
అజీర్తి చేసిందీ అనగానే వేడి అన్నంలో వాము వేసుకుని ఓ ముద్ద తినమని చెబుతారు బామ్మలు. అది నూటికి నూరుశాతం నిజమే అంటున్నారు ఆధునిక వైద్యనిపుణులు కూడా. ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువగా వచ్చే దగ్గూ ఆస్తమా, బ్రాంకైటిస్, జ్వరంతో బాధపడేవాళ్లకి ఇది ఎంతో మేలు చేస్తుందట. జీర్ణ, శ్వాసకోశ, మూత్రాశయ, రక్తప్రసరణ వ్యవస్థలకు సంబంధించిన వ్యాధులన్నింటినీ వాము సమర్థంగా నివారిస్తుందట. పొట్టలో పరాన్నజీవులుగా చేరే క్రిముల్ని వాము చక్కగా నిర్మూలిస్తుంది. ఎందుకంటే వాములోని థైమల్, కార్వాక్రల్,
థైమోక్వినాల్ వంటి ఘాటైన నూనెలు హానికర క్రిముల్నీ బ్యాక్టీరియానీ నాశనం చేస్తాయి. అంతేకాదు, జీర్ణశక్తినీ పెంచుతాయి. గొంతులోని శ్లేష్మాన్నీ హరిస్తాయి. నరాల బలహీనతనీ తగ్గిస్తాయి. అందుకే ఆయుర్వేద నిపుణులు అరటీస్పూను వాముపొడిని గోరువెచ్చని నీటితో కలిపి రోజుకి రెండుమూడుసార్లు తీసుకుంటే సకల రోగాలూ తగ్గుతాయి అంటున్నారు. ముఖ్యంగా కీళ్లనొప్పులూ ఆర్థ్రయిటిస్‌తో బాధపడేవాళ్లు వాముని పొడి చేసి అందులో గోరువెచ్చని నీళ్లు కలిపి పేస్టులా చేసి నొప్పులున్న చోట రాసి, మర్దన చేస్తే ఉపశమనం ఉంటుందట.
బస్సులో శానిటైజర్ ధూపం!
కోవిడ్-19 కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ప్రయాణించాలంటే ఎవరికైనా భయమే. అందుకే స్ప్రే చేయడంతోబాటు ప్రయాణికులు ఎక్కేటప్పుడు స్ప్రింక్లర్స్ ద్వారా వైరస్ వ్యాపించకుండా అడ్డుకునే శానిటైజింగ్ పద్ధతులు వాడుకలోకి వచ్చాయి. చైనాలో ఇన్ఫెక్షన్ సోకకుండా బస్సులో యూవీ లైట్లనూ అమర్చారు. అయితే బ్రెజిల్‌కు చెందిన మార్కొపొలో నెక్ట్స్, ఆరాటెక్ సంస్థలు సంయుక్తంగా ఫాగ్ ఇన్ ప్లేస్(ఫిఫ్) ఆన్‌బోర్డు అనే సరికొత్త టెక్నాలజీతో కూడిన శానిటైజ్ విధానాన్ని రూపొందించాయి. హానిరహితమైన స్ప్రేను పొగ రూపంలో బస్సంతా 20 నిమిషాలు వ్యాపింపచేయడం ద్వారా వైరస్‌ను అడ్డుకోవచ్చట. ఇలా ఒకసారి చేస్తే అది మూడు రోజులవరకూ పనిచేస్తుందట. డ్రైవరు క్యాబిన్ నుంచి ప్రయాణికులు కూర్చునే సీట్ల కిందివరకూ ఈ ధూపం వ్యాపిస్తుంది కాబట్టి ఈ పద్ధతిలో శానిటైజ్ చేసిన బస్సులో నిశ్చింతగా ప్రయాణించవచ్చట.
మీ బంధం పదిలమేనా?
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లోనూ కొన్నాళ్లకి కొంత స్తబ్దత ఏర్పడుతుంది. మొదట్లో ఉన్న ఉత్సాహం, ఆనందం స్థానంలో చిన్న చిన్న అపార్థాలు తలెత్తుతుంటాయి. అవి అలాగే కొనసాగితే దూరం పెరిగిపోతుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించక తప్పదు మరి... ప్రధానంగా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. తమ అభిప్రాయాల్నీ ఆలోచనల్నీ తమలోనే దాచుకోకూడదు. భాగస్వామి పద్ధతులు నచ్చకపోతే చెప్పాలి. అలాకాకుండా అవతలి వాళ్లు ఏమనుకుంటారనో లేదా బాధపడతారనో లోపలే ఉంచేసుకుంటే ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, అవతలివాళ్ల పట్ల ప్రేమ, ఆప్యాయతలకు బదులు కోపం, అసహనం పెరిగిపోతుంటాయి. కాబట్టి మనసు విప్పి మాట్లాడుకోవాలి.
* ‘మా మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలూ లేవు’ అన్న అభిప్రాయంతో భాగస్వామికి సమయాన్ని కేటాయించకపోవడం సరికాదు. ఎవరు ఎంత బిజీగా ఉన్నా ‘నువ్వే నాకు ముఖ్యం’ అన్న ఫీల్ కలిగేలా రోజులో కనీసం ఓ ఐదు నిమిషాలయినా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. సినిమాల్లో చూపించినట్లు కానుకలతో ముంచెత్తక్కర్లేదు కానీ ప్రేమ పూర్వకమైన సంభాషణ తప్పనిసరి. అప్పుడప్పుడూ అయినాగానీ లవ్ యూ అని చెప్పడం వల్ల ఇద్దరికీ ఆనందంగా అనిపిస్తుంది. కేవలం యువజంటలనే కాదు, మధ్య వయస్కులయినా పెద్దవాళ్లయినా సిల్లీగా ఏమిటిది అనుకోకుండా తమ ప్రేమను వ్యక్తం చేయాలి. అప్పుడే వాళ్ల బంధం ఎప్పటికీ నిత్యనూతనంగా వర్థిల్లుతుంటుంది.
అన్నం తింటే బీపీ తగ్గుతుందా?
జన్యుమార్పులకు గురిచేసిన వరి వంగడాల గురించి మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేలానూ, కరవును తట్టుకుని పెరిగేలానూ మాత్రమే చేశారు. ఇప్పుడు హృద్రోగాలకు దారితీసే బీపీని తగ్గించేలా రూపొందించాం అంటున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా బీపీని తగ్గించేందుకు అందుకు కారణమయ్యే యాంజియో కన్వర్టింగ్ ఎంజైమ్ శాతాన్ని తగ్గించే మందులు ఇస్తుంటారు. అయితే వాటివల్ల బీపీ తగ్గినప్పటికీ దుష్ఫలితాలూ ఎక్కువే. అందుకే పరిశోధకులు ఈ ఎంజైమ్‌ను నిరోధించే సహజ పదార్థాలమీద దృష్టి సారించారు. దాంతో ఎంజైమ్‌ను నిరోధించే అమైనోఆమ్లాలతో కూడిన జన్యువును రూపొందించి దాన్ని వరి మొక్కల్లో ప్రవేశపెట్టారు. దాన్నుంచి పండిన బియ్యాన్ని బీపీతో బాధపడుతున్న ఎలుకలకి పెట్టగా వాటికి బీపీ బాగా తగ్గినట్లు గుర్తించారు. పైగా ఎలాంటి దుష్ఫలితాలూ తలెత్తలేదట. సో, త్వరలోనే ఇవి వాడుకలోకి వస్తే బీపీని అడ్డుకోవచ్చన్నమాట.
స్టౌ మీద పెట్టినా... ఈ గాజు గిన్నెలు పగలవు..!
పొయ్యి మీద సాంబారు మరుగుతుంటే దూరం నుంచే చూడ్డానికి ఎంత బాగుందో... మూత తియ్యకుండానే అందులోని ములక్కాడలు ఉడికాయో లేదో తెలిసిపోతోంది... వంట పూర్తయ్యాక ఆ గిన్నెని అలాగే తీసుకెళ్లి అతిథులకోసం డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంటే ఇంకెంత పని తగ్గినట్లుందో... అంతా గాజు వంట గిన్నెల మహత్యమే!
గాజు గిన్నెలు పారదర్శకంగా చూడ్డానికి బాగుంటాయి. అందుకే, ఏ పాత్రల్లో వండినా వంటకాలను గాజు వాటిలోకి తీసి డైనింగ్ టేబుల్ మీద అందంగా సర్దేస్తారు. అలా కాకుండా నేరుగా గాజు పాత్రల్లోనే వండేస్తే... వాటినలా తెచ్చి వడ్డించేస్తే... విడ్డూరంగా ఉండదూ..? కాబట్టే, పొయ్యిమీద పెట్టుకుని వండుకునే వీలుండే ఈ గాజు పాత్రలు అందర్నీ కళ్లు పెద్దవి చేసుకుని చూసేలా చేస్తున్నాయి. ‘ఏంటీ... గాజు గిన్నెల్లో వంటా..? మంట వేడికి అవి పగిలి, పేలిపోవూ...’ అని భయపడాల్సిన పన్లేదు. ఎందుకంటే ఇవి పైరోసెరమ్, బోరోసిలికేట్ అనే ప్రత్యేకమైన గాజుతో చేసినవి. అందుకే ఈ గిన్నెల్ని మామూలు స్టౌ మీదా, ఇండక్షన్ పొయ్యి పైనా, ఓవెన్‌లోనూ పెట్టి ఎంచక్కా వంట చేసేసుకోవచ్చు. అంతేకాదు, సాధారణ గాజు గిన్నెల్ని ఫ్రిజ్‌లో పెట్టినా పగిలిపోతాయి. కానీ పైరోసెరమ్ వంట పాత్రల్ని చల్లారాక ఫ్రిజ్‌లోనూ పెట్టుకోవచ్చు.
రుచికరంగానూ...
స్టీలు, ఇత్తడి, ఇనుము, రాగి, నాన్‌స్టిక్... ఇలా రకరకాల పాత్రల్లో వంట చేయడం సులభమే. కానీ ఆ పాత్రలు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేందుకు అనువుగానూ అందంగానూ ఉండవు. అందుకే, వండిన పదార్థాల్ని వేరే గిన్నెల్లోకి మార్చుతాం. అదే పెద్దపనంటే గిన్నెలు కూడా బోలెడు తోముకోవాల్సి వస్తుంది. గాజు గిన్నెల విషయానికొస్తే వడ్డించేటపుడే కాదు, వంటలు ఉడికేటపుడూ చూడముచ్చటగా ఉంటాయి. అంతేనా, పారదర్శకంగా ఉండడంతో పాన్‌లో పులుసు ఉడికిందో లేదో, ముక్కలు మాడిపోతున్నాయేమో... అని మాటిమాటికీ పని మానుకుని మూత తీసి చూడాల్సిన పన్లేదు. దూరం నుంచే కనిపించేస్తుంది మరి. ఇక, గాజు మిగిలిన లోహాల్లా ఆహార పదార్థాలతో ఎలాంటి రసాయన చర్యా జరపదు. కాబట్టి, పదార్థాల రుచీ మారదు, పాత్రల్లోని హానికర లోహాలు వంటల్లో కలుస్తాయని భయపడాల్సిన పనీలేదు. ముందు వండిన వంటకాల వాసనలు కూడా గిన్నెలకు అంటుకోవు. పైగా గాజు పాత్రలు నెమ్మదిగా వేడెక్కుతాయి. వేడి గిన్నె మొత్తానికీ సమానంగా చేరుతుంది. మంట ఆపేశాక కూడా గిన్నెలు చాలాసేపు వేడిగా ఉంటాయి. దీనివల్ల వంటలు మరింత రుచికరంగా ఉండడంతో పాటు, తినడం ఆలస్యమైనా తాజాగా ఉంటాయి. అన్నట్లూ గాజు పాత్రలకు జిడ్డు కూడా ఎక్కువగా అంటుకోదు, కడిగేటపుడూ కొంచెం సబ్బు రాయగానే వదిలిపోతుంది.
పైరోసెరమ్, బోరోసిలికేట్ గాజు పాత్రల్లో కుక్కర్లూ పాన్లూ గిన్నెలూ అట్ల పెనాల్లాంటివన్నీ వస్తున్నాయి. ఆన్లైన్ సైట్లలోనూ ఇవి దొరుకుతున్నాయి. అయితే, ఈ పాత్రల్ని వాడేటపుడు ముందు తక్కువ మంట మీద పెట్టి నెమ్మదిగా వేడి పెంచాలి. వేడిగా ఉన్న గిన్నెల్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టడం, ఫ్రిజ్‌లో నుంచి తీసిన వెంటనే పొయ్యి మీద పెట్టడం... చెయ్యకూడదు.
ఏమైనా గాజు గిన్నెల్లో వంటలంటే చూడ్డానికే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ..!
ఏం ప్యాక్ చేశార్రా బాబూ!
చిప్స్ ప్యాకెట్లో చెయ్యి పెట్టి వాటిని తీసుకుని తింటుంటే ఆ మసాలా చేతికంటుకుంటుంది. ఫ్రెంచ్‌ఫ్రైస్‌ను సాస్‌తో కలిపి తింటేనే రుచి. కానీ, వాటిపైన సాస్ వేసుకోవడం ఆలస్యం అవి మెత్తబడిపోతాయి. ఇవనే కాదు... రకరకాల వస్తువుల విషయంలో వినియోగదారులు ఎదుర్కొనే ఇలాంటి సమస్యలకు ప్యాకింగ్‌తోనే పరిష్కారం చూపిస్తున్నాయి తయారీ సంస్థలు. ఎలాగంటే...
ఓ బేకరీకి ఫోన్ చేసి పిజ్జా ఆర్డరిస్తే దాన్ని అట్టపెట్టెలో పెట్టి అదనంగా కొన్ని టిష్యూ పేపర్లు కూడా ఇస్తారు. త్రికోణాకారంలో కోసిన ఆ పిజ్జా ముక్కను టిష్యూ పేపరు మీద పెట్టుకుని తినడం కాస్త ఇబ్బందేనని గుర్తించిన తయారీదారులు వినూత్న ప్యాకింగ్‌ని ఎంచుకుంటున్నారిప్పుడు. సాధారణంగా పిజ్జా తినడానికి వీలుగా ఉంటుందని దాన్ని త్రికోణాకారంలోనే కోస్తారు కాబట్టి ఆ ముక్కను మాత్రమే విడిగా ప్యాక్ చేసేలా అట్టపెట్టెనూ తయారుచేస్తున్నారు. ఎన్ని ముక్కలుంటే అన్ని అట్టపెట్టెలు వస్తాయన్నమాట. పైగా టిష్యూపేపర్ అవసరం లేకుండా... అట్టను పట్టుకుని పిజాను హాయిగా తినేయొచ్చు. ఇందులోనే మరో ప్యాకింగ్ కూడా వస్తోంది. ఒకే అట్టపెట్టెను పిజ్జా ముక్కలకు అనుగుణంగా కోసి... అందులోనే దాన్ని పెట్టిస్తారు. ఆ అట్టపెట్టెను తెరిచినప్పుడు పిజ్జా ముక్క ఉన్నంతమేర అట్టతో సహా పట్టుకుని తినేలా ఏర్పాటు ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫ్రెంచ్‌ఫ్రైస్‌ని ప్యాక్ చేయడంలోనూ మార్పు వస్తోంది. ఏ బేకరీ అయినా... ఫ్రెంచ్ఫ్రైస్తోపాటూ ఒకటిరెండు సాస్ ప్యాకెట్లు ఇస్తాయి. కానీ అందులో కొత్తదనం లేదనుకున్న తయారీదారులు వాటిని పెట్టే ప్యాక్‌కే చిన్న సాస్డబ్బాను జతచేసి మరీ ఇస్తున్నారు. చూడ్డానికి బాగుండటమే కాదు, తినడానికీ సౌకర్యమే. ఇలా సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చే వాటిల్లో చిప్స్ కూడా చేరుతున్నాయి. నిజానికి ఇవి ప్యాకెట్లుగా, డబ్బాల రూపంలో వస్తాయి. వాటిలో చెయ్యి పెట్టి తీసుకోవడం కన్నా... డబ్బాను బౌల్ తరహాలో డిజైన్ చేస్తున్నారు. కొన్నప్పుడు అది డబ్బాలా పొడుగ్గా ఉన్నా... తినాలనుకున్నప్పుడు మూత తీసి బౌల్‌లా మార్చుకోవచ్చు. పాప్కార్న్నీ ఈ తరహాలోనే ప్యాక్ చేసి మరీ ఇస్తున్నారు. ఇవనే కాదు... వెన్న నుంచి నూనెల ప్యాకింగ్ దాకా అన్నింటిలోనూ వినియోగదారుల సౌకర్యానికే పెద్దపీట వేస్తున్నారు తయారీదారులు. వెన్న డబ్బాను తీసుకుంటే... దానిపైన ఉండే మూత చాకులా ఉపయోగపడుతుంది. దాంతో వెన్నను తీసి బ్రెడ్‌కు రాసుకుని మళ్లీ మూతలా పెట్టేసుకోవచ్చు. నూనెలు - ముఖ్యంగా ఆలివ్‌నూనె క్యాప్సూల్ రూపంలో వచ్చేస్తోంది. ఇది ఖరీదు కాబట్టి... ఒక్క బొట్టు కూడా వృథా కాకుండా ఈ తరహా తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. దాన్ని కత్తిరించి నొక్కితే నూనె పడుతుంది. వీటితోపాటూ బిస్కెట్లూ, ఓట్స్ వంటివాటినీ ఇంతే సౌకర్యంగా మార్చేస్తున్నారు. ప్యాకింగ్‌లో వస్తోన్న కొత్త ట్రెండ్‌కు ఈ మార్పు అద్దంపట్టడమే కాదు... ఇందులోని వెసులుబాటును చూసి వినియోగదారులు మళ్లీమళ్లీ ఈ ఉత్పత్తులనే కొంటారనడంలో సందేహమేముంది...!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్