close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక సీఈఓ పల్లెవాసం!

జీన్స్‌ వేసుకుని సైకిల్‌ తొక్కుతూ తిరిగే ఆయన ఆ ఊరివాళ్లకు తమ తోటి రైతుగానే పరిచయం. వాళ్లలాగే పొద్దున్నే పొలం వెళ్తారు. వరికి నీరు పెట్టి పొలంలో పండిన కూరలు కోసుకుని ఇంటికి వెళ్తారు. గత ఏడాది ఇదే టైమ్‌లో ఆయన సూటూ బూటూ వేసుకుని అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ఆఫీసుకు వెళ్లేవారు. సాఫ్ట్‌వేర్‌ సంస్థ సీఈవోగా మీటింగులూ వ్యాపార లావాదేవీలతో బిజీగా ఉండేవారు. ఇప్పటికీ ఆయన సీఈవోనే. మారిందల్లా నివాసమే. భారత సాఫ్ట్‌వేర్‌ రంగంలో సరికొత్త ఉత్పత్తులతో దూసుకుపోతున్న జోహో కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడూ సీఈవో అయిన శ్రీధర్‌ వేంబు జీవనశైలే కాదు, సంస్థను ఆయన నిర్వహిస్తున్న తీరూ ప్రత్యేకమే!

వ్యవసాయం అనగానే పల్లెటూరు గుర్తొస్తుంది.
అలాగే సాఫ్ట్‌వేర్‌ అనగానే ఎవరికైనా మెట్రో నగరాలే గుర్తొస్తాయి.
ఆ ప్రతీకల్ని తిరగరాశారు శ్రీధర్‌ వేంబు.
దక్షిణ తమిళనాడులోని పశ్చిమకనుమల మధ్య చెన్నైకి 650కి.మీ. దూరంలో ఉన్న ఊరు తెన్కాశి. కుట్రాలం జలపాతానికి పేరొందిన ప్రాంతం అది. దానికి సమీపంలో ఉంది మత్తలంపారై అనే చిన్న గ్రామం. పచ్చని పొలాలతో ప్రశాంతంగా ఉంటుంది.
దాదాపు పదేళ్ల క్రితం ఆ గ్రామంలో ఓ భవనాన్ని తీసుకుని సాఫ్ట్‌వేర్‌ కార్యాలయం పెట్టారు శ్రీధర్‌. ఇప్పుడక్కడ కొన్ని వందలమంది పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆఫీసు పనిని పర్యవేక్షించడానికీ, టీమ్‌తో టచ్‌లో ఉండటానికీ వీలు కల్పించే ‘జోహో రిమోట్‌లీ’, వ్యాపారాలకు ఉపయోగపడే కస్టమర్‌ సర్వీస్‌ సాఫ్ట్‌వేర్‌ ‘జోహో డెస్క్‌’ లాంటివి ఎన్నో అక్కడే పురుడు పోసుకున్నాయి. ఇదే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటలోనూ జోహోకి మరో    గ్రామీణ కార్యాలయం ఉంది. కొత్తగా మరికొన్ని పల్లెల్లోనూ ఆఫీసుల్ని  ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది జోహో. ప్రపంచమంతటా సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ మెట్రో నగరాల్లో కేంద్రీకృతమై ఉంటే జోహో మాత్రమే ఇలా పల్లెబాట ఎందుకు పట్టిందో తెలియాలంటే జోహో వ్యవస్థాపకుల ప్రస్థానం గురించి తెలుసుకోవాలి.

రైతు బిడ్డ
తంజావూరు జిల్లాలోని ఓ రైతు కుటుంబంలో పుట్టారు శ్రీధర్‌. స్కూలు ఫైనలు మాత్రమే చదివిన తండ్రి హైకోర్టులో స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగం కోసం నగరానికి మకాం మార్చాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న శ్రీధర్‌ ఎంట్రన్స్‌లో మంచి మార్కులు తెచ్చుకుని మద్రాసు ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదివారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసి, క్వాల్‌కామ్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. శ్రీధర్‌ తమ్ముడు కుమార్‌ చెన్నైలోనే ఇంజినీరింగ్‌ చదివి అన్నతో పాటే క్వాల్‌కామ్‌లో చేరాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడే అన్నదమ్ములిద్దరికీ స్వదేశంలో ఏదైనా సొంతంగా చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. అది తొంభయ్యవ దశకం. దేశం నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు వేలల్లో అమెరికా ప్రయాణమవుతున్న రోజులవి. ఇంతమంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఉన్న దేశంలో సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు మాత్రం నామమాత్రంగా ఎందుకున్నాయీ అన్న ఆలోచనలో శ్రీధర్‌కి ఒక చక్కటి అవకాశం కన్పించింది. ఐఐటీలో తనకు సీనియర్‌ అయిన టోనీ థామస్‌తోనూ మాటల్లో ఆ విషయమే చర్చకు రావడం, అతడూ అదే అభిప్రాయం వ్యక్తంచేయడంతో ఉద్యోగం వదిలేసి చెన్నై తిరిగొచ్చారు సోదరులిద్దరూ.

ఐదు కోట్లమంది
రాగానే ముగ్గురు స్నేహితులూ ఇద్దరు సోదరులను భాగస్వాములుగా చేసుకుని చెన్నైలో 1996లో ‘అడ్వెంట్‌నెట్‌’ పేరుతో సొంత సాఫ్ట్‌వేర్‌ సంస్థను ప్రారంభించారు శ్రీధర్‌. తలా కాస్త పెట్టుబడి పెట్టారు. కష్టపడి పనిచేశారు. మెల్లమెల్లగా నిలదొక్కుకున్నారు. లాభాల్లో దూసుకుపోతున్న కంపెనీపై 2001లో డాట్‌కామ్‌ బబుల్‌ ప్రభావం పడింది. వ్యాపారం లేక ఉద్యోగులు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. అయితే వ్యవస్థాపకులు మాత్రం స్థైర్యం కోల్పోలేదు. ఆ పరిస్థితుల్నీ తమకు అనువుగా మలచుకున్నారు. మారిన అవసరాలకు తగినట్లుగా సంస్థ విధానాన్ని మార్చుకుని కొత్త ఉత్పత్తులు తెచ్చి మళ్లీ వినియోగదారుల ఆదరణ పొందారు. ఆ తర్వాత వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం మరోసారి పరిశ్రమలను వణికించినా వీరి సంస్థ మాత్రం ఏ మాత్రం తొణకలేదు. ‘జోహో కార్పొరేషన్‌’గా పేరు మార్చుకుని కస్టమర్‌ రిలేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థగా బలమైన పునాదులు వేసుకుంది. అలా క్రమంగా ఉత్పత్తులనూ, సేవలనూ విస్తరించుకుంటూ వచ్చిన జోహోకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐదుకోట్ల మంది వినియోగదారులున్నారు. క్లౌడ్‌ వేదికగా ఉద్యోగ, వ్యాపారాలకు పనికొచ్చే రకరకాల సాఫ్ట్‌వేర్‌ సేవలను అందించే జోహోకి చెన్నైలో ప్రధాన కార్యాలయమూ అమెరికాలో అంతర్జాతీయ వాణిజ్య కార్యాలయమూ పలు ఇతర దేశాల్లో శాఖలూ ఉన్నాయి.

కస్టమర్‌ చెప్పిన పాఠం
కంపెనీ ప్రారంభించిన కొత్తలో సీఈవోగా టోనీ థామస్‌ ఉండగా ఇతర పనులతో పాటు సేల్స్‌మన్‌ బాధ్యతల్నీ తనే చూసుకునేవారు శ్రీధర్‌. ఒకరోజు ఓ కస్టమర్‌తో చర్చలు జరిపి బేరాలాడి ఓ సాఫ్ట్‌వేర్‌ని 30వేల డాలర్లకు కొనిపించారు. మంచి బేరం చేశాననుకున్న శ్రీధర్‌ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. బిల్లు చెల్లింపులన్నీ అయిపోయాక ఆ కస్టమర్‌ ‘మీ అంత తెలివితక్కువ సేల్స్‌మన్‌ ఇంకొకరు ఉండరు. ఎలాగూ నా బేరం అయిపోయింది కాబట్టి నాకొచ్చిన నష్టమేమీ లేదని ఓ ఉచిత సలహా చెబుతున్నా. మీ సాఫ్ట్‌వేర్‌ నేనిచ్చిన డబ్బుకన్నా పదిరెట్లు విలువైనది. ఇకనైనా ఒక మంచి సేల్స్‌మన్‌ని పెట్టుకోండి’ అని చెప్పి మరీ వెళ్లాడట. వినియోగదారుడే అలా ముఖం మీద చెప్పాక, పైగా సాఫ్ట్‌వేర్‌ మంచిదని కితాబిచ్చాక ఇక సంకోచించలేదు శ్రీధర్‌ బృందం. అన్ని ఉద్యోగాల్లోనూ తగిన అభ్యర్థుల్ని నియమించి ఉత్పత్తులూ వ్యాపార విస్తరణ మీద దృష్టి పెట్టింది. సంస్థ సీఈవోగా సిలికాన్‌ వ్యాలీలో నివసించేవారు శ్రీధర్‌. పల్లెటూరి నేపథ్యం నుంచి వచ్చినందుకేమో ఆయనకు పల్లె, నగర జీవితాలను పోల్చిచూడడం బాగా అలవాటు. రెండు సమాజాలకీ మధ్య ఉన్న ఆర్థిక అసమానతలు శ్రీధర్‌ని ఆలోచింపజేసేవి. అమెరికా అయినా ఇండియా అయినా పరిస్థితిలో మార్పు లేదని భావించిన ఆయన సిలికాన్‌ వ్యాలీని భారతదేశంలోని ఓ పల్లెకు తీసుకుపోవాలని కలలు కనేవారు.

వలస వద్దని...
ఉపాధి కోసం యువత పల్లెల నుంచి నగరాలకు వలస వెళ్లడం వల్ల నగరాల మీద ఒత్తిడి పెరుగుతోంది, మరో పక్క గ్రామాలు మరింత పేదవి అవుతున్నాయి- అంటారు శ్రీధర్‌. ఎక్కడికక్కడ గ్రామాల్లోనే ఆఫీసులు పెట్టి శాటిలైట్‌ ద్వారా అనుసంధానించి పనిచేయడం ద్వారా వలసలు తగ్గించవచ్చన్న ఆలోచన ఆయనను చాలాకాలం వేధించింది. ఫైబర్‌నెట్‌ పూర్తిగా అందుబాటులోకి రాకముందే ఈ దిశగా శ్రీధర్‌ చేసిన ప్రయత్నం చాలామందిని ముక్కున వేలేసుకునేలా చేసింది. కానీ ఆ ఆలోచన విజయవంతమైందనడానికి నిదర్శనం- తెెన్కాశి, రేణిగుంటల్లోని గ్రామీణ కార్యాలయాలు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారుచేయాలంటే సంస్థల ఆర్‌ అండ్‌ డి విభాగాలు మెట్రో నగరాల్లోనే ఉండక్కరలేదని రుజువు చేశాయి ఈ కార్యాలయాలు. జోహోలో మొత్తం 9,300 మంది పనిచేస్తోంటే అందులో 500 మందికి పైగా ఈ రెండు ఆఫీసుల్లోనే ఉన్నారు. ఆటిజంతో బాధపడుతున్న కొడుకు చికిత్స కోసం శ్రీధర్‌ అమెరికాలో ఉన్నప్పటికీ మూడు నెలలకోసారి ఈ కార్యాలయాలకు వచ్చి వెళ్లేవారు. గత అక్టోబరులో సిలికాన్‌ వ్యాలీ నుంచి తన మకాంని పూర్తిగా తెన్కాశికి మార్చేశారు. మత్తలంపారైలో ఆఫీసు పెట్టాలనుకున్నప్పుడు బ్యాంకూ ఏటీఎం లాంటివి కాదు కదా వీధి దీపాలు కూడా లేవు. ఇప్పుడు మౌలిక వసతులన్నీ ఏర్పడ్డాయి. ఈ గ్రామీణ కార్యాలయాల్లో పనిచేసేవారంతా చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్నవారే. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయగల అర్హతలు ఉన్నవాళ్లు శ్రీధర్‌కి పల్లెటూళ్లలో ఎలా దొరికారు? ఆ దారిని వేసిందీ శ్రీధరే. ఇంటర్‌ పాసైన కొందరు చురుకైన యువకుల్ని ఎంపిక చేసుకుని చెన్నై ఉద్యోగుల చేత వారికి శిక్షణ ఇప్పించారు. ఈ ప్రయోగం మంచి ఫలితాన్నివ్వడం చూసిన శ్రీధర్‌ ఆ తర్వాత మరో అడుగు ముందుకేశారు.

డిగ్రీ లేని ఇంజినీర్లు
అబ్దుల్‌ అలీమ్‌ జోహోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఖాళీ సమయంలో రిసెప్షన్లో కంప్యూటర్‌తో అతడు పనిచేయడం చూసిన ఓ ఉద్యోగి ప్రోగ్రామింగ్‌లో ఆసక్తి ఉన్నట్లు గుర్తించాడు. రెండేళ్లు తిరిగేసరికల్లా అలీమ్‌ జోహో చార్ట్స్‌ టీమ్‌లో ప్రోగ్రామర్‌ అయిపోయాడు.
పదిహేనేళ్లక్రితం కంప్యూటర్‌ని ఎలా ఆన్‌ చేయాలో కూడా తెలిసేది కాదు శరణ్‌కి. ఇప్పుడు సీనియర్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కనీసం డిగ్రీ అయినా లేదే అన్నారట పెళ్లి సంబంధం తెచ్చినవాళ్లు. ఎంబీఏ చదివిన ఆ అమ్మాయికి శ్రీధర్‌ పనిచేస్తున్న కంపెనీ గురించి తెలిసి పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకుందట. ఇప్పుడు అతడికి సొంత ఇల్లూ కారూ ఉన్నాయి. ఆఫీసు పనిమీద ఎన్నో దేశాలు వెళ్లొచ్చాడు.
జోహోలో పనిచేసే ఇంజినీర్లలో ఇరవై శాతం మంది ఇలాంటివారే. వారికి యూనివర్శిటీ డిగ్రీల్లేవు. మరి ఇంజినీర్లు ఎలా అయ్యారంటే- యువకులు టెక్నాలజీకి వినియోగ దారులుగానే కాదు, సృష్టికర్తలుగా కూడా తయారవ్వాలి... అనుకున్న శ్రీధర్‌ 2004లోనే జోహో స్కూల్స్‌(జోహో యూనివర్శిటీ అనేవారు మొదట్లో) ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌ చదివిన విద్యార్థుల్లో ఆసక్తీ చురుకుదనమూ ఉన్నవారిని ఎంచుకుని నెలకు పదివేల చొప్పున ఉపకారవేతనం ఇచ్చి రెండేళ్లపాటు ఈ స్కూల్స్‌లో శిక్షణ ఇస్తారు. డిగ్రీ కన్నా నైపుణ్యం ముఖ్యమని నమ్మే శ్రీధర్‌ ఆరుగురు విద్యార్థులూ ఇద్దరు ప్రొఫెసర్లతో మొదలుపెట్టిన జోహో స్కూల్స్‌లో ఇప్పటికి 800మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. ఇంగ్లీషు, లెక్కలు, డిజైనింగ్‌, వ్యాపార నైపుణ్యాలను నేర్పిస్తూ ఇంజినీరింగ్‌ చదవాలన్న గ్రామీణ పేదవిద్యార్థుల కలల్ని సాకారం చేస్తున్నాయి జోహో స్కూల్స్‌. సంస్థ సిబ్బందిలో 875 మంది ఇక్కడ చదివినవారే. సొంతూరికి దగ్గరలో ఉంటూ మంచి ఉద్యోగం చేయడాన్ని మించిన ఆనందం ఏముంటుంది- అనే శ్రీధర్‌ ఆ ఆనందాన్ని ఆస్వాదించడానికి ఇప్పుడు తానూ పల్లెటూరికి మారిపోయారు.

పగలు... రైతు!
సిలికాన్‌ వ్యాలీ నుంచి వచ్చి పల్లెలో ఉంటున్న శ్రీధర్‌కి రోజు ఎలా గడుస్తుందంటే- నా దినచర్య తెల్లారగట్ల నాలుగింటికే మొదలవుతుంది. లేవగానే యూఎస్‌లోని ఆఫీసువాళ్లతో ఫోన్లు మాట్లాడి బిజినెస్‌ విషయాలు తెలుసుకుంటాను. ఆరింటికి వాకింగ్‌కెళతాను. ఒకోసారి ఊరిబావిలో కాసేపు ఈత కొడతాను. తిరిగి వచ్చాక టిఫిన్‌ తిని ఇంజినీరింగ్‌ ప్రాజెక్టుల పనులు చూసుకుంటాను. ఆ తర్వాత పొలం వెళ్తాను. వరి పండిస్తున్నాను. టొమాటో, వంకాయ, బెండకాయ లాంటి కూరగాయలూ మామిడీ, కొబ్బరి తోటలూ ఉన్నాయి.
మరొకరితో పోలిక లేకుండా ప్రశాంతంగా ఉంది జీవితం. అదే నగరంలో ఉంటే పక్కింటివాళ్లు కొత్త కారు కొన్నారనో, కొలీగ్‌ యూరోప్‌ టూరుకు వెళ్లొచ్చాడనో... పనికిరాని చర్చలతో సమయం గడిచేది. ఇక్కడా గోల లేదు. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అప్పుడప్పుడు గణితం, ఇంగ్లీష్‌ క్లాసులు తీసుకునేవాణ్ణి. సాయంత్రం వేళ ఊరి పిల్లలతో క్రికెట్‌ ఆడేవాడిని. లాక్‌డౌన్‌ కారణంగా అవన్నీ ఆగిపోయాయి. సాయంత్రం మరోసారి వాకింగ్‌ చేస్తాను. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్‌ మీదే. మరీ దూరం అయితేనే ఆటోనో బస్సో ఎక్కుతాను. అరుదుగా మాత్రమే కారు తీస్తాను. ఏడింటికల్లా భోజనం చేసి ఆ తర్వాత కాసేపు చదువుకుంటాను. టీవీ చూసే అలవాటు లేదు. కాసేపు ట్విటర్‌ చూసి ఎనిమిదింటికల్లా నిద్రపోతాను. ఇక్కడ ఉండడం వల్ల ఒక్క సాఫ్ట్‌వేర్‌ విషయమే కాక రైతులూ స్థానిక సమస్యల గురించీ ఆలోచించే అవకాశం వచ్చింది’ అంటారు దేశంలోని తొలి వందమంది సంపన్నుల్లో 76వ స్థానంలో ఉన్న శ్రీధర్‌.

తనదైన ముద్ర
జోహో సంస్థ నిర్వహణలోనూ వ్యాపార విలువలు పాటించడంలోనూ శ్రీధర్‌ ముద్ర ప్రత్యేకంగా కన్పిస్తుంది. సొంత డబ్బు పెట్టుబడి పెట్టి సంస్థ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ఎంత ఒత్తిడి వచ్చినా బయటి నుంచి నిధులు తీసుకోలేదు. ‘డబ్బు లేకపోతే కొనుక్కోవడం మానెయ్యి కానీ అప్పు చేయవద్దని అమ్మ చెప్పేది. ఆ క్రమశిక్షణతో పెరగడం వల్లే వ్యక్తిగతంగానే కాదు, కంపెనీ వ్యవహారాల్లోనూ పొదుపుగా ఉంటాను. పైగా బయటి నుంచి నిధులు తీసుకున్నప్పుడు సంస్థ యాజమాన్యం మీదే కాదు, ఉద్యోగుల మీదా ఒత్తిడి పెరుగుతుంది. ఆ పరిస్థితి పనితీరును దెబ్బతీస్తుంది. అందుకే పాతికేళ్లుగా ఆ ప్రభావం లేకుండా మా స్వేచ్ఛను కాపాడుకుంటున్నాం. వచ్చిన లాభాలనే పెట్టుబడిగా పెడుతూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాం’ అని చెప్పే శ్రీధర్‌కి మంచి ఆఫర్‌ వచ్చిందని సంస్థని అమ్మేయడమూ ఇష్టం ఉండదు. ఎంతో ఇష్టపడి, కష్టపడి పెంచుకున్న సంస్థని అమ్మడం ఎందుకూ అని ఎదురు ప్రశ్నిస్తారు. ఆయన దృష్టిలో మేకిన్‌ ఇండియా అంటే ఎక్కడి నుంచో విడి భాగాలు తెచ్చి ఇక్కడ అసెంబుల్‌ చేయడం కాదు, మనమే పరిశోధించి అవసరమైన వస్తువులను అభివృద్ధి చేసుకోవడం. జోహో దాన్నే ఆచరణలో పెడుతోంది.

కరోనా వేళ...
జోహో పీపుల్‌, జోహో బుక్స్‌, జోహో ఇన్వెంటరీ లాంటి 50కి పైగా ఆప్స్‌ తయారుచేసిన జోహో సంస్థ కరోనా నేపథ్యంలో నేటి పరిస్థితులకు పనికొచ్చే సరికొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తెచ్చింది. జోహో రిమోట్‌లీ అనేది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టూల్‌కిట్‌. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల వ్యాపార సంస్థలు దీన్ని వాడుతున్నాయి. స్కూళ్లూ కాలేజీల్లో ఆన్‌లైన్‌ తరగతులకు పనికొచ్చే ‘జోహో క్లాసెస్‌’తో పాఠాలు చెప్పడమే కాక టీచర్లు ఇచ్చే నోట్స్‌, పిల్లల అసైన్‌మెంట్లు- అన్నీ ఒకే ఇంటర్‌ఫేస్‌లో నిర్వహించవచ్చు. ఈ ఆప్‌ ద్వారా ‘భారత్‌ పఢే ఆన్‌లైన్‌’ కార్యక్రమానికి తోడ్పాటు నందిస్తూ మహారాష్ట్రలోని 450 ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు తోడ్పడుతోంది జోహో. వెబినార్లు నిర్వహించేందుకు జోహో మీటింగ్‌ నీ అందుబాటులోకి తెచ్చింది.
గత ఏడాది ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం సంస్థలో శ్రీధర్‌ వాటా 88శాతం కాగా దాని విలువ రూ.12వేల కోట్లపైనే. శ్రీధర్‌ సోదరి రాధా వేంబు, సోదరుడు మణికంఠన్‌, బావ రాజేంద్రన్‌ దండపాణిలకు కూడా సంస్థలో వాటా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 కార్యాలయాల్లో 9,300 మంది పనిచేస్తుండగా వారిలో 8800 మంది మనదేశంలోనే ఉన్నారు.


* * *

‘నువ్వు తెలివైన పిల్లవాడివి. బాగా పైకి వస్తావు. పెద్దవాడివయ్యాక ఊరిని మర్చిపోకు...’
తాతగారి ఇంట్లో ఆడుకుంటున్న పన్నెండేళ్ల శ్రీధర్ని ఆశీర్వదిస్తూ ఓ బామ్మ అన్న మాటలివి. నాలుగు దశాబ్దాలు గడిచినా ఆ పెద్దావిడ ప్రేమగా తల నిమురుతూ అన్న మాటలు శ్రీధర్‌ మర్చిపోలేదు.

అందుకే... ఊరినే సిలికాన్‌ వ్యాలీగా మార్చే ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నారు..! 


మ్యాజిక్‌ మన మనసులో ఉంది!

ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పెద్ద పెద్ద డిగ్రీలు చదివినందువల్ల ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదంటారు శ్రీధర్‌ వేంబు. ‘మ్యాజిక్‌- యూనివర్శిటీలో లేదు... మన మనసులో ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి. జపాను వాళ్లనే చూడండి. 1905 వరకూ కనీసం సైకిల్‌ కూడా తయారుచేసుకోలేనివాళ్లు నేడు ఈ స్థితికి రావటానికి కారణం- వారిలోని పట్టుదలే. నేను ఐఐటీలో చదువుకునేటప్పుడు డ్రాయింగ్‌కి వాడే పెన్సిళ్లను జర్మనీ నుంచి తెప్పించేవారు. జపాన్‌నుంచి వచ్చిన ప్రొఫెసర్‌ ఒకాయన ఓరోజు మా చేతిలో ఆ పెన్సిల్‌ చూసి జపాన్‌లో అయితే ఇలా విదేశాలవి వాడడానికి సిగ్గుపడతారు. ఎంత కష్టమైనా ప్రయత్నించి సొంతంగా తయారుచేసుకుంటారు. మీరైనా కనీసం ఆ దిశగా ఆలోచించండి... అన్నారు. ఆ మాట నాకు బాగా గుర్తుండిపోయింది. జపాన్‌ వారి పట్టుదల నాకు నచ్చుతుంది. అది కావాలి కానీ, ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సంపాదించుకునే డిగ్రీలు కాదు. ఆ ప్రతిష్ఠను తీసి పక్కనపెట్టి మామూలుగా ఆలోచిస్తేనే- నిజంగా పనికొచ్చే పని చేస్తాం’ అన్నది శ్రీధర్‌ నిశ్చితాభిప్రాయం.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.