close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందానికి పెన్నులు!

ఏదయినా పెన్ను కాస్త కొత్తగా కనిపిస్తే... అబ్బా ఎంత బాగుందీ అని వెంటనే కాగితం మీద మన పేరు రాసుకుని చూస్తాం. ఈ పెన్నుల్ని చూసినా అలాగే అనిపిస్తుంది కానీ... వీటితో  ముఖంమీద రాసుకోవాల్సి ఉంటుంది. అదేంటీ... అలా చేస్తే గీతలు పడవా అనే సందేహం వద్దు. అస్సలు పడవు సరికదా... అందం రెట్టింపవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మేకప్‌ పెన్నులు మరి.

ఒకప్పుడు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మేకప్‌ వేసుకునేవారు. కానీ ఇప్పుడు.... రోజువారీ జీవన విధానంలో అదీ ఓ భాగమే. ముఖానికి కొద్దిగానైనా టచప్‌ లేనిదే బయటకు వెళ్లడంలేదు చాలామంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకునే మేకప్‌ సామగ్రిలోనూ ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల క్రమంలో వస్తున్నవే ఈ పెన్నులు. ముఖ్యంగా ఫౌండేషన్‌, లిప్‌స్టిక్‌, కన్సీలర్‌, ఐ లైనర్‌, హైలైటర్‌ వంటివి... సీసాలూ, ట్యూబ్‌లకు బదులుగా పెన్నుల్లా మారిపోతూ కోరిన షేడ్‌లలో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వీటన్నింటితో అలంకరణ చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదు. పనైపోయిన వెంటనే క్యాప్‌ పెట్టేస్తే సరిపోతుంది. అదనంగా వాటికోసం స్పాంజ్‌లు లేదా బ్రష్‌లు వాడాల్సిన అవసరం అంతకన్నా ఉండదు.

ఫోర్‌ ఇన్‌ వన్‌ తరహాలోనూ...
ఒకేసారి నీలం, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల రీఫిళ్లు పెట్టే పెన్ను తెలుసుగా... ఏ రంగు పెన్నుతో రాయాలనుకుంటే ఆ బటన్‌ని నొక్కాల్సి ఉంటుంది. 4-1 మేకప్‌ పెన్ను కూడా అలాంటిదే. ఇందులో రెండు బటన్లను కేవలం కనుబొమల్ని అందంగా దిద్దుకోవడానికి ఉపయోగిస్తే... మరో రెండింటినీ లిప్‌లైనర్‌, ఐలైనర్‌గా వాడుకోవచ్చు. లిప్‌స్టిక్‌ పెన్నులోనూ అంతే. ఓ వైపు రంగు ఉంటే మరోవైపు లిప్‌లైనర్‌ వస్తుంది. ఈ రెండింటికీ కాస్త భిన్నం ఐబ్రో టాటూ పెన్‌. కనుబొమలు కాస్త పల్చగా ఉన్నవారికి ఈ పెన్‌ ఉపయోగపడుతుంది. నాలుగు గీతల్లా ఉండే ఈ పెన్నుతో కనుబొమలపైన ఓ ఆకృతిలో గీస్తే... ఇంకు వెంట్రుకల్లా పడి ఐబ్రోస్‌ చూడ్డానికి ఒత్తుగా సహజంగా ఉంటాయి. పైగా ఆ రంగూ ఎక్కువసేపే నిలిచి ఉంటుంది.

టాటూ కావాలా...
ప్రముఖుల్లానే చాలామందికి టాటూలు వేయించుకోవాలని మనసులో ఉన్నా... నొప్పి, ఇన్‌ఫెక్షన్‌ భయంతోపాటూ ఒకసారి వేయించుకుంటే అది జీవితాంతం ఉంటుందనే కారణాలతో వద్దనుకుంటారు. కానీ ఈ టెంపరరీ టాటూ మార్కర్‌ పెన్నులతో ఎవరికి వారు కోరిన టాటూను ఇంట్లోనే వేసుకోవచ్చు. వీటిల్లో డిజైను గీసుకోవడానికి కేవలం నలుపు మాత్రమే కాదు వివిధ రంగులూ ఉంటాయి. చేతిమీదో, మెడమీదో నచ్చిన డిజైను వేసుకుని, రంగు నింపితే... సహజ టాటూలానే కనిపిస్తుంది. ఆ డిజైను తాత్కాలికమే కాబట్టి... వారం నుంచి పది రోజుల తరువాత దానంతట అదే పోతుంది. కొన్నింటికి పెన్నులతోపాటూ డిజైను ఉన్న స్టెన్సిల్‌ స్టిక్కర్లు కూడా వస్తాయి.

ఈ పెన్నులన్నీ సౌకర్యాన్నివ్వడంతోపాటూ స్థలం కూడా పెద్దగా ఆక్రమించవు కాబట్టి... హ్యాండు బ్యాగులోనూ వేసుకుని వెంట తీసుకెళ్లొచ్చు. ఇంత సౌకర్యంగా ఉన్న ఈ మేకప్‌ పెన్నులకు యూత్‌లో క్రేజ్‌ తెగ పెరుగుతోందని ప్రత్యేకంగా చెప్పాలా!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు