close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనుభూతి కవిత్వం

భావుకతా తాత్వికతా కలిసిపోయి దానికి చిక్కనైన అనుభూతి తోడైతే- అదే ఈ కవిత్వం. చాలావరకూ చిన్న చిన్న కవితల్లో పొదుపుగా కొద్ది పదాల్లోనే పొదిగిన లోతైన భావం కవయిత్రి ఆలోచనల గాఢతకు అద్దం పడుతుంది. ఆకుకొక పువ్వుగా ఈ దేవకాంచనం/ కొమ్మలు మొదలంటా నరికేసినా/ రెండు వానలకే చిగురించిన వైనం/ నాకు ఏమైనా నేర్పాలనుకుందేమో- అని ఆలోచనలో పడతారు కవయిత్రి. ఓ సూర్యోదయమో, చంద్రోదయమో/ ఆఖరుకు ఓ గడ్డిపూవైనా సరే/ చూసిన అందరికీ ఒకేలా కనపడితే/ మానవులంతా ఒక్కటైనట్టు... అని తేల్చి చెబుతారు. ఏమీ లేదంటే/ చాలా ఉందని/ బోలెడు ఉందంటే/ అసలేమీ లేదని/ పైనది వేదాంతం/ కిందది జీవితం- ఇక చెప్పేదేముంది, అర్థం చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత. కూడగట్టుకుంటూ పోతే/ మోపు పెద్దదవుతుంది/ విడగొట్టుకుంటూ పోతే/ బతుకు నిస్సారమైపోతుంది... అంతేగా మరి!

      - పద్మ

దేవకాంచనం నీడన(కవిత్వం)
రచన: వసుధా రాణి
పేజీలు: 282: వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌-9959839446


భార్యాభర్తల కథలు

మధ్యతరగతి భార్యాభర్తల చుట్టూ తిరిగే 24 కథలివి. నిత్య జీవితంలో అనుబంధంలో ఎదురయ్యే ఎన్నో విషయాలను వీరు ఎదుర్కొనే తీరు ఆయా కథలకు ముడి సరుకైంది. దాంపత్య బంధంలో ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు, ఇద్దరూ సమానమేనని పరోక్షంగా చెబుతాయి కథలన్నీ. ‘మీరెవరినైనా ప్రేమించారా’ అని భార్య అడిగితే ఉత్సాహంగా తన కథ చెప్పిన సుబ్బారావు ఆ తర్వాత భార్య ప్రేమ కథ విని ఏమయ్యాడో తర్వాత తన పొరపాటు ఎలా తెలుసుకున్నాడో చెప్పే కథ ‘పాపం సుబ్బారావు’. భార్య ముందు వంటొచ్చని ప్రగల్భాలు పలికి కుక్కరుతో భర్త పడే కష్టాలు నవ్విస్తాయి. వ్యక్తి బలహీనతలూ, అహంకారమూ, కాపురాల్లో కలతలకు కారణమైనప్పుడు ఇద్దరి కోణాలనుంచీ చర్చించి సర్దుబాటు అవసరాన్ని చాటిచెప్పే కథలివి.

- శ్రీ

(జ)వరాలి కథలు

రచన: గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి
పేజీలు: 196: వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌-8558899478


వ్యక్తిత్వ వికాసం

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన రచయిత వ్యక్తిత్వవికాసానికి సంబంధించిన పాఠాలను కథల రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు ఈపుస్తకంలో. సరదాగా చదివిస్తూనే ఆలోచింప జేస్తాయి కొన్ని. మరికొన్ని నైతిక విలువల గురించి చర్చిస్తాయి. పెద్దలు చెప్పే మాటలు విని వదిలేయకుండా ఆలోచించి, తమ జీవితానికి అన్వయించుకుని ఆచరిస్తే- తప్పకుండా జీవితంలో పైకి ఎదగవచ్చని నిరూపిస్తారు నలుగురు స్నేహితులు. విద్యార్థికి ‘ప్రేరణ’ అవసరాన్ని చాటి చెబుతుందీ కథ. క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటూ తీవ్రవేదన అనుభవిస్తూ కూడా పైకి నవ్వుతూ, తాను కోలుకున్నాననీ, మళ్లీ ఉద్యోగం చేస్తాననీ చెప్పే సోమేశ్వరరావు కథ మనోనిబ్బరంతో ఎన్ని కష్టాలనైనా అధిగమించవచ్చని చెబుతుంది. ఇలా కథలన్నీ జీవితంపట్ల సానుకూల వైఖరిని పెంపొందిస్తాయి.

                      - శుశీల

తోవ;
రచన: కొండవీటి మధుసూదన్‌ రెడ్డి
పేజీలు: 269: వెల: రూ. 220/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


మమత కవిత

రాజకీయ నేతగా అందరికీ తెలిసిన మమతా బెనర్జీ కవయిత్రి కూడా. ‘కవితా బితాన్‌’ పేరుతో ఓ బృహత్‌ కవితా సంకలనాన్ని గత ఏడాదే ప్రచురించారు. ఈ అనువాద కవితల్లో స్త్రీ సహజమైన సున్నిత హృదయమే కాదు, అభ్యుదయ కాంక్షా కన్పిస్తుంది. మనుషులందరినీ కలుపుకుపోలేని అభివృద్ధిని ‘వక్రాభివృద్ధి’ అని పేర్కొంటారు కవయిత్రి. హృదయపు సవ్వడి అందరిదీ ఒకటే/ కన్నీటి రుచి అంతా ఉప్పదనమే/ జీవితం అత్యంత విలువైనది/ ప్రియసోదరా/ అంటుకడదాం అనుబంధాలను- అంటూ మానవత్వపు జెండా ఎగరేస్తారు కవయిత్రి.

  - పూర్ణ

సరళ సుందర సునిశిత మమత
రచన: మమతాబెనర్జీ, అనువాదం: సామాన్య
పేజీలు: 117: వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9848787284

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.