ్రెడ్‌ క్యుల్లెర్‌’ అనే డైమండ్‌ నిపుణుడు రూబిక్స్‌ క్యూబ్‌ వార్షికోత్సవం సందర్భంగా దీన్ని తయారుచేశాడు. దీని ధర 11.34 కోట్లు. రూబిక్స్‌లో అత్యంత ఖరీదైనది ఇదే.


బంగారు గుర్రం!

చెక్క గుర్రంపై చల్‌చల్‌ అంటూ స్వారీ చేయడం ఎంతో బాగుంటుంది. కానీ ఆ గుర్రం మొత్తం బంగారంతో చేసినదైతే? జపాన్‌కు చెందిన ఓ సంస్థ... ఆ దేశపు రాకుమారుడు ‘హిషహితో’ జన్మించిన సందర్భానికి గుర్తుగా దీన్ని తయారుచేసింది. ఇందుకోసం 26 కేజీల బంగారం వాడిందట! దీని ధర 45.75 కోట్లు. ఈ గుర్రాన్ని హాలీవుడ్‌ సెలెబ్రిటీలు జేయ్‌-జడ్‌, బియాన్స్‌ తమ కూతురి కోసం కొనుగోలు చేశారు.


బార్బీకి డైమండ్‌ నెక్లెస్‌!

బార్బీ డాల్‌ చూడచక్కగా ఉంటుంది. అదే ‘స్టెఫానో సాంటరీ బార్బీ’ (దీన్నే డైమండ్‌ బార్బీ అని కూడా అంటారు) అయితే ఇంకా బావుంటుంది. నల్లని దుస్తులు ధరించే ఈ బార్బీ మెడలో ఉన్న డైమండ్‌ చోకర్‌ కారణంగానే దీనికి బోలెడు డిమాండ్‌. ఆ నెక్లెస్‌లో ఒక గులాబీరంగు పెద్ద వజ్రం, తెల్లని చిన్నచిన్న వజ్రాలు ఉన్నాయి. ఈ బొమ్మను వేలం వేస్తే 2.28 కోట్ల రూపాయలకు ఒక జంట తమ పాప కోసం సొంతం చేసుకుంది.


అదండీ వీటి ధరల కథాకమామీషు... ఆటలాడుకునే బొమ్మల కోసం కోట్ల రూపాయలు పెడుతున్నారంటే ఆశ్చర్యంగా లేదూ!!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు