close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నవబ్రహ్మలు కట్టిన... జనార్దనస్వామి ఆలయం!

భోజనం పట్టుకున్నట్లుగా కనిపించే స్వామి చేయి... ఔషధగుణాలున్న సరస్సు... సముద్రానికి దగ్గరగా గుడి... దక్షిణ గయగా గుర్తింపు పొందిన కేరళలోని వర్కల జనార్ధనస్వామి ఆలయంలోని విశేషాలే ఇవన్నీ. ఈ స్వామి సమక్షంలో పితృ కార్యాలు నిర్వహిస్తే మంచిదని అంటారు.

రేబియా మహా సముద్రానికి దగ్గరగా... చిన్న కొండపైన కనిపించే గుడే జనార్ధనస్వామి ఆలయం. శ్రీదేవి, భూదేవి సమేతుడైన ఈ స్వామి ప్రాంగణంలో పితృకార్యాలు నిర్వహిస్తే పితృదేవతలు ఆనందిస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఈ స్వామిని పితృ మోక్షకన్‌ అనీ పిలుస్తారు. ఇక్కడ కొలువైన స్వామి కుడి చెయ్యి భోజనం పట్టుకున్నట్లుగా ఉంటుంది. ఇలాంటి విష్ణుమూర్తి విగ్రహం మరెక్కడా కనిపించదు. దక్షిణ గయగా గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని నవబ్రహ్మలే 2000 ఏళ్ల క్రితం నిర్మించారని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. బలరాముడు కన్యాకుమారికి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా సందర్శించాడని అంటారు.

స్థలపురాణం...
ఓసారి యాగం చేసేందుకు బ్రహ్మ భూమిపైకి రావడంతో సృష్టికి అంతరాయం కలిగిందట. అది గుర్తు చేసేందుకు విష్ణుమూర్తి ఓ వృద్ధుడి రూపంలో బ్రహ్మ యాగం చేసే చోటుకు వచ్చాడట. పూజారులు ఆ వృద్ధుడికి భోజనం పెట్టారట. అయితే ఎంత తిన్నా ఆకలి తీరలేదని అతడు చెప్పడంతో వాళ్లు బ్రహ్మకు విషయాన్ని చేరవేశారట. అక్కడకు వచ్చింది విష్ణుమూర్తేనని అర్థం చేసుకున్న బ్రహ్మ వృద్ధుడి రూపంలో ఉన్న స్వామి దగ్గరకు వచ్చి తింటున్న చేయిని పట్టుకున్నాడట. విష్ణుమూర్తి కూడా బ్రహ్మతో సృష్టికి అంతరాయం కలిగించొద్దని చెప్పడంతో ఆ యాగం ఆగిపోయిందట. బ్రహ్మతోపాటూ అక్కడే ఉన్న నవబ్రహ్మలు ఇదంతా చూసి... ఆ ప్రాంతంలో స్వామి విగ్రహాన్ని స్థాపించి ఆలయాన్ని కట్టించారట. అయితే కొన్నాళ్లకు ఆలయం శిథిలావస్థకు చేరుకుని విగ్రహం కూడా మాయమైందట. అది తెలిసిన ఓ పాండ్య రాజు తన అనారోగ్యం నయమైతే ఆలయాన్ని పునర్నిమించాలని అనుకున్నాడట. ఆ మర్నాడే అతడికి సముద్రం ఒడ్డుకు వెళ్లి నిల్చోమని చెప్పినట్లుగా ఓ కల వచ్చిందట. అలానే వెళ్లి నిల్చుంటే కొన్ని పూలు నీళ్లలో కొట్టుకు వస్తూ.. వాటి మధ్య స్వామి విగ్రహం కనిపించడంతో దాన్ని తీసుకున్నాడట.
ఆ విగ్రహానికి బంగారు చేయిని తయారుచేయించి మరీ తొడిగి.. ఆలయాన్ని మళ్లీ నిర్మించాడనీ అంటారు. ఆ తరువాత ఉమాయమ్మ అనే మహారాణి కేరళ కళా నైపుణ్యం కనిపించేలా ఈ ఆలయాన్ని ఆధునికంగా తీర్చిదిద్దిందనీ అంటారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథా ప్రాచుర్యంలో ఉంది. ఓ సారి నారదుడు విష్ణు నామస్మరణ చేస్తూ వైకుంఠం నుంచి బ్రహ్మ దగ్గరకు వెళ్లాడట. ఆ పాటలు విన్న నారాయణుడు నారదుడికి తెలియకుండానే అతడిని అనుసరించాడట. అలా నారదుడితో పాటూ విష్ణుమూర్తిని చూసిన బ్రహ్మ... నమస్కరించేందుకు ప్రయత్నించడం... నారాయణుడు మాయమవడం ఒకేసారి జరిగిందట. చుట్టూ ఉన్న నవబ్రహ్మలు బ్రహ్మ నారదుడికి నమస్కరించడం చూసి నవ్వారట. బ్రహ్మకు కోపం వచ్చి వాళ్లని సామాన్య మానవుల్లా జీవించమంటూ శపించాడట. అది చూసిన నారదుడు వాళ్లకు కేరళలోని ఓ ప్రాంతాన్ని చూపించి అక్కడ తపస్సు చేయమని చెప్పాడట. అదే ఇప్పటి వర్కల. బ్రహ్మ శాపంతో భూమిమీదకు వచ్చిన నవబ్రహ్మలు స్వామిని పూజించి ఇక్కడ విష్ణుమూర్తి ఆలయం కట్టించినట్లూ చెబుతారు.

ఏడాదికోసారి పండగ...
ఆలయం మొదట్లో హనుమంతుడు, గరుడ విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడున్న పూజారి అదే ప్రాంతానికి చెందినవాడై ఉండకూడదని అప్పట్లో నియమం పెడితే... ఇప్పటికీ అదే కొనసాగుతోందట. గర్భం దాల్చాలనుకునేవాళ్లు ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రిచెట్టుకు బొమ్మలు కడితే పిల్లలు పుడతారని అంటారు. కేవలం విష్ణుమూర్తి మాత్రమే కాకుండా... ఇక్కడ గణపతి, శివుడు, నాగదేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయంలోని కొలనును ప్రజాపతి సరస్సు అని పిలుస్తారు. ఈ నీటిలో ఔషధ గుణాలుంటాయని భక్తుల నమ్ముతారు. మార్చిలో ఇక్కడ పదిరోజుల పాటు అరట్టు పేరుతో పెద్దఎత్తున వేడుకల్ని నిర్వహిస్తారు. ఏనుగుల ఊరేగింపులతోపాటూ రాత్రంతా అంగరంగవైభవంగా వేడుకలు జరుగుతాయిక్కడ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.