close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాతికేళ్లు పనిచేసే హార్ట్‌ వాల్వ్‌!

పెన్‌ హార్ట్‌ సర్జరీ తీరుని మార్చేసే పరికరాన్ని అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. కేంబ్రిడ్జ్‌, బ్రిస్టల్‌ యూనివర్సిటీ సైంటిస్టులు సంయుక్తంగా చేపట్టిన ఈ పరిశోధనలో సుదీర్ఘకాలంపాటు మన్నే పాలీమెరిక్‌ హార్ట్‌వాల్వ్‌ని రూపొందించారు. మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న వాటికి పరిమితులు ఉన్నాయి. కృత్రిమ వాల్వ్‌ మన్నిక ఎక్కువ. కానీ, దీన్ని ఉపయోగించినపుడు రక్తం పల్చగా అవ్వటానికి హృద్రోగులు జీవిత కాలం మందులు వాడాలి. గొర్రెలూ, పందుల జీవ కణజాలంతో తయారయ్యే బయో వాల్వ్‌ వాడితే మందుల అవసరం ఉండదు. కానీ, దాని మన్నిక 10-15 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత మరోసారి సర్జరీకి వెళ్లాలి. ఈ రెంటికీ పరిష్కారం చూపేదే సరికొత్త ‘పాలీవాల్వ్‌’. దీన్ని ఒకసారి అమర్చితే మందుల అవసరం లేకుండానే పాతికేళ్లపాటు పనిచేస్తుందట. దీని పనితీరు సహజమైన వాల్వ్‌కు దగ్గరగా ఉంటుంది. గొర్రెల్లో ఈ వాల్వ్‌ని అమర్చినపుడు బాగా పనిచేసింది. దీని తయారీ ఖర్చు కూడా తక్కువట. ఐఎస్‌ఓ ప్రకారం ఏదైనా వాల్వ్‌ ఆమోదం పొందాలంటే 20కోట్ల పంపింగ్‌లను నిరాటంకంగా పూర్తిచేయాలి. పాలీవాల్వ్‌ ఈ పరీక్షలో విజయవంతమైంది. మరికొన్ని పరీక్షల్ని దాటి ఇది మార్కెట్‌లోకి వస్తే లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది.


వ్యాయామంతో కంటి సమస్యలు దూరం!

వ్యాయామంతో కంటిచూపు మెరుగవుతుందని ఓ తాజా అధ్యయనంలో తేల్చారు శాస్త్రవేత్తలు. కంటి సమస్యల్లో ప్రధానమైన మచ్చల క్షీణత(మాక్యులర్‌ డీజనరేషన్‌), శుక్లాలు, డయోబెటిక్‌ రెటీనోపతీలకు వ్యాయామంతో చెక్‌ పెట్టొచ్చంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనంలో- వ్యాయామం చేయడంవల్ల ఎలుకల్లో కళ్లకు హానిచేసే రక్తనాళాల పెరుగుదల 45 శాతం తగ్గడాన్ని గమనించారు. ఈ రక్తనాళాల పెరుగుదల కంటి చూపు తగ్గడానికి ప్రధాన కారణమైన మచ్చల క్షీణతకీ, మరికొన్ని సమస్యలకూ దారి తీస్తుంది. వ్యాయామంతో కళ్లకు అధిక స్థాయిలో రక్తం సరఫరా కావడంవల్ల ఈ రక్తనాళాల పెరుగుదల తగ్గి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదే యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గతంలో చేసిన అధ్యయనంలో వ్యాయామం లేకపోవడంవల్ల కంటి సమస్యలు వస్తాయని
గుర్తించారు.


ఇన్సులిన్‌ మరింత వేగవంతంగా...

ధుమేహ బాధితులకు ఇన్సులిన్‌ ఎంత ముఖ్యమో తెలిసిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్సులిన్‌ను తీసుకుంటే అది శరీరంలో చక్కెర స్థాయుల్ని పెంచడానికి కనీసం అరగంట పడుతుంది. ఆ సమయాన్ని తగ్గించే అల్ట్రాఫాస్ట్‌ ఇన్సులిన్‌ను అభివృద్ధి చేశారు స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు. మోనోమెరిక్‌ ఇన్సులిన్‌ను ఉపయోగించడంద్వారా ఇది సాధ్యమైంది. మోనోమెరిక్‌ త్వరగా పనిచేస్తుంది కానీ అస్థిరంగా ఉంటూ వినియోగానికి కష్టంగా ఉంటుంది. దీనికి మరో పదార్థాన్ని కలపడంవల్ల దానిలో స్థిరత్వం వస్తోందని శాస్త్రవేత్తలు గమనించారు. దీన్ని మధుమేహం ఉన్న పందులమీద ప్రయోగించినపుడు మంచి ఫలితాలు వచ్చాయి. మోనోమెరిక్‌ శరీరంలో ప్రవేశపెట్టిన పది నిమిషాలకు 100 శాతం పనిచేస్తుంది. అదే మార్కెట్‌లో ఉన్నవాటికి 25 నిమిషాలు పడుతుంది. త్వరలో ఈ మందుని మనుషులమీద ప్రయోగించనున్నారు.


తండ్రితో ఆటలు... పిల్లలకు మేలు!

సిప్రాయంలో తండ్రితో సరదాగా ఆటలు ఆడే పిల్లలు- పెద్దయ్యాక భావోద్వేగాల్ని బాగా అదుపులో పెట్టుకోగలుగుతారనేది ఓ తాజా అధ్యయనం. లెగో ఫౌండేషన్‌-కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ కలిసి ఈ అధ్యయనం చేపట్టాయి. గత నలభై ఏళ్లకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి చేసిన ఈ అధ్యయనంలో మూడేళ్లలోపు పిల్లలతో తండ్రులు ఎక్కువసేపు గడిపినపుడు వారి ఎదుగుదలలో ఎలాంటి మార్పులు వస్తాయన్న అంశాన్ని శోధించారు. ‘తండ్రితో ఆడినపుడు పిల్లలు శారీరకంగా చురుగ్గా ఉంటారు. ఆరుబయట పరిగెత్తడం, వీపుపైన వేలాడటం, కితకితలు పెట్టడం లాంటివి చేస్తుంటారు. వీటివల్ల పిల్లలు తమ భావాల్ని నియంత్రించు కోవడం నేర్చుకుంటారు. ఈ అలవాటే పెద్దయ్యాకా కొనసాగుతుంది’  అంటారు అధ్యయనకర్తల నాయకుడు ప్రొఫెసర్‌ పాల్‌ రామ్‌చంద్రాని.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు