close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మెడలోనే గుడి కడుతున్నారు!

దక్షిణ భారతావని అద్భుత వాస్తు, శిల్పకళాసంపదతో అలరారే ఆలయాలకీ దేవీదేవతలకీ పెట్టింది పేరు. అందుకే ఆ గుడులూ గోపురాలతోపాటు  గర్భగుడి పీఠంమీద నవరత్న ఖచితాభరణాలతో సర్వాంగ సుందరంగా  అలంకరించిన దేవతామూర్తుల్ని ఎన్నిసార్లు చూసినా తనివితీరదు భక్తులకు. అందుకేనేమో గుడినీ, అందులో కొలువుదీరిన దేవుడినీ కూడా నగలుగా చెక్కేస్తున్నారు నేటి  డిజైనర్లు. అంతే అపురూపంగా వాటిని ధరిస్తున్నారు ఈనాటి అమ్మాయిలు.
నగల్లో దేవుళ్ల రూపాలు కొత్త కాదు. రత్నాలు పొదిగిన దేవతా ప్రతిమలతో రూపొందించే టెంపుల్‌ జ్యువెలరీ తెలిసిందే. అయితే అవన్నీ టూ డైమన్షన్‌లోనే ఉండేవి. కానీ ఈమధ్య ఇంటీరియర్‌ నుంచి జ్యువెలరీ వరకూ త్రీడీ ట్రెండే నడుస్తోంది. అందుకే టెంపుల్‌ జ్యువెలరీనీ త్రీడైమన్షన్‌లో తయారుచేస్తున్నారు. అచ్చంగా గర్భగుడిలో పీఠంమీద కూర్చున్నట్లే దేవుళ్ల లాకెట్లను చెక్కేస్తున్నారు. పీఠం పక్కనే స్తంభాల్నీ గోపురాల్నీ కూడా లాకెట్లలో చొప్పించేస్తున్నారు.
నిజానికి ఆలయ నిర్మాణానికి పేరొందిన చోళుల కాలంలోనే- అంటే, క్రీ.శ.9వశతాబ్దంలోనే టెంపుల్‌ జ్యువెలరీ మొదలైంది. అప్పట్లో ఆలయకుడ్యాల మీద ఉండే హంసలూ నెమళ్లూ లక్ష్మీదేవి రూపాలతోనే బంగారు ఆభరణాల్ని చేసి, వాటికి వజ్రాలూ కెంపులూ పచ్చలూ వంటి రత్నాల్ని పొదిగేవారు. ఈ డిజైన్లలో చేసిన వడ్డాణాలూ హారాలూ ముక్కెరలూ వంటి నగల్ని ఆలయంలోని దేవీదేవతలకే అలంకరించేవారు. అందుకే దీనికి టెంపుల్‌ జ్యువెలరీ అని పేరు. తరవాత్తరవాత ఆ డిజైన్లను సంప్రదాయ నృత్యం చేసేవాళ్లు ధరించేవారు. అవి చూసి సంపన్నులూ ఆ నగలపట్ల ఆకర్షితులయ్యారట. అప్పట్లో ఆలయాలకు పేరొందిన తమిళనాడులోనే వీటి వాడకం ఎక్కువగా ఉండేది. క్రమంగా ఇవి అంతటా ప్రాచుర్యం పొందాయి. ఆ టెంపుల్‌ నగల్నే త్రీడీ రూపంలో మందిరంతోసహా డిజైన్‌ చేయడం తాజా ట్రెండ్‌గా మారింది.

మనకు- వినాయకుడూ వేంకటేశ్వరుడూ పరమేశ్వరుడూ శ్రీరాముడూ లక్ష్మీదేవీ దుర్గాదేవీ... ఇలా ఎందరో దేవుళ్లూ దేవతలూ. వాళ్లకోసం కట్టిన వందల, వేల గుళ్లూ గోపురాలూ. దైవం ఒక్కడే అయినా కొందరికి లక్ష్మీదేవి ఇలవేల్పు అయితే, మరికొందరికి వినాయకుడు ఇష్టదైవం. కొంతమంది ఏడాదికోసారి తిరుపతికి వెళితే, మరికొంతమంది భద్రాచలం వెళుతుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కాబోలు, నగల డిజైనర్లు ఒక్కో పెండెంటునీ ఒక్కో గుడి డిజైనుతో సునిశితమైన పనితనంతో చేస్తున్నారు. వెంటనే కొని వేసుకోవాలనిపిస్తోంది కదూ. బంగారం ధర గుర్తొచ్చి భయమేస్తోందా...ఫరవాలేదు, వెండితో చేయించి బంగారు కోటింగూ వేయించుకోవచ్చు. ట్రై చేయండి!


జీన్స్‌ అంచు అదిరింది!

