
జై జవాన్!
ఓ యువకుడు విధి నిర్వహణకు వెళ్తూ తనవారికి వీడ్కోలు చెబుతున్నాడు... ‘అమ్మానాన్నా... నేను తప్పకుండా తిరిగొస్తాను... శత్రువుని మట్టుపెట్టి మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసిన విజయోత్సాహంతోనో... ఆ మువ్వన్నెల పతాకాన్ని కప్పిన శవపేటికలో నిర్జీవంగానో... తప్పకుండా తిరిగొస్తాను! ఎలా వచ్చినా ‘మా బిడ్డ’ అని మీరు సగర్వంగా చెప్పుకుంటారు’ ఆ యువకుడు భారతీయ సైనికుడు!
పదిహేను వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ భూ సరిహద్దు ఉన్న దేశం మనది. మొత్తం ఏడు దేశాలతో ఆ సరిహద్దును పంచుకుంటున్నాం. అందులో ఏ కాస్తో మైదానప్రాంతం ఉంటుంది. మిగిలినదంతా ఎడారి నేలలూ అడవులూ కొండలూ లోయలూ మంచుపర్వతాలూ... ఇలా విభిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతం. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరిహద్దు అన్నాక కాపలా తప్పదు. వందగజాల ఇంటి స్థలం ఉంటేనే దానికి హద్దులు గీసి ప్రహరీలు కట్టి పకడ్బందీగా పత్రాలు రాయించుకుంటాం. మరి దేశ సరిహద్దును ఇంకెంత భద్రంగా చూసుకోవాలి. అందుకే పగలూ రేయీ తేడా లేకుండా ఏడాది పొడుగునా మన సైనికులు ఆ సరిహద్దుల్ని కంటికి రెప్పలా కాపలా కాస్తుంటారు.
ఇరుగూపొరుగూ మంచి... ఇల్లాలు మంచి... అని సామెత.
పొరుగువారు మంచిగా ఉన్నప్పుడు ఆ ఇల్లాలి నోరు బయటకు వినపడదు. దేశానికైనా అంతే. సగం పొరుగుతో సమస్య లేదు కానీ మిగిలిన ఆ సగం దేశాలే... ఏదో ఒక రూపంలో సైన్యానికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. కయ్యానికి కాలు దువ్వడమూ సందు దొరికితే ఆక్రమించుకుందామని చూడడమూ చాటుమాటుగా సంఘవిద్రోహశక్తులు చొరబడేలా చేయడమూ... ఇలా అవి చేసే ప్రయత్నాలన్నిటికీ ఎక్కడి కక్కడ చెక్ పెట్టగలుగుతున్నామంటే అది మన సైనికుల వల్లే.
దేశ రక్షణకు తమ ప్రాణాల్నైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్న కొన్ని లక్షల మంది... మన త్రివిధ దళాల్లో సేవలందిస్తున్నారు. మనమంతా గుండెల మీద చేతులు వేసుకుని ప్రశాంతంగా నిద్రించేందుకు వాళ్లు తమ సుఖాలను త్యాగం చేస్తున్నారు. రండి... హృదయాన్ని ఉప్పొంగింపజేసే ఆ సైన్యం సంగతులు కొన్ని తెలుసుకుందాం.
ఇవీ మన ప్రత్యేకతలు!
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ సైన్యానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవేంటంటే...
* 136 దేశాల సైనిక శక్తిని విశ్లేషించిన ‘గ్లోబల్ ఫైర్ పవర్’ సంస్థ అమెరికా, రష్యా, చైనాల తర్వాత నాలుగో స్థానం భారతదేశానిదేనని తేల్చి చెప్పింది. ఇక, సంఖ్యాపరంగా సైనికులు ఎక్కువున్న దేశాల్లో మనది రెండో స్థానం.
* సైన్యంలో పనిచేయడం మన దేశంలో తప్పనిసరి కాదు. ఎవరికివారు స్వచ్ఛందంగా చేరతారు. ఇంత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా చేరే సైనికులు ఉండటమూ మన సైన్యం ప్రత్యేకతే.
* ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధభూమి- సియాచిన్ గ్లేసియర్ మనదే. సముద్రమట్టానికి దాదాపు ఆరువేల మీటర్ల ఎత్తులో ఉంటుందిది.
* భారతీయ సైన్యం నిర్వహిస్తున్న హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్(హెచ్ఏడబ్ల్యుఎస్- గుల్మార్గ్) ప్రపంచంలోని ప్రముఖ శిక్షణా సంస్థల్లో ఒకటి.
* ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సైనికులు లొంగిపోవడాన్ని ఆమోదించిన చరిత్ర భారతీయ సైన్యానిది. 1971 యుద్ధం తర్వాత 93వేల మంది పాకిస్థానీ సైనికులు లొంగిపోయారు.
* డెహ్రాడూన్‌లోని భారతీయ మిలిటరీ అకాడమీలో, మిజోరంలోని జంగిల్ వార్ఫేర్ స్కూల్లో అమెరికా, రష్యా, ఇంగ్లాండ్ తదితర దేశాల సైనికులకు శిక్షణ ఇస్తోంది భారతీయ సైన్యం.
* ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకదళంలో కీలక పాత్ర పోషిస్తున్న సైన్యాల్లో మన దేశానిది రెండోస్థానం. ఇప్పటివరకు దాదాపు రెండున్నర లక్షల మంది సైనికులు 49 మిషన్లలో సేవలందించారు. 168 మంది ప్రాణాలు కోల్పోయారు.
* మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ - మనదేశంలోని పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి. ప్రపంచంలో అత్యంత ఎత్తుమీద ఉన్న ‘బెయిలీ బ్రిడ్జి’(లద్దాఖ్)ని కట్టింది సైన్యమే.
ఒక్క శత్రువు కాదు!
సైనికుడి ఉద్యోగం అది ఎక్కడైనా సవాళ్లతో కూడినదే. కొన్ని ప్రాంతాల్లో అయితే వారు ఒక్క శత్రువుతో కాదు, అసంఖ్యాక శత్రువులతో పోరాడాలి. అలాంటి ప్రమాదకరమైన పోస్టింగులు కొన్ని...
సియాచిన్: హిమాలయాల్లోని సియాచిన్ గ్లేసియర్‌లో మైనస్ 50 డిగ్రీల చలి ఉంటుంది. వాతావరణంలో పదిశాతం ఆక్సిజన్ మాత్రమే ఉండే చోట గుండెల నిండా గాలి పీల్చుకోవడానికి కూడా వీలుకాకపోయినా కేవలం గుండెధైర్యంతో దాదాపు మూడు వేలమంది సైనికులు ఆ మంచుకొండల మీద కాపలా కాస్తుంటారు.
ద్రాస్- జమ్ముకశ్మీర్: మనుషులు నివసించే ప్రాంతాల్లో అత్యంత శీతల ప్రదేశం మన దేశంలోని ద్రాస్. అంతకన్నా చలిప్రదేశం ప్రపంచంలో మరొక్కటి మాత్రమే ఉంది. ఇక్కడ జరిగిన పాకిస్థాన్ దాడులే కార్గిల్ యుద్ధానికి దారితీశాయి. ఆ యుద్ధంలో 500 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో అత్యంత ఉద్రిక్తభరితమైన సరిహద్దు ప్రాంతం ఇదేనట.
థార్ ఎడారి: పొడవైన ఇండో పాక్ సరిహద్దులో రాజస్థాన్‌లోని థార్ ఎడారి కూడా ఉంటుంది. వెయ్యి కిలోమీటర్ల కన్నా పొడవైన ఈ సరిహద్దు వెంట మూడు లక్షల మంది సైనికులు పహరా కాస్తుంటారు. సియాచిన్‌కి పూర్తి వ్యతిరేకంగా 50డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ ఉంటుంది. దానికి తోడు వేడి గాలులూ, ఇసుక తుపానులూ కూడా తట్టుకోవాలి.
అరుణాచల్ ప్రదేశ్: భారత్- చైనా సరిహద్దులోని తవాంగ్ తరచూ ఉద్రిక్తతలకు నెలవవుతుంటుంది. ఇక్కడ విధులు నిర్వర్తించే సైనికులు విపరీతమైన వాతావరణ మార్పులను తట్టుకుంటూ సరిహద్దు మీదే దృష్టంతా పెడతారు. ఇవే కాకుండా ఉల్ఫా తీవ్రవాదులూ దట్టమైన అడవులూ లోయలతో ఉండే అస్సోం, 33వ ఆర్మర్డ్ డివిజన్‌కి కేంద్రం అయిన హిసార్ మిలిటరీ స్టేషన్లలో డ్యూటీ కూడా కత్తిమీద సామే. అసలే ఎండలు మండే జైపుర్‌లో ఒళ్లంతా లోహపు కవచం వేసుకుని యుద్ధ విద్యలు సాధన చేయడమంటే మాటలు కాదు.
భర్త అడుగుజాడల్లో...
తండ్రి అడుగుజాడల్లో పిల్లలు నడవడం మామూలే కానీ, సైన్యంలో భర్త ప్రాణాలు కోల్పోయినా ఆ దుఃఖాన్ని దిగమింగుకుని ఏడాది తిరిగేసరికల్లా వారి భార్యలూ సైన్యంలో చేరి సేవలందించడం మన సైన్యం ప్రత్యేకత. పద్దెనిమిదేళ్ల శాలినికి మేజర్ అవినాష్‌తో పెళ్లయింది. ఆయన నెలల తరబడి విధినిర్వహణలో ఉంటే ఆమె చదువు కొనసాగించింది. కశ్మీర్లో తీవ్రవాదులతో ఎన్కౌంటర్లో అవినాశ్ కన్నుమూసే నాటికి శాలిని ఎంబీయే విద్యార్థిని. భర్త తొలి వర్ధంతికల్లా సైన్యంలో అధికారిగా చేరిపోయింది శాలిని.
నాలుగేళ్ల క్రితం ఆపరేషన్ రైనోలో పాల్గొని తీవ్రంగా గాయపడి కన్నుమూశాడు మేజర్ నీరజ్. ఆయన పనిచేసిన విభాగంలోనే తానూ చేరి భర్త దేశ సేవా వారసత్వాన్ని కొనసాగిస్తోంది భార్య సుస్మిత. మణిపూర్‌లో చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు మేజర్ అమిత్ దేశ్వాల్. రెండేళ్లు తిరిగేసరికల్లా అతడి భార్య నీతా దేశ్వాల్ లెఫ్టినెంట్‌గా సైన్యంలో చేరింది. డిగ్రీ చదువుతుండగా ప్రియా సేమ్వాల్కి నాయక్ అమిత్ శర్మతో పెళ్లయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే భర్త వీరమరణం చెందితే పసిబిడ్డను తన తల్లిదండ్రులకు అప్పగించి తాను వెళ్లి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరింది. గౌరి, కనికా రాణె, నిధి మిశ్రా, సంగీతా మాల్, నీరూ సాంబియాల్... చెప్పుకుంటూ పోతే ఇలాంటి వాళ్లు ఎందరో. వీళ్లంతా చదువుకున్నవారూ ఇరవై ఏడేళ్ల లోపువారూ కాబట్టి తగిన శిక్షణ పొంది ఉద్యోగం సాధించగలిగారు. కానీ స్వాతి మహాదిక్ సంగతి వేరు. ఆమె భర్త కర్నల్ సంతోష్ జమ్ముకశ్మీర్‌లో విధినిర్వహణలో మరణించేటప్పటికి ఆమెకు ఇద్దరు పిల్లలు. మూడున్నర పదుల వయసు. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. కష్టపడి శిక్షణ పొందింది. పరీక్షలన్నీ పాసై తన భర్తలాగే తానూ దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వమని అధికారులను కోరింది. ఆమె పట్టుదల చూసిన అధికారులు వయోపరిమితిని సడలించి 38 ఏళ్ల వయసులో ఆమెకు సైన్యంలో అవకాశం కల్పించారు. మంచి జీతమో సమాజంలో హోదానో వీరిని ఆ దిశగా ప్రేరేపించలేదు, దేశంకోసం ప్రాణాలైనా అర్పించాలన్న
త్యాగశీలత వారిని అటు నడిపించింది.
ఇవి... సైనికుల ఊళ్లు!
మన దేశంలో ఆసక్తీ అర్హతలూ ఉన్నవారు ఎవరైనా భాషాప్రాంతాలతో సంబంధం లేకుండా సైన్యంలో చేరవచ్చు. అయినా కొన్ని ఊళ్లు ప్రత్యేకంగా సైన్యంపట్ల ఆసక్తి చూపి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని మిలటరీ మాధవరం, శ్రీకాకుళం జిల్లాలోని పెద్ద మురహరిపురం, విజయనగరం జిల్లాలోని గుడివాడ అలాంటివే. మాధవరం నుంచి రెండు ప్రపంచయుద్ధాల్లోనూ దాదాపు 1200మంది సైనికులు పాల్గొనగా వారిలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఏడువేల జనాభా ఉన్న ఆ ఊరినుంచీ ఎప్పుడు చూసినా వంద మంది దాకా సైన్యంలో వివిధ హోదాల్లో ఉంటారు. గత ఏడాది తెలుగు రాష్ట్రాలనుంచి 1300 మంది సైన్యంలో చేరగా వారిలో నాలుగో వంతు శ్రీకాకుళం జిల్లానుంచే ఉన్నారు. ఆ తర్వాత ప్రకాశం, విజయనగరం, చిత్తూరు జిల్లాలనుంచి; తెలంగాణలోని మహబూబ్‌నగర్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, వికారాబాద్ ప్రాంతాలనుంచి ఎక్కువగా సైన్యంలో చేరారు. అయితే వీటన్నిటినీ తలదన్నే గ్రామం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. అక్కడి గాజీపూర్ జిల్లాలోని గహ్మర్ అనే గ్రామంలో ఏకంగా పదివేల మంది సైనికులు ఉన్నారు. మరో పద్నాలుగు వేల మంది మాజీ సైనికులున్నారు. ఆసియాలోనే అతి పెద్ద గ్రామంగా పేరొంది దాదాపు లక్ష జనాభా ఉన్న ఈ గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చటానికి ప్రయత్నిస్తే ఊరివాళ్లంతా వద్దని అడ్డుకున్నారు. ఎందుకంటే- ‘విలేజ్ ఆఫ్ జవాన్స్’ అన్న తమ ఊరి పేరు మారిపోతుందని. ఈ గ్రామం నుంచి 228మంది మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇంటికొకరు సైన్యంలో చేరడాన్ని ఆనవాయితీగా మలచుకున్న గహ్మర్లో పదో తరగతిలోకి రాగానే అబ్బాయిలు మిలిటరీ శిక్షణ మొదలెట్టేస్తారు. అలాగని అక్కడేమీ ప్రత్యేక శిక్షణ కేంద్రమూ, ఇతర సౌకర్యాలూ లేవు. ఊరి మైదానంలో విశ్రాంత సైనికుల ఆధ్వర్యంలో కసరత్తులతో మొదలవుతుంది వారి శిక్షణ. అందుకే ఎక్కువ మంది ఎంపిక కాగలుగుతున్నారు.
విపత్తు వేళ... అండ!
దేశరక్షణ బాధ్యత సైన్యానికి మొదటి కర్తవ్యమైతే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడూ శాంతిభద్రతల సమస్యలు ఎదురైనప్పుడూ పౌరుల్ని రక్షించడం రెండో కర్తవ్యం. అందుకే ప్రపంచమంతా పెను విపత్తుగా ప్రకటించిన కొవిడ్-19 అంటువ్యాధి సమయంలోనూ సైన్యం సహాయ
చర్యల్లో పాల్గొంది. లాక్డౌన్ సరిగా అమలయ్యేలా గస్తీతో మొదలుపెట్టి క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ వరకూ చాలా బాధ్యతలను పౌరసమాజంతో పంచుకుంది. ఇదే కాదు, భూకంపాలూ తుపానులూ వరదలూ లాంటి విపత్తులు దేశంలో ఎక్కడ వచ్చినా మేమున్నామంటూ వెళ్లి సహాయ హస్తం చాస్తుంది సైన్యం. శిథిలాల కిందినుంచి బాధితులను వెలికితీయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సుదూరప్రాంతాల్లో చిక్కుకుపోయినవారికి ఆహారం సరఫరా చేయడం... ఇలా ఎన్నో పనులు సైన్యం చేపడుతుంది. ‘ఆపరేషన్ రాహత్’ పేరుతో ఉత్తరాఖండ్ వరదల సందర్భంగా భారతీయ సైన్యం చేపట్టిన సహాయ చర్యలను చూసి ప్రపంచమే విస్తుపోయింది. ఇంత పెద్ద ఎత్తున జరిగిన సహాయ కార్యక్రమం మరొకటి లేదు మరి. హఠాత్తుగా విరుచుకుపడిన వరదల వల్ల కొండలూ లోయల్లో చిక్కుకుపోయిన దాదాపు 20వేల మంది యాత్రికులను సైన్యం రక్షించింది. తక్షణం స్పందించి ధైర్యంగా రంగంలోకి దిగగల సాహసమూ, క్రమశిక్షణా, సరైన నాయకత్వమూ ఉంటాయి కాబట్టి పెను విపత్తులు సంభవించినప్పుడు సైన్యాన్ని సహాయం కోరుతుంటాయి ప్రభుత్వాలు.
నాలుగు తరాలు... 14 మంది!
మూడుతరాల వారు సైన్యంలో పనిచేసిన కుటుంబాలు చాలానే ఉంటాయి. ఇటీవల 103 ఏళ్ల వయసులో కన్నుమూసిన మేజర్ గురుదయాళ్ సింగ్‌ది మాత్రం సైన్యంతో నాలుగు తరాల అనుబంధం. మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్న తండ్రి నుంచి స్ఫూర్తిపొందిన గురుదయాళ్ పదిహేడేళ్ల వయసులో సైనిక శిక్షణలో చేరారు. రెండో ప్రపంచయుద్ధంతో మొదలుపెట్టి మొత్తం నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నారు. తొలి యుద్ధంలోనే కాల్పులకు గాయపడ్డా సమయస్ఫూర్తితో తప్పించుకుని అప్పజెప్పిన లక్ష్యాన్ని నెరవేర్చారు. స్వాతంత్య్రం వచ్చాక జమ్మూకశ్మీర్‌లో చొరబాటుదారులను ఎదుర్కొనడంలో, పాకిస్థాన్‌తో యుద్ధంలో కీలక పాత్ర వహించారు. 1967లో రిటైరైనా వందేళ్లు నిండేవరకూ తన పనులు తాను చేసుకుంటూ చురుగ్గా ఉండేవారు. ఆయన ఇద్దరు కుమారులూ ఒకరు సైన్యంలో, మరొకరు వాయుసేనలో చేరి కార్గిల్ యుద్ధంలో
పాల్గొన్నారు. ఇప్పుడు మనవడు సైన్యాధికారిగా ఉన్నాడు. అతడి భార్య కూడా డాక్టరుగా సైన్యంలోనే సేవలందిస్తోంది. గురుదయాళ్ మేనల్లుళ్లు ఇద్దరు వేర్వేరు యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా వీరి కుటుంబం నుంచి 14 మంది సైన్యంలో పనిచేశారు.
అదో కుటుంబం!
సైన్యంలో ఉద్యోగమంటే ఎందుకింత ఆసక్తి... అసలు సైన్యంలో చేరేవారంతా ఇలా సరిహద్దుల్లో కాపలా కాస్తారా... సగటు పౌరుడికి ఎన్నెన్నో సందేహాలు. నిజానికి సైన్యమంటేనే అదో ప్రత్యేక ప్రపంచం. ఒకసారి అందులో ప్రవేశిస్తే ఇక వ్యక్తిగా తమను తాము మర్చిపోతారు. దేశం తప్ప మరొకటేదీ వారికి గుర్తుండదు. కుల, మత, భాషా, ప్రాంత భేదాలేవీ లేకుండా అందరూ ఒకటే అన్న భావం వారిలో బలపడేలా అక్కడి శిక్షణ, సంప్రదాయాలుంటాయి. పదో తరగతి చదివిన పదహారేళ్ల కుర్రాళ్లతో మొదలుపెట్టి ఉన్నత విద్యావంతుల వరకూ ఎవరైనా సైన్యంలో చేరవచ్చు. శిక్షణ పూర్తి చేసుకున్నాక అర్హతలను బట్టి వేర్వేరు హోదాల్లో నియామకాలుంటాయి. మొన్న చైనా సరిహద్దులో అసువులు బాసిన తెలంగాణ బిడ్డ కర్నల్ సంతోష్ బిహార్ రెజిమెంటులో సభ్యుడిగా లద్దాఖ్‌లో విధులు నిర్వహించాడు. ఎక్కడి తెలంగాణ... ఎక్కడి బిహార్... ఎక్కడి లద్దాఖ్. అదే సైన్యం ప్రత్యేకత. కన్న తల్లిదండ్రుల్నీ, కట్టుకున్న భార్యనీ, తాము కన్న బిడ్డల్నీ వదిలి వెళ్లిన సైనికుల్ని అక్కడి వ్యవస్థ మరో కుటుంబంలా అక్కున చేర్చుకుంటుంది. ప్రతి సైనికుడూ ఒక బృందంలో సభ్యుడిగా ప్రత్యేక గుర్తింపు పొందుతాడు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచీ వెళ్లిన వారంతా బయట ఉన్నప్పుడు ఎవరికి వారే. అక్కడ మాత్రం అందరూ ఒకటే. బృందంగా ఆలోచిస్తారు, బృందంగానే లక్ష్యాలు నెరవేరుస్తారు. సైన్యంలో ఉండే పలు సంప్రదాయాలు వారిలో ఆ బృందస్ఫూర్తిని నింపుతుంటాయి. సైనికుడు ఎప్పుడూ ఖాళీగా ఉండడు. క్రమశిక్షణ అతడిని నడిపిస్తుంది. సైన్యంలో రెండు రకాల విధులుంటాయి. ప్రశాంతంగా ఉండే కంటోన్మెంట్లో రెండేళ్లు గడిపితే మిగిలిన మూడేళ్లూ యుద్ధభూమిలో అంటే- సరిహద్దులో విధులు నిర్వర్తించాలి. బృందాలవారీగా ఈ విధులు అందరికీ సమానంగా కేటాయిస్తారు. కంటోన్మెంట్లో ఉన్నప్పుడూ ఖాళీగా ఉండరు. సరిహద్దు విధుల కోసం తమను తాము సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఫిట్నెస్ వ్యాయామాలు, ఆయుధాల వినియోగంలో శిక్షణ, పౌరసమాజానికి సేవలందించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక తరగతులు... ఇలా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. తనకేమన్నా అయితే కుటుంబం ఎలా అన్న భయం సైనికుడికి ఉండదు. ప్రభుత్వమూ ప్రజలూ వారిని చూసుకుంటారన్న ధీమాని వ్యవస్థ వారికి కల్పిస్తుంది. విశ్రాంత సైనికులూ, సైనికాధికారుల భార్యలూ సంఘాలుగా ఏర్పడి సైనికుల కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని ఎక్కడికక్కడ అందిస్తూ ఉంటారు. ఇవన్నీ చదువుతుంటే మీకూ సైన్యంలో చేరాలనిపిస్తోందా? అయితే జాయిన్ఇండియన్ఆర్మీ అన్న వెబ్సైట్లోకి వెళ్లండి. నియామకాలకు సంబంధించిన విశేషాలు తెలుసుకుని ఆ అర్హతలు మీకూ ఉన్నాయనుకుంటే ఇంకెందుకూ ఆలస్యం... దరఖాస్తు చేసేయండి.
ఓ తోటమాలీ...
అందమైన అమ్మాయి జడలో ఒదిగిపోవాలనో, ప్రేమికులను ఒకటి చేసే పూమాలలో చేరాలనో నాకు లేదు...
మహారాజుల శవపేటికను అలంకరించాలనో లేక దేవుడి పూజకు నన్ను నేను అర్పించుకోవాలనో కూడా కోరుకోవడం లేదు.
దేశం కోసం ప్రాణాలర్పించే వీరజవాన్లు నడిచి వెళ్లే దారిలో నన్ను పడెయ్ చాలు...
వారి పాదాలకింద నలిగి నా జన్మధన్యమైందనుకుంటాను...
ఓ పువ్వు ఉదాత్తమైన ఆకాంక్షకు ఓ కవి ఇచ్చిన అక్షరరూపం ఇది... భారతీయ సైనికుడికి మన సంస్కృతి ఇచ్చే విలువ అది!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్