
ఉన్నత చదువులు చదివిన వారంతా మంచి కొలువులు సాధించారు. అయినా, ఏదో అసంతృప్తి వారిని నిలవనీయలేదు. సమాజానికి తన వంతు సేవ చేయాలనుకున్నారు. ఉద్యోగాలకు రాజీనామా చేశారు. సమాజ సేవలో భాగమయ్యారు.
వలసలు మాన్పించాడు...
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అమితాబ్ సోని ఇంగ్లండ్‌లోని సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగి. అక్కడి పౌరుల సంక్షేమం కోసం ప్రభుత్వ కార్యక్రమాలను అమలుచేస్తున్న సమయంలో అతడిని పలు ఆలోచనలు చుట్టుముట్టేవి. మన దేశంలోని గ్రామాల్లో ఎన్నో వనరులు ఉన్నాయనీ, వాటి వినియోగం గురించి తెలియక రైతులు అభివృద్ధికి నోచుకోవడం లేదనీ గ్రహించాడు. దాంతో 2014లో ఇంగ్లాండ్‌లోని తన ఉద్యోగానికి రాజీనామా చేసి భోపాల్‌కు చేరుకున్న అమితాబ్, కొందరు అధికారులూ, మిత్రుల సహకారంతో అక్కడి గ్రామాల పరిస్థితులను అధ్యయనం చేశాడు. సమీపంలోని కెకడియా గ్రామ రైతులు సాగునీటి సౌకర్యం లేక పంటలు పండించడం లేదనీ, కుటుంబాలను పోషించడానికి వలస వెళ్తున్నారనీ వారు వివరించారు. వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి రైతులతో సమావేశమయ్యాడు. శిథిలావస్థకు చేరుకున్న చెక్డ్యాములకూ, కాలువలకూ మరమ్మతులు చేయించాడు. చెక్డ్యాముల్లోకి నీరు చేరగానే... రైతులతో సేంద్రియ పద్ధతిలో మెంతి పంటను సాగు చేయించాడు. దాంతో రైతులు లాభాలు సాధిస్తున్నారు. వ్యాపారులు గతంలో ఒక ట్రే మెంతులకు రూ.150 చెల్లించేవారనీ, ఇప్పుడు ఈ సేంద్రియ మెంతులకు రూ.450 దాకా చెల్లిస్తున్నారనీ ఆనందంగా చెబుతున్నారు కెకడియా గ్రామానికి చెందిన 1200 మంది రైతులు. ఆ గ్రామంలాగే సమీప సమఫ్గఢ్, ఖాకర్డోల్, భవరిఖేడ గ్రామాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలే చేపట్టాడు అమితాబ్ సోని. దీంతో వలసలు మాని సేంద్రియ మెంతుల సాగును చేపట్టిన ఆ గ్రామాలకు చెందిన 5000 మంది రైతులు గతంలో కంటే మూడు రెట్ల లాభం పొందుతున్నారు.
చెరువులకు పునరుజ్జీవం
చెరువుల్లో ప్లాస్టిక్ పదార్థాలూ, ఇతర వ్యర్థాలూ పేరుకుపోతుండటం వల్ల అందులోని జలచరాలు చనిపోవడంతోపాటు నీరు కలుషితమవుతోంది. దశాబ్దాలుగా పూడికను తొలగించకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి పంటల సాగు విస్తీర్ణమూ పడిపోతోంది. చెన్నైలోని ముడిచూర్‌కు చెందిన అరుణ్ కృష్ణమూర్తిని ఈ విషయాలు ఆలోచింపజేశాయి. అప్పటికే హైదరాబాద్ లోని గూగుల్ కంపెనీలో ఎనలిస్ట్‌గా కొనసాగుతున్న అరుణ్... చెరువుల ప్రక్షాళన కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తరవాత సమస్యను తన మిత్రులకూ, కొందరు స్వచ్ఛంద కార్యకర్తలకూ వివరించి 2007లో ఎన్విరాన్మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(ఈఎఫ్ఐ) సంస్థను స్థాపించాడు. వారందరి సహకారంతో మొదట హైదరాబాద్ శివారులో ఉన్న గురునాథం చెరువులోని వ్యర్థాలను తొలగించాడు. ఆ తరవాత దిల్లీలో చెరువును శుభ్రం చేశాడు. అలా అప్పటి నుంచీ ఇప్పటి దాకా అతడు తన మిత్రులూ, కార్యకర్తలూ, రైతులూ, విద్యార్థులతో కలిసి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దిల్లీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సుమారు 95 చెరువు ల్లోని వ్యర్థాలూ, పూడికనూ తొలగించి వాటికి పునరుజ్జీవం కల్పించాడు. ఫలితంగా... చెరువులు శుభ్రమై స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతుండటంతోపాటూ వాటి ఆయకట్టు పరిధిలో సాగు విస్తీర్ణమూ పెరిగింది.
పేద మహిళలకు ఉపాధి
గుజరాత్‌లోని సూరత్ సమీప గ్రామాల్లో చాలా మంది మద్యానికి బానిసలవడంతో వారి కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయి. తాగుడు వల్ల అనారోగ్యానికి గురై మగవారు మరణించడంతో ఎంతోమంది మహిళలు ఒంటరిగా మిగిలారు. వారి దుర్భర జీవితాలను చూసి చలించిన సూరత్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్ సోనల్ రొచానీ... ఆ పేద మహిళలకు ఉపాధి కల్పించి, వారి కుటుంబాలకు బాసటగా నిలవాలని భావించారు. దీంతో 2011లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ‘శక్తి ఫౌండేషన్’ను ప్రారంభించిన ఆమె... ఆ గ్రామాల మహిళలకు స్వయం ఉపాధిపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందించే రుణానికితోడు ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి మహిళలకు అందించారు. ఆ డబ్బుతో సూరత్ చుట్టుపక్కల ఉన్న 55 గ్రామాలకు చెందిన 5000 మంది మహిళలు వెదురు బుట్టలూ, అప్పడాలూ, అగర్బత్తీలూ తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. అదే విధంగా 45 గ్రామాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఆ గ్రామాల విద్యార్థులు పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించి ఉన్నత చదువులు చదువుతున్నారు కూడా.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్