close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ ట్రే వేడిగా ఉంచుతుంది!

చాలా పదార్థాలు వేడిగా ఉంటేనే తినడానికి బాగుంటాయి. కానీ వండిన వెంటనే తినేయడం ప్రతిసారీ సాధ్యం కాదు. ఈ ‘సాల్టన్‌ కార్డ్‌లెస్‌ వార్మింగ్‌ ట్రే’ ఉంటే ఆ సమస్యే ఉండదు.రీఛార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ ట్రేని ఎనిమిది నిమిషాలు ఛార్జ్‌ చేస్తే చాలు. దానిమీద పెట్టిన గిన్నెల్నీ అందులోని పదార్థాల్నీ గంటపాటు వేడిగా ఉంచుతుంది. రోజువారీ తినే భోజనం, టిఫిన్‌, కాఫీ టీలతో సహా అన్నిటినీ ఈ ట్రేలో పెట్టి డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టుకోవచ్చు. అతిథులు వచ్చినపుడు పాయసం, సూప్‌లాంటి వాటినీ ఈ ట్రేతో నేరుగా తీసుకెళ్లి వారి ఎదురుగా పెట్టొచ్చు.


కాఫీ టేబుల్లోనే ఫ్రిజ్‌!

ఉదయం కాఫీ తాగుతూ పేపర్‌ చదవడం దగ్గర్నుంచి టీవీ చూడాలన్నా, కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్నా కాఫీ టేబుల్‌ ఎదురుగా ఉన్న సోఫాలో వాలిపోతాం. అంటే రోజులో ఎక్కువ సమయం గడిపేది కాఫీ టేబుల్‌ దగ్గరే అన్నమాట. అలాంటపుడు మంచినీళ్లు, జ్యూస్‌లాంటివి తాగాలన్నా ఏదైనా తినాలన్నా మాటిమాటికీ వంటగదిలోని ఫ్రిజ్‌ దగ్గరికి వెళ్లే పనిలేకుండా కాఫీ టేబుల్‌లోనే ఫ్రిజ్‌ ఉంటే బాగుంటుంది కదూ... ఈ ఆలోచనతో వచ్చిందే ‘కూస్నో స్మార్ట్‌ కాఫీ టేబుల్‌’. దీని కింది భాగంలో ఉండే ఫ్రిజ్‌ మనం నోటితో ‘ఓపెన్‌’ అని చెప్పగానే దానంతటదే ఫొటోలో చూపినట్లూ తెరుచుకుంటుంది. ఈరోజుల్లో ఫ్రిజ్‌లో పెట్టుకునేవి బోలెడు ఉంటున్నాయి. కాబట్టి, ఒక్క ఫ్రిజ్‌ సరిపోవడం లేదనుకునేవారికి ఇది రెండో ఫ్రిజ్‌గానూ పనికొస్తుంది. ఇక, ఈ టేబుల్‌ పైభాగంలో మన ఫోన్‌ పెడితే దానంతటదే ఛార్జ్‌ అయిపోతుంది. ఇతర గ్యాడ్జెట్లకు ఛార్జింగ్‌ పెట్టేందుకైతే టేబుల్‌ పక్కగా ప్లగ్‌లుంటాయి. అన్నట్లూ కూస్నో టేబుల్‌ పైవైపునా కిందా రంగురంగుల ఎల్‌ఈడీలుంటాయి. వీటిని బెడ్‌లైట్‌గానూ ఉపయోగించుకోవచ్చు. మన ఫోన్‌లో వినిపించే మ్యూజిక్‌కి తగ్గట్లు కూడా లైట్లను వెలిగించుకోవచ్చు. స్మార్ట్‌ టేబుల్‌ అంటే స్మార్టే మరి!


తొడిగే దుప్పట్లు!

నెలల పిల్లలు మధ్య రాత్రిలో ఎప్పుడు లేస్తారో తెలియదు. అలా లేచినపుడు కాళ్లు ఆడిస్తూ మీద కప్పిన దుప్పటిని పక్కకు తోసేస్తుంటారు. దాంతో చలి పుడుతుంది. కాళ్లు పైకెత్తినపుడు ఒక్కోసారి ఆ దుప్పటి ముఖం మీద పడితే ఊపిరి ఆడదు కూడా. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చినవే ఈ ‘లల్లబీ శాక్‌ వేరబుల్‌ బ్లాంకెట్స్‌’. గౌనులా ఉండే ఈ దుప్పట్లను పిల్లలకు తొడిగేస్తే వాళ్లు ఎటు కదిలినా పక్కకు జరిగి పోవు. ఇక, వీటిలో వ్యోమగామి, ప్రిన్సెస్‌, మత్స్యకన్య... లాంటి రకరకాల ప్రింట్లతో వచ్చే దుప్పట్లు వేస్తే పిల్లలు చూడ్డానికీ ముచ్చటగా ఉంటారు. మీకూ నచ్చాయా..?


ప్లగ్‌ తడవకుండా...

గీజర్‌, హీటర్‌... లాంటి వాటికోసం బాత్‌రూమ్‌లోనూ ప్లగ్‌బోర్డులుంటాయి. కాకపోతే షవర్‌తో స్నానం చేసేటపుడు వాటిమీద నీళ్లు పడుతుంటాయి. ఇంటి బయట గోడలకూ లైట్‌ స్విచ్‌లుంటాయి. వర్షం వచ్చినపుడు అవీ తడుస్తుంటాయి. అలాంటపుడు మనం చూసుకోకుండా స్విచ్‌ వెయ్యడానికి వెళ్తే షాక్‌ కొట్టే ప్రమాదం ఉంటుంది. దీనికి పరిష్కారంగా వచ్చినవే ఈ ‘వాటర్‌ప్రూఫ్‌ వాల్‌ సాకెట్‌ కవర్లు’. పారదర్శక ఫైబర్‌ గ్లాస్‌ బాక్సుల్లా ఉండే ఇవి ఆన్‌లైన్‌లో వేరు వేరు సైజుల్లో దొరుకుతున్నాయి. మనక్కావల్సినవి తెప్పించుకుని సులభంగా ప్లగ్‌బోర్డుకి అమర్చేసుకోవచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు