
సంపాదన కోసమే కాదు, చదివిన చదువును సార్థకం చేసుకోడానికీ ఉద్యోగం చేయవచ్చని తెలుసుకున్న మాలతి చేసిన ‘సద్యోగం’ వికలాంగుల పాఠశాలలో స్వచ్ఛందంగా సేవలందించడం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పే కథ ‘యవనిక’. ఇద్దరు పిల్లల్నీ భార్యనీ వదిలి చావడానికి వెళ్లిన రాఘవకు ఎంసెట్‌లో సీటు రాలేదని చావడానికి వచ్చిన కుర్రాడు కనపడ్డాడు. ఆ ఇద్దరిలో ఎవరు ఎవరిని ప్రభావితం చేశారో తెలియాలంటే ‘తేలుకుట్టిన దొంగ’ చదవాలి. ‘రేపటి వెలుగు’ కోసం తమను తాము సిద్ధం చేసుకునేది గిరిజలాంటి కొందరే. సానుకూల దృక్పథమూ, దృఢమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీపాత్రలతో ఈ కథలన్నీ చదివిస్తాయి.
-సుశీల
రేపటి వెలుగు (కథలు)
రచన: ఈరంకి ప్రమీలారాణి
పేజీలు: 141: వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్- 9441482505
మధురమైన జ్ఞాపకం
బాపట్ల వ్యవసాయ కళాశాల 75 ఏళ్ల ప్రస్థానం పూర్తయిన వేళ ప్రచురించిన పుస్తకం ఇది. అక్కడ విద్యార్థులుగా చేరిన కొన్నివేల మంది ఉన్నతవిద్యావంతులై శాస్త్రవేత్తలుగా, ఉన్నతాధికారులుగా, ప్రజా ప్రతినిధులుగా, పారిశ్రామికవేత్తలుగా సమాజానికి సేవలందించారు, నేటికీ అందిస్తూనే ఉన్నారు. ప్రవేశించిన అన్ని రంగాల్లోనూ విజయ బావుటా ఎగరేసి కళాశాలకు పేరు తెచ్చారు. అలాంటివారందరినీ వెతికి పట్టుకుని పలు విశేషాలతో వెలువరించిన ఈ పుస్తకం పూర్వ విద్యార్థులకు ఓ చక్కటి జ్ఞాపకం. తుపాను బ్యాచ్, గోల్డెన్ బ్యాచ్, ఢక్కామొక్కీ బ్యాచ్, బ్యూటిఫుల్ బ్యాచ్... అంటూ సమయానికి తగిన పేర్లతో ఆయా బ్యాచ్‌ల విశేషాలను పంచుకున్నారు.
- పద్మ
ఒక నేల... అనేక ఆకాశాలు
సంకలనం: వలేటి గోపీచంద్
పేజీలు: 244: వెల: రూ.1000/-
ప్రతులకు: రైతునేస్తం ఫోన్-040 23395979
పద్యకవిత్వం
వచనకవిగా, కథారచయితగా పేరొందిన పాపినేని శివశంకర్ తొలి నాళ్లలో రాసిన పద్యకవితలను ఇప్పుడు పుస్తకంగా వేశారు. హైస్కూల్లో ఉండగానే పద్యరచన ప్రయత్నాలు కూడా చేసిన ఆయన కళాశాలలో చదివేటప్పుడే ఆశువుగా పద్యాలు అల్లేవారట. ఈ పుస్తకంలోని పద్యాలన్నీ పాతికేళ్లలోపు వయసులో రాసినవే. ‘తిరిగి రమ్ము’ శీర్షికలో- వేసిపోయిన స్వాతంత్య్ర వృక్ష మెన్ని/ యమృత ఫలములందిచ్చెనో యరయనెంచి/ వచ్చినాడవు గాబోలు; వలదు శంక/ సర్వదేశమ్ము ధూర్తత్వ సంస్థితమ్ము... అంటూనే మళ్లీ గాంధీ వచ్చినా నేటి పరిస్థితులకు తట్టుకోలేరని ‘తిరిగి రమ్ము దేశము కీర్తి వరలినపుడు’ అంటారు. రాలినపూవు, ఈరాత్రి లాంటి ఖండికలు కవి ప్రతిభను చాటుతాయి.
-శ్రీ
అంకుర- పద్యకవితలు
రచన: డా।।పాపినేని శివశంకర్
పేజీలు: 80: వెల: రూ. 80/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు
వెతల కథలు
దళితేతరులే ఎక్కువగా దళిత కథలు రాస్తున్న వేళ వచ్చిన ఈ సంకలనంలో కర్నూలుకు చెందిన 15 మంది దళిత రచయితల కథలున్నాయి. అందులో చాలామంది కొత్తవారే. వారికివి మొదటి కథలే. అయినా వస్తువైవిధ్యానికి లోటు లేదు. సామాజిక వివక్ష, అంటరానితనం, వృత్తి నిర్బంధం లాంటి విషయాల చుట్టూ తిరుగుతాయి కథలు. కుల సాంస్కృతిక విధ్వంసాన్ని చెప్పే కథ ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద’. చావు వార్తల్ని చేరవేసి శవసంస్కారం చేసే వారి కథ ‘బ్యాగరోళ్లు’, వదిలేసి పోయిన మొగుడు పదేళ్ల తర్వాత వస్తున్నాడంటే మార్తమ్మతో పాటు ఊరివాళ్లూ బాధపడతారు దళిత స్త్రీల వెతలకు ప్రతీకగా నిలిచే ‘బతుకు తునకలు’ కథలో. పెద్దిరెడ్డికి రక్తమిచ్చి కాపాడిన తండ్రీకూతుళ్లు ఎందుకు భయపడాల్సి వచ్చిందో చెప్పే కథ ‘కనువిప్పు’. కైమా, దొరలదర్బారు, కాపులింట్ల, పరివర్తన కథలు అణచివేతకు అక్షరరూపాలే. ఒకే జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల పలుకుబడి కథావస్తువులకు బలాన్నిచ్చింది.
- పూర్ణ
నిప్పులవాన (దళిత కథలు)
సంపాదకులు: కెంగార మోహన్
పేజీలు: 136: వెల: రూ. 150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్