close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మంచి మనసుకు... ఇల్లు బహుమతి!

దుటి వారి మేలు కోరితే అది ఏదో ఒక రూపంలో మనకి మంచి చేస్తుంది... అంటారు. ఆ మాటలు అక్షరాలా నిజమయ్యాయి కేరళకు చెందిన సుప్రియ విషయంలో. ఆమె తిరువల్లలోని జాయ్‌ ఆలుకాస్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. ఈ మధ్య ఒక రోజు సుప్రియ బస్టాండ్‌లో బస్సుకోసం ఎదురు చూస్తున్నప్పుడు చూపులేని ఓ వృద్ధుడు కూడా బస్సు ఎక్కడానికి వచ్చాడు. అయితే అతను ఎక్కాల్సిన బస్సును మాత్రం డ్రైవరు బస్టాపులో ఆపలేదు. అది చూసిన సుప్రియ బస్సు వెనక చాలాదూరం పరిగెత్తి దాన్ని ఆపి ఆ వృద్ధుణ్ని క్షేమంగా ఎక్కించింది. ఇదంతా అక్కడున్న ఓ యువకుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. తెగ వైరల్‌ అయిన ఈ వీడియో చివరికి సుప్రియ పనిస్తున్న సంస్థ ఛైర్మన్‌ వరకూ చేరింది. దాంతో వెంటనే ఆమెని అభినందించడానికి ఇంటికి వెళ్లాడాయన. చాలీచాలని ఓ కిరాయి ఇంట్లో భర్తా, ఇద్దరుపిల్లలతో సుప్రియ అద్దెకుండటం చూసి ఎంతగానో బాధపడ్డాడు. అందుకే మంచి మనసున్న ఆమె కష్టాలను తీర్చాలని లక్షల విలువ చేసే ఓ ఇంటినే బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.


పొట్టా... తేనెటీగల తుట్టా

తేనెటీగల పేరు చెబితే చాలు చాలామందికి ఒళ్లు జలదరించేస్తుంది. అవి గుంపుగా దాడిచేస్తే ప్రాణాలు కూడా దక్కవు. మరి అంత ప్రమాదకరమైన తేనెటీగలతో ఫొటో షూట్‌ చేయించుకుని సంచలనం సృష్టించింది టెక్సాస్‌కు చెందిన బెథానీ కురులక్‌ బేకర్‌. ఆమెకి తేనె టీగలు పెంచడం ఓ సరదా వ్యాపకం. అందుకు గంటలు గంటల సమయం కేటాయిస్తుంది. అంతేకాదు, గర్భం దాల్చిన సమయంలో తీపి జ్ఞాపకంగా గుర్తుండిపోవాలని 37వ వారంలో తన పొట్టమీద తేనెటీగల్ని పెట్టుకుని ఫొటో షూట్‌ చేయించుకుంది. భర్తతో కూడా కలిసి పలు ఫొటోలకి ఫోజులిచ్చింది. మరి ఇలాంటి సాహసాన్ని చేసిన బేకర్‌కు గతంలో గర్భస్రావం కావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆ తరువాత పలు అనారోగ్య సమస్యలకి గురైంది. దాంతో రెండోసారి గర్భం దాల్చిన తరవాత విషయం ఎవరికీ చెప్పలేదు. తాజాగా తేనెటీగల ఫొటోషూట్‌ ద్వారా ఆ విషయాన్ని అందరితోనూ పంచుకుంది.


కొబ్బరి ఆకులతో స్ట్రా

ర్యావరణానికి హాని చేసే వాటిల్లో ముందుండేది ప్లాస్టిక్‌. అందుకే చాలామంది దీనికి ప్రత్యామ్నాయంగా రకరకాల వస్తువులను వాడుతున్నారు. అందులో భాగంగానే సాజీ వర్గీస్‌ ప్లాస్టిక్‌ స్ట్రాలకు బదులుగా కొబ్బరి ఆకులతో చేసిన స్ట్రాలను రూపొందిస్తున్నాడు. బెంగళూరులోని క్రైస్ట్‌ యూనివర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు వర్గీస్‌. ఆయన పనిచేస్తున్నది ఆంగ్ల విభాగంలో అయినప్పటికీ ఆసక్తి కొద్దీ కొబ్బరిస్ట్రాల రూపకల్పన చేశాడు. అందుకు సంబంధించిన యంత్రాన్నీ తయారు చేసి పేటెంట్‌ పొందాడు. తయారీలో భాగంగా కొబ్బరి ఆకుల్ని గుజ్జుగా చేసి యంత్రం సాయంతో దాన్ని పల్చటి షీట్లుగా మారుస్తారు. తరవాత పొరల్ని ఫుడ్‌గ్రేడ్‌ జిగురుతో అతికించి స్ట్రాలను తయారు చేస్తారు. వీటిని వర్గీస్‌ ‘సన్‌బర్డ్‌’ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. ఒక్క కొబ్బరిమట్టనుంచి దాదాపు 200 వందల దాకా స్ట్రాలు తయారవుతాయి. అంతేకాకుండా, ఈ స్ట్రాలు 45 దేశాలు పాల్గొన్న ఓ పోటీలో ‘బెస్ట్‌ ఇన్నోవేషన్‌ ఫర్‌ సోషల్‌ ఇంపాక్ట్‌’ అవార్డుకు ఎంపికయ్యాయి. ఇప్పటికే మలేషియా, అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్‌ వంటి దాదాపు పది దేశాల నుంచి 2 కోట్ల స్ట్రాలకు ఆర్డర్లు కూడా వచ్చాయి వర్గీస్‌కు.


ఈ ఎద్దులకు ఆదివారం సెలవు

దివారం సెలవు కేవలం ఉద్యోగులకేనా, పంట పొలాల్లో మాతో కలిసి శ్రమిస్తున్న మా ఎద్దులకూ ఇస్తామంటున్నారు ఝార్ఖండ్‌ రైతన్నలు. తాతేహార్‌ జిల్లాలోని హరఖ్ఖా, లల్‌గడీ, పక్‌రార్‌ పరిసర గ్రామాల్లో - పశువులకు సెలవులివ్వడం ఓ సంప్రదాయంగా వస్తోంది. కష్టం, సుఖం అనేవి మనుషులకు ఉన్నట్టే మూగ జీవాలకూ ఉంటాయి. చేసే పనిలో విరామం అంటూ ఉంటే మరింత ఉత్సాహంగా పని చేయొచ్చన్నది వీరి మాట. విరామం లేకుండా పని చేస్తే మెదడు అలసిపోయి, శరీరం సొలసిపోయి రోగాలు ముసురుకుంటాయి. అదే పరిస్థితిని పశువులూ ఎదుర్కొంటాయి. కాబట్టి వాటికీ పనిలో విశ్రాంతి చాలా అవసరం అంటున్నారు లాతేహార్‌ పశుసంవర్థక శాఖ అధికారి రామ్‌సేవక్‌ రామ్‌. తమ జిల్లా గ్రామీణులు తరతరాలుగా అనుసరిస్తున్న ‘పశువులకు వారానికొక రోజు సెలవు’ విధానం చాలా గొప్పదనీ, అన్ని ప్రాంతాల్లోనూ ఆచరించదŸగినదనీ చెబుతున్నారు. భలే ఐడియా కదూ!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు