చూపులేనివారికి... చేయూత ఇస్తారు! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చూపులేనివారికి... చేయూత ఇస్తారు!

చూపులేకపోయినా ఏదో సాధించాలనే తపన వాళ్లది. అంధుల్లోని ఆ స్ఫూర్తిని గుర్తించిన ఈ ముగ్గురూ వాళ్లకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వాళ్లకు అవసరమైన చికిత్సలు చేయిస్తూ, చదువుకునేలా ప్రోత్సహిస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఇంతకీ వాళ్లెవరూ... ఏం చేస్తున్నారంటే...


పాఠాలు చెబుతారు

కొన్నాళ్ల క్రితం ఓ అంధ విద్యార్థి పాఠాలు కేవలం విని ఇంటరులో వెయ్యికి 960 మార్కులు తెచ్చుకున్నాడట. ఇది తెలిసిన చెన్నైకి చెందిన భరత్‌ అనే మెకానికల్‌ ఇంజినీర్‌ అలాంటివారికి తన వంతుగా సాయం చేయాలనుకున్నాడు. కొందరు స్నేహితులతో కలిసి ‘లిట్‌ ద లైట్‌’ పేరుతో ఓ ఎన్జీవోను ప్రారంభించాడు. ఈ సంస్థ అంధ విద్యార్థులకు ప్రత్యేక బోధనా తరగతులను  నిర్వహిస్తుంది. అంటే వీళ్ల వాలంటీర్లు ఆ విద్యార్థుల పక్కన కూర్చుని పాఠాలు చదివి వినిపిస్తారు. అలాగే స్టడీమెటీరియల్‌తోపాటూ స్ఫూర్తి గాథలూ, కాంపిటేటీవ్‌ పరీక్షలకు సంబంధించిన అంశాలను రికార్డు చేసి మరీ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో ఉంచుతారు. పరీక్షలు రాయాలనుకునేవారికీ స్క్రైబ్‌లనూ ఏర్పాటు చేస్తుందీ సంస్థ. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో ఎవరైనా స్క్రైబ్‌ కావాలని మెసేజ్‌ పెడితే ఈ సంస్థ వాలంటీర్లు వెంటనే స్పందిస్తారు. అదేవిధంగా రకరకాల అంశాల్లో ప్రతిభగల అంధులను గుర్తించి వాళ్ల వీడియోలను సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టు చేస్తుందీ సంస్థ. వీటన్నింటితోపాటూ వాళ్లు ఎలాంటి ఇబ్బందీ పడకుండా ఉద్యోగం చేసేలా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌లోనూ శిక్షణ అందిస్తోంది. అలా శిక్షణ పొందినవారిలో పాతికమంది ఇప్పటికే ఉద్యోగాలు పొందడం గమనార్హం. భరత్‌ సొంతూరు తమిళనాడు, కృష్ణగిరి జిల్లాలోని అరసంపట్టి. ప్రస్తుతం చెన్నై, కోయంబత్తూర్‌, మదురై, ఈరోడ్‌లలో ఈ సేవల్ని అందిస్తున్నా... దేశవ్యాప్తంగా వీలైనంతమంది అంధుల్ని ఆదుకోవాలనేది భరత్‌ లక్ష్యం.


స్కాలర్‌షిప్‌తో ప్రోత్సాహం

కుటుంబసభ్యులతోపాటూ ఆర్థిక పరిస్థితులు సహకరిస్తేనే అంధ విద్యార్థులు చదువుకోగలుగుతారు. అయితే... చాలామందికి అలాంటి అవకాశం ఉండదని గుర్తించిన డి.కె.పటిల్‌ అనే రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి చూపులేని వారికోసం ‘హెల్ప్‌ ద బ్లైండ్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. ఇది చెన్నైలో ప్రారంభమైనా ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తో కలిపి పద్నాలుగు రాష్ట్రాల్లోని అంధ విద్యార్థులు ఈ సంస్థ ద్వారా చదువుకుంటున్నారు. చూపులేని వారెవరూ చదువు మధ్యలో ఆపేయకూడదనే ఆశయంతోనే దీన్ని ప్రారంభించిన పాటిల్‌ డిగ్రీలోపు అంధ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తాడు. చదువు, కళలు, కంప్యూటర్‌ విద్య... ఏదయినా సరే విద్యార్థులు ఈ సంస్థకు దరఖాస్తు చేసుకుని ఉపకారవేతనాన్ని పొందవచ్చు. అవసరమైనవారికి కంప్యూటరు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు, ల్యాప్‌ట్యాప్‌లూ, పాఠాలు రికార్డు చేసుకునే పరికరాలూ అందిస్తుందీ సంస్థ. వీటన్నింటితోపాటూ రకరకాల అంశాల్లో శిక్షణా తరగతులూ నిర్వహించి వాళ్లు జీవితంలో నిలదొక్కుకునేలా అండగా ఉంటుంది.


కంటి ఆపరేషన్లు చేయిస్తాడు

విదేశంలో స్థిరపడినా... సొంతూరుకు వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు నిర్వహించే సేవా కార్యక్రమాలను చూసిన వావిలపల్లి సాయి హితేష్‌ తనవంతుగా ఏదో ఒకటి చేయాలనే తపనతో ‘ద ఐ మిషన్‌’ను ప్రారంభించాడు. నిండా ఇరవైఏళ్లు కూడా లేని హితేష్‌ ప్రస్తుతం కంటి సమస్యలతో బాధపడేవారికి ఉచిత స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి, అవసరమైతే ఆపరేషన్లూ చేయిస్తున్నాడు. హితేష్‌ స్వస్థలం విశాఖపట్నం. తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడటంతో అక్కడే చదువుకుంటున్నాడు. తనకు పద్నాలుగేళ్లున్నప్పుడు ఓసారి తల్లిదండ్రులతో కలిసి భారత్‌ వచ్చాడు. ఆ సమయంలో వాళ్లు చేసిన సేవతోపాటూ, కాకినాడలోని ఓ అంధ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలు చూసి తానూ ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. తరువాత అమెరికా వెళ్లిన అతడు ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించి... 4,200 డాలర్లను సేకరించాడు. ఆ తరువాత కొన్నాళ్లకు విశాఖపట్నం వచ్చిన హితేష్‌... శంకర్‌ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రి సహకారంతో పేదవారికి ఉచిత కంటిపరీక్షలు నిర్వహించి 500 ఆపరేషన్లు చేయించాడు. ఇలా  ఇప్పటివరకూ 5000 మందికి ఉచిత కంటి పరీక్షలూ దాదాపు 1800 ఆపరేషన్లూ చేయించడంతో అంధ పాఠశాలల్నీ దత్తత తీసుకున్నాడు. ఇందుకు అవసరమైన నిధుల్ని సేకరించేందుకు కార్పొరేట్‌ సంస్థల సాయమూ తీసుకుంటున్నాడు. ఓ వైపు చదవుకుంటున్నా... వీలైనంతమంది అంధుల్ని ఆదుకోవడమే తన లక్ష్యమని చెబుతాడు హితేష్‌.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న