close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
త్రిశూల రూపంలో... శ్రీ మహాలక్ష్మి!

అష్టసంపదలిచ్చే అద్భుతశక్తి స్వరూపిణిగా శ్రీ మహాలక్ష్మిని కొలుస్తారు భక్తులు. ఆమె అనుగ్రహించిందంటే నిరుపేద ఇంట్లోనూ కనకవర్షం కురవాల్సిందే. అలాంటి బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మి అవతారంలో, త్రిశూల రూపంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనగడప గ్రామంలో కొలువయ్యింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఆమెకు పేరుంది.

క్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం... అంటూ లక్ష్మీదేవిని కొలుస్తాం... పాల సముద్రంలో పుట్టిన ఆ తల్లి మనసూ సముద్రమంత విశాలమైనదంటారు. లక్ష్మీదేవి సాధారణంగా చతుర్భుజిగా దర్శనమిస్తుంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామంలో అమ్మవారు త్రిశూల రూపంలో వెలసింది. అష్టాదశ భుజాలతో దర్శనమిస్తూ మహాశక్తిశాలినిగా పేరుగాంచింది. ఈ ఆలయం వెనక కథ శతాబ్దాల నాటిది.

స్థల పురాణం
పూర్వం భద్రాచలం ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. సుమారు ఆరు వందల ఏళ్ల క్రితం ఒక రుషి పుంగవుడు పవిత్ర గోదావరీ తీరాన తపమాచరించి, కృష్ణా నదికి వెళుతూ ఈ పెనగడప గ్రామంలో సంధ్యావందనాది క్రతువులు పూర్తి చేసుకొనేందుకు ఆగాడు. అక్కడి వేంకటేశ్వర చెరువు (ఎర్ర చెరువు)లో స్నానం చేసి పక్కనే ఉన్న ఒక వెదురు పొద కింద అనుష్ఠానం చేసుకున్నాడు. అప్పుడే అక్కడి నీటికి ఎన్నో ఔషధ గుణాలున్నాయనీ, జప సమయంలో తనను ఏదో దివ్యశక్తి ఆవహించిందనీ గమనించి ఆ ప్రాంతంలోనే కొంతకాలం ఉండి తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన మహాలక్ష్మీ ఉపాసకుడు కావడంతో, ఆ అమ్మను తన చేతిలో ఉన్న త్రిశూలంలోకి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. తపశ్శక్తినంతా త్రిశూలంలోకి ధారపోస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయన కృష్ణా తీరానికి వెళ్లదలచాడు. అప్పుడు తన దగ్గర త్రిశూల రూపంలో ఉన్న మహాలక్ష్మీ అమ్మవారి బాధ్యతను ఆ గ్రామంలోని ఇంద్రగంటి భద్రేశ్వర శర్మ, రైతు కట్టా రామయ్యలకు అప్పగించాడు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి గ్రామ రక్షణ కోసం విశేష సేవలూ, కొలుపులూ చేసే విధంగా గ్రామ ప్రజల నుంచి మాట తీసుకున్నాడు. అప్పటి నుంచీ గ్రామానికి చెందిన ఇంద్రగంటి వంశం వారే మహాలక్ష్మీ ఆలయ బాధ్యతలను చూసుకుంటున్నారు. సంవత్సరాలుగా ఆమెకు పూజాది క్రతువులు నిర్వహిస్తూ వచ్చారు. ఏ శుభకార్యమైనా తొలి పిలుపు ఆమెకే ఇస్తూ ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. అయితే, మొదట్లో నిర్మించిన చిన్న ఆలయం శిథిలావస్థకు రావడంతో నాలుగు సంవత్సరాల క్రితం అదే వంశానికి చెందిన శంకరప్రసాద శర్మ ఆధ్వర్యంలో గ్రామస్థులూ, భక్తుల సహకారంతో సర్వాంగ సుందరంగా కొత్త ఆలయాన్ని నిర్మించారు. ప్రతి పౌర్ణమి రోజూ ఈ వంశానికి చెందిన ఒక్కో కుటుంబం వాళ్లూ చండీహోమం నిర్వహించి అన్నదానం జరుపుతున్నారు. ఒక్క పెనగడప వాసులే కాదు చుట్టు పక్కల ఎన్నో గ్రామాలకు చెందిన ప్రజలూ అమ్మవారిని భక్తితో దర్శించుకుంటారు.

మహాశక్తి స్వరూపం
దేవాలయంలో రుషిపుంగవుడు శక్తి ధారపోసిన త్రిశూలంతో పాటు అష్టాదశ భుజాలతో ఉండే మహాలక్ష్మీదేవి విగ్రహమూ కన్నుల పండువగా దర్శనమిస్తుంది. ఈ రూపానికి ఒక విశిష్టత ఉంది. జగన్మాత ఆదిశక్తి నుంచీ మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతీ రూపాలు ఉద్భవించాయంటారు. ఇందులోని మహాలక్ష్మీ స్వరూపానికి పద్దెనిమిది చేతులుంటాయి. మహిషాసురుణ్ని మర్దించిన శక్తి స్వరూపం ఈవిడేనన్నది పురాణ వాక్కు. త్రిశూలం, మధుపాత్ర, బాణం, వజ్రాయుధం, పద్మం, ధనుస్సు, కలశం... తదితరాలు ఈ చేతుల్లో పట్టుకుని ఉంటుంది. అందుకే ఈ మహాలక్ష్మిని మహాశక్తి స్వరూపంగా చెబుతారు. ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి సోదరుడిగా చెప్పే పోతురాజు విగ్రహంతో పాటు శివుడూ, సీతారాములూ, నవగ్రహాల ప్రతిమలూ దర్శనమిస్తాయి. ప్రతి మాఘమాసంలో వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం జరిపే దీపలక్ష్మి పూజకు ఎంతో విశిష్టత ఉంది. ఏదైనా పని తలపెట్టి ఈ పూజ చేస్తే తప్పక విజయాన్ని సాధిస్తారని నమ్ముతారు భక్తులు. ఎక్కడ వర్షం పడ్డా పడకపోయినా ఈ ఊళ్లో మాత్రం సమృద్ధిగా వర్షాలు కురవడానికి అమ్మ దయే కారణమంటారు. బోనాలూ, దసరా ఉత్సవాలూ వైభవోపేతంగా జరుగుతాయిక్కడ.

కొత్తగూడెం నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి పక్కనే ఉండే ఈ ఆలయానికి చేరుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం నుంచి బస్సు, ఆటో సౌకర్యం ఉంది. రైలులో రావాలనుకున్న వాళ్లు భద్రాచలం రోడ్‌ (కొత్తగూడెం) రైల్వే స్టేషన్‌ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుడికి వెళ్లొచ్చు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు