close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కుండీమీద పేరు, ఫొటో!

ష్టమైన వారికి మొక్కలను బహుమతులుగా ఇవ్వడం ఈ మధ్య కాలంలో ట్రెండయింది. ఆహ్లాదాన్ని పంచే ఈ కానుకలు ఇచ్చే వారితోపాటు అందుకున్న వారికీ బాగా నచ్చుతున్నాయి కూడా. అందుకే, ఆ బహుమతులకు మరింత ప్రత్యేకత తీసుకువచ్చేలా ఇప్పుడు పర్సనలైజ్డ్‌ ప్లాంటర్‌ పాట్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి వివిధ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు. పుట్టినరోజు, పెళ్లి పండుగలు... ఇలా సందర్భానికి సరిపోయేలా రకరకాల శుభాకాంక్షలు, కోట్‌లతో పాటు ఫొటోలు ప్రింట్‌ చేసి వస్తున్నాయి ఈ కుండీలు. మనం బహుమతి ఇవ్వాలనుకున్న వారి అభిరుచిని బట్టి వీటిని ఎంచుకుంటే ఎంచక్కా వెబ్‌సైట్‌ వాళ్లే ఆ బహుమతిని వారికి అందిస్తారు. గులాబీ, వెదురు, మనీప్లాంట్‌... ఇలా మనకు నచ్చిన మొక్కను అందులో పెట్టి ఇస్తారు. ఇలాంటి బహుమతి అందిస్తే ఇచ్చిన వాళ్లకీ తీసుకున్న వాళ్లకీ మధ్య అనుబంధం మొక్కల్లాగే పచ్చగా కళకళలాడుతుంది కదూ!


ఫ్లవర్‌వేజ్‌ గొడుగయిపోతోంది!

నం వాడే ప్రతి వస్తువులోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాం. మరి మనల్ని ఎండావానల నుంచి రక్షించే గొడుగుకు మాత్రం అందులో నుంచి మినహాయింపు ఎందుకుండాలి... అందుకే గొడుగులనూ ఇప్పుడు విభిన్నంగా తయారు చేస్తున్నారు. అలా పుట్టుకొచ్చిందే రోజ్‌ వేజ్‌ అంబ్రెల్లా. ఇది చూసేందుకు అందమైన గులాబీ మొగ్గ పెట్టిన ఫ్లవర్‌వేజ్‌లా ఉంటుంది. ఆ వేజ్‌లోంచి గులాబీ మొగ్గను లాగితే మాత్రం అది ఒక గొడుగయిపోతుందన్నమాట. గొడుగును ఉపయోగించాక మళ్లీ మడిచేసి ఈ వేజ్‌లాంటి దాంట్లో పెట్టేసుకోవచ్చు. దీన్ని ఎక్కడికయినా తీసుకువెళ్లడం సులభం, అంతేకాదు దాన్ని ఈవేజ్‌ లోపల పెడతాం కాబట్టి మడిచి పెట్టినా బ్యాగ్‌కు తడి అంటదు.


విజిల్‌ వేస్తే తాళాలు పలుకుతాయ్‌!

నకు ఆత్యవసరమైనవీ, ఇంట్లో ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోయేవీ ఏంటంటే అవి తప్పకుండా తాళాలే అవుతాయి. బయటకి వెళ్దామని బయల్దేరే సమయానికి అవి ఎక్కడో ఉండిపోయి హడావుడి పెట్టేస్తాయి. సెల్‌ఫోన్‌కి రింగ్‌ ఇస్తే ఎక్కడుందో తెలిసిపోయినట్టు ఈ తాళాలూ అలా దొరికేస్తే ఎంత బాగుండునని చాలా మందే అనుకుంటూ ఉంటారు. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకునే తాళాలు ఎక్కడ ఉన్నాయో చిటికెలో తెలుసుకునేందుకు తయారు చేసిందే కీ ఫైండర్‌. మామూలు కీచెయిన్‌లాగే దీనికీ తాళంచేతులు పెట్టుకోవచ్చు. అయితే ఇందులో ఉండే సెన్సర్లవల్ల మనం విజిల్‌ వేసినా, చప్పట్లు కొట్టినా అది వెలుగుతూ, శబ్దం చేస్తుంది. అందుకే చీకట్లో ఉన్నా తాళాలను చిటికెలో పట్టేయొచ్చు. దాదాపు 30 అడుగుల దూరంలో ఉన్నవాటినీ మనం ఇలా కనిపెట్టేయవచ్చు. ఇది ఉంటే తాళాలు వెతికే ఇబ్బంది లేనట్టే!


కళ్లకూ మాస్క్‌!

రోనా వైరస్‌ నోరూ, ముక్కుతోపాటు కళ్ల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందని ఆరోగ్య సంస్థలు చెబుతున్న నేపథ్యంలో చాలా మంది మాస్క్‌తో పాటు ప్లాస్టిక్‌తో చేసిన పారదర్శక ఫేస్‌ షీల్డ్‌నూ వాడుతున్నారు. ఇలా రెండింటిని వాడే అవసరాన్ని తప్పిస్తూ మార్కెట్లోకి వస్తున్నాయి మాస్క్‌ విత్‌ ఫేస్‌ షీల్డులు. సాధారణ మాస్కుకు పై భాగంలో కళ్లకు రక్షణగా ప్లాస్టిక్‌ పొర వస్తుంది ఇందులో. కాబట్టి మామూలుగా మాస్క్‌ ఎలా పెట్టుకుంటామో అలాగే దీన్ని పెట్టుకుంటే సరి, ముక్కూ నోరుతో పాటు కళ్లనూ వైరస్‌ బారినుంచి రక్షించుకోవచ్చు. బాగుంది కదూ!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు