close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వీళ్లు నిజమైన మనుషులు కాదు!

ఇక్కడి ఫొటోల్లో అమ్మాయిని చూసి ‘ఎంత సక్కగున్నావే లచ్చిమీ... ఎంత సక్కగున్నావే...’ అంటూ మంచి పాటేసుకుంటే తప్పేం లేదు. ఇందులోని అబ్బాయిని చూసి అబ్బ... ఏమున్నాడు గురుడు - అనుకుని మనసు పారేసుకున్నా ఇబ్బందేం కాదు. కానీ ఈ అమ్మాయిలతో కలిసి ఓ కప్పు కాఫీ తాగాలనుకున్నా, అబ్బాయిలతో కలిసి షికారుకెళ్లాలనుకున్నా కష్టమే. ఎందుకంటే వీళ్లసలు నిజమైన మనుషులే కారు... కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) సృష్టించిన చిత్రాలు మరి!

మధ్య ఓ మోడల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోయర్లు అయ్యారు. అదిరిపోయే ఫ్యాషన్‌ దుస్తుల్లో ఆమె అందాలను చూసి మైమరచిపోయారు. కొన్నాళ్లకు ఆమె ఓ కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజ్‌ అని తెలిసి నోరెళ్లబెట్టారు. ఇది నిజమే... ఇలా ఇన్‌స్టాలో లక్షల్లో ఫాలోయర్లున్న డిజిటల్‌ మోడళ్లు చాలా మందే ఉన్నారు. వీళ్లని ఏఐ జనరేటెడ్‌ మోడల్స్‌గా పిలుస్తున్నారు. అంటే కృత్రిమ మేధ సృష్టించిన మోడల్స్‌ అన్నమాట. ఎన్ని సార్లు చూసినా మనం చూస్తున్నది మనిషిని కాదు అని గుర్తు పట్టలేనంత సహజంగా వీటిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఫేక్‌ మనుషుల్ని సృష్టించేందుకు ఏకంగా రకరకాల స్టార్టప్‌లే పుట్టుకొచ్చేశాయి. మోడళ్లుగా పెట్టుకునేందుకు డిజిటల్‌ మోడళ్లను అందిస్తామంటూ ముందుకొస్తున్నాయి. దుస్తులూ, జ్యువెలరీ, పెర్‌ఫ్యూమ్‌ సంస్థలూ, లగేజ్‌ కంపెనీల్లాంటి వాటికి తమ మోడళ్లను ఇన్‌స్టంట్‌గా ఇస్తామంటున్నాయి. ఇలాంటి వాటిలో ఐఎన్‌ఎఐ అనే సంస్థతో పాటు రోజ్‌బడ్‌ ఏఐ, ఐకాన్స్‌ 8 తదితర కంపెనీలు ఇలాంటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వీళ్ల దగ్గర లక్ష దాకా ఫొటోలుంటాయి. ఆడా, మగా, పిల్లలూ, ముసలివాళ్లూ... ఇలా అన్ని వయసుల వాళ్లూ ఉంటారిందులో. తెలుపూ, నలుపూ శరీర ఛాయలు కలిగిన వాళ్లు మొదలు వివిధ దేశాలూ, ప్రాంతాలకు చెందిన పోలికలుండేవాళ్ల దాకా ఏ లక్షణాలున్న మోడల్‌ కావాలంటే అలాంటి మోడల్‌ను వీళ్లు అందిస్తారన్నమాట. అంతేకాదు, మనకు ఆ మోడల్‌ నవ్వుతున్నట్టు కావాలా, ఆలోచిస్తున్నట్టు కావాలా, దిగులుగా ఉన్నట్టు కావాలా, ఎదురుగా ఉన్నట్టా లేక వాలుగా నిలబడాలా... అవసరాన్ని బట్టి ఎలా కావాలంటే అలా కూడా చేసిస్తున్నారు. ఒక్క ఫొటోలే కాదు కావాలంటే ఆ మోడళ్లతో క్యాట్‌ వాక్‌లూ చేయించి వీడియోలు తీసిస్తారట. అంటే ఫ్యాషన్‌ యాడ్లకూ, వివిధ మొబైల్‌ అప్లికేషన్లకూ, ప్రెజెంటేషన్లలోనూ ఇలా బోలెడు చోట్ల వీటిని ఇప్పటికే వాడుతున్నారట కూడా. ఇంతకీ ఈ డిజిటల్‌ మోడళ్లని ఎలా చేస్తారంటే... రకరకాల ముఖకవళికలూ, శరీరాకృతులూ, ఛాయలూ ఉన్న మోడళ్లను ఫొటోలూ వీడియోలూ తీసుకుని ఆ ఫొటోలను ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో కలపడం ద్వారా రూపొందిస్తున్నారు. ఈ మోడళ్లను తీసుకుంటే గంటల తరబడి ఫొటోషూట్‌లు తీయాల్సిన శ్రమ తగ్గడమే కాకుండా, వాళ్లకు చెల్లించాల్సిన డబ్బూ తక్కువ మొత్తంలో ఉండటం, అచ్చంగా కావాలనుకునే ఫీచర్లతో మనిషిని ఎంచుకునే వీలుండటంతో వివిధ వ్యాపార సంస్థలూ ఈ బొమ్మల్ని పెట్టుకునేందుకు ముందుకు వస్తున్నాయట. మొత్తానికి మనం ఇప్పుడు ఫేక్‌ న్యూస్‌ చూస్తున్నట్టే త్వరలో ఫేక్‌ మోడళ్లనీ చూడబోతున్నామన్నమాట!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు