close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మండపంలో కొలువైన మల్లికార్జునుడు!

పేరుకు అది ఆలయమైనా... అక్కడ ఎలాంటి గోపురం కానీ గర్భాలయం కానీ కనిపించవు. కేవలం పన్నెండు అడుగుల ఎత్తులో రాతి శివలింగం మాత్రమే ఉంటుంది. పశ్చిమ ముఖంగా వెలసి ఎండల మల్లికార్జునుడిగా కొలిచే ఆ శివలింగాన్ని దర్శించుకోవాలంటే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి వెళ్లాలి.

మండపం కింద అష్టభుజి ఆకారంలో దర్శనమిస్తాడు ఎండల మల్లికార్జునుడు. ఇక్కడే కాదు, చుట్టుపక్కల ఎలాంటి ఉపాలయాలూ లేకుండా కేవలం పన్నెండు అడుగుల ఎత్తులో ఉండే ఈ శివలింగాన్ని కొలిచేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావడం విశేషం. ఈ శివలింగానికి ఎండల మల్లికార్జునుడు అనే పేరు రావడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

స్థలపురాణం...
త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం రాముడు సీతతో పాటు తన పరివారంతో అయోధ్యకు బయలుదేరతాడు. మార్గమధ్యంలో తూర్పు సముద్ర తీరాన సుమంచ పర్వత ప్రదేశంగా పిలిచే ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో వానర జాతి వైద్యుడైన సుసేనుడు అక్కడున్న ఔషధ మొక్కలూ, వృక్షజాతులను గమనిస్తాడు. అన్నిరకాల ఔషధ మొక్కలున్నా స్థానికులు అనేక రోగాలతో బాధ పడటం చూసి రాముడి అనుమతి తీసుకుని అక్కడే ఉండిపోయి శివుడి కోసం తపస్సు చేస్తాడు. అయితే రాముడి పట్టాభిషేకం పూర్తయి చాలాకాలమైనా సుసేనుడు రాజ్యానికి తిరిగి రాకపోవడంతో ఆంజనేయుడు ఆ వైద్యుడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాడు. అప్పటికే సుసేనుడు ధ్యాన సమాధి స్థితిలోకి చేరు కోవడంతో హనుమంతుడు ఓ గుంతను తవ్వి అందులో సుసేనుడి శరీరాన్ని ఉంచి, ఆనవాలుగా అక్కడో జింక చర్మాన్ని కప్పి అయోధ్యకు వెళ్లిపోతాడు. హనుమంతుడి ద్వారా విషయం తెలుసుకున్న సీతారాములు అక్కడకు వెళ్లి చూస్తే సుసేనుడి కళేబరం పైన మల్లెపూలతో కప్పిన ఓ శివలింగం కనిపిస్తుంది. జింక చర్మం, మల్లెపూలతో కప్పి ఉంచిన చోట శివలింగం ఉద్భవించింది కాబట్టి రాముడు ఆ లింగానికి మల్లికాజినుడని పేరు పెడతాడు. (సంస్కృతంలో అజినం అంటే చర్మం అని అర్థం). తరువాత రాముడు అక్కడ ఆలయం నిర్మించాలని పూజ చేసేందుకు ప్రయత్నిస్తే ఆ లింగం పెరుగుతూ ఉంటుంది. దాంతో తన నిర్ణయాన్ని విరమించుకుని అయోధ్యకు వెళ్లిపోతాడు. మళ్లీ ద్వాపర యుగంలో దేశ సంచారం చేస్తూ అర్జునుడు అక్కడికి వచ్చినప్పుడు ఆ మహా శివలింగాన్ని పూజించి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవడంతో తన పేరుతోనే పూజలందుకోమని అర్జునుడు కోరతాడు. అప్పటినుంచీ స్వామిని మల్లికార్జునుడని పిలుస్తున్నారు. క్రీ.శ. 1824లో అప్పటి రాజు హరిచందన బృందావన జగద్దేవ స్వామికి గర్భాలయం కట్టాలనుకుంటాడు. కానీ ఏ రోజు కట్టిన గోడలు ఆ రోజే కూలిపోతుండటంతో ఆ భక్తుడికి ఏం చేయాలో తోచదు. చివరకు ఓ రోజు స్వామి కలలో కనిపించి సుసేనుడి శరీరం నుంచి తాను ఉద్భవించాననీ తన మీదనుంచీ వచ్చే గాలి తగిలే ఆ ఊరివారంతా ఆరోగ్యంగా ఉన్నారని వివరించి అక్కడ ఆలయం నిర్మించొద్దని చెబుతాడు. దాంతో రాజు తన ఆలోచనను విరమించుకున్నాడనీ అప్పటినుంచీ స్వామి ఆరుబయట కేవలం ఓ మండపం కింద పూజలు అందుకుంటున్నాడనీ చెబుతారు.

కోర్కెలు తీర్చే సీతకుండం...
ఇక్కడ ఉన్న సీత కుండాన్ని హనుమంతుడు నిర్మించాడని ప్రతీతి. సీతారాములు శివలింగానికి అభిషేకం చేయాలనుకున్నప్పుడు ఎక్కడా నీరు కనిపించదు. దీంతో ఆంజనేయుడు తన పాదంతో రాతి గొయ్యిని తవ్వడంతో అక్కడ నీరు ఉద్భవిస్తుంది. ఆ కొలనులో సీతారాములు స్నానం చేసి... స్వామిని పూజించడంతో దానికి సీతాకుండం అనే పేరు వచ్చిందని స్థల పురాణంలో ఉంది. ఈ కొలను చివరన ఇప్పటికీ రాయి కనిపిస్తుంది. అలాగే 30 ఏళ్ల క్రితం తవ్వకాల్లో భాగంగా ఓ పుట్టను కూల్చినప్పుడు పాము పడగ కింద లింగం బయటపడింది. దీన్ని నీలలోహిత లింగమని పిలుస్తారు. ఈ మండపానికి సమీపంలోనే పాండవ గుహలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ప్రత్యేక పర్వదినాలతోపాటూ కార్తికమాసంలోనూ శివలింగాన్ని పూజించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు.

ఎలా చేరుకోవచ్చంటే...
మల్లికార్జున స్వామి మండపం శ్రీకాకుళం జిల్లాకు 50 కిలోమీటర్ల దూరంలో టెక్కలి సమీపంలోని రావివలస గ్రామంలో ఉంది. శ్రీకాకుళానికి చేరుకుని అక్కడి నుంచి బస్సు మార్గంలో వెళ్లొచ్చు. రైల్లో వచ్చేవారు టెక్కలి రైల్వేస్టేషన్‌లో దిగి ఇక్కడికి చేరుకోవచ్చు.

-మాలోతు సురేష్‌, ఈనాడు జర్నలిజం స్కూలు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు