close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డ్రైఫ్రూట్స్‌ జాబితాలో అరటిపండు చేరిందోచ్‌..!

పసిపాపకు తొలిసారి తినిపించే అమృతఫలం... వయసుతో పనిలేకుండా, పేదా గొప్పా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సునాయాసంగా తీసుకోగలిగే అద్భుత ఫలం అరటిపండు. ఎన్నో పోషకవిలువలతో కూడి... చౌకగా లభించే ఈ పండు బియ్యం, గోధుమ, మొక్కజొన్న తరవాత స్థానంలో ఉన్న ప్రధాన ఆహార పంట. ఇలాంటి ప్రత్యేకతలెన్నో ఉన్న ఈ కదళీఫలం కూడా ఇప్పుడు డ్రైఫ్రూట్స్‌ జాబితాలో చేరిపోయింది. మరి ఎండిన ఆ అరటి రుచేంటో మనమూ చూసేద్దామా...!

కాలంలోనైనా మార్కెట్‌లోనూ, వీధి చివర బండి మీదా... ఇలా ఎక్కడ పడితే అక్కడ చౌకగా దొరికేది ఒక్క అరటి పండే. వీటిని ఇలా కొని తీసుకొచ్చామో లేదో అలా పండిపోతాయి. పిల్లలే కాదు చాలామంది పెద్దవాళ్లు కూడా కాస్త మగ్గిపోయినా, పండిన వాసన వచ్చినా వాటిని తినడానికి ఇష్టపడరు. దాంతో వాటిని వృథాగా పడేయలేక కళ్లు మూసుకుని తినేయడమో, లేదా జ్యూస్‌రూపంలోకి మార్చేసి తీసుకోవడమో చేస్తుంటారు ఆడవాళ్లు. అలానే అరటి పండ్లని ప్రయాణాల్లో తీసుకెళ్లడం కూడా కుదరదు. ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవే అయినా వీటితో చాలానే సమస్యలున్నాయి. అదే ఎండిన అరటి పండ్లను తెచ్చేసుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా తినేయొచ్చు. ఎన్నిరోజులున్నా పాడైపోతాయనే బాధ కూడా ఉండదు. ప్రయాణాల్లోనూ బయట ఆహారానికి బదులు ఈ డ్రైఫ్రూట్స్‌ ఆకలిని తీర్చుతాయి.

ఎండబెడతారు...
ఎండలో యంత్రాల సాయంతో వీటిని ఆరబెట్టి డ్రైఫ్రూట్స్‌గా మార్చేస్తారు. అలా చేయడం వల్ల వీటిలోని పోషక విలువ లేమీపోవు. ఎండిన పండు రుచి కూడా తాజా అరటి మాదిరే ఉంటుంది. మన దగ్గర ఆప్రికాట్‌, అంజీరా, కివీ, కిస్మిస్‌, ఎండుఖర్జూరాలను ఎక్కువగా తీసుకుంటాం తప్ప  అరటిపండును డ్రైఫ్రూట్‌గా తీసుకోవడం ఇంకా మొదలు కాలేదు. కానీ ఆఫ్రికా, జమైకా, థాయ్‌లాండ్‌, తైవాన్‌, బ్రెజిల్‌ వంటి చోట్ల ఇదే ప్రధాన పంట, ఇష్టంగా తినే డ్రైఫూట్‌ కూడా. జమైకా, ఆఫ్రికా దేశాల్లో ఎండిన అరటి నుంచి తయారు చేసే పొడిని గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా వాడతారు. బలమని పిల్లలకు ఈ పిండితో చేసిన తినుబండారాలను ఎక్కువగా తినిపిస్తారు. సెలెబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌ కూడా సిక్స్‌ప్యాక్‌ కోసం కష్టపడే చాలామందికి ఈ పిండిని సూచిస్తోంది. ఇక మరికొన్ని దేశాల్లో ఎండిన ఫలాలతో బార్లూ, కుకీస్‌, జెల్లీలూ, క్యాండీలూ విరివిగా తయారు చేస్తున్నారు.

కరోనా వల్ల ఇప్పుడు మన దగ్గర కూడా ఎండబెట్టిన అరటి పండ్లకు గిరాకీ వచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో పంటను సరైన సమయానికి అమ్ముకోలేక మగ్గిపోయిన పండ్లను రోడ్డు పక్కన పడేశారు ఎంతో మంది అరటి రైతులు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన గంగాధర్‌ అనే రైతు మాత్రం పంట చేతికి రాగానే మార్కెట్‌కి తీసుకెళ్లకుండా తొక్క తీసి ఎండబెట్టి డ్రైఫ్రూట్స్‌గా మార్చి అమ్మడం మొదలుపెట్టాడు. పైగా విదేశాల్లోనూ వీటికి గిరాకీ ఉన్న విషయం తెలుసుకుని ఎగుమతి చేయడానికి ఆర్డర్లు తీసుకున్నాడు. అలా కష్టకాలంలో గంగాధర్‌ చాలామందికి దారిచూపాడు. ఆ స్ఫూర్తితోనే గోదావరి, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని కొందరు రైతులు ఇప్పుడు అరటిపండ్లని ఎండుఫలాలుగా మార్చేసి లాభసాటి మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఓసారి రుచి చూద్దామా మరి!


