close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ కుటుంబానికి... ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌!

 

మనమంతా రోజూ ‘ఇవాళ ఏం వండుదాం, ఏం తిందాం!’ అన్నదానిపైనే పదిసార్లు ఆలోచిస్తాం కదా! కానీ ఆ ఇంట్లో ఈరోజూ, రేపటికే కాదు ఏడాదంతా ఏమేం వండుతారో కూడా ముందుగానే రాసిపెట్టుకుంటారు. ఇంటికో పేరు ఉండటం మనకు తెలిసిందే... కానీ ఆ ఇంట్లో గదిగదికీ ఓ పేరూ, ప్రతి వస్తువుకీ ఓ లేబులూ ఉంటుంది. ఇంత ప్రణాళికాబద్ధంగా ఉంటున్నారు కాబట్టే ఆ కుటుంబం కంపెనీలకిచ్చే ‘ఐఎస్‌ఓ’ సర్టిఫికెట్‌ని గత పదహారేళ్లుగా సాధిస్తోంది! చెన్నైలో ఉంటున్న సురానా కుటుంబం విశేషాలివి...

‘నాకన్నీ పక్కాగా జరగాలి... చిన్న తేడా వచ్చినా సహించను’ అంటుంటారు కొందరు. ఎంత కఠోర క్రమశిక్షణ ఉన్నవారికైనా ఈ తీరు ఆఫీసులో కొంతవరకూ చెల్లుతుంది కానీ ఇంట్లో చెల్లదు. ఏ ఒక్కరో, ఇద్దరో అలా పద్ధతిగా ఉన్నా ఇంటిల్లిపాదీ అలా ఉండటం అసాధ్యం. ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపుతోంది కాబట్టే ఏటా ‘ఐఎస్‌ఓ 9000’ సర్టిఫికెట్‌ అందుకుంటోంది సురానా కుటుంబం. మనదేశంలో ఆ ఘనత సాధించిన కుటుంబం ఇదొక్కటే. ఓ వస్తువు నాణ్యతని తెలుసుకోవడానికి అగ్‌మార్క్‌, ఐఎస్‌ఐ ముద్రల్లాంటివి ఉన్నట్టే... కంపెనీ నిర్వహణలో పాటించే ప్రమాణాలని చాటడానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్లిస్తారు. జెనీవాలోని ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ స్టాండర్డైజేషన్‌(ఐఎస్‌ఓ) వీటిని అందిస్తుంది. ఆ సర్టిఫికెట్‌ని ఓ కుటుంబం తనదైన ప్రణాళికాబద్ధ జీవనంతో సాధించడమే విశేషం!

అన్నింట్లో పక్కాగా...
న్యాయవాది పీఎస్‌ సురానా ఈ కుటుంబ పెద్ద. రాజస్థాన్‌కి చెందిన ఆయన 1987లో చెన్నైలో సురానా అండ్‌ సురానా పేరుతో న్యాయసంస్థని ఏర్పాటుచేశారు. ఆ సంస్థ ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా పనిచేస్తుండటంతో 1999లో ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ అందుకుంది. దేశంలో ఆ సర్టిఫికెట్‌ అందుకున్న తొలి న్యాయసంస్థ ఇదే! పీఎస్‌ సురానా భార్య లీల, వాళ్లబ్బాయి వినోద్‌, కోడలు రేష్మి అందరూ న్యాయవాదులే కాబట్టి అందరూ ఈ సంస్థలోనే పనిచేసేవారు. 2002-03 మధ్య వినోద్‌, రేష్మిలకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ‘కొత్తతరం వచ్చింది. వాళ్లకి మంచి ఆరోగ్యాన్నీ, క్రమశిక్షణనీ అందించాలంటే ఆఫీసులాగానే ఇంటినీ ప్రణాళికాబద్ధంగా నడపాలి..!’ అనుకున్నారందరూ. ఆ పద్ధతులకి ఐఎస్‌ఓ సర్టిఫికెట్టూ అందుకోవాలని భావించారు. అందుకోసం 2003లో ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ ఆడిటర్స్‌ని కలిశారు. ‘ఓ కుటుంబానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ ఎలా ఇవ్వాలబ్బా!’ అని తలలుపట్టుకున్నారట వాళ్లు. కానీ కుటుంబాన్ని ఓ కంపెనీ తరహాలో నిర్వహిస్తున్న తీరుని చూసి ఆశ్చర్యపోయి వాళ్లే 2004లో తొలిసారి ఈ సర్టిఫికెట్‌ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి ఆరునెలలకోసారి ఆడిట్‌ చేస్తూ ఆ సర్టిఫికెట్‌ ఇస్తూనే ఉన్నారు!

ఓ కంపెనీలాగే...!
ఓ సంస్థలాగే ఈ కుటుంబానికి పీఎస్‌ సురానా ఛైర్మన్‌(హౌస్‌హోల్డ్‌ హెడ్‌)గా ఉంటారు. ఆయన భార్య లీల ఓ మేనేజింగ్‌ డైరెక్టర్‌లా అన్ని వ్యవస్థలూ చక్కగా నడుస్తున్నాయా లేదా అని చూస్తారు. వీరి కోడలు రేష్మి... సీఈఓలా వ్యవహరిస్తారు! ఇక, ఆమె భర్త వినోద్‌ సురానా, ఇద్దరు పిల్లలు కీర్తి, దేవ్‌కార్తిక్‌లు వినియోగదారులు! అంటే... ఈ కుటుంబం అందించే ఆరోగ్యం, ఆహారం, మనశ్శాంతులనే సేవల్ని పొందేవారు. ఏ రోజు ఏం వంట చేయాలో ఏడాది ముందే రాసిపెట్టుకుంటారు... కచ్చితంగా అలానే వండుతారు, తింటారు. అందులోనూ-రసాయనాలూ, ప్రిజర్వేటివ్స్‌ లేనివి మాత్రమే వాడతారు. ఇంటికి కావాల్సిన వస్తువుల్ని ఏడాది, ఆరునెలలు, మూడునెలలు, నెల, వారం, రోజుమార్చి రోజు... తెచ్చుకునేవి అంటూ విభజించి ఆ రకంగానే షాపింగ్‌ చేస్తారు. ఐఎస్‌ఓ ప్రమాణాల ప్రకారం ఇంట్లోని ప్రతి వస్తువుమీదా పేరూ, దానికి సంబంధించిన బొమ్మా ఉంటుంది! అంతేకాదు-గెస్ట్‌ రూమ్‌కి ‘అతిథి’ అనీ, వంటగదికి ‘అన్నలక్ష్మీ’ అనీ, పడగ్గదులకి ‘ఆంచల్‌’, ‘వైభవ్‌’లనీ, భోజనం చేసే స్థలానికి తృప్తి అనీ పేర్లు పెట్టారు. ఇంటిపేరేమో సుధర్మ! పర్యావరణ నిబంధనల ప్రకారం ఉదయం వేళ లైట్లేవీ అక్కర్లేని విధంగానే తమ ఇంటినీ, పక్కనే ఉన్న ఆఫీసునీ తీర్చిదిద్దుకున్నారు. నెలకోసారి జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించుకుని మార్పుచేర్పులపైన చర్చిస్తారు. ఆరోగ్యం, ఆహారం, మనశ్శాంతి మిగులుతుందని చెప్పుకుంటే సరా... ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ అందివ్వాలంటే వాటికి గణాంకాలంటూ ఉండాలి కదా! తమ పద్ధతుల వల్ల విద్యుత్తు బిల్లు, వైద్య బిల్లు బాగా తగ్గిందని చెబుతున్నారు ఈ కుటుంబం ‘ఎండీ’ లీలా సురానా ఆనందంగా. ‘‘ఇవాళ ఏం వంట చేయాలి’ అని ఏడాదిలో మనం 160 గంటలపాటు ఆలోచిస్తామట. మాకు ఆ బాధ ఎప్పుడూ లేదు’ అంటారు ‘సీఈఓ’ రేష్మి సంతృప్తిగా!

నిర్మలా సీతారామన్‌ కూడా వచ్చారు...
ఆ ఇంటికి ఎవరు వెళ్లినా వాళ్ల ఆతిథ్యం గురించి ‘ఫీడ్‌ బ్యాక్‌’ రాయాల్సిందే. ఈ ఇంటి గురించి విన్న వీఐపీలూ అప్పుడప్పుడూ సందర్శిస్తుంటారు. ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వీరి ఇంటిని సందర్శించి అభినందించారు. ఇలా ఫీడ్‌ బ్యాక్‌ రాసినవారిలో మాజీ ఎంపీ జయప్రద, టీఎన్‌ శేషన్‌ వంటివాళ్లూ ఉన్నారు!


కౌజు గుడ్డుకి భలే క్రేజు!

గుడ్డు అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది కోడిగుడ్డే. కానీ ఈమధ్య మార్కెట్లో కోడిగుడ్లతోబాటు మరో రకం గుడ్లూ కనిపిస్తున్నాయి. అవే కౌజు పిట్ట (క్వెయిల్‌)గుడ్లు. కోడిగుడ్డులో నాలుగో వంతు కూడా ఉండని ఈ గుడ్లు మెల్లమెల్లగా వంటింట్లోకి వచ్చేస్తున్నాయి. ఎందుకో ఏమిటో కాస్త చూద్దాం...

 కౌజు పిట్ట... ఈ పేరు విన్నట్లనిపిస్తోంది కదూ. అడవుల్లో కనిపించే ఈ పిట్టల్ని వేటాడి తీసుకొచ్చి ఊళ్లల్లో అమ్ముతుంటారు. వీటి మాంసం రుచిగా ఉంటుందని చాలామంది తింటుంటారు. అయితే ఇప్పుడు ఆ పిట్టల్నే కాదు, వాటి గుడ్లనీ తింటున్నారు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లు ఈ పిట్టలూ అవి పెట్టే గుడ్లూ రెండూ చిన్నగానే ఉంటాయి. కానీ ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే కోళ్లలానే ఈ పిట్టల్నీ ఫామ్స్‌లో పెంచేస్తున్నారు. పైగా కోళ్లకన్నా లాభదాయకం కూడా. స్వల్ప పెట్టుబడి, తక్కువ శ్రమ, కొంచెం స్థలం ఉంటే చాలు, అధిక ఆదాయం పొందవచ్చు. వ్యాధుల్ని తట్టుకునే శక్తీ వీటికి ఎక్కువే. తిండి ఖర్చూ ఉండదు. కోడి రోజుకి 150 గ్రా. మేత తింటే, ఈ పిట్టకి 20 గ్రా. చాలు. పైగా ఏడాదిలో సుమారు 300 గుడ్లు పెడుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వీటి పెంపకం పెరుగుతోంది. మిగిలిన దేశాలతో పోలిస్తే ఆగ్నేయాసియా దేశాల్లోనూ ముఖ్యంగా జపాన్‌లో ఈ పిట్ట గుడ్ల వాడకం మరీ ఎక్కువ. పదకొండో శతాబ్దంలో జపాన్‌ చక్రవర్తికి ఈ పిట్ట మాంసం తినడం వల్లే టీబీ తగ్గిందట. అప్పటినుంచీ అక్కడ ఈ పిట్టల్ని పెంచుతున్నారట. అందుకే వాళ్ల లంచ్‌ బాక్సుల్లో నాలుగైదు క్వెయిల్‌ గుడ్లు తప్పక కనిపిస్తాయి.

ఎందుకు తింటున్నారు?
ఇతర గుడ్లతో పోలిస్తే వీటిల్లో పోషకాలు 30 శాతం ఎక్కువట. వంద గ్రా. కౌజు గుడ్ల నుంచి 158 క్యాలరీలూ, 74 గ్రా. నీరూ, 13 గ్రా. ప్రొటీనూ, 11 గ్రా. కొవ్వులూ లభిస్తాయి. కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌, ఫోలేట్‌, విటమిన్‌-బి12, విటమిన్‌-ఎ, ఇ వంటివన్నీ వీటిల్లో దొరుకుతాయి. విటమిన్‌- బి1 కోడిగుడ్లలో కన్నా ఆరు శాతం ఎక్కువ ఉంటే, బి12 పదిహేను శాతం ఎక్కువ. అయితే మీడియం సైజు కోడిగుడ్డు బరువు యాభై గ్రాములయితే, కౌజు గుడ్డు బరువు పది గ్రాములలోపే. దాన్నుంచి వచ్చే క్యాలరీలూ 14 మాత్రమే. అందుకే వీటిని నాలుగైదు తింటుంటారు. కోడిగుడ్డు అలర్జీ ఉన్నవాళ్లకి ఇవి మంచి ప్రత్యామ్నాయం.
రోజూ ఈ గుడ్లను తినేవాళ్లలో పొట్ట అల్సర్లూ రావట. ఇందులోని విటమిన్‌-బి జీవక్రియా వేగాన్ని పెంచుతుంది. మెదడు, నరాల పనితీరు మెరుగవడమే కాదు, తెలివితేటలూ జ్ఞాపకశక్తీ పెరుగుతాయి. రక్తహీనత ఉన్నవాళ్లకీ మంచిదే. ఇందులోని ఐరన్‌, పొటాషియం వల్ల హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. తద్వారా శ్వాసకోశ వ్యాధులన్నీ తగ్గుముఖం పడతాయట. అందుకే సంప్రదాయ చికిత్సలో భాగంగా టీబీ, ఆస్తమా, మధుమేహం, హృద్రోగ సమస్యలు ఉన్నవాళ్లకి ఈ గుడ్లను పెట్టమంటారు చైనీయులు. లైంగిక సమస్యలతో బాధపడేవాళ్లకి ఈ పిట్ట మాంసం, గుడ్లూ మంచి మందు అని పరిశోధనల్లోనూ స్పష్టమైంది. ప్రధానంగా పురుషుల్లో ప్రొస్టేట్‌ గ్రంథి పనితీరు మెరుగవుతుందట.

అలర్జీలూ, మంటతో బాధపడేవాళ్లకి క్వెయిల్‌ గుడ్లలో ఒవొమ్యుకాయిడ్‌ అనే ప్రొటీన్‌ సహజ యాంటీ అలర్జిటిక్‌గా పనిచేస్తుంది. ఇతరత్రా అమైనో ఆమ్లాలు - ప్రత్యేకంగా లినోలీట్‌ ఆమ్లం జుట్టు పెరిగేందుకు తోడ్పడుతుందట. ఈ గుడ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు యాంటీఏజింగ్‌ ఏజెంట్లలానూ పనిచేస్తాయన్న కారణంతో వృద్ధాప్య ఛాయల్ని అడ్డుకునేందుకు ఖరీదైన కాస్మొటిక్స్‌కన్నా ఈ గుడ్లు ఎంతో మేలు అంటున్నారు నిపుణులు. మూత్రపిండాలు, కాలేయం, పిత్తాశయాల్లోని రాళ్లనీ నివారిస్తాయట. ముఖ్యంగా కిడ్నీలు దెబ్బతిన్నవాళ్లకి శక్తిమంతమైన ప్రొటీన్‌ని అందించడంతోబాటు రక్తంలోని హానికర పదార్థాలను తొలగించేందుకూ ఈ గుడ్లు సాయపడతాయి.
తలనొప్పి, డిప్రెషన్‌, ఒత్తిడితో ఉండేవాళ్లకీ ఈ గుడ్లే ఉత్తమ ఔషధం. ఇందులోని హార్మోన్‌-పి మెనోపాజ్‌ సమయంలో తలెత్తే డిప్రెషన్‌కి మంచి మందు. ఈ గుడ్లలోని సెలీనియం, విటమిన్‌-ఎలు సహజ యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తూ క్యాన్సర్‌ రోగులకి మేలు చేస్తాయి. అంతేకాదు, హార్మోన్ల అసమతౌల్యం, గుండెజబ్బులు, హైబీపీ, ఆర్థ్రయిటిస్‌, క్యాన్సర్‌, జీర్ణ సంబంధిత సమస్యలన్నింటితో పోరాడే గుణం ఈ గుడ్లకు ఉంది. అందుకే అంటున్నారంతా... ఇవి గుడ్లు కాదు, రోగనిరోధకశక్తిని పెంచే మందులు అని.


చుట్టూ వర్షం... కాని మీరు తడవరు!

‘వర్షంలో నిల్చోవాలి కానీ తడవకూడదు’ అని ఎవరికైనా చెప్పారనుకోండి... ‘నీకేమైనా మతిపోయిందా’ అనేస్తారు వెంటనే. అయితే అవతలివాళ్లకు అలా అనే అవకాశం ఇవ్వకుండానే మీ కోరిక నెరవేరాలంటే ఓసారి రెయిన్‌రూమ్‌లోకి వెళ్లొస్తే సరి. అవును అందులోకి అడుగుపెడితే మీ చుట్టూ వర్షం పడుతుంది కానీ మీపైన మాత్రం ఒక్క బొట్టు కూడా పడదు. అదే ఆ గది ప్రత్యేకత మరి. వాన పడుతున్నా తడవకుండా ఉండటం ఎలా సాధ్యమంటే... ఈ గదిపైన త్రీడీ ట్రాకింగ్‌ కెమెరాలూ సెన్సార్లూ అమర్చి ఉంటాయి. మనం ఎక్కడున్నామనేది ఆ కెమెరాలూ, సెన్సార్లూ గుర్తిస్తాయి. దాంతో మన అడుగులకు తగినట్లుగా వర్షం కూడా మన ముందో లేదా పక్కనో పడుతుంది తప్ప మనపైన కాదు. అలా ఏ మాత్రం తడవకుండానే వర్షాన్ని హాయిగా ఆనందించొచ్చన్నమాట. ఈ గదుల్లో వెలుతురు కాస్త తక్కువగానే ఉన్నా... ఫొటోలు తీసుకోవచ్చు. వీటిని రాండమ్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ఇలాంటి రెయిన్‌రూమ్‌లు న్యూయార్క్‌, లండన్‌, షార్జా... వంటిచోట్ల ఉన్నాయి. ఈ గదులను సాధారణంగా మ్యూజియంల వంటి వాటిలోనే ఏర్పాటు చేస్తారు కాబట్టి టిక్కెట్టు కొనుక్కుని వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఎంతసేపు ఉండాలనేదీ నిర్వాహకులే చెబుతారు. ఒకేసారి ఎనిమిది నుంచి పదిమంది వరకూ లోపలికి వెళ్లేలా ఈ గదుల్ని నిర్మిస్తారు. ఇలాంటివి ఏర్పాటు చేయడం ఒకవిధంగా సవాలే అయినా... ఈ కాన్సెప్ట్‌ విజయవంతమైందని చెబుతుంది రాండమ్‌ సంస్థ. ఏదేమైనా ఇలాంటి రెయిన్‌ రూమ్‌ మనకు అందుబాటులో ఉంటే... ఎంత బాగుంటుంది కదూ!


 


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు