close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీ ఇల్లు బంగారం గానూ...

చోర కళలో ఆరితేరిన ఇద్దరు దొంగలు అర్ధరాత్రి తాళం వేసిన ఓ బంగ్లాలో దూరారు. నేరుగా పడగ్గదిలో ఉన్న బీరువా దగ్గరకెళ్లి దాన్ని తెరవడానికి ప్రయత్నించారు. ఎంత సేపటికీ కుదరకపోయేసరికి మంచినీళ్లన్నా తాగొద్దామని వంటగదిలోకెళ్లారు. ఆశ్చర్యం... వంటింట్లోని గిన్నెలూ గరిటెలూ కప్పులూ పాన్‌లూ అన్నీ బంగారపు మెరుపులతో తళతళలాడిపోతున్నాయి. అది చూసిన దొంగలిద్దరికీ మైండ్‌ బ్లాంక్‌ అయ్యి సొమ్మసిల్లి పడిపోయారు. అసలు విషయం ఏంటంటే... స్టీలు పాత్రలు బంగరు రంగులో మెరిసిపోవడం నయా ట్రెండ్‌.

 స్వర్ణ కాంతులతో మెరిసిపోయే కప్పుల్లో టీ పోసి, ఆ పక్కనే అదే పసిడి మెరుపుల ప్లేట్లలో స్నాక్స్‌ పెట్టి ఇంటికొచ్చిన అతిథులకు అందిస్తుంటే... వారి కళ్లు కూడా కనకంలా వెలిగిపోవడం ఖాయం. పచ్చటి పసుపు రంగులో మెరిసే పుత్తడికి ఫిదా అవ్వని వాళ్లంటూ ఉండరు మరి. అందుకే, తరతరాలుగా అది ఆడవాళ్ల అందాన్ని పెంచే ఆభరణంగా స్థిరపడిపోయింది. రాజుల కాలంలో అయితే తినే ప్లేట్లూ స్పూన్లూ గిన్నెలూ తాగే గ్లాసులూ కప్పులూ అన్నీ బంగారంతో చేసినవే ఉండేవి. ఇప్పటి సంపన్నులు కూడా కొందరు ఆ దార్లోనే నడుస్తున్నారు. అలా అని వాళ్లు కేవలం తమ స్థాయిని చూపించేందుకే బంగారపు సామాను వాడతారనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే దర్పాన్ని చూపించాలంటే బంగారం కన్నా విలువైన ప్లాటినంతోనూ గిన్నెల్ని చేయించుకోవచ్చు. అలా చెయ్యలేదంటే, పుత్తడి మెరుపుల్ని మెచ్చడమే అసలు కారణం అన్నమాట. అందుకే, పసిడిని కొనలేని సామాన్యులు ఇత్తడితోనైనా సరిపెట్టుకుందామనుకుని ఆ సామాన్లను కొనుక్కునేవారు. కంచుకి కనకపు రంగైతే ఉంది కానీ ఆ మెరుపు నిలవాలంటే ఎప్పటికప్పుడు దాన్ని బాగా తోముకుంటూ ఉండాలి. పైగా బరువూ ధరా రెండూ ఎక్కువే. ఆ కారణంతోనే అందాన్ని పక్కన పెట్టి జనం నెమ్మదిగా స్టీలుకి అలవాటు పడిపోయారు. రోజులు మారాయి. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోగలగడం ఈతరం నైజం. ఇంకేముందీ స్టీలుకి పుత్తడి అందాలద్దడం మొదలుపెట్టారు. అవును, ఇక్కడ అచ్చం బంగారు గిన్నెల్లా కనిపిస్తున్నవన్నీ స్టీలు పాత్రలే.

