close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోడెక్కిన చిట్టడవి..!

ఎత్తైన చెట్లు... గుబురుగా పెరిగిన పొదలు... మధ్యలో రాళ్ల దారులు... అక్కడక్కడా విరిసిన పువ్వులు... ఆ వైపు చూస్తే చిన్నపాటి అడవే గోడమీదికెక్కిందా అన్నట్లుంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇంత అందమైన వనాన్ని తెచ్చి గోడకు తగిలించుకోవడం తప్ప నీళ్లు కూడా పోసే పన్లేదు. అలా అని ఇది ప్లాస్టిక్‌ కాదు. ఇక్కడున్నవి నిజమైన కొమ్మలూ ఆకులూ నాచు మొక్కలే.

పచ్చదనం ఎక్కడుంటే అందం ఆహ్లాదం అక్కడే ఉంటుంది. అయితే పల్లెల్లోలా పట్టణాలూ నగరాల్లో ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకునేంత స్థలం ఉండదు. బాల్కనీ ఉంటే కుండీల్లో నాలుగు మొక్కలు... లేదంటే హాల్లో ఏ మనీ ప్లాంటో, లక్కీ ప్లాంటునో పెట్టుకుని సరిపెట్టుకోవడమే. కానీ ప్రకృతి ప్రేమికులకు అది ఏమాత్రం సరిపోదు. అందుకే, ఈమధ్య వర్టికల్‌ గార్టెన్లు అంటూ చిన్న చిన్న మొక్కల్ని గోడకి వేలాడేలా అమర్చి పెంచుకుంటున్నారు. అయితే, కుండీల్లోనూ ఆరుబయటా పెరిగే మొక్కలతో పోల్చితే వర్టికల్‌ గార్డెన్లను పెంచడం కాస్త ఖర్చుతోనూ శ్రమతోనూ కూడుకున్న పని. వీటిని ఇంటిలోపల పెట్టుకుంటాం కాబట్టి, ఎప్పటికప్పుడు ప్రూనింగ్‌ చెయ్యకపోతే మొక్కలు అడ్డదిడ్డంగా పెరిగి ఉన్న అందం పోతుంది. రాలిన ఆకులూ, కొమ్మల్లాంటివాటిని తీసెయ్యకపోయినా, పురుగుల్లాంటివి చేరకుండా మొక్క ఆరోగ్యంగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకోకపోయినా అంతే.


వీటితో శ్రమే ఉండదు
లివింగ్‌ మాస్‌ ఆర్ట్‌ అంటూ మార్కెట్లోకి వస్తున్న ఈ ‘ప్రిజర్వ్‌డ్‌ మాస్‌ ఆర్ట్‌’ని గోడకు తగిలిస్తే అందాన్ని ఆస్వాదించడం తప్ప వేరే పనే ఉండదు. ఈ కళాఖండాలను నిజమైన కొమ్మలూ ఆకులూ అడవి మొక్కలూ నాచుమొక్కలతో తయారుచేస్తారు. కాకపోతే కొన్ని ప్రత్యేకపద్ధతుల సాయంతో వీటిని ఎప్పటికీ వాడిపోకుండా రాలిపోకుండా అలా పచ్చగానే ఉండేలా మారుస్తారు. దాంతో మనకు నీళ్లు పొయ్యడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం లాంటి పనులేవీ ఉండవు. పైగా మామూలు మొక్కల్ని ఫ్రేముల్లో ఇంత అందంగా తీర్చిదిద్దడం సాధ్యం కాదు. ప్రిజర్వ్‌డ్‌ మాస్‌ ఆర్ట్‌లో అయితే, రాళ్లతో చూడచక్కగా పరిచిన దారులూ ఎత్తైన చెట్లూ రంగు రంగుల పువ్వులూ సీతాకోక చిలుకలతో ప్రకృతి అందాలన్నిటినీ ఏరి ఓచోట కూర్చినట్లుంటుంది. మైమరపించే ఈ పచ్చందాలు నట్టింట్లో కొలువైతే ఇల్లు ఎంత ఆకర్షణీయంగా మారిపోతుందో మనసుకి ఇంకెంత ఆహ్లాదంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే, ప్రకృతి ప్రేమికులు ఒక్క ఫ్రేముని కొని సరిపెట్టుకోవడం లేదు. రకరకాల సైజుల్లో దొరికే లివింగ్‌ మాస్‌ కళాఖండాలతో గోడల్ని పచ్చగా మార్చేస్తున్నారు. వైట్‌హాస్‌లివింగ్‌, స్యూమాస్‌డిజైన్స్‌, రిష్‌స్టూడియో... లాంటి ఎన్నో కంపెనీలు ఈ మాస్‌ వాల్‌ ఆర్ట్‌లను etsy.comలో అమ్మకానికి ఉంచాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.