close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇది... ‘శామ్‌సంగ్‌ నగరం’

సెల్‌ఫోన్లతోపాటు పలు రకాల విద్యుత్‌ ఉపకరణాలను అందించే శామ్‌సంగ్‌ పరిచయం అక్కర్లేని సంస్థ. దక్షిణ కొరియాలోని సువోయ్‌ ప్రాంతంలో దాదాపు నాలుగొందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఆ సంస్థ ప్రధాన కార్యాలయం. దాన్ని శామ్‌సంగ్‌ డిజిటల్‌ సిటీ అని కూడా పిలుస్తారు. లక్ష మందికిపైనే పనిచేసే ఈ సిటీలో విహరించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా...

శామ్‌సంగ్‌ డిజిటల్‌ సిటీని చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవంటే నమ్మండి. అత్యాధునిక కట్టడాలతో అందంగానూ ప్రకృతికి పెద్ద పీట వేసి రమణీయంగానూ కనిపిస్తుంది. అక్కడున్న నాలుగు ప్రధాన ఆఫీసుల్లో దాదాపు 35వేల మంది దాకా పనిచేస్తారు. రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో సుమారు 70 వేల మంది ఉన్నారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా శామ్‌సంగ్‌ సంస్థలో మూడున్నర లక్షలమంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల విషయంలో ప్రపంచంలోనే 12వ అతి పెద్ద సంస్థ ఇది.

* డిజిటల్‌ సిటీలో అడ్మినిస్ట్రేషన్‌కోసం 38 అంతస్తుల భవనాలు నాలుగున్నాయి.  ఈ భవనాలకు హెలీపోర్టు సౌకర్యం కూడా ఉంది. 131 భవనాల్లో ల్యాబులూ, ఇతర ఆఫీసులూ, ఆసుపత్రులూ, స్కూళ్లూ, అతిథి భవనాలూ ఉన్నాయి. బీ ఓ హెలికాప్టర్‌తోపాటు 500 షటిల్‌ బస్సులు కూడా డిజిటల్‌ సిటీలో ఉన్నాయి. బయటి నుంచి ఉద్యోగులను దించడానికీ, డిజిటల్‌ సిటీలోని వందల ఆఫీసుల మధ్య రాకపోకలకూ వీటిని ఉపయోగిస్తారు.
*  ఈ సిటీలో ఉద్యోగులందరికీ ఉచితంగా ఆహారాన్ని- అదీ మూడు పూటలా అందిస్తుంది శామ్‌సంగ్‌. మధ్యాహ్న భోజనం, డిన్నర్‌కు సుమారు వంద రకాల పదార్థాలు అందుబాటులో ఉంచుతారు. బయటి ఆహారాన్ని రుచి చూడాలనుకునే వారికోసం బాస్కిన్‌ రాబిన్స్‌, మెక్‌డొనాల్డ్స్‌ వంటి కొన్ని అంతర్జాతీయ అవుట్‌లెట్లకూ చోటిచ్చింది.
* సౌర విద్యుత్‌తోనే నడిచే డిజిటల్‌ సిటీలో వైద్య సేవలూ ఉచితమే. వెల్‌నెస్‌ సెంటర్లూ, ఆక్యుపంక్చర్‌ క్లినిక్‌లూ, జిమ్‌లూ అందుబాటులో ఉంటాయి.
* ఉద్యోగులకు పిల్లల విషయంలో బెంగలేకుండా రెండు స్కూళ్లను నిర్మించారు. దాదాపు 900 మంది చిన్నారులకు 150 మంది టీచర్లనీ నియమించారు. డే కేర్‌ నుంచి పదేళ్ల వయసు వరకూ ఉచితం. ఆ తరవాత క్లాస్‌లకి నామమాత్రపు రుసుము తీసుకుంటారు.

* ఆర్‌ అండ్‌ డీ విభాగం ఉద్యోగులు సాయంత్రం ఆరు తరవాత పని చేయకూడదనే నిబంధన ఉంది. ఎందుకంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకతా, నాణ్యతా దెబ్బతింటాయని శామ్‌సంగ్‌ నమ్మకం.
* అక్కడున్న భవనాల్లోని ప్రతి అంతస్తులో ఓ విశ్రాంతి గది ఉంటుంది. కూర్చోవచ్చూ, కబుర్లు చెప్పుకోవచ్చూ, ఓ కునుకూ తీయొచ్చు. అందుకు అనుగుణంగానే సీటింగ్‌ ఉంటుంది. అలసిపోయినవారికి బాడీ మసాజ్‌ ఛైర్ల ఏర్పాటుంది.
* ఆవరణలో ఓ క్లైంబింగ్‌ వాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌, బాస్కెట్‌ బాల్‌ కోర్టులూ ఉన్నాయి.
* ఉద్యోగుల వినోదం కోసం వారాంతాల్లో సెలెబ్రిటీ టాక్‌షోలూ, రాక్‌ బ్యాండ్‌ కన్సర్ట్‌లూ, ఫ్యాషన్‌ షోలూ డిజిటల్‌ సిటీలోనే జరుగుతాయి. అక్కడకు కుటుంబంతో సహా హాజరై కడుపునిండా భోంచేసి రావొచ్చు.
* ఫొటోగ్రఫీ, పారాగ్లైడింగ్‌, అడ్వెంచర్‌ వంటి దాదాపు 650 రకాల క్లబ్‌లున్నాయి. ఈ క్లబ్‌ల పేరిట వారాంతాల్లో ఉద్యోగులు తరచూ కలుసుకుంటూ ఉంటారు.
* రకరకాల ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో అక్కడే ఓ మ్యూజియం ఉంది. అందులో 270 ఏళ్ల నాటి ఎలక్ట్రికల్‌ డివైజ్‌లు కూడా ఉండటం విశేషం. ఫోన్లూ, టీవీలూ, ఫ్రిజ్‌ల వంటి ఇతర ఉపకరణాలు తొలినాళ్లలో ఎలా ఉండేవో అక్కడ చూడొచ్చు.
* శామ్‌సంగ్‌ వార్షిక ఆదాయం దక్షిణ కొరియా దేశ జీడీపీలో 17 శాతానికి సమానం

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.