close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చూస్తే బొమ్మ నీళ్లలో వేస్తే టీషర్ట్‌!

రవి ఫోన్‌ కొనుక్కుందామని ఓ మొబైల్‌ స్టోర్‌కి వెళ్లాడు. అక్కడంతా హడావుడిగా ఉంది. ఏంటా అని కనుక్కుంటే కొత్తగా ఫోన్‌ మోడల్‌ ఏదో లాంచ్‌ అవుతోందట. ఆ మోడల్‌ ఫోన్లన్నీ వచ్చిన వాళ్లకు వరుసగా పంచేస్తున్నాడు మేనేజర్‌! ఇదేంటబ్బా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అనుకున్నాడు రవి. అసలు విషయం తెలిశాక మాత్రం ఆశ్చర్యపోయాడు... ఎందుకంటే అవి ఫోన్లు కాదు, అచ్చం అదే ఆకారంలో ఉన్న కంప్రెస్డ్‌ టీషర్ట్స్‌!

ఊరికే ఇంట్లో కూర్చున్నా...
సరదాగా బయటకు వెళ్లాలన్నా... ఆడామగా చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ సౌకర్యంగా ఉండేవి టీషర్టులే. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకూ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవారికీ సంస్థ లోగోలతో ఉన్న టీషర్టులు ఇస్తుంటాయి. అయితే అవి మామూలుగా ఉంటే కిక్కేముంది? అందుకే వాటినిప్పుడు కంప్రెస్డ్‌గా మారుస్తున్నారు. వినియోగదారుణ్ణి ఆకట్టుకోవడంలోనూ, ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంలోనూ ఒక్కొక్కరిదీ ఒక్కో పద్ధతి. కొందరు గిఫ్ట్‌లు ఇస్తే, మరికొందరు కాంప్లిమెంటరీ వస్తువులు ఇస్తుంటారు. అందులోనూ కొత్తదనం కోరుకునే వారికోసమే ఈ వెరైటీ టీషర్టులు.

మామూలుగా టీషర్టులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ కంప్రెస్డ్‌ విధానంలో మాత్రం కంపెనీ ఉత్పత్తి ఆకారంలో ఆ టీషర్ట్‌ ప్యాకింగ్‌ ఉంటుంది. ఉదాహరణకు కోకకోలా కంపెనీ ప్రచారం అయితే ఈ టీషర్టు కూడా కోకకోలా సీసాలా ఉంటుంది! ఐడియా వాళ్ల ప్రచారం అయితే సిమ్‌కార్డుల ఆకారంలోనే టీషర్ట్‌ ప్యాకింగ్‌ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా అరచేతిలో ఇమిడిపోయే సైజులోనే ఉంటాయి. ప్యాక్‌ విప్పిన తర్వాత ఆ టీషర్టును నీళ్లలో తడిపితే... ఆ తడిని పీల్చుకుని అది పూర్తి సైజుకు వస్తుందన్నమాట.

వస్త్రాన్ని ప్రత్యేకమైన యంత్రాల సాయంతో అధిక పీడనానికి గురిచేయడం, అనేక చిన్నచిన్న మడతలు పెట్టి అలా తయారుచేస్తున్నారు. వీటి మీద వేసే ప్రింట్లు కూడా చక్కని నాణ్యతతో ఉంటున్నాయి. కంప్రెస్‌ చేసినా చెదిరిపోని విధంగా వాటిని అందంగా వేస్తున్నారు.

ప్రముఖ కంపెనీల ప్రచారానికి ఉపయోగపడే వస్తువులను తయారుచేసేందుకే అచ్చంగా మరికొన్ని సంస్థలు పనిచేస్తుంటాయి. అలాంటి వాటికి ఈ కంప్రెస్డ్‌ టీషర్టులు చాలా పెద్ద బిజినెస్‌. భారత్‌లో వస్త్ర ఇండియా, యాక్టివ్‌ ఫ్యాషన్‌ ఇండియా, ట్రేడ్‌ ఇండియా వంటి సంస్థలు గుత్తగా ఆర్డర్లు తీసుకుని వీటిని తయారుచేస్తున్నాయి. ఈ ప్రక్రియకు తగ్గట్టు టీషర్టు నాణ్యంగా ఉండేలా పేరుమోసిన బ్రాండ్ల ఫ్యాబ్రిక్‌ను వాడుతున్నారు. స్టైల్‌ విషయంలోనూ ఎక్కడా రాజీపడటం లేదు. వీటిని ప్రొడక్ట్‌ లాంచ్‌, ప్రొమోషనల్‌ పార్టీ, ట్రేడ్‌షో వంటి కార్యక్రమాల్లో వాడుతున్నారు. కేవలం కంపెనీలు మాత్రమే కాదు...

వివిధ స్వచ్ఛంద సంస్థల వారూ తమ కార్యక్రమాల ప్రచారంలో భాగంగా వీటిని ఉపయోగిస్తున్నారు. పాల్గొనేవారిలో ఉత్సాహం, స్ఫూర్తి నింపేలా చక్కని నినాదాలతో ఆ టీషర్టులు ఉంటున్నాయి. మరి ఇంత వెరైటీగా ఉంటున్న వీటిని చూస్తే... ఆ ఉత్పత్తుల మీద ఆసక్తి పెరగకుండా ఉంటుందా... మీరే చెప్పండి!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు