
వన్నెచిన్నెల సీతాకోకచిలుకలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి. అయితే వాటిలోనూ కాస్త వింతగా, వెరైటీగా ఉండేవి అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ 88-89 బటర్‌ఫ్లై కూడా. ఇవి అమెజాన్ అడవుల్లో పెరిగే డైత్రియా జాతికి చెందినవి. చూడటానికి మామూలుగానే ఉన్నా వీటికో ప్రత్యేకత ఉంది. తెల్లని వీటి రెక్కలపై ముందువైపున ఎరుపు రంగు పూసినట్టు ఉంటుంది. ఆపైన నల్లని వలయాలు ఉంటాయి. ఆ వలయాలు రెక్కల మధ్యకు వచ్చే సరికి 88, 89, 98 అంకెల్లా కనిపిస్తుంటాయి! అందుకే ఇవి అదే పేరుతో ఫేమస్ అయ్యాయన్నమాట. భలే ఉన్నాయి కదూ!
ఒక్క దోమా లేదు!
సాయంత్రం అయితే చాలు... దోమలు దండయాత్ర ప్రారంభిస్తాయి. వాటి బారిన పడకుండా ఉండటానికి నానాతిప్పలూ పడాలి. కానీ చైనాలోని ఈ ఊళ్లో మాత్రం ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే గత వందేళ్లుగా అక్కడ ఒక్క దోమ కూడా కనిపించలేదు! ఈ ఊరి పేరు డింగ్ వూలింగ్. ఫ్యూజిన్ ప్రావిన్స్‌లో సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టూ పెద్దపెద్ద చెట్లూ, సరస్సులూ, దోమలు పెరగడానికి అన్నిరకాల అవకాశాలూ ఉన్నా సరే... ఇక్కడ మాత్రం దోమలు ఉండవట. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కానీ అక్కడ నివసించే హక్కా జాతి ప్రజలు మాత్రం... వారు పూజించే ఓ రాయి వల్లనే దోమలు తమ ఊరిలోకి రావని నమ్ముతుంటారు. వీరికి ఇంకో అలవాటు కూడా ఉంది. చెత్తను ఆరుబయట వెయ్యకుండా గొయ్యి తీసి పాతిపెడతారట. దానివల్ల కూడా దోమలు రావడం లేదని కొందరు చెబుతుంటారు. అయితే ఎందుకలా అనేది మాత్రం పూర్తిగా ఎవరికీ తెలియదు.
ఏం జుట్టురా బాబు!
నల్లగా నిగనిగలాడుతూ పట్టుకుచ్చులా మెరిసే కురులంటే ఎవరికైనా ఇష్టమే! కానీ ఆ జుట్టు గుబురుగా పొదలా పెరిగినా అందమే అంటున్నాడు కాలిఫోర్నియాకు చెందిన బెన్నీ హార్లెమ్. తన జుట్టు కాస్త విచిత్రంగా ఉండటంతో కొన్నేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రాంలో ఫొటోలు పెట్టడం మొదలు పెట్టాడట. అవి కాస్తా వైరల్ కావడంతో ఆ తర్వాత జుట్టును ఇంకా ఎక్కువగా పెంచుతూ ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా హెయిర్ ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు. అలా అతడు ఫేమస్ అయిపోవడంతో కొన్ని కంపెనీలు తమ హెయిర్ ఉత్పత్తులకు బెన్నీని మోడల్‌గా కూడా తీసుకుంటున్నాయట! తనకు అంత పేరు తెచ్చిపెట్టిన ఈ జుట్టును సంరక్షించుకునేందుకు సహజంగా దొరికే వస్తువులతో ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన షాంపూ తయారు చేసుకుంటాడట బెన్నీ. ఈ విచిత్రమైన జుట్టు అతడి కూతురు జేక్సిన్కు కూడా వచ్చింది. దీంతో తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి ఫొటోలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
మాత్ర కోసం వెళ్తే... లాటరీ!
ఆ బామ్మకు బాగా తలనొప్పిగా ఉంది. మాత్ర కొనుక్కోడానికని మందుల షాపుకు వెళ్లింది. కానీ అనుకోకుండా దాదాపు 4 కోట్ల రూపాయల లాటరీ తగిలింది! ఇక చూసుకోండి... బామ్మగారి ఆనందానికి అవధుల్లేవు. వర్జీనియాకు చెందిన ఓల్గా రిచీ అనే ఆవిడ కథ ఇది. ఈమెకు ఓరోజు బాగా తలనొప్పిగా ఉండటంతో మాత్రల కోసం పక్కనే ఉన్న మెడికల్ షాప్‌కి వెళ్లిందట. అయితే అక్కడ చిల్లర కోసం తప్పనిసరై ఓ లాటరీ టికెట్ కొంది. తీరా చూస్తే దానికి 5,00,000 డాలర్ల బహుమతి దక్కింది! అంటే 3.80 కోట్లు. ఆ దెబ్బకు మనరిచీ బామ్మ కాస్తా రిచ్ బామ్మ అయిపోయింది.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్