close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ బొమ్మల్ని తినేయొచ్చు..!

‘చక్కెరతో శిల్పాలే చేసినారూ... మనవాళ్లు వేడుకకే అందాన్ని తెచ్చినారూ...’ అని ఏ తెలుగు షెఫ్‌ అయినా రాగయుక్తంగా పాడుతూ వంటలు చేస్తుంటే ఆశ్చర్యపోకండి. అచ్చం గాజుతోనో పింగాణీతోనో చేసినట్లుగా మెరుస్తున్న ఈ అందాల బొమ్మలన్నీ పంచదార పాకంతో చేసినవే మరి!

పంచదార చిలుకల్నీ బొమ్మల్నీ చూస్తే చప్పరించాలనిపించడం సహజం. కానీ ఈ చక్కెర బొమ్మల్ని చూస్తే ఓ పట్టాన నోట్లో పెట్టుకోవాలనిపించదు సరికదా, నిజంగానే ఇవి తినేవేనా అన్న అనుమానమూ కలగకపోదు. అందుకే త్వరపడి ఎవరూ వీటిని తినడానికి సాహసించరు. అయితే వీటినీ తినొచ్చుకానీ అంత శ్రమకోర్చి చేసినది తినడానికి కాదు, అలంకారం కోసమే సుమీ అంటున్నారు షుగర్‌ ఆర్టిస్టులు. ఆహ్వానితుల కళ్లను కట్టిపడేసేందుకన్నట్లు పెళ్లి వేడుకల్లో కేకులకు బదులుగా ఈ చక్కెర శిల్పాల్ని అలంకరిస్తున్నారు సంపన్నులు. ఎందుకంటే కేకులతో పోలిస్తే ఇవి ఎంతో ఖరీదైనవి. పైగా వీటిని చేయడానికి రోజులూ నెలలూ కూడా పడుతుందట.

అలా మొదలైంది..!
చైనాలో మొదలైన ఈ చక్కెర పాక శాస్త్ర కళ, నేడు ప్రపంచ ప్రజలందరినీ ఆకట్టుకుంటోంది. అప్పట్లో పంచదారను కరిగించి అచ్చుల్లో పోసి పుల్లకు గుచ్చుకుని చప్పరించేవారట. అదే క్రమంగా షుగర్‌ పెయింటింగ్‌ పేరుతో ఆగ్నేయాసియా దేశాల్లో వాడుకలోకి వచ్చింది. ఇప్పటికీ చైనా, జపాన్‌ దేశాల్లో మరిగించిన చక్కెర పాకాన్ని గచ్చు లేదా చెక్క మీద రకరకాల జంతువులు, కీటకాల బొమ్మల్లా వేసి ఆరాక వాటిని పుల్లకు గుచ్చి అమ్ముతారు. కాలక్రమంలో ఈ బొమ్మలే పంచదార శిల్పాల రూపకల్పనకీ దారితీశాయి. సుమారు 150 డిగ్రీల సెల్సియస్‌ వరకూ మరిగించిన చక్కెర పాకంతో చేసే ఈ బొమ్మలు అచ్చం గాజులానే మెరుస్తుంటాయి. దాంతో ప్రకృతిలో కనిపించే పువ్వులూ జంతువులతోబాటు సాగర గర్భంలోని అందాలూ ఈ పంచదార బొమ్మల్లో ప్రతిఫలిస్తున్నాయి. అక్కడితో ఆగితే వింతేముందీ... నిలువెత్తు మనుషుల్నీ సన్నివేశాల్నీ కూడా చక్కెరతోనే చెక్కేస్తున్నారు షెఫ్‌ కళాకారులు. మొదట్లో కొద్దిమంది మాత్రమే అదీ ఈ కళలో ఆరితేరినవారి వారసులే ఈ చక్కెర బొమ్మల్ని చేయడానికి సాహసించేవారు. క్రమేణా కలినరీ ఆర్ట్‌లో భాగంగా దీన్ని కూడా ప్రవేశపెట్టి కోర్సులు నిర్వహించడంతో ఔత్సాహిక షెఫ్‌లంతా పంచదార పాకంతో రకరకాల ప్రయోగాలు చేస్తూ సరికొత్త అందాల్ని ఆవిష్కరిస్తున్నారు. దానికితోడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పోటీలూ నిర్వహిస్తుండటంతో చక్కెర శిల్పుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

ఎలా చేస్తారు?
కరిగించిన పంచదారలో రంగులు వేసి బాగా కలిపి అదో బంకలా అయ్యేవరకూ పట్టి లాగుతూ సాగదీస్తారు. ఆ తరవాత దాన్ని చేత్తో కావలసిన ఆకారంలోకి మలుస్తారు. ఇందులోనే మరో పద్ధతి కూడా ఉంది. అదే షుగర్‌ బ్లోయింగ్‌. అంటే- సాగిన పాకాన్నే చెక్క లేదా లోహపు గొట్టాల్లోకి వేసి, దాన్ని గట్టిగా నోటితో ఊదుతూ బొమ్మలు చేస్తుంటారన్నమాట. అయితే భారీ చక్కెర శిల్పాలకోసం ఈ రెండు పద్ధతులతోబాటు మరికొన్నింటినీ జోడించి చేస్తుంటారు. పక్షుల ఈకలూ రెక్కలూ గూళ్ల పంచదార పాకాన్ని పైపుల ద్వారా పలుచగా అల్లితే, బొమ్మకు అడుగున పెట్టే భాగం కోసం పంచదారను కొంచెం నీళ్లలో కరిగించి బాగా గట్టిపడేలా చేస్తారు.
జెలాటిన్‌, నీళ్లు, పంచదార కలిపి చేసే పేస్టుతో పువ్వులూ ఆకులూ చేస్తారు. బొమ్మకి నగలూ రాళ్ల మెరుపుల్నీ అద్దాలను కున్నప్పుడు ఐసొమాల్ట్‌ చక్కెరని వాడుతున్నారట. ఎందుకంటే ఇది కూడా ఎలా కావాలంటే అలా వంగుతుంది అంటున్నారు ఆధునిక షుగర్‌ ఆర్ట్‌ షెఫ్‌లు. పైగా ఈ షుగర్‌ ఆర్ట్‌తో చేసిన పండ్లని డెజర్ట్‌ల్లోనూ అలంకరించి మరీ అందిస్తున్నారు స్టార్‌ హోటల్‌ షెఫ్‌లు. ఇక, పాలరాతి నునుపుతో పోర్స్‌లీన్‌ బొమ్మ కావాలంటే మాత్రం పంచదారకి కాస్త కార్న్‌సిరప్‌ కూడా జోడించాల్సిందే. దాంతో అందమైన అమ్మాయినో, కుర్చీలో కూర్చున్న తాతయ్యనో... ఇలా ఏ బొమ్మనైనా సృష్టించేస్తారు. అందులోనూ షుగర్‌ కింగ్‌గా పేరొందిన జో యి చేతిలో అయితే ఈ పంచదార పేస్టు అందాల బొమ్మల్లా ప్రాణం పోసుకుంటుంది. అచ్చం పోర్స్‌లీన్‌ను తలపించే వాటిని ఒకటికి వందసార్లు చూసినా అవి పంచదార బొమ్మలన్న విషయం ఎవరికీ అర్థం కాదూ అర్థమైనా నమ్మలేరూ అంటే- కాదనగలరేమో ఓ సారి ఈ బొమ్మల్ని చూసి మరీ చెప్పండి...!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు