close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డ్రాగన్‌ పండు... తిని చూడు..!

కొందరు చూడ్డానికి మొరటుగా ఉంటారు. మాటతీరూ కటువుగానే ఉంటుంది. కానీ మనసు మాత్రం వెన్నపూసే. డ్రాగన్‌ పండుదీ అచ్చంగా ఇదే తీరు. చూడ్డానికి కాస్త వింతగా ముళ్లతో మందపాటి తోలుతో ఉండే ఈ పండులో గుజ్జు ఎంతో మృదువుగా రుచిగా ఉండటంతోపాటు బోలెడన్ని పోషకాల్నీ ఔషధగుణాల్నీ కలిగి ఉంటుందట. ఇప్పుడిప్పుడు మనదగ్గరా పండుతోన్న ఈ పండు విశేషాలేంటంటే...
డ్రాగన్‌ పండు... పేరు వినగానే చైనాదే అనుకుంటాం కానీ ఇది పుట్టింది దక్షిణ అమెరికాలో. ఏ వాతావరణంలోనయినా సులభంగా పెరగడంతో అనేక దేశాలకు విస్తరించింది. నిజానికి ఇది ముళ్లమొక్కల (కాక్టస్‌)జాతికి చెందినది. బ్రహ్మకమలంగా భావించి పిలిచే ఓ రకం కాక్టస్‌ పువ్వు మాదిరిగానే దీని పువ్వులు కూడా అర్ధరాత్రివేళలోనే సువాసనని వెలువరిస్తూ విచ్చుకుని మర్నాటికల్లా ముడుచుకుపోతాయి. అందుకే దీన్ని క్వీన్‌ ఆఫ్‌ ద నైట్‌ అంటారు. పండు లోపలి గుజ్జు తెలుపూ ఎరుపూ గులాబీరంగుల్లో నల్లనిగింజలతో ఉంటుంది. తొక్క రంగునీ గుజ్జునీ బట్టి డ్రాగన్‌ ఫ్రూట్‌ ప్రధానంగా నాలుగు రకాలు. కానీ వాటి నుంచి హైబ్రిడ్‌ రకాలు చాలానే పుట్టుకొచ్చాయి. గులాబీరంగు తొక్కతో ఎర్రని గుజ్జుతో ఉండే హైలోసెరస్‌ పాలీరైజస్‌ రకం అన్నింటిలోకీ తియ్యగా ఉంటుందట.తొక్కతోబాటు గుజ్జూ నిండు గులాబీ రంగులోనే ఉండే గాటెమాలెన్సిస్‌ రకాన్ని అమెరికన్‌ బ్యూటీగా పిలుస్తారు. పసుపురంగులోని సెలెనిసెరస్‌ అరుదుగా పండుతుంది. పియర్స్‌, కివీ పండ్లు కలగలిసిన రుచితోనూ నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత మృదువైన గుజ్జుతోనూ ఉండే డ్రాగన్‌ పండుని తినేకొద్దీ తినాలనిపిస్తుంది అంటారు దీన్ని రుచి చూసినవాళ్లు.

అందం-ఆరోగ్యం!
80 శాతం నీటితో ఉండే డ్రాగన్‌ పండు తింటే జీర్ణవ్యవస్థ మెరుగై పొట్టకి హాయిగా ఉంటుంది. సి, ఎ, బి1, బి2, బి3 విటమిన్లూ మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలూ సమృద్ధిగా ఉండటంవల్ల రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవాళ్లకి ముఖ్యంగా ఐరన్‌ లోపంతో బాధపడేవాళ్లకి డ్రాగన్‌ పండు ఎంతో మంచిది. రోజువారీ ఆహారంలో భాగంగా తింటే- డయాబెటిస్‌ బాధితులకి రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుందట. టొమాటోల్లోలానే డ్రాగన్‌ పండ్లలో పుష్కలంగా దొరికే లైకోపీన్‌, క్యాన్సర్లూ హృద్రోగాలూ బీపీ వంటి రోగాలతోబాటు యూవీ కిరణాల కారణంగా చర్మం దెబ్బతినకుండానూ ముడతలు పడకుండానూ కాపాడుతుంది.

ఈ పండు రసం జుట్టుని ఆరోగ్యంగానూ మృదువుగానూ ఉంచుతుంది. ఇందులోని పీచు మలబద్ధకం లేకుండా చేస్తే, కాల్షియం ఎముక సాంద్రతని పెంచుతుంది, ఆర్థ్రయిటిస్‌ తగ్గడానికీ సాయపడుతుంది. ఫోలేట్‌, ఐరన్‌, బి-విటమిన్ల వల్ల ఇది గర్భిణీలకీ మంచిదే. అంతేకాదు, ఇది ప్రిబయోటిక్‌గా పనిచేస్తూ పొట్టలో బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. పుష్కలంగా ఉండే సి-విటమిన్‌వల్ల ఈ పండు గుజ్జు ఆయింట్‌మెంట్‌గానూ ఉపయోగపడుతుంది. గుజ్జును మొటిమల మీద ఉంచి కాసేపాగి కడిగేస్తే అవి తగ్గుతాయట. ఎండవేడికి దెబ్బతిన్న చర్మాన్ని ఇందులోని బి3 విటమిన్‌ బాగుచేస్తుంది.
డ్రాగన్‌ పండు మరీ పండితే త్వరగా పాడై పోతుంది. కాబట్టి పట్టుకున్నప్పుడు నొక్కితే లోపలికంటా గుంట పడకుండా ఉండేవి చూసి కొనాలి. పుచ్చకాయలా మధ్యలోకి కోసి చాకు లేదా స్పూనుతో గుజ్జును మాత్రమే తీయాలి. జిగురుగా ఉండే తొక్క చేదుగా ఉంటుంది. నేరుగా తినడంతోబాటు దీంతో జ్యూసులూ స్మూతీలూ ఐసుక్రీములూ డెజర్టులూ జామ్‌లూ ఇలా చాలానే తయారుచేసుకోవచ్చు. మరి... ఈ ముళ్లపండుని తిని చూద్దామా..!


ఏ ఫొటోనైనా కోరినట్లు మార్చగలడు..!

గుర్రం మీద కూర్చుని ఉన్న ఈ కాలం పాప ఫొటో ఒకటి, ఆ పక్కనే కోట వెలుపల అశ్వం మీద స్వారీ చేస్తున్న చిన్నారి ఝాన్సీలక్ష్మీబాయి చిత్రం మరొకటి...  కారులో తండ్రి ఒడిలో కూర్చున్న చిన్నితండ్రి ఫొటో ఒకటి, పక్కనే పౌరుషానికీ పరాక్రమానికీ ప్రతిరూపమైన ఛత్రపతి శివాజీ ఆయన వారసుడూ ఉన్న చిత్రం ఇంకొకటి... ఇక్కడున్న రెండు ఫొటోల్లోనూ మనుషులు ఒకేలా ఉన్నా వారి కాలాలు వేరు. వేషధారణ వేరు. మరి, ఇదెలా సాధ్యమైందీ అంటే... అంతా కరణ్‌ ఆచార్య చేసిన ఫొటో ఎడిటింగ్‌ మాయ.

రణ్‌ ఆచార్య... చాలామందికి ఈ పేరు తెలియకపోవచ్చు. కానీ అతడు గీసిన ‘యాంగ్రీ హనుమాన్‌’ యానిమేషన్‌ స్టిక్కర్లని మాత్రం చూడని వారుండరు. దేశవ్యాప్తంగా కార్లూ బైక్‌ల మీద ఎక్కడ చూసినా హనుమంతుడు కోపంగా చూస్తున్నట్లున్న ఈ స్టిక్కర్లే కనిపిస్తున్నాయి మరి. టీషర్టులూ వాచ్‌లూ ఫోన్‌లూ ల్యాప్‌టాప్‌లలాంటి వాటిమీదికీ చేరి ఈ బొమ్మ ఫ్యాషన్‌ సింబల్‌గానూ మారడంతో ప్రధాని మోదీ కూడా మంగళూరు వచ్చినపుడు కరణ్‌ ఆచార్యను యూత్‌ ఐకన్‌గా అభివర్ణించారు.

ఇక, ప్రస్తుత విషయానికొస్తే ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలు అతడు ఫొటోఎడిటింగ్‌ చేసినవి. కొన్ని రోజుల కిందట ఓ చిన్నారి ఫొటోను బాల కృష్ణుడు కాళీయ మర్దనం చేస్తున్నట్లు మార్చి 2.5 లక్షల ఫాలోవర్లు ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు కరణ్‌. దానికి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. కొందరు అభిమానులు అతడిని మెచ్చుకోవడంతోనే ఆగకుండా ‘మా బుజ్జిగాడి ఫొటోను కూడా కృష్ణుడిలా మారుస్తారా..? మా పాపాయిని ఝాన్సీలక్ష్మీబాయిలా చూపించగలరా..?’ అంటూ ఇన్‌స్టా, ట్విటర్లలో కరణ్‌కి మెసేజ్‌లు పెట్టారు. వాళ్లు కోరినట్లే ఫొటోలను ఎడిట్‌ చేసి కరణ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో అవికాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిపోయాయి. ఒకరి తల ఇంకొకరికి పెట్టడం, బ్యాగ్రౌండ్‌ మార్చడం లాంటివి చాలామంది చెయ్యగలరు. కానీ మామూలు ప్యాంటూ షర్టూ వేసుకున్న పిల్లాడికి కాషాయ వస్త్రాల్ని అందంగా చుట్టి, చేతిలో ధనుస్సుని పెట్టి అయోధ్యలో రాముడిలా చూపించడం, టీషర్టు వేసుకుని కార్లో కూర్చున్న వ్యక్తిని రాచఠీవితో రాజమందిరంలో ఆశీనుడైన ఛత్రపతి శివాజీలాగా మార్చడం... సరదాగా గుర్రంమీద కూర్చున్న పాప ఫొటోను పరాక్రమశాలి అయిన ఝాన్సీలక్ష్మీబాయిగా తీర్చిదిద్దడం... సాధారణ విషయం కాదు. పైగా ఆయా చిత్రాలకు చక్కగా సరిపోయే బ్యాగ్రౌండ్‌ని డిజైన్‌ చెయ్యడం కూడా గొప్ప విషయమే. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... వీటిలో కొన్ని ఫొటోలు సగం వరకే ఉన్నా వాటిని పూర్తిగా కనిపించేలా డిజైన్‌ చేసి ఆయా చిత్రాలను మరింత సహజంగా ఆకట్టుకునేలా చేశాడు. ఇంకేముందీ... ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండడంతో కరణ్‌ మరోసారి వార్తల్లోకెక్కేశాడు.


వార్తలు చూసేయండి... లాక్‌ తీయకుండా!

గూగుల్‌లో సెర్చ్‌ చేయకుండా, ఏ ఆప్‌లోకీ వెళ్లకుండా... వినూత్నంగా స్మార్ట్‌ఫోన్‌ ‘లాక్‌ స్క్రీన్‌’ పైనే సమస్త ప్రపంచాన్ని ఉంచుతోంది ఓ అంకుర సంస్థ. ఇది అమెరికాలోనో, చైనాలోనో పుట్టింది కాదు, అచ్చమైన భారతీయ సంస్థ.
ఇప్పటివరకూ ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా ఫోన్‌ స్క్రీన్‌ని అన్‌లాక్‌ చేసి గూగుల్‌/వార్తల ఆప్‌లలోకి వెళ్లడమే తెలుసు. అందుకు భిన్నంగా జీరో స్క్రీన్‌గా పిలిచే ‘లాక్‌ స్క్రీన్‌’ పైనే వార్తల్ని అందిస్తోంది ‘గ్లాన్స్‌’. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌, మార్కెటింగ్‌ సంస్థ ‘ఇన్‌మొబి’ దీన్ని రూపొందించింది. భారతీయ వినియోగదారులే లక్ష్యంగా తయారుచేసిన ఉత్పత్తి ఇది. ప్రస్తుతం ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సమాచారాన్ని అందిస్తోంది గ్లాన్స్‌. నైపుణ్యాలూ, క్రీడలూ, పర్యటకం, ఆరోగ్యం, వినోదం, ఆన్‌లైన్‌ గేమ్స్‌, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, వాణిజ్యం, సంగీతం, ఫ్యాషన్‌... ఇలా యువతకు నచ్చే అంశాల్లో కథనాలు దీన్లో కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే వార్తలూ, వీడియోల నిడివి చాలా తక్కువగా ఉండటం విశేషం.
ఇది ఆప్‌ కాదు
గ్లాన్స్‌ ఒక ఆప్‌ కాదు. ఫోన్లలో అంతర్లీనంగా ఉండే సాంకేతికతతో పనిచేస్తుంది. ఇప్పటివరకూ షివోమీ, శామ్‌సంగ్‌, వివో... సంస్థలతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుందీ సంస్థ. సరికొత్తగా ఉండటంతో మొబైల్‌ తయారీ సంస్థలు కూడా తమ కొత్త ఉత్పత్తుల్లో గ్లాన్స్‌ను చేర్చడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇతర ఫోన్లు వాడే వినియోగదారులు ప్లేస్టోర్‌ నుంచి గ్లాన్స్‌ ఏపీకే(ఆండ్రాయిడ్‌ ప్యాకేజ్‌ కిట్‌)ను ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకుని ఈ సౌలభ్యాన్ని పొందొచ్చు. గ్లాన్స్‌ ఉన్న ఫోన్‌ని స్లీప్‌ మోడ్‌ నుంచి తీసిన ప్రతిసారీ లాక్‌ స్క్రీన్‌మీద ఓ కొత్త వార్తాంశం కనిపిస్తుంది. దానిమీద స్వైప్‌, టాప్‌ చేయడంద్వారా ఆ వార్తలోకి వెళ్లొచ్చు.
దాని తర్వాత మరో విషయాన్ని చూడాలనుకుంటే స్క్రీన్‌ని స్క్రోల్‌ చేయడమే. ఖాళీ దొరికినపుడు ఒకసారి ఫోన్‌ని టచ్‌ చేస్తే చాలు కొత్త విషయాన్ని తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్లో ఎక్కువగా ఉండే మిలీనియల్స్‌, జనరేషన్‌ జెడ్‌ను ఆకట్టుకునే అంశాలనే ఎక్కువగా అందిస్తున్నారు.
ప్రతిభకి చోటు
రెండేళ్లపాటు శ్రమించి గ్లాన్స్‌ని 2018లో అందుబాటులోకి తెచ్చింది ఇన్‌మొబి. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ ఫోన్లమీద ఈ సాంకేతికతను అందిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి వార్తాంశాల గురించి పర్సనలైజ్డ్‌ రికమండేషన్స్‌ అందిస్తుంది గ్లాన్స్‌. గతేడాది చివర్లో రొపోసో(తక్కువ నిడివి వీడియోలు షేర్‌ చేసే ప్లాట్‌ఫామ్‌) ఆప్‌ని చేజిక్కించుకుంది ఇన్‌మొబి. అందులోని కంటెంట్‌నీ చేర్చడంతో గ్లాన్స్‌ మరింత ఆకర్షణీయంగా తయారైంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని అయిదు కోట్ల మంది గ్లాన్స్‌ ద్వారా చూశారట. వివిధ వార్తా పత్రికలూ, మీడియా సంస్థల వెబ్‌సైట్లూ, ఆప్‌ల నుంచి సమాచారాన్ని సేకరించి వీరు గ్లాన్స్‌ద్వారా అందిస్తారు. నాణ్యమైన, వివాదాస్పదం కానీ అంశాలనే తీసుకుంటారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఫోన్‌ తీస్తారు కాబట్టి ఎవర్నీ ఇబ్బంది పెట్టే వార్తలు ఉండవు. భవిష్యత్తులో వ్యక్తులు ప్రతిభ చూపే ‘ఇండీ ప్రొడక్ట్‌’ వీడియోల్ని ఎక్కువగా చూపించనున్నారిక్కడ.
గ్లాన్స్‌ గతేడాది రూ.350 కోట్లు పెట్టుబడుల్ని పొందింది. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌, ఫిలిప్పైన్స్‌లలోనూ స్థానిక భాషల్లో సేవలు అందిస్తోంది గ్లాన్స్‌. వెబ్‌ పోర్టల్‌ని కూడా తీసుకొచ్చారు. త్వరలో మరిన్ని దేశాలకు విస్తరించనుంది మన గ్లాన్స్‌. కేవలం రెండేళ్లలో 10 కోట్లమందికి చేరిన గ్లాన్స్‌పైన వినియోగదారులు సగటున రోజుకి 25 నిమిషాలు గడుపుతున్నారు. ఓ అంకుర సంస్థకు ఇదో పెద్ద విజయమనే చెప్పాలి!


మొబైల్‌ ఫోన్‌ ద్వారా కంటెంట్‌ను వినూత్నంగా అందివ్వడం గురించి ఆలోచించి గ్లాన్స్‌ని అభివృద్ధి చేశాం. లాక్‌ స్క్రీన్‌ అనేది ఫోన్‌లో ఉండే శక్తివంతమైన విభాగం. ఎందుకంటే రోజులో సగటున 150 సార్లు ఫోన్‌ని అన్‌లాక్‌ చేస్తారు. యువత సాధారణంగా తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారా వార్తల్నీ, వినోదాన్ని పంచే వీడియోల్నీ చూడాలనుకుంటారు. అదే కంటెంట్‌ని మేం లాక్‌ తీయకుండానే అందిస్తున్నాం. ఇంటర్నెట్‌ ప్రపంచంలోకి రోజూ వేల మంది కొత్తగా వస్తున్నారు. వారికి తమ ఫోన్లో ఏం చూడాలన్న విషయంలో అంత స్పష్టత ఉండదు. ఆ విషయంలో గ్లాన్స్‌ వారికి సహాయంగా ఉంటోంది. మేం తక్కువ నిడివి వీడియోల్నీ, గేమ్స్‌నీ చేర్చాక వినియోగదారులు గ్లాన్స్‌ ప్లాట్‌ఫామ్‌పైన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

- వ్యవస్థాపకుడు నవీన్‌ తివారి.

 


మీకు తెలుసా!

పుట్టగానే పిల్లలు కేర్‌ కేర్‌మని ఏడుస్తారన్నది తెలిసిందే. కానీ నిజానికి వాళ్లు అరుస్తారే తప్ప కన్నీళ్లు కార్చరట. ఎందుకంటే అప్పటికి కన్నీటిని ప్రవహింపజేసే నాళాలు పూర్తిగా తయారవ్వకపోవడంతో సుమారు మూడు వారాల వరకూ కంటి నుంచి చుక్క నీరు కారదు, కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు కొంత తేమ మాత్రం కంట్లో ఊరుతుంటుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.