close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎంత మధురం... స్నేహబంధం..!

స్నేహబంధమూ ఎంత మధురమూ...
అని ఆ తరం వారు పాడుకున్నా...
ట్రెండు మారినా ఫ్రెండు మారడే...
అంటూ ఈ తరం పాడుకున్నా...
అది స్నేహం గొప్పతనమే.
అమ్మలా ప్రేమను పంచేదీ, నాన్నలా బాధ్యత తీసుకునేదీ, తోబుట్టువులా ఆదరించేదీ, గురువులా దారి చూపేదీ... ఒక్క స్నేహితుడే!
అలాంటి ఒక్క స్నేహితుడు ఉంటే ప్రపంచాన్నే గెలవొచ్చు... అని చెబుతున్నాయి కొందరు ప్రముఖుల స్నేహకథలు!


స్నేహంలోనూ మెగాస్టార్‌!

ద్దరు మిత్రులు, స్నేహం కోసం... లాంటి చిత్రాల్లో నటించి స్నేహానికి అర్థం చెప్పిన మెగాస్టార్‌ చిరంజీవి నిజజీవితంలో చిన్ననాటి క్లాస్‌మేట్స్‌తో ఎంతో స్నేహంగా ఉంటారు. ఒకరూ ఇద్దరూ కాదు ఆయన స్నేహితులది సినిమా రీల్‌లా చాలా పెద్ద జాబితా!  వారందరినీ తరచూ ఫోన్‌ చేసి పలకరిస్తారు చిరంజీవి. వీలైనప్పుడల్లా కలుస్తుంటారు. ఎవరికే అవసరమొచ్చినా నేనున్నానన్న ధైర్యమిస్తారు. పువ్వాడ రాజరాజేశ్వరరావు, కత్తుల సత్యప్రకాశ్‌... వీళ్లిద్దరూ చిరంజీవికి ఏడో తరగతిలో క్లాస్‌మేట్స్‌. రాజేశ్వరరావు బిజినెస్‌ చేస్తుంటే సత్యప్రకాశ్‌ భీమవరంలో ఛాతీవైద్యునిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఆ తర్వాత బీకాం చదివేటప్పటి మిత్రుల్లో మద్దిపట్ల శర్మ రైల్వేలో పనిచేసి రిటైరయ్యాడు. నర్సయ్య సినిమాల్లోనే ప్రొడక్షన్‌ విభాగంలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. చినమామిడిపల్లికి చెందిన నాయుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. ‘వేర్వేరు ఉద్యోగాల్లో ఉన్నా వీళ్లంతా నాతోపాటు అప్పట్నుంచీ ఇప్పటివరకూ కలిసి ప్రయాణించారు. అయితే కాలేజీ రోజుల్లో నిజమైన స్నేహాన్ని అన్ని కోణాల్లోనూ ఆస్వాదించింది శేఖర్‌తో. తన పూర్తిపేరు ఎంజేటి సాయి వెంకట చంద్రశేఖర్‌(ఫొటోలో ఉన్నారు). ఇద్దరం కలిసి చెన్నైలో రాత్రి కళాశాలలో ఐసీడబ్ల్యూఏ చదివేవాళ్లం. పగలు నేను ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లేవాణ్ణి. అప్పుడు మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది’ అని చెబుతారు చిరంజీవి. కరోనా కన్నా కొద్ది రోజులముందే చిరంజీవి తమ ఇంట్లో పార్టీకి హైదరాబాదులోని స్నేహితులందరినీ పిలిచారు. ఆరోజు రాత్రి వారంతా చాలా ఉద్వేగానికి లోనయ్యారట. దానికి కారణం లేకపోలేదు. వారిలో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టింది చిరంజీవి. సరైన సమయంలో ఆయన స్పందించి ఒకరికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స, ఇద్దరికి గుండె ఆపరేషన్లు చేయించడం వల్ల వాళ్లిప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఇక శేఖర్‌కి అయితే ఆదర్శం, స్ఫూర్తి, ప్రేరణ... అన్ని పదాలకీ అర్థం చిరంజీవే.

డిసెంబరు 31న అందరూ పార్టీ చేసుకునే సమయంలో చిరంజీవి ఆంజనేయస్వామి ధ్యానంలో గడపడం చూసిన శేఖర్‌ తానూ పార్టీలు మానేశాడు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకున్నాడు. ‘మద్రాసులో చదువుకునేటప్పుడు మేమిద్దరం కలిసి ఒకరోజు వర్షంలో కటౌట్‌ కింద తలదాచుకున్నాం. పైకి తలెత్తి చూస్తే కటౌట్లో రజనీ, కమల్‌ ఉన్నారు. ఎప్పటికైనా అలాంటి కటౌట్‌ మీద మన బొమ్మ ఉండాలి అన్నాడు చిరంజీవి. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన మొదటి సంవత్సరం అది. టీలూ రస్కులూ అరటిపళ్లతో కడుపు నింపుకుంటున్న రోజుల్లో తను అన్న మాటకి నవ్వొచ్చింది. కానీ సంకల్పబలంతో కోరికను నిజం చేసుకున్నాడు. అప్పటివరకూ మా నాన్న రికమండేషన్‌తో ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామనుకున్న నేను చిరంజీవిని చూసే సొంతంగా స్కూల్స్‌ పెట్టి నాకాళ్ల మీద నేను నిలబడ్డాను. ఆ తర్వాత మా అబ్బాయి సివిల్స్‌లో మొదటిసారి సీటు రాలేదని దిగులుపడితే చిరంజీవి దగ్గరికే తీసుకొచ్చాను. ఏం చెప్పాడో ఎలా చెప్పాడో కానీ మా అబ్బాయి పట్టుదలగా చదివి ఐపీఎస్‌ అయ్యాడు. మా స్నేహం నన్నే కాదు, మా అబ్బాయినీ  ప్రభావితం చేసింది...’ అని చెబుతారు శేఖర్‌. అలా స్నేహితులంతా తమ జీవితాలను తరచి చూసుకుని ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే అందుకు కారణం చిరంజీవితో తమ స్నేహమేనని తీర్మానించుకుని ఉద్వేగానికి లోనయ్యారట. వారి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటూనే అవసరమైన చేయూతనందించే చిరంజీవిలో వారు స్నేహితుడినే కాదు, మార్గదర్శినీ చూస్తారు. ‘వాళ్లకి నేను శంకర్‌బాబుని, వరప్రసాదుని. నేనంటే ఎంత ప్రేమో అంత గౌరవం కూడా...’ అంటూ స్నేహితులను తలచుకునే ఆయన వారితో కలిసి ఉన్న సమయమంతా కాలేజీ కబుర్లు గుర్తుచేసుకుంటూ సరదాగా గడిపేస్తారు.


ముకేశ్‌ ‘ఆనంద్‌’ అంబానీ

సియాలోనే అత్యంత సంపన్నుడు అయిన ముకేశ్‌ అంబానీకి స్నేహితులు ఎవరుంటారు... తోటి వ్యాపారవేత్తలే కదా. ఆయన కూడా తన స్నేహితుల జాబితాలో ముందుగా చెప్పేది ఆనంద్‌ మహీంద్రా, ఆది గోద్రెజ్‌ లాంటి వాళ్ల పేర్లే. కానీ వ్యాపార ప్రపంచంలోనే ఉన్నా బయటకు అంతగా కన్పించని అత్యంత సన్నిహిత మిత్రుడు మాత్రం ఆనంద్‌ జైన్‌. ఆనంద్‌, ముకేశ్‌ ఇద్దరూ ముంబయిలోని హిల్‌ గ్రాంజ్‌ హై స్కూల్లో చదువుకునేటప్పుడు క్లాస్‌మేట్లు. ఆ తర్వాత పై చదువులకు దారులు వేరయినా స్నేహబంధం వీడలేదు. చదువయ్యాక ఆనంద్‌ మళ్లీ వచ్చి రిలయన్స్‌ గ్రూపులో ఉద్యోగంలో చేరడంతో తిరిగి ఇద్దరి స్నేహం మరింతగా బలపడింది. రిలయన్స్‌ సంస్థతో ఆనంద్‌ ఎంతగా మమేకమయ్యాడంటే అక్కడ చాలామంది ఆనంద్‌ని ధీరూభాయి అంబానీ మూడో కొడుకుగా పేర్కొంటుంటారు. ముకేశ్‌కి ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌ అతనే- అంటారు. ఆనంద్‌ని స్నేహితుడిగా కాక ఒక కుటుంబసభ్యుడిగా చూసుకుంటారు ముకేశ్‌. దానికి తగ్గట్టే సంస్థకి ఎప్పుడే కష్టమొచ్చినా ఒడ్డున పడేసే ఒకే ఒక వ్యక్తి ఆనంద్‌ అన్నంతగా అతడు కష్టపడేవాడు. అలాగని బయట ఎవరికీ తెలిసేది కాదు మళ్లీ. అంతా తెరవెనక ఉండే నడిపించే సామర్థ్యం ఆనంద్‌ సొంతం. స్వతహాగా తెలివితేటలూ వ్యాపారనైపుణ్యాలూ ఉన్న ఆనంద్‌ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోగలడు. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లోని ప్రముఖులందరితో సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. తర్వాత  తన సొంత కంపెనీలు పెట్టుకున్నాక కూడా రూపాయి జీతం తీసుకోకుండా, రిలయన్స్‌లో ఏ హోదా లేకుండా కూడా ఎన్నో సేవలు చేసి పెట్టేవాడు ఆనంద్‌. స్వభావ రీత్యా అంతర్ముఖుడైన ముకేశ్‌కి ఆనంద్‌ స్నేహం అలా కలసివచ్చింది. ఆ తర్వాత వ్యక్తిగత పనుల ఒత్తిడి వల్ల క్రమంగా సంస్థకి దూరమైనా స్నేహితుడి కుటుంబానికి దగ్గరగానే ఉన్నారు. ఆనంద్‌ జైన్‌ ఆఫీసులో ఆయన సీటుకు ఎదురుగా ధీరూభాయ్‌ అంబానీ ఫొటో ఉంటుంది. ‘పెట్రోల్‌ పంపులో పనిచేస్తూ ఓ రిఫైనరీ ఓనర్ని కావాలని కలలు కన్నారు, అంతటి దూరదృష్టి ఎవరికి ఉంటుంది. ఆయనే నా హీరో, ఆయన పేరే నన్ను నడిపించే స్ఫూర్తి...’ అంటూ ధీరూభాయ్‌ని సందర్భం వచ్చినప్పుడల్లా పొగుడుతుంటాడు ఆనంద్‌. స్నేహితులిద్దరూ ఎవరి వ్యాపారాల్లో వాళ్లు ఎంతగా తలమునకలవుతున్నా ఏదో వంకతో కలిసి గడిపే సమయాన్ని వెతుక్కుంటారు. ముకేశ్‌కీ ఆనంద్‌కీ బాలీవుడ్‌ సినిమాలంటే పిచ్చి. వారంలో రెండు మూడు సార్లయినా ఇద్దరూ కలిసి ముకేశ్‌ ఇంట్లోని హోమ్‌ థియేటర్‌లో హిందీ సినిమాలు చూస్తూ సరదాగా కాలక్షేపం చేస్తారు. ఏడాదికోసారైనా సెలవులు గడపడానికి ఎక్కడికో ఓచోటికి కలిసే వెళ్తారు.


మనవడు కాదు...... ఫ్రెండే..!

యన జగమెరిగిన పారిశ్రామికవేత్త. కోటీశ్వరుడు. ఎనభై దాటాయి. ఆ యువకుడికి ఇరవై ఏడేళ్లు. టాటా సంస్థలో ఓ ఉద్యోగి. ఇద్దరి మధ్యా స్నేహం కలిసింది. ఎంతలా అంటే భుజంమీద చెయ్యేసి ‘హాయ్‌ ఫ్రెండ్‌’ అని పలకరించుకునేంత. స్నేహానికి తరాల అంతరాలు ఉండవనడానికి నిదర్శనం రతన్‌ టాటా, శంతను నాయుడుల స్నేహం. పుణెకి చెందిన శంతను కుటుంబంలో టాటా ఉద్యోగిగా అతడిది ఐదో తరం. కుక్కలంటే శంతనుకి చాలా ప్రేమ. ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టి వీధి కుక్కలు ప్రమాదాల బారిన పడకుండా వాటి మెడలో రేడియం బెల్టులు కడుతుంటాడు. తన స్నేహితులతో కలిసి వాటిని సంరక్షిస్తుంటాడు. ఆ విషయాన్ని కంపెనీ న్యూస్‌లెటర్‌లో రాయడంతో రతన్‌ టాటా దృష్టికి వచ్చింది. ఆయనకీ కుక్కలంటే ఇష్టం. దాంతో శంతనుని ముంబయి రమ్మని ఆహ్వానించి, అభినందించారు. ఇక నుంచీ అతను చేసే పనుల గురించి ఈమెయిల్‌ ద్వారా తనకు తెలపమని చెప్పారు. అలా ఇద్దరి మధ్యా ఈమెయిల్స్‌ కొనసాగాయి. మెల్లగా పరిచయం వ్యక్తిగత విషయాలదాకా వెళ్లింది. శంతనుని అమెరికాలో పై చదువులు చదువుకోమని ప్రోత్సహించారాయన. కాకతాళీయంగా ఆయన చదివిన యూనివర్శిటీలోనే అతడికీ సీటు వచ్చింది. అదే సమయంలో ముంబయిలో టాటాకి ఇష్టమైన పశువుల ఆస్పత్రి నిర్మాణమూ మొదలైంది. దాంతో ఈ విషయాలన్నిటి గురించి ఇద్దరూ తరచూ చర్చించుకునేవారు. అమెరికాలో శంతను పట్టా తీసుకునే వేడుకకు రతన్‌ టాటా హాజరయ్యారు. తిరిగి రాగానే శంతనుని తన దగ్గర బిజినెస్‌ అసిస్టెంట్‌గా చేర్చుకున్నారాయన. ‘పైకి ఎదుగుతున్న వారి కాళ్లను పట్టుకుని లాగిపడేసే ఈనాటి పోటీ ప్రపంచంలో శంతను లాంటి కుర్రాడు నాకు అపురూపంగా కన్పించాడు. లోకాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా అందంగా చూసే ఆ సున్నితత్వం నన్ను కట్టిపడేసింది’ అంటారాయన. ‘నా జీవితం ఇంతలా మారిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు’ అంటాడు శంతను.  టాటాకి బిజినెస్‌ అసిస్టెంట్‌గా శంతను ఏం చేస్తాడంటే- ఆయన హాజరయ్యే సమావేశాలన్నిట్లో నోట్సు రాసుకుంటాడు.

భవిష్యత్తుకు అవసరమైన పాయింట్లు విడిగా తీసిపెడతాడు. ఏరోజు కారోజు ఆయన తన ప్లాన్‌ చెబుతారు. అది సరిగ్గా అమలయ్యేలా చూడడం శంతను వంతు. అసలు విరామం లేకుండా నిమిషం వృథా కాకుండా పనిచేస్తారాయన. ఒక స్నేహితుడిగా ఆయనతో అనుబంధం పెనవేసు కోవడంతో అచ్చం ఆయనంత వేగంగానూ శంతను పనిచేయగలుగుతున్నాడు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి దాన్ని వాడడం నేర్పింది శంతనునే. దాని ద్వారా ఇప్పుడాయన యువతతో కనెక్ట్‌ అయి అంకుర పరిశ్రమల రంగంపై అవగాహన పెంచుకుంటూ అవసరమైన చోట పెట్టుబడులు పెడుతున్నారు. సలహాలూ సూచనలూ ఇస్తున్నారు. ఈ స్నేహితులిద్దరికీ యాక్షన్‌ కామెడీ సినిమాలంటే ఇష్టం. సినిమా చూడడం, హెయిర్‌కట్‌కి వెళ్లడం... ఇలాంటి పనులెన్నో ఇద్దరూ కలిసి చేస్తున్నారిప్పుడు. ‘స్కూల్లో, కాలేజీలో ఎందరో ఫ్రెండ్స్‌ ఉన్నా ఇప్పుడు మాత్రం నాకు రతన్‌జీనే బెస్ట్‌ ఫ్రెండ్‌. ఆయనకీ నేనే...’ అంటాడు శంతను.


స్నేహితురాలికి నివాళి

దాదాపు నలభయ్యేళ్ల క్రితం సంగతి. కిరణ్‌ మజుందార్‌ షా బయోకాన్‌ కంపెనీ పెట్టిన కొత్త. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో మహిళలు అరుదుగా కన్పించే రోజులవి. ఒంటరి పోరాటం చేస్తున్న కిరణ్‌కి తనలాంటి పరిస్థితిలోనే ఉన్న నీలిమా రౌషెన్‌తో పరిచయమైంది.  ఇద్దరూ కష్టసుఖాల్ని కలబోసుకునేవారు. కొత్తవాళ్లు చూస్తే స్నేహితులా అక్కాచెల్లెళ్లా అనుకునేంతగా అల్లుకుపోయింది వారి బంధం. కిరణ్‌కి ఏ సందేహమొచ్చినా, నీలిమకి ఏ సలహా కావాల్సివచ్చినా మొదటగా డయల్‌ చేసేది మరొకరి నంబరే. అలా ఒకరికొకరం నిలవబట్టే ఇద్దరమూ నిలదొక్కుకోగలిగాం... అంటారు కిరణ్‌. యువతులుగా మొదలుపెట్టిన స్నేహం యాభైల్లోకొచ్చేసరికి నాకు నువ్వు నీకు నేను అన్నట్లు తయారైంది. తనకు క్యాన్సర్‌ అని తెలిసినప్పుడు నీలిమ ఎంత భయపడిందో కిరణ్‌ అంత బాధపడ్డారు. ఆరేళ్లపాటు స్నేహితురాలి వెన్నంటి ఉండి చికిత్స చేయించారు. సంవత్సరాల తరబడి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సివస్తే ‘నేనున్నాను, నీకేం కాదని’ స్నేహితురాలికి ధైర్యం చెప్పిన కిరణ్‌ అంతటితో ఊరుకోలేదు. ఆమె బాధని మరిపించడం కోసం తరచూ ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటుచేసేవారు. వారాంతాల్లో విధిగా హైదరాబాదు వచ్చి నీలిమతో గడిపేవారు. ఒక పుట్టినరోజున బెంగళూరులో సర్‌ప్రైజ్‌ పార్టీ ఏర్పాటుచేశారు. అరవయ్యో పుట్టినరోజు సందర్భంగా ఏకంగా స్పెయిన్‌ తీసుకెళ్లి ఆమెకిష్టమైన ప్రాంతాలన్నీ చూపించారు. కాకతాళీయంగా అదే సమయంలో కిరణ్‌ భర్తకీ పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చింది. ఓ పక్క బెస్ట్‌ ఫ్రెండ్‌ చావుబతుకుల మధ్య ఉన్నప్పుడే మరో పక్క భర్తకీ క్యాన్సర్‌ అని తెలియడంతో కిరణ్‌ తల్లడిల్లిపోయారు. రోగం పెట్టే బాధకి తోడు చికిత్సల యాతన తోడై వాళ్లు నరకం అనుభవించడాన్ని కళ్లారా చూశారామె. అదృష్టవశాత్తూ కిరణ్‌ భర్త త్వరగా కోలుకున్నారు కానీ, నీలిమని విదేశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఉన్నత మధ్య తరగతి కుటుంబానికి చెందినప్పటికీ క్యాన్సర్‌ చికిత్స కోసం నీలిమ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడడమూ చూశారామె. ఆ అనుభవం అంతా కిరణ్‌ని ఆలోచింపజేసింది. క్యాన్సర్‌పై పోరాటానికి వందల కోట్లు విరాళమివ్వడమే కాక 1400 పడకలతో బెంగళూరులో ఓ ఆస్పత్రినే నెలకొల్పారామె. అందులో రొమ్ము క్యాన్సర్‌ విభాగానికి స్నేహితురాలి పేరు పెట్టారు. ‘నీలిమ స్నేహమే నన్ను నిలబెట్టింది. ఆమె జీవితం ద్వారా లభించిన స్ఫూర్తితో ఇప్పుడు ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపగలుగుతున్నా...’ అంటారు కిరణ్‌.


స్కూల్లో మొదలైంది... క్రికెట్‌తో బలపడింది!

చిన్‌ తెందుల్కర్‌ మా ఫ్రెండ్‌ అని చెబితే ఎవరూ ఒకపట్టాన నమ్మరే... రికీ, మార్కస్‌ కౌటో సోదరులకు ఇది తరచూ ఎదురయ్యే అనుభవమే. అయినా వాళ్లు చిరాకుపడరు. సచిన్‌ మీద ఎంత ప్రేమో ఆయన అభిమానుల మీదా అంత ప్రేమ చూపిస్తారు. ఓపిగ్గా వెంట తీసుకెళ్లి సచిన్‌ని పరిచయం చేసి ఆయనతో వాళ్లకో ఫొటో తీసి ఇప్పుడు నమ్ముతారు కదా అని నవ్వుతూ భుజం చరిచి పంపిస్తారు. వాళ్ల స్నేహం నిన్న మొన్నటిది కాదు మరి. సచిన్‌ చిన్నప్పుడు శివాజీ పార్కులో క్రికెట్‌ ఆడేటప్పటి దోస్తీ. క్రికెట్‌ కోసమే కోచ్‌ సలహా మేరకు రికీ, సచిన్‌ ఇద్దరూ శారదాశ్రమ్‌ స్కూల్లో ఏడో తరగతిలో చేరారు. ఒకే క్లాసు కావడంతో ఇద్దరూ లంచ్‌బాక్స్‌లు షేర్‌ చేసుకునేవారు. పెద్దవాడైన మార్కస్‌కి సచిన్‌ సోదరుడు అజిత్‌ స్నేహితుడు. అప్పుడు మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సోదరుల ఇళ్లలో జరిగే వేడుకలకు సచిన్‌ కుటుంబసమేతంగా వెళ్తాడు. అలాగే సచిన్‌ ప్రతి పుట్టినరోజుకీ స్నేహితులంతా కలిసి సందడి చేస్తారు. చిన్ననాటి విషయాలన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంటారు. అందరూ కలిసి క్రికెట్‌ ప్రాక్టీసు చేసేటప్పుడు సచిన్‌, కాంబ్లి లాంటి వాళ్ల కారణంగా రికీకి బ్యాటింగ్‌ చేసే అవకాశమే వచ్చేది కాదట. ప్యాడ్స్‌ కట్టుకుని ఎదురుచూడడంతోనే సరిపోయేది. మరొకరెవరైనా అయితే ఉక్రోషంతో పోట్లాటకు దిగేవారేమో. రికీ మాత్రం స్నేహితుడి మీద ప్రేమతో అతని ఆటను చూస్తూ ఉండిపోయేవాడట. తర్వాత అతడు అన్న మార్కస్‌ లాగే అంపైరింగ్‌ వైపు వెళ్లిపోయాడు. స్కూల్లో సచిన్‌, కాంబ్లిల పార్ట్నర్‌షిప్‌లో చేసిన 664 పరుగులూ ప్రపంచ రికార్డు అని ఎంతో కష్టపడి నిరూపించింది ఈ అన్నదమ్ములే. సచిన్‌కి బాగా పేరొచ్చాక వీళ్లిద్దరూ కొంచెం సంకోచంగా దూరంగా ఉండేవారట. అది సచిన్‌కి అసలు నచ్చేదికాదు. తనతో మామూలుగా మాట్లాడమని కోప్పడేవాడట. అలా మళ్లీ వారి స్నేహం ఎప్పటిలాగా ‘ఏరా’, ‘ఒరే’ అనుకునేలా కొనసాగింది. ఇప్పుడు వయసులోనూ పెద్దవాళ్లం అయ్యాం కాబట్టి కాస్త మర్యాదగా మాట్లాడుకుందామని ప్రయత్నిస్తాం, దానికీ సచిన్‌ ఒప్పుకోడు... అంటాడు మార్కస్‌. రిటైర్‌ అయ్యాక సచిన్‌ చాలా బిజీ అయిపోయాడంటున్నారు అతని దోస్తులు. గతంలో క్రికెట్‌ ఆడేటప్పుడు ఎక్కడ మ్యాచ్‌ జరిగినా వెళ్లి కలిసేవాళ్లం. డ్రెసింగ్‌ రూమ్‌లోనే పదినిమిషాలు మంచీ చెడూ మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు రకరకాల కార్యక్రమాల వల్ల కలవడం కుదరక ఫోన్‌లోనే ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. మొదటిసారి ఇంగ్లాండ్‌ వెళ్లి వస్తూ క్రికెట్‌ కిట్‌ బ్యాగ్‌ తెచ్చుకున్న సచిన్‌ అది ఎంత పెద్దదో స్నేహితులకు చూపించడం కోసం రికీని అందులో పడుకోబెట్టి ఆ బ్యాగ్‌ మోస్తూ స్కూల్‌ చుట్టూ ఒక రౌండ్‌ వేసి మరీ చూపించాడట. ఈ దోస్తులిద్దరూ స్కూల్లో వెనకబెంచీ గ్యాంగ్‌ సభ్యులే. బాగా అల్లరి చేసేవారు. మార్కస్‌ దగ్గర ఉన్న బ్రాడ్‌మన్‌ సీడీలు చూడటానికి సచిన్‌ రోజూ వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. వాళ్ల అమ్మ వండిపెట్టే సీఫుడ్‌ని ఇష్టంగా తినేవాడట. సచిన్‌ అప్పుడే కాదు ఇప్పటికీ ఆర్మ్‌ రెజ్లింగ్‌లో ఛాంపియన్‌ అనీ, కలిసినప్పుడు ఒక ఆట ఆడకుండా వదలమనీ అంటాడు రికీ. అంపైర్‌గా మార్కస్‌ చాలాసార్లు సచిన్‌కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అదేదీ వారి స్నేహానికి అడ్డం వచ్చేది కావట.


దోస్త్‌ మేరా దోస్త్‌...

గస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవటం చాలాకాలంగా ఎన్నో దేశాల్లో అమల్లో ఉంది. అయితే ఐక్యరాజ్యసమితి మాత్రం తొమ్మిదేళ్ల క్రితమే జులై 30ని ఫ్రెండ్‌షిప్‌ డేగా ప్రకటించింది.


స్నేహానికీ ఓ రాయబారి ఉంది. ‘విన్నీ ద పూ’ అనే కార్టూన్‌ క్యారెక్టర్‌ని స్నేహానికి ప్రపంచ రాయబారిగా ఎంపిక చేసింది ఐక్యరాజ్యసమితి.


మ్మాయిల మధ్య కన్నా అబ్బాయిల మధ్య స్నేహం ఎక్కువ కాలం కొనసాగుతుందంటారు శాస్త్రవేత్తలు. దీనికి దేన్నైనా తేలిగ్గా తీసుకునే అబ్బాయిల మనస్తత్వాలకు తోడు కుటుంబవాతావరణం లాంటివి కారణం కావచ్చు. అందుకే అబ్బాయిలకు స్నేహితులు ఎక్కువగా కూడా ఉంటారు. అయితే ఒకరిద్దరు స్నేహితులకే పరిమితమైనా ఆ స్నేహం కోసం ప్రాణమిచ్చే విషయంలో అమ్మాయిలు ముందుంటారనీ అధ్యయనాలు తేల్చాయి.


భిరుచులు కలిసిన తర్వాతే స్నేహితులవుతారనుకుంటాం కానీ నిజానికి స్నేహితులయ్యాకే అభిరుచులు కలుస్తాయట. ఏకంగా ఇద్దరి డీఎన్‌ఏలలోనూ ఒక శాతం మార్పులు వస్తాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. స్నేహితులుఇద్దరూ ఒకేలా ఆలోచించడానికి కారణం అదేనట.


నం కష్టాల్లో ఉన్నా మన దగ్గరి స్నేహితులు కష్టాల్లో ఉన్నా మన మెదడు ఒకేలా స్పందిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.


వ్యసనాలు మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో స్నేహితులు లేకపోవడమూ అంతే ప్రమాదకరమట.


ఫ్రెండ్షిప్‌ బ్యాండ్‌ అంటే ఏదో పేరుకి కట్టుకునేది కాదు, దాని వెనకాల చాలా నమ్మకాలున్నాయి. స్నేహితుల జీవితాల్లో మంచి మార్పును ఆశిస్తూ కట్టే ఈ బ్యాండ్‌ దానంతటది తెగి ఊడిపోయేనాటికి వారి మనసులోని ఆకాంక్ష నెరవేరుతుందని చాలామంది నమ్ముతారట. స్నేహితులకు ఇలా బ్యాండ్‌ కట్టే సంప్రదాయం చైనాలో మొదలైందట.


నందంగా ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా... అయితే మంచి స్నేహితులతో గడపండి అంటున్నారు పరిశోధకులు. స్నేహస్వభావం ఉన్నవారికీ కష్టసుఖాల్ని ఇతరులతో పంచుకునేవారికీ ఒత్తిడికి దారితీసే హార్మోన్లు అదుపులో ఉంటాయట. రక్తపోటు, గుండెపోటు లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం తగ్గడమే కాదు, ఆయుష్షూ పెరుగుతుందట. అంతేకాదు, విడాకులు, వ్యాపారంలో నష్టం, ఆత్మీయుల మరణం లాంటి కుంగదీసే సంఘటనలు జరిగినప్పుడు కూడా తట్టుకుని నిలబడగలిగేలా చేసేది స్నేహితులేనట.


నీ స్నేహితులెవరో చెబితే నువ్వు ఎలాంటి వాడివో చెబుతాను- అన్న మాటకి బలమైన ఆధారమే ఉంది. మన మాటా, ఆలోచనా, వ్యక్తిత్వమూ అన్నిటిపైనా మన స్నేహితుల ప్రభావం పడుతుంది. స్నేహితుడు మంచి నాయకుడైతే ఆ నాయకత్వ లక్షణాలూ దయా జాలీ కలిగిన సున్నిత మనస్కుడైతే ఆ లక్షణాలూ మనకీ ఎంతో కొంత తప్పనిసరిగా అలవడతాయని పరిశోధనలు తేల్చిచెప్పాయి. ఇద్దరు స్నేహితులే కాదు, ఒక బృందంలో నలుగురు స్నేహితులుంటే వారందరి గుణగణాల్లోనూ సారూప్యత ఉంటుందట.


బెస్ట్‌ ఫ్రెండ్‌కి ఓ బొకే పంపాలనుకుంటున్నారా... ఏ రంగు పువ్వులు పంపుతారు? పసుపు, గులాబీ రంగులు కలిసిన పూల గుత్తి పంపండి. పసుపు కృతజ్ఞతకీ అభిమానానికీ చిహ్నమైతే, గులాబీ రంగు స్నేహంలోని మధురిమకు గుర్తట.


స్నేహితులకు నచ్చే విషయాల కన్నా నచ్చని విషయాలేవో తెలుసుకుని తదనుగుణంగా ప్రవర్తించినప్పుడే ఇద్దరి మధ్యా స్నేహం బలోపేతమవుతుందట.


కొందరితో గబుక్కున స్నేహం చేస్తాం. కొందరితో పరిచయం మాత్రం ఎన్నేళ్లైనా పరిచయం దగ్గరే నిలిచిపోతుంది కానీ స్నేహం దాకా రాదు. దానికి కారణం మన జన్యువులేనట. కుటుంబ పరిస్థితులూ, పెరిగిన వాతావరణమూ కలిసి మనం ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో చేయకూడదో నిర్ధారిస్తాయట.


నసైన స్నేహితులు పక్కన ఉంటే మనలో సృజన శక్తి రెట్టింపవుతుందట. చేసే పని వేగంగానూ, మరింత సమర్థంగానూ కూడా చేస్తామట.


డేళ్లపాటు ఎవరితోనైనా స్నేహం చేస్తే ఆ స్నేహం జీవితకాలం నిలిచిపోతుందంటారు మానసిక నిపుణులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు