close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అతని పడవకి ప్రపంచ గుర్తింపు!

కేరళ అనగానే కొబ్బరి చెట్ల అందాలే కాదు... అక్కడి కాలువ ప్రయాణాలూ కళ్లముందు నిలుస్తాయి. కాలువలపైన మెల్లగా జారుతున్నట్టు వెళ్లే పడవల్ని చూస్తూ పెరిగాడు శాండిత్‌. చూస్తుండగానే సంప్రదాయ పడవల స్థానాన్ని డీజిల్‌ బోట్లు ఆక్రమించడం, అవి వెదజల్లే కాలుష్యంతో తమ గ్రామాలన్నీ దెబ్బతినడం గమనించాడు. అందుకే దేశంలోనే తొలి సౌరవిద్యుత్తు పడవ ‘ఆదిత్య’ని రూపొందించాడు. ఈ పడవ ఇటీవల ‘గుస్టావ్‌ ట్రూవే’ ప్రపంచ అవార్డుకి నామినేట్‌ అయింది. ఆసియా నుంచి ఒక్క ‘ఆదిత్య’కి మాత్రమే ఈ గౌరవం దక్కింది!

శాండిత్‌ ఏదో అత్యుత్సాహంతోనో, ఆషామాషీగానో ‘ఆదిత్య’ని డిజైన్‌ చేయలేదు. ఇందుకోసమే ఐఐటీ-మద్రాసులో నేవల్‌ ఆర్కిటెక్చర్‌లో బీటెక్‌ చదివాడు. కొంతకాలం వివిధ ఓడల నిర్మాణాల కంపెనీల కోసం గుజరాత్‌లోనూ, దక్షిణ కొరియాలోనూ పనిచేశాడు. ఆ తర్వాత పర్యావరణహిత పడవల తయారీయే లక్ష్యంగా, ఆల్ట్‌.ఈవెన్‌ అనే ఫ్రెంచి సంస్థతో కలిసి నావాల్ట్‌ అనే సంస్థని ప్రారంభించాడు. దాని ద్వారా కేరళ కుమరకోమ్‌లోని ఓ ప్రయివేటు పర్యటక సంస్థ కోసం పదిమంది ప్రయాణించే చిన్న పడవని చేస్తే... దేశంలోనే అత్యంత వేగంతో ప్రయాణించే సౌర విద్యుత్తు పడవగా అది ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో నమోదైంది. ఆ తర్వాతే కేరళ ప్రభుత్వం కోసం ‘ఆదిత్య’ని తయారుచేసే అవకాశం శాండిత్‌ తలుపుతట్టింది.

ఎవరూ నమ్మలేదు...
మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీలాగే... కేరళలో జలమార్గాల రవాణా కోసం కేరళ స్టేట్‌ వాటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌(కేఎస్‌డబ్ల్యూటీడీ) ఉంది. కేరళ పశ్చిమ ప్రాంతంలో ఉన్న కాలువల రవాణా మొత్తాన్ని అదే చూస్తుంది. ముఖ్యంగా కోట్టయం-ఆలప్పుళ జిల్లాల మధ్య ఉండే వైక్కం-తిరువానాక్కడవు మార్గం వాళ్లకి చాలా కీలకం. పర్యటకంగా అతికీలకమైన వీటి మధ్య ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా డీజిల్‌ లాంచీలూ, పడవలూ నడుపుతున్నా అవి అంత లాభదాయకంగా ఉండట్లేదు. వాటికి ప్రతిరోజూ పదివేల రూపాయల వంతున ఖర్చవుతుంటే... ఆదాయం మాత్రం ఆరువేల రూపాయలే వచ్చేది. దానికితోడు, వాటివల్ల జల, వాయు, శబ్ద కాలుష్యాలు తీవ్రంగా ఉంటున్నాయనే వ్యతిరేకతా రావడం మొదలైంది. ఈ సమస్యల నుంచి బయట పడాలనే కేరళ ప్రభుత్వం ఓ పోటీ పెట్టింది. 75 మంది ప్రయాణికుల్ని తీసుకువెళ్లే సౌర విద్యుత్తు పడవని తయారుచేయాలంటూ దేశంలోని ఓడల తయారీ సంస్థలకి సవాలు విసిరింది. ఆ పోటీలో శాండిత్‌ కంపెనీకే కాంట్రాక్టు దక్కింది. కానీ దీనిపైన ‘75 మంది ప్రయాణికులతో సౌర పడవలు నడపడం అసాధ్యం...’ అంటూ కొన్ని విశ్వవిద్యాలయాలూ అభ్యంతరం వ్యక్తంచేశాయి. కొందరైతే అసలు ఈ ప్రాజెక్టులోనే ఏదో ‘మతలబు’ ఉందంటూ కేరళ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం కూడా వేశారు. ‘నిజానికి వాళ్లందరూ అదివరకే ఉన్న పడవలకి సోలార్‌ ప్యానల్స్‌ బిగిస్తాననే అనుకున్నారు. అలా చేస్తే 75 మందిని మోసుకెళ్లగల సౌరవిద్యుత్తు పడవ నడపడం అసాధ్యమే. కానీ నా ఆలోచన పూర్తిగా వేరు. నేను ప్రధానంగా పడవ బరువుని తగ్గించడంపైన దృష్టిపెట్టాను. ఫైబర్‌గ్లాస్‌ పరికరాలతో సరికొత్త డిజైన్‌తో కూడిన తేలికపాటి పడవని రూపొందించాను. దాంతో పడవ నడవడానికి కావాల్సిన ఇంధనం అవసరం తగ్గిపోయింది. ప్రయాణికుల భద్రతతో పాటు వేగం కూడా పెరిగింది...’ అని చెబుతాడు శాండిత్‌.
ఏమైతేనేం, దేశంలోనే అతిపెద్ద సౌర విద్యుత్తు పడవ ‘ఆదిత్య’ అలా మూడేళ్ల కిందట తన సేవలు ప్రారంభించింది. ఇందులో 150 మంది కూడా సులభంగా ప్రయాణించగలుగుతున్నారు! ఎప్పటికప్పుడు బ్యాటరీ బ్యాకప్‌ చేసుకునే అవకాశం కూడా ఉండటంతో సూర్యుడి వెలుగు తగ్గినా, రాత్రయినా సరే ఈ పడవని నడిపించొచ్చు. సంప్రదాయ పడవల్లో ఇంధన ఖర్చు మాత్రమే ఎనిమిదివేలుంటే ఇందులో రూ.180 మాత్రమే అవుతోంది. ఆ రకంగా ఆదిత్య వల్ల తమకి లక్ష లీటర్ల డీజిల్‌ ఆదా అయిందనీ దాని వల్ల రూ.75 లక్షల రూపాయల ఖర్చు మిగిలిందనీ ప్రకటించింది కేరళ ప్రభుత్వం! ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ‘గుస్తావ్‌ త్రూవే’ అవార్డు పోటీల కమిటీ దీన్ని ఎంపికచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 12 పడవలని ఇందుకు ఎంపికచేస్తే ఆసియా నుంచి ‘ఆదిత్య’కు మాత్రమే ఇందులో స్థానం దక్కింది! అన్నట్టు... శాండిత్‌ పూర్తి సౌరవిద్యుత్తుతో నడిచే అతిపెద్ద కార్గో ఓడనీ, విలాసాల క్రూయిజ్‌ ఓడనీ తయారుచేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు ప్రయత్నాలూ సఫలమైతే ప్రపంచం మొత్తం మనదేశ ఓడనిర్మాణ రంగంవైపు కళ్లింతలు చేసుకుని చూడక తప్పదంటున్నాడు శాండిత్‌. అతనికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుదామా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు