close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నీళ్లలో పెడితే బొమ్మొస్తుంది

స్నానం చేయించేటప్పుడు కొందరు పిల్లలు తెగ మారం చేస్తుంటారు. వారిని మాటలతో బుజ్జగిస్తూ... రకరకాల బొమ్మలతో ఆడిస్తూ గబగబా స్నానం చేయించాల్సి ఉంటుంది. అలాంటి బుజ్జాయిలకి స్ప్రింక్లింగ్‌ టాయ్స్‌ను చేతికిస్తే ఎంచక్కా ఆడుకుంటూ స్నానం చేయించుకుంటారు. ఈ బొమ్మ చూడ్డానికి గుడ్డులా ఉంటుంది. దాన్ని నీళ్లలో పెట్టి తీయగానే అందులోంచి కోడి పిల్లా, బాతూ వంటి రకరకాల పక్షులు పై నుంచి బయటకు వస్తాయి. అప్పుడు దాన్ని చేత్తో నొక్కుతుంటే జల్లులా నీళ్లు బయటకు వస్తాయి. ఈ జల్లును పిల్లల మీదకు చల్లుతుంటే ఎంతో సంతోషిస్తారు. స్నానం చేయించేటపుడు ఇక ఏడవకుండా ఆడుకుంటారు. అలానే ఆ బొమ్మలు నోట్లో పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 


కలిసిపోవిక...

పిల్లలకి రకరకాల స్నాక్స్‌, టిఫిన్లు, ఇతర చిరుతిళ్లు పెట్టినప్పుడు వాటికి తోడు చట్నీలూ సాస్‌లూ కావాలంటారు. మరి వాటిని ఒకే ప్లేటులో పెట్టి ఇస్తే కాసేపట్లోనే అన్నీ ఒకే చోటికి తెచ్చేసి కలగాపులగం చేసేస్తుంటారు. అలాగని ఒకే ప్లేటులో రెండు మూడు గిన్నెల్లో పెట్టిచ్చినా సరిగా తినలేరు. అదే ప్లేట్‌ డివైడర్లు ఉంటే కలిపేసుకోకుండా వేటికవే తీసుకుని తేలిగ్గా తినేస్తారు. రకరకాల ఆకృతుల్లో ఉండే ఈ డివైడర్లు ఒక సెట్‌ తెచ్చుకుంటే ఏ ప్లేట్‌లో కావాలంటే ఆ ప్లేట్‌లో తీసి పెట్టుకోవచ్చు. ఇవి సిలికాన్‌తో తయారైనవి కావడం వల్ల ప్లేట్‌లో పెట్టగానే అతుక్కుపోయి కదలకుండా ఉంటాయి. అప్పుడు ఇడ్లీ, దోశలూ, స్నాక్స్‌ల్లోకి ఎన్ని చట్నీలూ సాస్‌లూ అయినా వేయొచ్చు. క్యారెట్‌ ముక్కలు, పాస్తా, పండ్ల ముక్కలు, ఉడికించిన బఠాణీ, ఇతర స్నాక్స్‌ ఏవైనా ఓ రెండుమూడు రకాలు ఒకేసారి ప్లేట్‌లో పెట్టివ్వచ్చు.


మ్యాజిక్‌ పుస్తకం...

నర్సరీ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి రాయించడం, చదివించడం అలవాటు చేస్తే త్వరగా నేర్చేసుకుంటారు. వాటితోపాటు వాళ్లు అందంగా రాయడం కూడా ముఖ్యమే. అందుకోసమని తల్లిదండ్రులు కాపీ రైటింగ్‌ పుస్తకాలు ఇచ్చి తెగ రాయిస్తుంటారు. అలా కాకుండా చదవడం, రాయడంతోపాటు అందమైన చేతి రాతను పిల్లలు ఒకేసారి సొంతం చేసుకోవాలంటే వాళ్లకి సెల్ఫ్‌ ఫేడింగ్‌ పుస్తకాలు ఇస్తే సరి. ఈ పుస్తకాల్లో పెన్నుతో ఏం రాసినా కాసేపటికే చెరిగిపోయి మామూలుగా మారిపోతాయి. కాబట్టి పదే పదే పుస్తకాలు కూడా కొని తీసుకురావల్సిన పనీ ఉండదు. ఈ ఫేడింగ్‌ పుస్తకాల్లో అక్షరమాలా, 0- 100 వరకూ నంబర్లూ, రకరకాల బొమ్మలూ ఉంటాయి. వాటిమీద పెన్నుతో రాస్తూ ఉంటే చదవడం, చక్కగా రాయడం, పెన్ను పట్టుకోవడం అలవాటవుతాయి. పైగా ప్రత్యేకంగా తయారుచేసిన ఈ కాగితం చిరిగిపోదు కూడా. ఇలాంటి పుస్తకం ఒకటి తెస్తే చాలు పిల్లలకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.


అతుక్కుపోతాయి...

కాళ్లూ చేతులూ ఆడిస్తూ అస్తమానం కదిలే చంటి పిల్లలకు బట్టలు వేయడం చాలా కష్టం. వాళ్లు గబగబా దొర్లుతున్నపుడో లేదా చకచకా పాకుతున్నపుడో షర్టుకి గుండీలు పెట్టడం ఎంత పెద్ద ప్రహసనమో చంటి పిల్లలున్న తల్లులకే  తెలుస్తుంది. మరి అలాంటి గడుగ్గాయిలకి మ్యాగ్నెటిక్‌ బట్టలు వేయడం చాలా తేలిక. వీటికి గుండీలూ, జిప్పుల వంటివేమీ ఉండవు. వాటి స్థానంలో లోపలి భాగంలో అయస్కాంతం అమర్చుతారు. పిల్లలకు ఆ దుస్తులు వేసి గుండీలు ఉండే చోట అంచుల్ని ఒకదాని దగ్గరకు ఒకటి తెస్తే అవే అతుక్కుపోతాయి. వారి వెంటపడి గుండీలు పెట్టాల్సిన బాధ కూడా ఉండదు. అలానే తీయడం కూడా చాలా సులువు. పసిపిల్లల దగ్గర్నుంచీ రెండుమూడేళ్ల చిన్నారులకు ఈ తరహాలో రకరకాల డిజైన్లలో నైట్‌వేర్‌, షర్టులూ, స్వెటర్లూ అందుబాటులో ఉంటున్నాయి. ఇవి ఆన్‌లైన్‌లో పలు ఈ కామర్స్‌ సైట్లలో దొరుకుతున్నాయి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.