ఇలా చేస్తారు
బంగారు నగల్ని చేయించుకునే స్థోమత లేకపోతే కనీసం వన్‌గ్రామ్‌ గోల్డ్‌ నగల్నైనా వేసుకుందామనుకుంటారు ఆడవాళ్లు. బంగారంతో చేసినవి ఉన్నా చీరకు మ్యాచింగ్‌ అనో డిజైన్‌ బాగుందనో కూడా రోల్డ్‌గోల్డ్‌ నగల్ని కొంటుంటారు. అలాగే, కనకపు పళ్లెంలో భోజనం చెయ్యాలనీ స్వర్ణ కాంతులీనే కప్పుల్లో టీ తాగాలనే కోరిక ఉన్నవాళ్లు అచ్చంగా బంగారంతో చేసినవి కొనలేకపోయినా స్వర్ణంలా ఉండే స్టీలునైనా కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఈ రంగుకి ఉన్న ఆకర్షణ వల్ల ‘గోల్డ్‌ కలర్‌ స్టీల్‌’ సామానుని ఎక్కడ పెడితే అక్కడ వేరే అలంకరణ సామగ్రి అవసరమే ఉండకపోవడం అదనపు హంగు.స్టీలుకి ఎక్కువగా పీవీడీ(ఫిజికల్‌ వేపర్‌ డిపాజిషన్‌)కోటింగ్‌ పద్ధతిలోనే బంగరు రంగుల్ని అద్దుతున్నారు. ఇవి చూడ్డానికి నిజమైన బంగారు పాత్రల్లానే తళుకులీనుతుంటాయి. ధర మాత్రం బాగా తక్కువ. పైగా స్టీలు పాత్రల్ని సులభంగా వాడుకోవచ్చు, శుభ్రం చేసుకోవచ్చు. తోమేటపుడు రంగు పోదా అంటే... వన్‌గ్రామ్‌ గోల్డ్‌లాంటి వాటికి తక్కువ మోతాదులో బంగారాన్ని కరిగించి పూతగా పూస్తారు. అది కొంతకాలానికి పోతుంది. కానీ పీవీడీ కోటింగ్‌ వేసేటపుడు పాత్రల్ని టైటానియం నైట్రైడ్‌ ఉన్న వ్యాక్యూమ్‌ ఛాంబర్‌లోకి పంపి ప్రత్యేక పద్ధతుల్లో స్టీలు కనకపు రంగులోకి వచ్చేలా చేస్తారు. దీనివల్ల స్టీలుకుండే మెరుపు అలాగే ఉండడంతో పాటు, అది బంగరు వర్ణంలోకి మారుతుంది. రంగూ త్వరగా పోదు సరికదా... అది పాత్రల్ని తుప్పు పట్టనివ్వకుండా ఎక్కువకాలం మన్నేలా చేస్తుంది. పుత్తడి రంగులో మెరిసే తలుపు హ్యాండిళ్లూ గొళ్లాలూ చూస్తూనే ఉంటాం కదా... అవి ఇలా తయారైనవే. పాత్రల్ని అధిక ఉష్ణోగ్రతలకు గురి చేయడం, ఎలక్ట్రో ప్లేటింగ్‌... లాంటి పద్ధతుల ద్వారానూ స్టీలుకి స్వర్ణ కాంతుల్ని అద్దుతుంటారు.

అన్నింటా కనకమే!
వంటింట్లో వాడే స్పూన్ల దగ్గర్నుంచి ప్లేట్లూ పాన్‌లూ గ్లాసులూ గిన్నెలూ టీ కప్పులూ కాఫీ మగ్గులూ ఇతర వంట సామగ్రి వరకూ ఇందు లేదు, అందు కలదనే సందేహము లేకుండా ఈమధ్య అన్నిటికీ బంగారపు సోకులద్దేస్తున్నారు. ఆఖరికి క్యారెట్‌ తురిమే గ్రేటర్‌, పిండి జల్లెడలూ చాకులు కూడా పుత్తడి కాంతులీనుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఇవి విరివిగా దొరుకుతున్నాయి. అసలే స్టీలు పాత్రలు జిగేల్‌ జిగేల్‌మని కళ్లు చెదిరేలా తళతళలాడుతుంటాయి. ఇక, ఆ తళుకులకు బంగరు మెరుపులు జోడిస్తే అందమంతా వంటింట్లోనే ఉందా... అనిపించదూ..? అందుకే, ఇవి మహిళామణుల మనసుల్ని దోచేశాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.