జీన్స్‌ ప్యాంటులో ఉన్న సౌకర్యం మరే డ్రెస్‌లోనూ ఉండదన్నది ఈ తరం అమ్మాయిల నిశ్చితాభిప్రాయం. ఏళ్లు గడుస్తున్నా ఎన్ని ఫ్యాషన్లు వచ్చి పోయినా ఇది అమ్మాయిల హాట్‌ ఫేవరెట్‌గానే నిలిచిపోతోంది తప్ప మరుగున పడిపోలేదు. ఇప్పుడు క్యాజువల్‌ వేర్‌గానే కాదు... ప్రత్యేక సందర్భాల్లోనూ జీన్స్‌కే మా ఓటు అనే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అందుకేనేమో వాళ్ల అభిరుచులూ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు ఇందులోనూ రకరకాల డిజైన్లు సందడి చేస్తున్నాయి. అలా వస్తున్నవే వెరైటీ అంచుల జీన్స్‌. ప్యాంటు అడుగున రకరకాల డిజైన్లు ఉండటమే వీటి ప్రత్యేకత.
జీన్స్‌లో ఎన్నో రకాల ప్యాంట్లు. వాటిల్లో సిగరెట్‌ ప్యాంట్‌, బాయ్‌ఫ్రెండ్‌జీన్స్‌, స్ట్రెయిట్‌కట్‌, క్యాప్రీ, చిరుగులు... ఇలా మోడల్‌ ఏదయినా... దాని అంచు మాత్రం వైవిధ్యమైన డిజైన్‌లలో కనికట్టు చేస్తోందిప్పుడు. ఒకప్పుడు గౌన్లూ చుడీదార్లూ చీరలకు లేస్‌ అంచులు పెట్టించుకునేవారు. ఇప్పుడు అదే జీన్స్‌కి బోర్డర్‌గా మారిపోయింది. పట్టూ, టాజిల్సూ, ఎంబ్రాయిడరీ, కుందన్లూ... ఇలా రకరకాల డిజైన్‌లు జీన్స్‌ అంచులుగా ఇమిడిపోతున్నాయి. కొన్నింటిని అలాగే జతచేస్తుంటే.. మరికొన్ని అంచులను ఇంకాస్త వైవిధ్యంగా మార్చి మరీ జీన్స్‌ప్యాంట్లకు బోర్డర్‌గా మార్చేస్తున్నారు. ఉదాహరణకు లేస్‌నే తీసుకుంటే.. అలాగే అతికించినా కూడా కొన్నిసార్లు ట్రెండీ లుక్‌ తేవడంకోసం అడుగున టాజిల్స్‌ లేదా పామ్‌పామ్‌లు అమరుస్తున్నారు. జీన్స్‌ నీలం లేదా నలుపులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి... టాజిల్స్‌, ఫ్యాబ్రిక్‌ ఒకే రంగులో ఉండేలా చూసుకుంటే చాలు. కొందరు అమ్మాయిలు ప్యాంటును పైకి మడుస్తుంటారు. అలా మడిచినప్పుడు అది సాదాగా కనిపిస్తే ఏం బాగుంటుందనే ఆలోచనతోనే ప్యాంటు లోపలివైపు కూడా ప్రత్యేక డిజైన్‌ ఉండేలా చూస్తున్నారు. వీటిమీదకు పట్టు అంచులూ కొత్త లుక్‌ని తెచ్చిపెడుతున్నాయి. నీలం, నలుపు, తెలుపు... ఇలా జీన్స్‌ రంగు ఏదయినా వాటికి జతగా రకరకాల పట్టు అంచులు ముచ్చటగా ఒదిగిపోతున్నాయి. ప్యాంటుకి డబుల్‌ బోర్డర్‌ లుక్‌ తెచ్చేందుకు పట్టు బోర్డర్‌తోపాటు రఫుల్స్‌ డిజైన్‌నీ జతచేస్తున్నారు.

ఎంబ్రాయిడరీ సొగసులూ...
డ్రెస్‌ లేదా చీరకే కాదు... జీన్స్‌ ప్యాంటు అంచుల్లో కూడా ఎంబ్రాయిడరీ మెరుపులు ఉండేలా చూస్తున్నారు. ఎంబ్రాయిడరీ వర్క్‌, డిజైన్‌ని బట్టి ఆ ప్యాంటును క్యాజువల్‌గా లేదా ప్రత్యేక సందర్భాలకు వేసుకుంటున్నారు. ఇవి మాత్రమే కాదు... రకరకాల రంగురాళ్లూ కుందన్లూ కూడా అంచులుగా మారిపోతున్నాయి. ఇన్నిరకాల ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్న ఈ ప్యాంట్లు మార్కెట్లో దొరకడం మామూలే కానీ... కాస్త సమయం వెచ్చిస్తే ఇంట్లోనే సులువుగా డిజైన్‌ చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ మాత్రమే కాదు రకరకాల అంచులు సిద్ధంచేసుకుంటే నచ్చినట్లుగా అతికించుకోవచ్చు.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.