close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వామాకు... వెయ్యందాల మేలు!

పచ్చని మందపాటి ఆకులతో ఉండే వాము మొక్క... కిచెన్‌గార్డెన్‌లో సులభంగా పెరుగుతుంది. ఈ మొక్కనుంచే వాము వస్తుందని అనుకుంటారు కొందరు. కానీ వాముకోసం పెంచేదీ, ఆకులకోసం పెంచుకునేదీ రెండూ ఒకటి కాదు. ఇండియన్‌ బొరేజ్గా పిలిచే వాము ఆకులు, వాము గింజల వాసనని పోలి ఉండటంతో ఆ పేరుతో పిలుస్తుంటారు. అయితే ఈ ఆకుల్ని బజ్జీల కోసమే వాడుతుంటారు. కానీ దీన్నివల్ల ప్రయోజనాలెన్నో...
* పదిపన్నెండు ఆకుల్ని ముక్కలుగా చేసి నీళ్లలో వేసి నాలుగో వంతు అయ్యేవరకూ సిమ్‌లో మరిగించి ఆ కషాయాన్ని తాగితే దగ్గూ జలుబూ బ్రాంకైటిస్‌ జ్వరం వంటివి తగ్గుతాయి. మూత్రపిండాల్లో రాళ్లున్నవాళ్లకీ ఇది మంచిదే. పిల్లలకు కాస్త సైంధవలవణంతో కలిపి నూరి ఆ రసాన్ని నాకించినా జలుబూ దగ్గూ తగ్గుతాయి. తల్లిపాలు తాగే పిల్లలకు జలుబూ దగ్గూ వస్తుంటే కాస్త తేనె కలిపిన రసాన్ని చనుమొనలకి రాస్తే తగ్గుతుందట. అలాగే పాలిచ్చే తల్లులు ఒకటో రెండో ఆకుల్ని నేరుగా తినడం వల్ల పాలూ పడతాయట.
* పొట్టనొప్పిగా ఉన్నా ఆకలి లేకున్నా ఒంటిమీద దద్దుర్లు వచ్చినా ఈ ఆకుల్ని తింటే ఉపశమనం ఉంటుంది. గుండె ఆరోగ్యానికీ మంచిదేనట. ఈ ఆకుల్ని సలాడ్స్‌లో వేసుకుని తినడం వల్ల ఒంట్లో అధికంగా ఉన్న నీటిని తొలగించడం ద్వారా బరువుని తగ్గిస్తుంది. వామాకు, అల్లం కలిపి మెత్తగా నూరి తీసిన రసం తాగితే ఆకలి పెరిగి, అజీర్తి తగ్గుతుంది. కండ్లకలకతో బాధపడేవాళ్లు వామాకు ముద్దని కండ్ల చుట్టూ పెడితే మంచిది. ఆకుల్ని నుదుటిమీద పెట్టుకుంటే తలనొప్పీ తగ్గుతుంది. గాయాలూ పుండ్లూ దురదలకీ ఇది మంచిదేనట.


పుక్కిలించండి!

చాలామందికి ఏదైనా తిన్న వెంటనే పుక్కిలించడం ద్వారా నోటిని కడుక్కునే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు కోవిడ్‌ కాలంలో చాలా మంచిది అంటున్నారు. ముఖ్యంగా కోవిడ్‌ సోకినవాళ్లు మౌత్‌వాష్‌తో బాగా పుక్కిలించడం వల్ల నోటిలోనూ గొంతులోనూ వైరస్‌ శాతం తగ్గడంతో దాని వ్యాప్తి కూడా తగ్గుతుంది. ఎందుకంటే అత్యధిక శాతం వైరస్‌ గొంతులోనూ నోట్లోనూ ఉన్నట్లు గుర్తించింది జర్మనీలోని రహ్‌ యూనివర్సిటీ బృందం. పైగా కోవిడ్‌ వైరస్‌ తుమ్ముడం, దగ్గడం, మాట్లాడటం వంటి వాటి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తుందని ఇప్పటికే అనేక పరిశీలనల్లో తేలింది. దాంతో ఎనిమిది రకాల మౌత్‌వాష్‌లను తీసుకుని కోవిడ్‌ సోకిన వాళ్లతో వాటిని పుక్కిలించేలా చేశారట. అలా చేసిన వెంటనే వాళ్ల నోటిలో వైరస్‌ శాతం చాలావరకూ తగ్గిందట. ఇది వైరస్‌ కణాల పెరుగుదలని నియంత్రిస్తుందని చెప్పలేం కానీ తరచూ పుక్కిలించడం వల్ల కొంచెంసేపు నోట్లో వాటి శాతం తగ్గి వ్యాప్తి తగ్గుతుందని వివరిస్తున్నారు సదరు నిపుణులు.


మధ్యవర్తిత్వం అవసరమా?!

భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు మధ్యలో ఎవరైనా వెళ్లడంవల్ల గొడవ పెరుగుతుందే తప్ప తగ్గదు అంటుంటారు. అది నిజమే. కానీ మధ్యవర్తిత్వంతో గొడవ సద్దుమణిగినప్పుడు ఇద్దరికీ మానసికమైన సంతృప్తి దొరుకుతుంది అంటున్నారు జెనీవా యూనివర్సిటీ నిపుణులు. ఆస్తిపాస్తులు, సమయం కేటాయించక పోవడం, ఇంటిపని... వంటి కారణాలతో గొడవ పడ్డ దంపతులకి కౌన్సిలింగ్‌ ఇవ్వకముందూ, ఇచ్చాకా ఎమ్మారై స్కాన్‌ తీసి మెదడుని పరిశీలించారట. అందులో కౌన్సిలింగ్‌ ముందు కన్నా ఇచ్చాక న్యూరాన్లు మరింత చురుకుగా మారడంతో సామరస్యంగా ఆలోచిస్తున్నట్లు గ్రహించారు. వాళ్లకు వాళ్లే సర్దు కున్నప్పుడు ఎవరో ఒకరు రాజీపడాల్సి ఉంటుంది. తమది తప్పని తెలిసినా ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తుంది. తప్పనిసరై ఒప్పుకున్నా లోలోపల- నేనే రాజీపడాల్సి వచ్చిందే అన్న అసంతృప్తి ఉండిపోతుంది. అదే మధ్యలో ఎవరైనా ఉంటే ఇద్దరిలోని తప్పొప్పుల్ని విడమరిచి చెబుతూ గొడవని చల్లార్చేందుకు రకరకాల ఉదాహరణలూ చెబుతారు. దాంతో ఇద్దరూ ఆయా ఉదాహరణల్లోని వ్యక్తుల కన్నా తమ భాగస్వామి ఉత్తమం అని ఫీలవుతారట. ఏ ఒక్కరూ పూర్తిగా తమదే తప్పు అనుకోరు. కాబట్టి అహం సంతృప్తి చెందుతుంది అంటున్నారు.


ఆసక్తి ఉండటం లేదా?!

ఒక వయసు వచ్చాక కొంతమందిలో నిరాసక్తత కనిపిస్తుంటుంది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు, స్నేహితుల్నీ బంధువుల్నీ కలవడానికీ అంతగా ఇష్టపడరు. అలాగని ఈ స్థితిని డిప్రెషన్‌గా చెప్పలేం. ఆ రెండింటికీ వ్యత్యాసం ఉంది అంటున్నారు కింగ్స్‌ కాలేజ్‌ పరిశోధకులు. డిప్రెషన్‌లో ఉన్నవాళ్లంతా నిరాసక్తంగానే ఉంటారు. కానీ నిరాసక్తంగా ఉన్నవాళ్లంతా డిప్రెషన్‌తో బాధపడుతున్నారని చెప్పలేం. అయితే ఈ నిరాసక్తత భవిష్యత్తులో రాబోయే మతిమరపునకు సంకేతం అంటున్నారు. వీళ్లు డిమెన్షియాతో బాధపడుతున్న కొందరిని పరిశీలించినప్పుడు- అది రావడానికి ముందు వాళ్లకు దేనిమీదా ఆసక్తి లేకపోవడాన్ని గుర్తించారు. చురుకుతనం లోపించి నిరాసక్తతతో ఉన్నవాళ్లందరికీ మతిమరపు కచ్చితంగా వస్తుందని చెప్పలేం. కానీ దీన్నో సంకేతంగా భావించి తీరాలి అంటున్నారు సదరు పరిశోధకులు.


ఫస్ట్‌... ఫస్ట్‌..!

వైఫై, జీపీఎస్‌, బ్లూటూత్‌ లేని ప్రపంచాన్ని నేడు ఊహించలేం. అయితే వీటి రూపకల్పనకు దారితీసిన ‘ఫ్రీక్వెన్సీ హాపింగ్‌ టెక్నాలజీ’ని తొలిసారిగా కనుగొన్న వ్యక్తి హాలీవుడ్‌ నటి హెడీ లామర్‌. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జార్జి ఆంథియల్‌తో కలిసి ఆమె కనుగొన్న ఆ సీక్రెట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌కి 1942లో పేటెంట్‌నూ అందుకుంది.


మీకు తెలుసా!

కంటిలోని కనుగుడ్లు వేర్వేరు రంగుల్లో ఉండడాన్ని హెటరోక్రోమియా ఇరిడమ్‌ అని పిలుస్తారు. జన్యుమార్పుల వల్ల మెలనిన్‌ గాఢతలో తేడాలుండటంతో ఇలా జరుగుతుందట. పిల్లి, కుక్క వంటి జంతువులతోపాటు మనుషుల్లోనూ
ఇది కనిపిస్తుంటుంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.