close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫోన్‌ వచ్చినా వణికిపోయేవాణ్ణి!

టాలీవుడ్‌ తండ్రి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచి... తెలుగు ప్రేక్షకుల మనసులో చెదిరిపోని స్థానం సంపాదించుకున్న నటుడు వి.జయప్రకాశ్‌. ‘నా పేరు శివ’తో తెలుగు తెరకు పరిచయం అయి వరుస సినిమాలతో దూసుకెళుతున్న ఈ నటుడి జీవితం ఆద్యంతం ఆసక్తికరం. పెట్రోల్‌ బంకులో పనివాడిగా జీవితం మొదలుపెట్టి వ్యాపారవేత్తగా, నిర్మాతగా, సినీ నటుడిగా ఎదిగారు. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలూ ఎదురు దెబ్బలూ ఎందరికో పాఠాలు అంటారు జయప్రకాశ్‌. ఆ ఒడుదొడుకులన్నీ ఆయన మాటల్లోనే...
చాలామంది ‘డెస్టినీ’ అని మాట్లాడుకుంటుంటే నేను కొట్టి పారేసే వాడిని. మన కష్టమే మనల్ని ఒక తీరానికి చేర్చుతుంది, అనుకున్న చోట నిలబెడుతుంది అనుకునేవాడిని. ఎందుకంటే- నా జీవితంలో నేను చాలా అనుకున్నా... చేసేశా. కానీ, చివరికి నేను ఎన్నడూ ఊహించనీ, కోరుకోని నటనవైపు వచ్చి నటుడిగా స్థిరపడ్డా. బహుశా అదేనేమో డెస్టినీ అంటే... నా జీవితంలోకి తొంగి చూసుకుంటే అదే అనిపిస్తుంది.
మాది తమిళనాడుకు చెందిన మరాఠీ కుటుంబం. మా పూర్వీకులు నాగపట్టణం జిల్లాలోని శీర్గాళిలో స్థిరపడ్డారు. నాకు ముగ్గురు అక్కలు. నాన్నది ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం. నా చిన్నతనంలో మాది సంపన్న కుటుంబమే. నేను పీయూసీకి వచ్చేసరికి నాన్న వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారు. దాంతో వ్యాపారం తీసేసి ఓ చిన్న కంపెనీలో ఉద్యోగానికి చేరారు. చాలీచాలని ఆ జీతంతో కుటుంబాన్ని పోషించడానికీ, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికీ నాన్న ఎంతో కష్టపడేవారు. అవన్నీ దగ్గరగా చూసిన నాకు చదువు మీద ఆసక్తిపోయింది. దాంతో పీయూసీ తరవాత చదువు మానేశా. ఏదైనా పని చేసి మా కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. అలా చిన్న వయసులోనే చెన్నైకి వచ్చేశా. అక్కడ మా కజిన్‌ పెట్రోలు బంకు పెట్టాడని తెలిసి వెళ్లా. వాహనాల్లో పెట్రోల్‌ నింపే పని ఇచ్చాడు. కొంతకాలం అటెండర్‌గానూ చేశా. ఆ తరవాత క్యాషియర్‌గా నియమించారు. క్రమంగా మా కజిన్‌ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించాడు. ఆ చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు బంకుల్ని చూసుకునే స్థాయికి వచ్చా. ఈ లోపులో బంకునిర్వహణకు కావల్సిన నైపుణ్యాలన్నీ వచ్చేశాయి. ఇంతలో నష్టాల్లో ఉన్న ఓ బంకును అమ్ముతున్నారని తెలిసింది. కొందామని వెళితే నేను దాచుకున్న డబ్బుకి ఇంకాస్త అవసరమవుతుందని అర్థమైంది. ఎలాగైనా దాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. దాంతో మా ఊరు వెళ్లి నాన్నకి విషయం చెప్పి ఇల్లు అమ్ముదామని అడిగా. అప్పటికే నాన్న నష్టపోయి రాజీపడి బతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇల్లు అమ్ముదామని అడగడం చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ, నామీదున్న నమ్మకంతో నాన్న మారుమాట్లాడకుండా సరే అన్నారు. అలా బంకు కొన్న నేను చాలా కాలం బాయ్‌ నుంచి మేనేజర్‌గా రకరకాల పనులు చూసుకునేవాడిని. దాన్ని అభివృద్ధి చేసి లాభాల బాట పట్టించడానికి నాకు పదేళ్లు పట్టింది. ఆ లాభాలతో డెయిరీ వ్యాపారం మొదలుపెట్టా. కానీ కొంత కాలానికి నష్టం వచ్చింది. అలాగని దాన్ని తలచుకుని బాధపడుతూ కూర్చోవడం నాకిష్టం లేదు. అంత కంటే మంచి వ్యాపారం ఏదైనా ఉంటుందా అని ఆలోచించినప్పుడు బిలియర్డ్స్‌ క్లబ్‌ గురించి తెలిసింది. అప్పటికి చెన్నైలో చాలా తక్కువ క్లబ్‌లు ఉన్నాయి. దాంతో ఓ ఖరీదైన ఏరియాలో బిలియర్డ్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేశా. ఏడాది తిరిగే సరికి పెట్టుబడితోపాటు ఊహించని లాభాలు వచ్చాయి.

అదే మలుపు...
బిలియర్డ్స్‌ క్లబ్‌ నా జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. దాని వల్ల నాకు సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పరిచయాలు అయ్యాయి. అప్పటి వరకూ సినిమాల ఆలోచనే లేదు. అప్పుడప్పుడూ చూసేవాడిని అంతే. అయితే ఓ ఇద్దరు స్నేహితులు సినిమాలు చేద్దామని అడిగారు. దాంతో వారితో కలిసి ‘రోజా కంబైన్స్‌’ పేరిట నిర్మాణ సంస్థను మొదలుపెట్టి సినిమాలు తీశా. మొదట్లో వచ్చిన హిట్లు మాలో ఊపును పెంచాయి. అయితే చిన్న నిర్మాతగా రాణించడం మాత్రం చాలా కష్టమని అర్థమైంది. థియేటర్లు లభించక చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. కోట్లు పెట్టి ఉత్సాహంగా సినిమా తీసేవాళ్లం. తీరా విడుదల సమయానికి థియేటర్లు దొరక్క ఎంతో బాధపడేవాళ్లం. దాంతో కొన్నాళ్లకి సినీ రంగం నుంచి బయటకొచ్చి వ్యాపారాల మీద దృష్టి పెట్టా. కొంత కాలానికి నటుడు విజయ్‌కాంత్‌ ‘నేను కాల్షీట్లు ఇస్తా. ఓ సినిమా చేయండి’ అని అడిగారు. ఆయన మాట కాదనలేకపోయా. దాంతో 2001లో ఓ స్నేహితుడితో కలిసి ‘జీజే సినిమాస్‌’ సంస్థను ఆరంభించి ‘తవసి’ అనే సినిమా తీశా. దానికి మంచి పేరూ లాభాలూ వచ్చాయి. ఆ తరవాత పెద్ద నటులతో సినిమా తీసే అవకాశం వచ్చింది. అలానే మా బ్యానర్‌లోనే 2004లో హీరో విశాల్‌ను నటుడిగా పరిచయం చేశా. తెలుగులో ‘ప్రేమ చదరంగం’ పేరిట వచ్చిన ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. నిర్మాతగా మంచి పేరు ఎంత తొందరగా వచ్చిందో... అంతే వేగంగా ఆర్థికంగా నష్టాలు రావడమూ మొదలైంది. సరైన నిర్ణయాలు తీసుకోలేకనో మంచి కథలు ఎంచుకోకపోవడం వల్లనో సినిమాలు వరుసగా ఫ్ల్లాప్‌ అయ్యాయి. దాంతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. పొద్దుపొద్దునే ఫైనాన్సర్లూ, అప్పులు ఇచ్చిన వాళ్లూ ఇంటికొచ్చి డబ్బులు అడిగేవారు. బంకు దగ్గరకు వెళితే అక్కడ కొందరు నాకోసం కాచుకుని ఉండేవారు. వచ్చిన వాళ్లకి డబ్బులేదూ, నేను నష్టపోయా అని చెప్పడానికి నామోషీగా ఫీలయ్యేవాడిని. దాంతో వ్యాపారంలో వచ్చిన డబ్బులు వచ్చినట్టు అప్పులు తీర్చడానికి వాడేవాడిని. అయితే అప్పుడే ఓ పెద్ద బడ్జెట్‌ సినిమా తీసే అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదల అయితే అప్పులన్నీ తీరిపోయి గట్టెక్కుతాననిపించింది. దాంతో వ్యాపారాలు అమ్మేసి ఆ సినిమాకి పెట్టా. దురదృష్ట వశాత్తూ ఆ సినిమా విడుదల కాలేదు. దాంతో ఉన్న ఇల్లు తప్ప చేతిలో, బ్యాంకులో రూపాయి కూడా లేని పరిస్థితి వచ్చింది. ఆ బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఫోన్‌ వచ్చినా వణికిపోయేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ‘నా ఆటోగ్రాఫ్‌’ సినిమా తీసిన నా స్నేహితుడు చేరన్‌ తాను దర్శకత్వం చేస్తున్న ఓ సినిమాలో నటించమని అడిగాడు. నటించలేననీ, వేరే వాళ్లని తీసుకోమనీ చెప్పా. ‘లేదు నా సినిమాలో నువ్వే ముఖ్య పాత్ర పోషిస్తున్నావు’ అని బలవంతం చేశాడు. మొదటి రోజు సెట్‌కి వెళ్లా. కెమెరా ముందుకు వెళ్లగానే కాళ్లూ, చేతులూ వణకడం మొదలైంది. దాంతో షూటింగ్‌ మధ్యలోనే వదిలేసి ఇంటికొచ్చా. అయినా సరే మర్నాడు ఆ సీన్‌ నాతోనే చేయించాడు చేరన్‌. విడుదలయ్యాక సినిమాతోపాటు నా పాత్రకీ మంచి పేరు వచ్చింది. ఆ తరవాత మరికొందరు దర్శకులు అవకాశాలు ఇచ్చారుగానీ ఎవరూ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఓ నాలుగైదు సినిమాల తరవాత నా నటనను చూసి అప్పుడు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. రెండుమూడేళ్ల తరవాత నేను నటించిన ఓ సినిమాకి ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. ఊహించని స్థాయిలో అందులోని పాత్ర నాకు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. వ్యాపారవేత్త, నిర్మాత అనే విషయాలను దాటి నాలో ఓ నటుడు ఉన్నాడనే నమ్మకాన్ని నాకు కలిగించింది.
అప్పటి వరకూ తెలియదు
2014లో నేను టాలీవుడ్‌లో అడుగుపెట్టా. ‘రన్‌ రాజా రన్‌’లో శర్వానంద్‌ తండ్రిగా కూరగాయలు అమ్మే పాత్రలో నటించా. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒకరోజు జీవీకే మాల్‌లో షాపింగ్‌కి వెళ్లా. వెళ్లిన దగ్గర్నుంచీ కనిపించిన వాళ్లు నన్ను చూసి నవ్వడం, దగ్గరికొచ్చి మాట్లాడటం, సెల్ఫీలు అడగడం చేస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా తెలుగులో సినిమా విడుదల కూడా కాలేదు... నన్ను చూసి ఎవరు అనుకుంటున్నారో అని మనసులో భయపడ్డా. కాసేపటికి నా దగ్గరకు వచ్చిన కొందరు కాలేజీ పిల్లలతో అదే చెప్పా. ‘లేదు సర్‌... ‘నాపేరు శివ’లో మీరు కాజల్‌ తండ్రిగా నటించారు. మీ నటన చాలాబాగుంది’ అని చెప్పడంతో ఆశ్చర్యమేసింది.
తమిళంలో తీసిన ఆ సినిమాని తెలుగులోనూ విడుదల చేశారని అప్పటి వరకూ నాకు తెలియదు. రూమ్‌కి వెళ్లి గూగుల్‌లో వెతికితే అందులో నా పాత్రకి ఎన్నో మంచి రివ్యూలు వచ్చాయి. తెలుగులో నటించొచ్చు అనే ఆత్మవిశ్వాసం కూడా కలిగింది. ఆ తరవాత వచ్చిన ‘సరైనోడు’లో అల్లు అర్జున్‌కి తండ్రిగా నటించమని బోయపాటి శ్రీను అడిగారు. అంతేకాదు, తెలుగులో నన్నే డబ్బింగ్‌ చెప్పమన్నారు. దాంతో నేను సెట్‌లో రోజూ అసిస్టెంట్‌ డైరెక్టర్ల దగ్గర ట్యూషన్‌ చెప్పించుకుని తెలుగు స్పష్టంగా మాట్లాడటం నేర్చుకున్నా. అలా ఆ సినిమాకి డబ్బింగ్‌ చెప్పుకున్నా. అప్పట్నుంచీ మిగతా సినిమాలకీ చెప్పుకోవడం మొదలుపెట్టా. అఆ, అజ్ఞాతవాసి, జవాన్‌, వినయ విధేయరామ, చిత్రలహరి, జెర్సీ, అశ్వథ్థామ, వరల్డ్‌ఫేమస్‌ లవర్‌, తాజాగా వచ్చిన ‘వి’ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలానే మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, సీటీమార్‌, కపటధారి చిత్రాలు విడుదల కావల్సి ఉన్నాయి. నటనలోకి వచ్చాక నటుడిగా దొరికిన సంతృప్తి నాకు ఏ రంగంలోనూ దొరకలేదు. అందుకే మరో వ్యాపారంలోకి వెళ్లలేదూ, వెళ్లను కూడా.ఆ కోరిక తీరింది...

చాలామంది దర్శకులు ‘మా సినిమాలో మిమ్మల్ని తప్ప మరెవర్నీ తండ్రి పాత్రలో ఊహించుకోలేం’ అంటుంటారు. నటుడిగా నా జీవితంలో అంతకంటే పెద్ద ప్రశంస ఇంకేదీ ఉండదు. బీ నేను రజనీకాంత్‌కి వీరాభిమానిని. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని కలలు కనేవాడిని. ‘లింగ’లో ఆయనతో కలిసి నటించడంతో ఆ కోరిక తీరింది.
* దర్శకుడు శంకర్‌ ‘2.0’లో పక్షిరాజు పాత్రకు డబ్బింగ్‌ చెప్పమన్నప్పుడు భయమేసింది. నా వాయిస్‌లో బేస్‌ సరిపోదని కంగారుపడ్డా. కానీ శంకర్‌ దగ్గరుండి డబ్బింగ్‌ చెప్పించారు.


తను లేక నేను లేను...

మాది ప్రేమ వివాహం. నా భార్య బాగా చదువుకుంది. తొలినాళ్లలో నాకు పెట్రోలు బంకులో ఉద్యోగం ఇచ్చిన కజిన్‌కు సూపర్‌ మార్కెట్‌ ఉండేది. అప్పట్లో తను ఆ మార్కెట్‌ బాధ్యతలు చూసుకునేది. అక్కడ తనని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయా. మా ఇంట్లో మొదట కులాంతర వివాహానికి ఒప్పుకోలేదు. అమ్మానాన్నల్ని ఒప్పించి చివరికి పెళ్లి చేసుకున్నా. తను చాలా స్ట్రాంగ్‌ పర్సన్‌. వ్యాపారాల్లో నష్టపోయి బాధలో ఉన్నప్పుడు తనే బయటకు తీసుకొచ్చింది. అందుకే తను లేకపోతే నేను లేను అని గర్వంగా చెబుతా. పిల్లల విషయానికి వస్తే మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి నిరంజన్‌ ఆటోమొబైల్‌రంగం వైపు వెళ్లాడు. చిన్నోడు దుష్యంత్‌కి సినిమాలంటే చాలా ఇష్టం. ఓ సినిమాలో నటించాడు.


- టి.ఉదయ్‌కుమార్‌, న్యూస్‌టుడే చెన్నై

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.