ఆన్‌లైన్‌లోనూ దాగుడుమూతలు!

ఎస్కేప్‌ రూమ్స్‌... హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీలాంటి నగరాల్లో ఇవి చాలా ఫేమస్‌! మనల్నీ, మన స్నేహితుల్నీ బృందంగా ఓ చోట బంధించి చిన్న చిన్న ‘క్లూ’లు అందిస్తూ తప్పించుకొమ్మని చెప్పడమో, ఓ ఊహాజనిత క్రైమ్‌ వాతావరణంలోకి తీసుకెళ్లి అక్కడి మిస్టరీని ఛేదించేలా చూడటమో ఈ సంస్థల పని! మరి కరోనా వేళ ఈ ఆటలు సాగడమెలా?! అందుకే ఈ సంస్థలు ఆన్‌లైన్‌ బాటపట్టి సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఆ రకంగా మనదేశ ‘ఆన్‌లైన్‌ గేమ్స్‌’ రంగాన్ని మరోమెట్టు పైకి తీసుకెళ్తున్నాయి!

న దగ్గర ‘పబ్జీ’, ‘టెంపుల్‌ రన్‌’ వంటి ఆన్‌లైన్‌ గేమ్‌లు బాగా పాపులర్‌ కదా! వాటి స్థాయిలో కాకపోయినా ది రూమ్‌, అడ్వెంచర్‌ ఎస్కేప్‌, ది హౌజ్‌ ఆఫ్‌ డా వించీ... వంటి ఎస్కేప్‌ గేమ్స్‌కి కూడా యువతలో మంచి క్రేజ్‌ ఉంది. వాటికీ వీటికీ తేడా ఏంటీ అంటే... వాటిల్లో పాత్రధారులు ఇంకెవరో ఉంటారు. వాళ్లని మనం ఆడిస్తూ పోటీలో పాల్గొనాలి.

ఎస్కేప్‌ గేమ్స్‌ అలా కాదు... వీటిల్లో మనమే హీరోలం. వర్చువల్‌గా మనమే ఓ చోట చిక్కుకుని పోతాం... అందులో నుంచి బయటపడటానికి మన తెలివీ, సృజనా ఉపయోగిస్తాం. లేదా ఓ డిటెక్టివ్‌లా మారి ఏ హత్యా మిస్టరీనో, దోపిడీ నేపథ్యాన్నో ఛేదిస్తాం. ఈ గేమ్‌లలో మనం ఒక్కరమే కాకుండా బృందంగా పాల్గొనాల్సి ఉంటుంది. నిన్నమొన్నటిదాకా ఇవి మనదేశంలో తయారుకావడం లేదు. ఇందువల్ల ‘అటు సినిమా రంగంలోనూ, ఇటు యానిమేషన్‌ రంగంలోనూ మనదేశంలో మంచి నిపుణులున్నా అటువైపు అంతగా ఎవరూ దృష్టి పెట్టడం లేద’నే విమర్శలూ ఉండేవి. ఆ విమర్శల్ని తుడిచిపెట్టేలా ఇక్కడా ఇప్పుడు ఆన్‌లైన్‌ ఎస్కేప్‌ గేమ్స్‌ తయారవుతున్నాయి. కాకపోతే, ఇవి యానిమేషన్‌, టీవీ సినిమాల రంగం నుంచి కాకుండా... మరో కొత్త పరిశ్రమ నుంచి రావడమే విశేషం. ఆ పరిశ్రమే... ‘ఎస్కేప్‌ రూమ్స్‌’.

ఏమిటివి?
తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌ ప్రసాద్‌ ఐ మ్యాక్స్‌ థియేటర్స్‌లో తొలిసారి 2013లో ‘స్కేరీ రూమ్‌’ని ఏర్పాటుచేశారు. హారర్‌ సినిమాలాంటి వాతావరణంలోకి మనల్ని పంపించి భయపెడతారు ఇందులో. ఆ మల్టీప్లెక్స్‌లో ఉన్న ‘మిర్రర్‌ రూమ్‌’ కూడా ఇలాంటిదే. కాకపోతే వీటిల్లో మనం భయపడటం/ఆశ్చర్యపోవడం తప్ప బుర్రకి పదును పెట్టడం ఉండదు. ‘ఎస్కేప్‌ రూమ్స్‌’ మనల్ని ఆ పని కూడా చేయిస్తాయి. 2018లో ఇవి హైదరాబాద్‌లో అడుగుపెట్టాయి. ఈ ఒక్క నగరంలోనే ది హిడెన్‌ అవర్‌, మిస్టరీ రూమ్స్‌, నో ఎస్కేప్‌, ది ఫారెస్ట్‌ ఎడ్జ్‌ వంటి పదికి పైగా సంస్థలున్నాయి. వీటి స్ఫూర్తితో విజయవాడ లాంటి నగరాల్లో కొన్ని గేమింగ్‌ సంస్థలు వీటిని ఏర్పాటుచేశాయి. ఈ సంస్థలు అందించే గేమ్‌లలో చాలావరకూ బృందంగా ఆడాల్సినవే కాబట్టి... ‘టీమ్‌ బిల్డింగ్‌’ నైపుణ్యాల కోసం కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగుల్ని ఇక్కడికి పంపుతుండేవి. కొన్ని కుటుంబాలూ వివిధ వేడుకల కోసం కలిసికట్టుగా ఆడుకోవడానికి ఇక్కడికొచ్చేవి. కరోనా లాక్‌డౌన్‌తో ఇవన్నీ మూతపడ్డాయి. ఆ సంక్షోభమే వీటిని ప్రత్యామ్నాయాలవైపు చూసేలా చేసింది. ఇప్పటిదాకా ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్న గేమ్‌లని ‘ఆన్‌లైన్‌’గా మార్చుకున్నాయి. దాని ఫలితంగా- మన స్వదేశీ తయారీతో ఇక్కడా వర్చువల్‌ ఎస్కేప్‌ గేమ్స్‌ వచ్చేశాయి!

ఏమేం ఉన్నాయంటే...
మనదేశంలో ఉన్న ఎస్కేప్‌ గేమ్‌ సంస్థల్లో ది హిడన్‌ అవర్‌, మిస్టరీ రూమ్స్‌, నో ఎస్కేప్‌ సంస్థలకి ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోని పెద్ద నగరాలన్నింటా శాఖలున్నాయి. ఈ మూడు సంస్థలే ప్రధానంగా ఇప్పుడు ఆన్‌లైన్‌ ఎస్కేప్‌ గేమ్‌లని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ది హిడెన్‌ అవర్‌ అందిస్తున్న మిషన్‌ బ్లాక్‌ టవర్‌, ఫ్లైట్‌ 1032, సీక్రెట్‌ ఏజెన్సీ వంటివి నెటిజన్‌ల మధ్య బాగా పాపులరయ్యాయి. ‘నో ఎస్కేప్‌’ సంస్థ సంస్థ అయితే ‘కొవిడ్‌-19’ ఆధారంగా ఓ తాజా గేమ్‌ని సృష్టించింది. కరోనా సోకినా కూడా ఓ సీఐడీ ఓ ఉగ్రవాద కుట్రని ఎలా భగ్నం చేస్తాడు అన్నది ఇందులో ప్రధాన అంశం! మిస్టరీ రూమ్స్‌ సంస్థ కూడా ఇలా ‘కొవిడ్‌-19’ ఆధారంగానే ఆన్‌లైన్‌ గేమ్స్‌ను సృష్టిస్తోంది.

ఆఫ్‌లైన్‌లో ఓ గేమింగ్‌ వాతావరణాన్ని ఏర్పాటుచేయడానికి దాదాపు పదిలక్షల రూపాయలు ఖర్చయితే ఆన్‌లైన్‌లో నాలుగు లక్షలే అవుతున్నాయట. నిర్వాహకులకే కాదు వినియోగదారులకీ ఇది కలిసొస్తోంది.
ఇదివరకు ఇవి ఏ నగరాల్లో ఉంటే అక్కడ మాత్రమే ఆడే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో మీ స్నేహితులు ఎక్కడున్నా వీటిని ఆడుకోవచ్చు! అంతేకాదు, మనం ఆఫ్‌లైన్‌లో ఎస్కేప్‌ రూమ్‌ల్లోకి వెళ్లాలంటే కనీసం వెయ్యిరూపాయలైనా అవుతుంది. ఇప్పుడేమో 150 రూపాయలకే మనం ఆటాడుకోవచ్చు. పైగా విదేశాల్లో రూపొందే ఆన్‌లైన్‌ ఎస్కేప్‌ గేమ్‌లకంటే ఇవి చాలా తక్కువ ధరకే మనకు అందుబాటులోకి వస్తున్నాయి. స్వదేశీ తయారీతో వస్తున్న లాభం అది!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు