close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందరి చూపు... కొరియా వైపు!

పోల్చుకోనక్కరలేదు కానీ, పక్కవాళ్లు ఏ పనైనా సమర్థంగా చేస్తున్నారంటే చూసి నేర్చుకోవచ్చు. ఒకటో రెండో మంచి విషయాలను అనుసరించనూవచ్చు. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు దక్షిణ కొరియావైపు చూస్తున్నాయి. లాక్‌డౌన్‌ పెట్టకుండా కరోనా సమయంలోనూ ఆ దేశం అన్ని పనుల్నీ మామూలుగా చేసేసుకోవడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. దేశాల ఆర్థికవ్యవస్థలన్నీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతుంటే జీడీపీలో నామమాత్రపు తగ్గుదలతో నిలబడగలగడం దక్షిణ కొరియాకి ఎలా సాధ్యమైందా అని ఆశ్చర్యంగా పరిశీలిస్తున్నాయి. ప్రభుత్వ నిబద్ధతా ప్రజల బాధ్యతా కలిసి సౌత్‌ కొరియాని ఇలా ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టాయంటున్నారు ఆ దేశ విధానాల్ని అధ్యయనం చేసిన నిపుణులు.

కఠినమైన చట్టం చేయలేదు... జరిమానాల భయం లేదు... పోలీసుల కాపలా లేదు...
ఆ ప్రజలకు ప్రభుత్వం పరిస్థితిని ఉన్నదున్నట్లుగా వివరిస్తుంది... ఏం చేయాలో వాళ్లు చేసేస్తారు.
అందుకే దక్షిణ కొరియా లాక్‌డౌన్‌ పెట్టకుండానే కరోనా వైరస్‌ని కట్టడి చేసింది.
జనవరిలో మొట్టమొదటి కేసు వచ్చింది మొదలు ఇప్పటివరకు అక్కడా పాతికవేల మంది వైరస్‌ బారినపడ్డారు. అయినా మరణాలు 450 దాటలేదు.
ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ నెలల తరబడి లాక్‌డౌన్‌ని చాలా కఠినంగా అమలుచేశాయి. కొన్ని రెండో దఫా అమలుచేస్తున్నవీ ఉన్నాయి. కేసులు కాదు, మరణాలే లక్ష దాటిన దేశాలూ ఉన్నాయి. పిల్లల చదువులూ పెద్దల వ్యాపారాలూ అన్నీ మూలబడడంతో గత ఆరునెలల్లో ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఏకంగా ఇరవై, ముఫ్ఫై శాతం లోటును నమోదుచేశాయి. అలాంటిది దక్షిణ కొరియా మాత్రం ఒక్క శాతం కన్నా తక్కువ(0.8) లోటుతో ముందుకు దూసుకుపోతోంది.
కరోనా భయంకరమైన వైరస్సే...
అందుకని దాన్ని నిర్మూలించి తీరేదాకా మనం అన్నీ మానుకుని కూర్చోవటం ఎందుకు, దాన్ని మన జీవితంలోకి రానివ్వకుండా మన ప్రవర్తనను మార్చుకుంటే చాలుగా... అనుకున్నారు వాళ్లు.
అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణ జీవితం గడుపుతున్నారు. స్కూళ్లూ, కాలేజీలూ, కార్యాలయాలూ మామూలుగా పనిచేస్తున్నాయి. వ్యాపారసంస్థల్నీ, హోటళ్లనీ ఏనాడూ మూసివేయలేదు.
అంతేకాదు, ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉన్న వేళ... ఏప్రిల్‌లో అక్కడ సాధారణ ఎన్నికలు విజయవంతంగా జరిగాయి.మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రజలు ఓట్లు వేశారు. యువతీ యువకులు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు.
ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటే...

సిములేటర్‌తో శిక్షణ
వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాన ఆయుధం పరీక్షించడం. దానికి సాంకేతికతను అద్భుతంగా సమన్వయించడం కొరియా విజయంలో ప్రధానపాత్ర పోషించింది. మొత్తం పరిస్థితిని ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకుని ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడమూ, ఎక్కడ విఫలమవుతామోనన్న భయంతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడమూ...ఆ తర్వాత స్థానాన్ని ఆక్రమించాయి.
ఐదేళ్ల క్రితం కొరియాలో మెర్స్‌ వైరస్‌ వ్యాపించింది. దానిమీద అవగాహన లేని ప్రభుత్వం వైరస్‌ని ఎదుర్కొనడానికి సిద్ధంగా లేకపోవడంతో చాలామందికి వైరస్‌ సోకింది. వారిలో 38 మంది మరణించారు. దాన్ని పెద్ద వైఫల్యంగా భావించిన ప్రభుత్వం అప్పటినుంచీ అంటువ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవడంపై దృష్టి పెట్టింది. ఆర్నెల్లకోసారి వైద్య అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేది. అవి ఎలా ఉండేవంటే- విదేశాలనుంచి వచ్చిన వ్యక్తికి ఏదో కొత్త వైరస్‌ సోకినట్లూ, అతడిని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నట్లూ, వైద్యులు పీపీఈలు ధరించి సిములేటర్‌తో పనిచేసేవారు. రకరకాల వైరస్‌ లక్షణాలు ఊహించి, వాటికి జాగ్రత్తలూ చికిత్సలూ కనిపెట్టడం, వ్యాప్తిని అరికట్టడం లాంటివాటిపై పరిశోధన చేసేవారు. అలా గత డిసెంబరులోనూ ఒక శిక్షణ కార్యక్రమం జరిగింది. చైనా నుంచి వచ్చిన ఒక కుటుంబానికి ఏదో వైరస్‌ సోకినట్లు భావించి వైద్యులు పనిచేశారు. కరోనా కూడా చైనా నుంచే రావడం కాకతాళీయమే అయినా ఆ శిక్షణ ఈ వైరస్‌ని ఎదుర్కొనడంలో బాగా పనికొచ్చింది.

పరీక్ష... పరీక్ష
చైనాకీ దక్షిణకొరియాకీ మధ్య సముద్రమే అడ్డం. రెండు దేశాలమధ్యా రాకపోకలు ఎక్కువే. దాంతో చైనా జనవరి పదిన కరోనా వైరస్‌ డీఎన్‌ఏ గురించి ప్రకటించగానే కొరియా అధికారులు అప్రమత్తమై పరీక్షలు మొదలుపెట్టారు. జనవరి 20న వుహాన్‌ నుంచి వచ్చిన మహిళ వల్ల దేశంలో మొదటి కేసు నమోదైంది. జనవరి చివరి వారానికల్లా వైద్యాధికారులూ, వైరస్‌ నిపుణులూ, టెస్ట్‌ కిట్లను తయారుచేసే కంపెనీలూ సమావేశమయ్యాయి. అప్పటికే రెండు కంపెనీలు టెస్ట్‌ కిట్ల తయారీ పని ప్రారంభించేశాయి కూడా. మంచి కిట్లు తయారుచేస్తే త్వరగా అనుమతులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడమూ నాలుగు రోజులకల్లా ఒక కంపెనీకి అనుమతి లభించడమూ వరసగా జరిగి పోయాయి. ఆ తర్వాత ఇతర కంపెనీలూ చేరినా అన్నిటి పనిచేసే విధానమూ ఒకటే. శాంపిల్స్‌ని దేశంలో ఉన్న 120 లాబొరేటరీల్లో దేనికైనా పంపించొచ్చు. అలా మొదలుపెట్టిన దక్షిణ కొరియాకి ఇప్పుడు రోజుకు యాభైవేల పరీక్షలు చేయగల సామర్థ్యం ఉంది. విచిత్రమేమిటంటే- అమెరికాలోనూ కొరియాలోనూ మొదటి కేసు ఒకే రోజున వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత ఆరువారాల్లో అమెరికా 1500 పరీక్షలు చేస్తే, కొరియా లక్షా 40వేల పరీక్షలు చేసింది. వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉన్న ఆస్పత్రుల్లాంటి చోట ఇప్పటికీ క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తున్నారు. స్కూళ్లూ, కాలేజీలూ, ఇతర ప్రాంతాల్లోనూ తరచూ శాంపిల్స్‌ తీసుకుని పరీక్షలు చేస్తూనే ఉంటారు. ఆస్పత్రులు కాకుండా బయట కొత్తగా 600 పరీక్షా కేంద్రాలు పెట్టారు. ఎక్కడి వారికి అక్కడే చికిత్స చేయడానికి ఎన్నో తాత్కాలిక ఆస్పత్రులు కట్టింది ప్రభుత్వం. కరోనా చికిత్స వల్ల ఇతర వ్యాధుల చికిత్సకు అవాంతరం రాకుండా చూసింది.

స్వీయ క్రమశిక్షణ
వైరస్‌ మొదలైనప్పటినుంచీ అక్కడ అమలుచేసిన నిర్ణయాలన్నీ- వైద్యశాఖ అధికారులూ, వైరస్‌ నిపుణులూ కలిసి తీసుకున్నవే. వారే రోజూ రెండుసార్లు పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు పరిస్థితిని వివరించేవారు. దీని మీద నుంచి ప్రజల దృష్టి మళ్లకుండా ఉండాలని ఆ సమయంలో దేశాధ్యక్షుడు కానీ ఇతర నేతలు కానీ ఎవరూ వార్తల్లోకి వచ్చేవారు కాదు.
సమావేశాల్లో అధికారులు చెప్పినదానికి అనుగుణంగా ప్రజల ప్రవర్తన మారిపోయేది. మొదటినుంచీ ప్రతి ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరిస్తున్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం పిల్లలకీ పెద్దలకీ అలవాటైపోయింది. దాంతో లాక్‌డౌన్‌ పెట్టాల్సిన అవసరం లేదని భావించింది ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా మొదటి కేసు రాగానే స్కూళ్లూ కాలేజీలు మూసేసి ఆన్‌లైన్‌ క్లాసులు పెట్టారు.
రెస్టరెంట్లు, దుకాణాలు మాత్రం యథాతథంగా పనిచేస్తూనే ఉన్నాయి. వ్యాపారాల్లో నష్టమూ ఉద్యోగాలు పోవడమూ లాంటివేవీ లేకపోవడంతో ప్రజాజీవనం సాఫీగా సాగిపోతోంది. మధ్యలో ఒకసారి కేసులు ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రం ‘పరిస్థితి తీవ్రంగా ఉందనీ వచ్చేవారం కేసుల సంఖ్య రెట్టింపు కావచ్చ’నీ అధికారులు ప్రకటించారు. అంతే... ఆ తర్వాత రెండు వారాల పాటు నాలుగో వంతు ప్రజలు మాత్రమే బయట కన్పించారట. అలాంటి సమయంలోనే రెండు వారాలు వ్యాయామశాలల్నీ, స్పోర్ట్స్‌ స్టేడియాలనీ మూసేశారు.
హోటళ్లు రాత్రి తొమ్మిదింటివరకే ఉండేవి. ఆ తర్వాత నుంచీ అన్నీ మామూలుగానే పనిచేస్తున్నాయి. అక్కడ వేసవి తర్వాత ఏప్రిల్‌, మేలలో స్కూళ్లను కొద్దిగా ఆలస్యంగా ప్రారంభించారు. తరగతుల్లో కొన్నిచోట్ల పిల్లల మధ్య పారదర్శకంగా ఉండే తెరల్ని ఏర్పాటుచేస్తే, కొన్ని చోట్ల కుర్చీలను దూరదూరంగా వేసి కూర్చోబెడుతున్నారు. పాఠాలూ, పరీక్షలూ, మధ్యాహ్నభోజనాలూ అన్నీ యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇంత క్రమశిక్షణగా సాఫీగా సాగిపోతున్న కొరియన్ల పౌరజీవితంలో చర్చితో ముడిపడిన సంఘటనలే కేసుల్ని కొంతమేరకు పెంచాయి.

వేల పెళ్లిళ్లూ... ఒక పేషెంటూ...
ఒక చర్చి ఆధ్వర్యంలో కొరియాలో తరచూ సామూహిక వివాహాలు జరుగుతుంటాయి. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో కూడా సియోల్‌లోని ఒక చర్చిలో ఏకంగా ఒకేసారి మూడువేల జంటలు పెళ్లి చేసుకున్నాయి. ఆకార్యక్రమానికి మొత్తం ముఫ్ఫై వేల మంది హాజరై ఉంటారని అంచనా. అప్పటికి దేశంలో ఎక్కువ కేసులు లేకపోయినప్పటికీ ఈ కార్యక్రమ నిర్వహణ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఒకటీ అరా కేసులు పెరుగుతూ ఉండగా జరిగింది ఊహించని మరో సంఘటన.
ఫిబ్రవరి ఏడున తలనొప్పితో ఒక మహిళ ఆస్పత్రిలో చేరింది. ఆమె విదేశీ ప్రయాణాలు చేయలేదు, కరోనా సంబంధిత లక్షణాలేవీ లేవు. దాంతో వైద్యులకు అనుమానం రాలేదు. పైగా అంతకు ముందు రోజు ఆమె కారు ప్రమాదానికి గురైనట్లు చెప్పడంతో ఆ కోణంలోనే చికిత్స చేశారు. మూడోరోజున జ్వరంగా ఉంటే ఫ్లూ టెస్ట్‌ చేయగా నెగెటివ్‌ వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆమె రెండుసార్లు చర్చిలో ప్రార్థనలకీ, ఒకసారి స్నేహితులతో హోటల్‌కీ వెళ్లివచ్చింది. అక్కడ రోగులు ఆస్పత్రి నుంచి అలా బయటకు వెళ్లిరావడం మామూలే. వారం అయినా ఆమెకు తగ్గకపోగా పరిస్థితి సీరియస్‌గా మారడంతో కొవిడ్‌ టెస్ట్‌ చేశారు. పాజిటివ్‌ వచ్చింది. ఆమె చర్చికి వెళ్లిన రెండుసార్లూ వెయ్యేసి మంది చొప్పున ప్రార్థనలకు హాజరయ్యారని తెలిసి ఉలిక్కిపడ్డ యంత్రాంగం అక్షరాలా పరుగులు పెట్టింది. వారంతా ఆమెతో కాంటాక్ట్‌లోకి వచ్చినట్లే లెక్క కాబట్టి మాస్‌ టెస్టింగ్‌ తప్ప మరో మార్గం లేదని భావించి, ప్రజలు ఎక్కువగా సందర్శించే హోటళ్లూ సూపర్‌మార్కెట్లూ లాంటి చోట్ల డ్రైవ్‌ త్రూ క్లినిక్‌లు పెట్టి కారుల్లో వెళ్తున్నవాళ్లని సైతం ఆపి చకచకా పరీక్షలు నిర్వహించారు. వాళ్లు ఇంటికి లేదా కార్యాలయానికి చేరేలోపు ఫలితం వాళ్ల ఫోనుకు వెళ్లిపోయేది.
డేగు నగరంలో జరిగిన ఈ ఒక్క సంఘటన వల్ల కేసులు ఒక్కసారిగా 30 నుంచి మూడువేలకు చేరాయి. దాంతో ప్రజలు భయపడిపోయి ఇళ్లకు పరిమితమయ్యారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొందరు విధులకు రాలేదు. మాస్కులు దొరక్క ప్రజలు సూపర్‌ మార్కెట్ల ముందు క్యూలు కట్టారు. ఒకటి రెండు రోజుల్లోనే ఆ పరిస్థితిని ప్రభుత్వం అదుపులోకి తెచ్చుకుంది. మాస్కులూ పీపీఈల తయారీని కూడా తన నియంత్రణ లోకి తీసుకుని విస్తృతంగా పంపిణీ చేసింది. రెండున్నరవేల మంది ఆరోగ్యకార్యకర్తలను కొత్తగా ఉద్యోగంలో చేర్చుకుంది. సైన్యానికి చెందిన నర్సింగ్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న వారందరినీ రంగంలోకి దింపింది. ఎవరూ చెప్పకుండానే నగరంలో కొద్ది రోజుల పాటు బంద్‌ వాతావరణం కన్పించింది. కార్యాలయాలన్నీ ఇంటి నుంచి పనికి అనుమతించాయి. దాంతో క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే- ఒకవేళ వైరస్‌ సోకినా చికిత్సకు ఖర్చు గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోవటం.

చికిత్స ఉచితం
దక్షిణ కొరియాలో కరోనా చికిత్స పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సాగింది. మందులూ భోజనంతో సహా వసతి ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరించింది. వైరస్‌ సోకిన ప్రతి వ్యక్తినీ లక్షణాలు ఉన్నా లేకపోయినా ఆస్పత్రుల్లోే, ప్రభుత్వ వసతి గృహాల్లో, ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన అతిథి గృహాల్లో ఐసొలేషన్‌లో ఉంచారు తప్ప ఇళ్లల్లో ఉండనివ్వలేదు. దాంతో వ్యాప్తిని అరికట్టడం తేలికైంది. శాంసంగ్‌, ఎల్జీ లాంటి సంస్థలు ఖాళీగా ఉన్న తమ భవనాలను క్వారంటైన్‌ సెంటర్లు నిర్వహించడానికి ప్రభుత్వానికి అప్పజెప్పాయి. ఒక దశలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి వ్యక్తుల స్మార్ట్‌ ఫోన్‌ల నుంచి జీపీఎస్‌ ద్వారా వాళ్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నారూ ఎవరితో మాట్లాడుతున్నారూ అన్న సమాచారాన్ని నేరుగా వైద్యాధికారులు తెలుసుకునే అధికారాన్ని ఇచ్చింది ప్రభుత్వం. పేషెంట్ల ప్రైవసీని కాపాడుతూనే కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేసి అందరికీ పరీక్షలు నిర్వహించడానికీ, మరో పక్క ఆరోగ్యంగా ఉన్నవారిని పాజిటివ్‌ వ్యక్తులకు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండమని హెచ్చరించడానికీ తగిన సాంకేతికతను అభివృద్ధి చేసి నేరుగా ఆ సమాచారాన్ని వ్యక్తుల ఫోన్లకు పంపారు. దాంతో ప్రతి వారికీ తమ చుట్టుపక్కల వైరస్‌ రిస్క్‌ ఉన్న మనుషులు ఉంటే తెలిసిపోయేది. వెంటనే ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోయేవారు. వ్యాప్తి నియంత్రణకు ఇది ఎంతగానో తోడ్పడింది. అక్కడ ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువే ఉన్నప్పటికీ 97శాతం ప్రజలకు జాతీయ ఆరోగ్య బీమా ఉంటుంది. ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు వైద్య సదుపాయాల్లో (వెయ్యి మంది జనాభాకి అందుబాటులో ఉన్న వైద్యులూ, ఆస్పత్రి పడకల సంఖ్య విషయంలో) దక్షిణకొరియా పలు అభివృద్ధి చెందిన దేశాలకన్నా ముందు ఉంది. వైరస్‌ చికిత్సలో అది గట్టి పునాదిగా పనిచేసింది. ఈ బలం ఇచ్చిన ధైర్యంతోనే ఆ దేశం పార్లమెంటు ఎన్నికలను వాయిదా వేయకుండా ముందు నిర్ణయించిన తేదీల్లోనే నిర్వహించగలిగింది.

విజయవంతంగా ఎన్నికలు
ఏప్రిల్‌ 15న సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి అంటువ్యాధి ప్రబలిన సమయంలో ఎన్నికలు నిర్వహించిన తొలి దేశంగా సంచలనం సృష్టించింది దక్షిణ కొరియా. అప్పటికి దేశంలో పదివేలకు పైగా కేసులు ఉన్నాయి. కాకపోతే కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. అలాంటి సమయంలో వైరస్‌ నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేస్తూ పకడ్బందీగా ఎన్నికలు ఎలా నిర్వహించవచ్చో చెప్పడానికి కొరియా అనుసరించిన విధానం ప్రపంచానికి చక్కటి ఉదాహరణగా పనిచేస్తుందని ప్రశంసించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు. ప్రత్యేకించి అమెరికా ఎన్నికలు కూడా ఉండడంతో కొరియాని వారు నిశితంగా పరిశీలించారు. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ క్యూలో నిలబడి వచ్చిన ఓటర్లకు పోలింగ్‌ బూత్‌లో చేతులు శుభ్రం చేసుకోడానికి శానిటైజర్‌ ఇచ్చి ఆ తర్వాత గ్లోవ్స్‌ అందజేశారు. ఒక్కో వ్యక్తీ ఓటు వేసి వెళ్లగానే బూత్‌ని శానిటైజ్‌ చేసేవారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ దగ్గరా ఓటర్ల టెంపరేచర్‌ పరీక్షించి ఏ కాస్త నలతగా కనిపించినా వారిని వరుస నుంచి వేరు చేసి విడిగా ఉన్న మరో బూత్‌లో ఓటు వేసేలా అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. అలాంటివారందరికీ ఓటు వేయగానే కొవిడ్‌ టెస్ట్‌ కూడా చేశారు. ఫలితం వచ్చేదాకా వారిని విడిగానే ఉంచేవారు. ఆస్పత్రులూ కమ్యూనిటీ సెంటర్లలో ఐసొలేషన్లో ఉన్న ఓటర్ల కోసం ఆయా కేంద్రాల దగ్గర ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటుచేశారు. తీవ్ర లక్షణాలతో చికిత్స పొందుతున్నవారి ఓట్లను ఆన్‌లైన్లో తీసుకున్నారు. చికిత్స ముగిసి అదనపు పద్నాలుగు రోజుల క్వారంటైన్‌లో ఇంటివద్ద ఉన్నవారు ఓటువేయడానికి సాయంత్రం ప్రత్యేక సమయం కేటాయించారు. 1992 ఎన్నికల తర్వాత అత్యధిక పోలింగ్‌ శాతం నమోదైన ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీనే విజయం సాధించింది. వైరస్‌ విషయంలో మొదటినుంచీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడమూ, ప్రతి విషయాన్నీ పారదర్శకంగా ప్రజలతో పంచుకోవడమూ కూడా ఈ విజయానికి కారణమంటారు నిపుణులు.
కొరియాలో ఇప్పటికీ ఒకటీ అరా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
పాజిటివ్‌ కేసులు ఉన్న కొద్ది ప్రాంతాలు మినహాయించి మిగిలిన దేశమంతటా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు.
ప్రజాసేవలను సమర్థంగా అందించడానికి కట్టుబడి ఉంది అక్కడి ప్రభుత్వం.
దానికి సహకరించడం తమ బాధ్యతగా భావిస్తున్నారు ప్రజలు.
వారిద్దరి మధ్యా ఉన్న పరస్పర నమ్మకమే కరోనాని కట్టడి చేసింది... కొరియాని గెలిపించింది!

 


యాంటి-వైరస్‌ బస్‌షెల్టర్లు!

ఎంత మాస్కులు ధరించి భౌతికదూరం పాటించినా బస్టాండులో పదిమంది తిరిగే చోటా, బస్సుల్లోనూ వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉంటుందని భావించిన అక్కడి ప్రభుత్వం ప్రధాన నగరాల్లో ప్రత్యేకంగా యాంటి-వైరస్‌ బస్టాండ్లను ఏర్పాటుచేసింది. ఆ బస్‌షెల్టర్‌ లోపలికి వెళ్లాలనుకున్నవాళ్లు అక్కడున్న థర్మల్‌ కెమెరా ముందు నిలబడాలి. వారి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటేనే తలుపు తెరుచుకుంటుంది. లోపల ఏసీతో పాటు వైరస్‌ని చంపేసే శక్తి గల అల్ట్రావయొలెట్‌ లైట్లు ఉంటాయి. శానిటైజరూ, వైఫై సదుపాయమూ కూడా ఉంటాయి. కరోనా భయమూ, బాధా లేకుండా రోజూ ఒక్కో బస్‌ షెల్టర్‌నీ కొన్ని వందలమంది వాడుతున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.